దక్షిణ కొరియాలో 179 మంది చనిపోయిన విమాన ప్రమాదానికి కారణమేంటి, పక్షి వల్లే ప్రమాదం జరిగిందా?

ఫొటో సోర్స్, EPA
దక్షిణ కొరియాలో ఆదివారం ఉదయం రన్‌వేపైకి దిగుతుండగా విమానం కూలిన ఘటనలో 170 మందికి పైగా మరణించారు.
దక్షిణ కొరియా నైరుతి ప్రాంతంలోని మువాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జెజు ఎయిర్ సంస్థకు చెందిన విమానం రన్ వేపై నుంచి జారి గోడను ఢీకొట్టింది.
థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్ నుంచి తిరిగి వస్తున్న ఈ విమానంలో 181 మంది ఉన్నారు. వీరిలో 179 మంది మరణించగా, శిథిలాల నుంచి ఇద్దరు సిబ్బందిని రక్షించారు.
విమాన ప్రమాదానికి కారణాలేమిటనే విషయంపై అధికారులు విచారణ జరుపుతున్నారు. అయితే పక్షి ఢీకొనడం వల్ల కానీ, ప్రతికూల వాతావరణం కారణంవల్ల కానీ ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అగ్నిమాపక అధికారులు భావిస్తున్నారు.


ఫొటో సోర్స్, Reuters/Yonhap
పక్షి ఢీకొనడం వల్లేనా?
ప్రమాదానికి కారణమైన 7సీ2216 విమానం, కొరియాలో అత్యంత ప్రజాదరణ పొందిన జెజు ఎయిర్ సంస్థకు చెందినది. భారత కాలమాన ప్రకారం ఉదయం 5.30 గంటలకు విమానం మువాన్‌కు చేరుకుంది.
విమానం ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో పక్షులు ఢీకొనే ప్రమాదం ఉందంటూ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ హెచ్చరించింది.
అయితే రెండు నిమిషాల తరువాత పైలట్ మేడే కాల్ చేశారు (మేడే కాల్ అంటే అత్యవసరస్థితిని తెలియజేసేది), దీంతో విమానాన్ని వ్యతిరేకదిశ నుంచి ల్యాండ్ అయ్యేందుకు ఎయిర్ ట్రాఫిక్ కమాండ్ అనుమతిచ్చింది.
విమానంలోని ఓ ప్రయాణికుడు తన బంధువుకు ఫోన్ చేసి విమానం రెక్కలో పక్షి ఇరుక్కుపోయిందని విమానం ల్యాండ్ అయ్యే పరిస్థితి లేదని చెప్పినట్టుగా స్థానిక మీడియా తెలిపింది.
విమాన చక్రాలు కానీ, ఇతర ల్యాండింగ్ గేర్ గానీ ఉపయోగించకుండానే విమానం రన్‌వేపై జారిపోతున్నట్టుగా ఒక వీడియోలో కనిపిస్తోంది. విమానం రన్ వేపై నుంచి జారి గోడను ఢీకొనడంతో మంటలు చెలరేగాయి.
భారీ శబ్దం వినిపించిందని, ఆ తర్వాత వరుస పేలుళ్లు సంభవించాయని ప్రత్యక్ష సాక్షి ఒకరు దక్షిణ కొరియా వార్తాసంస్థ యెన్‌హాప్‌కు తెలిపారు.
ఆకాశంలోకి పొగలు ఎగసిపడుతూ విమానం దగ్ధమవుతున్న దృశ్యాలు అక్కడి వీడియోల్లో కనిపిస్తున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు.
విమానంలోని తోకభాగం మాత్రమే గుర్తించగలిగేలా ఉందని మిగిలిన ఏ భాగాన్నీ గుర్తించలేమని మువాన్ అగ్నిమాపక విభాగం చీఫ్ లీ జియోంగ్‌హ్యూన్ టీవీలకు సమాచారం ఇచ్చారు.
పక్షుల దాడి, ప్రతికూల వాతావరణం ప్రమాదానికి కారణమై ఉండవచ్చని, కానీ కచ్చితమైన కారణంపై ఇంకా దర్యాప్తు జరుగుతోందని ఆయన అన్నారు.
విమానం నుంచి వాయిస్ రికార్డర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ ప్రమాదం నిర్వహణ లోపాల వల్ల జరగలేదని జెజు ఎయిర్ సంస్థ యాజమాన్యం చెప్పినట్లు యోన్‌హాప్ వార్తాసంస్థ తెలిపింది.
విమానంలో ఉన్న హెడ్‌పైలట్ 2019 నుంచి పనిచేస్తున్నారని, 6,800 గంటలకు పైగా విమానం నడిపిన అనుభవం ఉందని దక్షిణకొరియా రవాణా శాఖ తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
పక్షులు ఢీకొనడం అంటే..
విమానం, పక్షులు ఢీకొనడం చాలా సాధారణం. యుకెలో 2022లో 1,400 కంటే ఎక్కువ పక్షుల ఢీకొన్న ఘటనలు నమోదయ్యాయి, పౌర విమానయాన సమాచారం మేరకు వీటిలో 100 మాత్రమే విమానాలను ప్రభావితం చేశాయి,
2009లో న్యూయార్క్‌లోని హడ్సన్ నదిలోకి దూసుకెళ్లిన ఎయిర్ బస్ విమానం బాతుల గుంపును ఢీకొట్టింది. మొత్తం 155 మంది ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలతో బయటపడ్డారు.
ఆస్ట్రేలియాలోని సీక్యూ యూనివర్శిటీ లో విమానయాన గురించి బోధించే ప్రొఫెసర్ డౌగ్ డ్రూరీ ఈ వేసవిలో ది కన్వర్జేషన్ కోసం రాసిన వ్యాసంలో బోయింగ్ విమానాల్లో టర్బోఫ్యాన్ ఇంజిన్లు ఉంటాయని, అవి పక్షులు ఢీకొంటే తీవ్రంగా దెబ్బతింటాయని రాశారు.
పక్షులు అత్యంత చురుకుగా ఉండే ఉదయం లేదా సూర్యాస్తమ సమయంలో అప్రమత్తంగా ఉండే విషయంలో పైలట్లకు శిక్షణ ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, EPA
విమానంలో ఎవరెవరు ఉన్నారు?
విమానంలో 175 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ప్రయాణికుల్లో ఇద్దరు థాయ్ లాండ్‌కు చెందినవారని, మిగిలిన వారు దక్షిణ కొరియాకు చెందినవారని అధికారులు తెలిపారు. చాలా మంది థాయ్ లాండ్‌లో క్రిస్మస్ హాలిడే ముగించుకుని తిరిగి వచ్చినట్లు భావిస్తున్నారు.
ఇప్పటివరకు 179 మంది మరణించారని అధికారులు తెలిపారు. ఇది దక్షిణ కొరియా చరిత్రలో అత్యంత ఘోరమైన విమాన ప్రమాదం. మొత్తం ప్రయాణికుల సహా సిబ్బందిలో నలుగురు చనిపోయారు.
ఇప్పటి వరకు 88 మృతదేహాలను అధికారులు గుర్తించారు.
మృతుల్లోపదేళ్ల లోపు చిన్నారులు ఐదుగురు ఉన్నారు. మృతులలో కనిష్ఠ వయసు మూడేళ్ల బాలుడిది కాగా, గరిష్ఠ వయసు 78 ఏళ్ల వృద్ధుడని ప్రయాణికుల జాబితాను ఉటంకిస్తూ అధికారులు తెలిపారు.
ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన ఇద్దరు విమాన సిబ్బందిలో ఒక పురుషుడు, ఒక మహిళ ఉన్నారని దక్షిణకొరియా నేషనల్ ఫైర్ ఏజెన్సీ తెలిపింది. ప్రమాదం జరిగిన తర్వాత విమానం తోక భాగంలో వీరిని గుర్తించి ఆస్పత్రికి తరలించారు.
490 మంది అగ్నిమాపక సిబ్బంది, 455 మంది పోలీసు అధికారులతో సహా 1,500 మందికి పైగా అత్యవసర సిబ్బందిని సహాయక చర్యల్లో భాగంగా మోహరించారు.
రన్ వే చుట్టుపక్కల ప్రాంతాల్లో విమాన భాగాలు, వాటిలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అంతటా శోకమే
దక్షిణ కొరియా తాత్కాలిక అధ్యక్షుడు చోయ్ సంగ్ మోమక్ మువాన్‌లో ప్రత్యేక విపత్తు జోన్‌ను ప్రకటించారు. దీనివల్ల బాధితులకు, స్థానిక ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వ నిధులు అందుబాటులోకి వస్తాయి.
విమాన ప్రమాదం కారణంగా మువాన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అన్ని విమానాల రాకపోకలు రద్దు చేశారు.
తమ బంధువులకు ఏమైందో తెలుసుకోవాలనే ఆశతో బాధిత కుటుంబాలు విమానాశ్రయానికి చేరుకుంటున్నాయి. రాయిటర్స్ నుంచి వచ్చిన వీడియో ఫుటేజీలో అధికారులు బాధితుల పేర్లను బిగ్గరగా చదువుతూ కనిపించారు.
మృతుల కుటుంబాల కోసం విమానాశ్రయ అధికారులు, రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో డజనుకు పైగా టెంట్లు ఏర్పాటు చేశారు. టెర్మినల్ అంతటా ఏడుపు శబ్దాలు ప్రతిధ్వనిస్తున్నాయి.
జెజు విమానయాన సంస్థ బాధిత కుటుంబాలకు క్షమాపణలు చెప్పింది. జెజు విమానయాన ఎలాంటి ప్రమాదాలు జరిగిన చరిత్ర లేదని ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మీడియా సమావేశంలో తెలిపారు.
2005లో విమానయాన సంస్థను ప్రారంభించినప్పటి నుంచి ఆదివారం జరిగిన ఏకైక ఘోర ప్రమాదం ఇదేనని భావిస్తున్నారు.
బాధితులకు విమాన తయారీ సంస్థ బోయింగ్ సంతాపం తెలిపింది.
బాధితులకు దక్షిణ కొరియా తాత్కాలిక అధ్యక్షుడు చోయ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవడానికి చేయగలిగినదంతా చేస్తానని చెప్పారు.
ప్రభుత్వం వారం రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది. ఈ ఏడురోజులు ప్రభుత్వ కార్యాలయాల వద్ద జాతీయజెండాను అవనతం చేస్తారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














