అనూజ: ఆస్కార్‌కు నామినేట్ అయిన ఈ చిత్ర కథేంటి, దర్శకుడు ఏమన్నారు?

ఫొటో సోర్స్, X/netflixgolden
"అమ్మాయి భవిష్యత్తు గురించి ఆశపడకూడదు. అమ్మాయికి కాకపోతే ఆశయం ఎవరికి ఉండాలి? అబ్బాయిలు ఎప్పుడైనా పని చేస్తారా? టాటా, బై-బై మిస్టర్ హ్యాండ్సమ్".
ఇవి అనూజ షార్ట్ ఫిల్మ్ ట్రైలర్‌లోని డైలాగులు.
చీకట్లో కూర్చున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనూజ, పాలక్‌లు టార్చ్ వెలుతురుతో న్యూస్ పేపర్‌లో 'వరుడు, వధువు కావాలి' అనే ప్రకటన చదువుతూ ఈ డైలాగులు చెబుతారు.
భారతీయ కథ ఆధారంగా తెరకెక్కిన 'అనూజ' అనే లఘు చిత్రం ఇప్పుడు ఆస్కార్‌కు నామినేట్ అయింది. ఈ షార్ట్ ఫిల్మ్ నిడివి 23 నిమిషాలు.
బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో అకాడమీకి 'అనూజ' నామినేట్ అయింది.
'అనూజ' చిత్రానికి ఆడమ్ జె. గ్రేవ్స్ దర్శకత్వం వహించారు.
ప్రియాంక చోప్రా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.
ఈ చిత్రానికి సంబంధించిన తొమ్మిది మంది నిర్మాతల్లో గునీత్ మోంగా ఒకరు.
గునీత్ మోంగా 2023లో 'బెస్ట్ షార్ట్ డాక్యుమెంటరీ' విభాగంలో ఆస్కార్‌ను గెలుచుకున్న 'ది ఎలిఫెంట్ విష్పరర్స్' నిర్మాత కూడా. ఆస్కార్‌ను గెలుచుకున్న మొదటి భారతీయ డాక్యుమెంటరీ చిత్రం ఇదే. గునీత్ తీసిన లఘు చిత్రం 'పీరియడ్' కూడా ఆస్కార్ గెలుచుకుంది.
ఇంతకీ ఏమిటీ అనూజ కథ? దర్శకుడు దీనినే ఎందుకు ఎంచుకున్నారు?

ఫొటో సోర్స్, ANUJAFILM
అక్కాచెల్లెళ్ల కథ..
దిల్లీలోని ఓ టెక్స్‌టైల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్ల కథే 'అనూజ' చిత్రం. వారి జీవితంలోని సవాళ్లు, అక్కాచెల్లెళ్ల మధ్య సంభాషణల ద్వారా కథ ముందుకు సాగుతుంది.
చిత్రంలో అనూజకు తొమ్మిదేళ్లు, ఆమె సోదరి పాలక్‌తో పాటు నివసిస్తుంటారు. అనూజ పాత్రను సజ్దా పఠాన్ పోషించగా, పాలక్ పాత్రలో అనన్య నటించారు. సజ్దా 'సలాం బాలక్ ట్రస్ట్' సెంటర్‌లో ఆశ్రయం పొందుతున్నారు. ఈ ట్రస్ట్ బాల కార్మికులకు విముక్తి కల్పించి విద్యావకాశాలు, వసతి కల్పించే దిశగా పనిచేస్తోంది.
ట్రైలర్‌లో వారు మ్యాట్రిమోనియల్ ప్రకటనల గురించి మాట్లాడుతుంటారు. ఈట్రైలర్ సమాజంలో ఆడపిల్లలు ఎదుర్కొనే సమస్యలను ప్రస్తావిస్తుంది.
చలనచిత్రాలకు సంబంధించిన వివరాలను పంచుకొనే వెబ్‌సైట్ IMDb ప్రకారం.. గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న తొమ్మిదేళ్ల అనూజకు ఓ పేరున్న పాఠశాలలో చదువుకునే అరుదైన అవకాశం వచ్చింది. ఈ క్రమంలో అనూజ ఎలాంటి నిర్ణయం తీసుకుంది, అది అనూజతో పాటు పాలక్ జీవితాలను ఎటువైపు తీసుకెళ్లిందనేది కథ.


ఫొటో సోర్స్, ANUJAFILM
దర్శకుడు ఏమన్నారు?
'అనూజ' వెబ్‌సైట్ ప్రకారం దర్శకుడు ఆడమ్ జె. గ్రేవ్స్ పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం నుంచి బీఏ, పీహెచ్‌డీ చేశారు. ఆయన కూడా చాలాకాలం బనారస్‌లో నివసించారు. ఆయన బనారస్ హిందూ యూనివర్శిటీలో సంస్కృతం అభ్యసించారు.
రాజస్థాన్, బిహార్, యూపీ, మధ్యప్రదేశ్‌లోని అనేక ఎన్జీవోలతో ఆడమ్‌కు పరిచయం ఉంది. ఈ చిత్రానికి నిర్మాత సుచిత్ర మట్టాయ్. ఆడమ్ భార్యే ఈ సుచిత్ర.
UNICEF ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి పది మంది బాలికలలో ఒకరు బాల కార్మికులుగా ఉన్నారు. ఈ గణాంకాలు, తన చుట్టూ ఉన్న అమ్మాయిల పరిస్థితి అనూజ సినిమా చేయడానికి కారణమని ఆడమ్ పేర్కొన్నారు.
"నేను కలిసిన బాలికలు చాలా స్పూర్తిదాయకంగా కనిపించారు. వారు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రతిభావంతులుగా ఉన్నారు. ఈ అమ్మాయిల సామర్థ్యాలను చూసి ముగ్ధులవ్వకుండా ఉండలేం. ఈ బాలికల అనుభవాలపై సినిమా తీయడం చాలా ముఖ్యం" అని అన్నారు ఆడమ్.

ఫొటో సోర్స్, TWITTER
ఇప్పటివరకు భారతీయులకు వచ్చిన ‘ఆస్కార్‌లు’ ఇవే..
ఆస్కార్ అనేది సినిమా ప్రపంచంలో ప్రతిష్టాత్మకమైన అవార్డు. ఇప్పటివరకు చాలామంది భారతీయులు ఆస్కార్ అవార్డులు గెలుచుకున్నారు. అయితే ఆస్కార్‌లు ఎక్కువగా విదేశీ సంబంధమున్న చిత్రాలకే దక్కాయి.
1983: 'గాంధీ' చిత్రానికి గాను భాను ఆతియా 'కాస్ట్యూమ్ డిజైన్' విభాగంలో ఆస్కార్ అవార్డు గెలుచుకున్నారు.
1992: భారతీయ చలనచిత్ర నిర్మాత సత్యజిత్ రేకు 'గౌరవ జీవిత సాఫల్య' పురస్కారం లభించింది.
2009: 'స్లమ్‌డాగ్ మిలియనీర్' చిత్రానికి ఒరిజినల్ స్కోరు కేటగిరీలో ఏఆర్ రెహమాన్, సౌండ్ మిక్సింగ్ కేటగిరీలో రసూల్ పూకుట్టి, ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో గుల్జార్ ఆస్కార్ గెలుచుకున్నారు.
2023: ది ఎలిఫెంట్ విష్పరర్స్ చిత్రానికి డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో గునీత్ మోంగా, కార్తికి గోన్సాల్వేస్‌లు ఆస్కార్ అవార్డును గెలుచుకున్నారు.
2023: ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన 'ఆర్ఆర్ఆర్' చిత్రంలోని 'నాటు-నాటు' పాటకు 'ఒరిజినల్ సాంగ్' విభాగంలో సంగీత దర్శకుడు కీరవాణి, గీత రచయిత చంద్రబోస్ ఆస్కార్ గెలుచుకున్నారు.
ఇదికాకుండా రాహుల్ థక్కర్ 2016లో టెక్నికల్ అచీవ్‌మెంట్ విభాగంలో అకాడమీ అవార్డు గెలుచుకోగా, అదే ఏడాదిలో భారత సంతతికి చెందిన కోటలాంగో లియోన్, 2018లో వికాస్‌లు ఈ అవార్డు అందుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అనూజ ఆస్కార్‌కి ఎలా చేరుకుంది?
సీనియర్ జర్నలిస్టు, సినీ విమర్శకుడు రామ్‌చంద్రన్ శ్రీనివాసన్ బీబీసీతో మాట్లాడుతూ "అవార్డు ప్రక్రియలో నామినేషన్ ఒక భాగం. సినిమా ఎంపిక నుంచి అవార్డు పొందే ప్రక్రియకు దాదాపు ఆరు నెలల సమయం పడుతుంది. అదే సమయంలో వారి చిత్రానికి అవార్డు వచ్చేలా చేయడానికి నిర్మాతలు తమ వంతుగా పబ్లిసిటీ చేస్తారు" అని అన్నారు.
ఆస్కార్ అవార్డులను అందించే సంస్థలో ప్రపంచవ్యాప్తంగా 10 వేల మందికి పైగా సభ్యులున్నారు. వీరిలో ఎక్కువ మంది అమెరికాకు చెందిన వారే. అదే సమయంలో భారత్ నుంచి దాదాపు 40 మంది సభ్యులున్నారు. ఇందులో ఎడిటింగ్, సౌండ్, వీఎఫ్ఎక్స్ వంటి విభిన్న విభాగాల వారుంటారు. ప్రస్తుతం, హాలీవుడ్ సినిమాలకు 24 విభాగాల కింద అకాడమీ అవార్డులు ఇస్తున్నారు.
"ప్రతి సంవత్సరం అకాడమీ సభ్యులు ఆస్కార్ రేసులో ఉన్న 300కు పైగా చిత్రాలలో వారికి నచ్చిన వాటికి ఓటు వేస్తారు. వాటిని షార్ట్‌లిస్ట్ చేసి మరోసారి ఓటింగ్ తీసుకుంటారు. అలా నామినేట్ అయిన చిత్రాల తుది జాబితాను సిద్ధం చేస్తారు" అని శ్రీనివాసన్ అన్నారు.
అప్పుడు మిగిలిన విషయాలను పీఆర్ కంపెనీలు చూసుకుంటాయి. చిత్రబృందం అకాడమీ సభ్యులకు సినిమాలను చూపిస్తుంది.
"మీ సినిమా వారికి చూపించాలంటే మీరు ఎవరో వారికి చెప్పాలి. మీరు వారికి పూర్తి సమయం ఇవ్వాలి. అల్పాహారం, భోజనం కలిసి చేయాలి. సినిమా మార్కెటింగ్‌లో ఎటువంటి తప్పు చేయకుండా ప్రయత్నించాలి" అని సినీ విమర్శకుడు శ్రీనివాసన్ చెప్పారు.
1957లో విడుదలైన 'మదర్ ఇండియా' ఆస్కార్ నామినేషన్లలో మొదటి ఐదు స్థానాల్లో నిలిచిన భారతీయ చిత్రం.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














