అమెరికా: విమానం - హెలికాప్టర్ గాల్లోనే ఢీకొని నదిలో పడిపోయాయి, 30 మందికి పైగా మృతి

ఫొటో సోర్స్, EPA
అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో విమాన ప్రమాదం జరిగింది.
అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని గగనతంలోనే బ్లాక్ హాక్ హెలికాప్టర్ ఢీకొట్టినట్లు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) తెలిపింది.
స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 9 గంటలకు (భారత కాలమానం ప్రకారం ఉదయం 7.30 గంటలకు) రోనాల్డ్ రీగన్ వాషింగ్టన్ నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని 33వ రన్‌వేకి దగ్గరవుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు ఎఫ్ఏఏ ఒక ప్రకటనలో తెలిపింది.
కూలిపోయిన విమానంలో 60 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నట్లు బీబీసీ అమెరికా భాగస్వామి వార్తాసంస్థ సీబీఎస్ రిపోర్ట్ చేసింది.
30 మృతదేహాలు నదిలో దొరికినట్లు సీబీఎస్ తెలిపింది.

ప్రమాద ఘటనతో వాషింగ్టన్ డీసీ అత్యవసర బృందాలు హుటాహుటిన విమానాశ్రయం వద్దకు చేరుకున్నాయి.
డజనుకుపైగా అగ్నిమాపక వాహనాలు, అంబులెన్సులు అక్కడికి చేరుకున్నాయి.
విమానం, హెలికాప్టర్ గాల్లోనే ఢీకొని, ఎయిర్‌పోర్టుకి సమీపంలోని పోటోమాక్ నదిలో పడిపోయాయి.
పోటోమాక్ నదిలో గాలింపు చర్యలు చేపట్టినట్లు డీసీ అగ్నిమాపక విభాగం తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
ఎఫ్ఏఏ విడుదల చేసిన ప్రకటనలో ''స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 21:00 గంటలకు రోనాల్డ్ రీగన్ వాషింగ్టన్ నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని 33వ రన్‌వేకు దగ్గరవుతున్న సమయంలో పీఎస్ఏ(PSA) ఎయిర్‌లైన్స్ నడుపుతున్న బాంబార్డియర్ CRJ700 ప్రాంతీయ జెట్ విమానం - సికోర్స్కీ H-60 హెలికాప్టర్ గాల్లో ఢీకొన్నాయి'' అని పేర్కొంది.
"పీఎస్‌ఏ విమానం అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 5342గా నడుస్తోంది. ఇది కన్సస్‌లోని విచిటా నుంచి వస్తోంది.''
"ఎఫ్ఏఏ, నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB) ఘటనపై దర్యాప్తు చేస్తున్నాయి. దర్యాప్తుకు ఎన్టీఎస్‌బీ నేతృత్వం వహిస్తోంది.
పోటోమాక్ నది వద్ద జరిగిన విమాన ప్రమాదం గురించి చాలా ఫోన్ కాల్స్ వచ్చాయని, పోటోమాక్ నదిలో పలు శాఖల బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
విమానంలో 64 మంది: అమెరికన్ ఎయిర్‌లైన్స్
ప్రమాద ఘటనపై అమెరికన్ ఎయిర్‌లైన్స్ ప్రకటన చేసింది.
కాన్సాస్‌లోని విచిట నుంచి వాషింగ్టన్ డీసికి వెళ్తున్న అమెరికన్ ఈగల్ ఫ్టైట్ 5342 డీసీ ఎయిర్‌పోర్ట్ (రోనాల్డ్ రీగన్ వాషింగ్టన్ నేషనల్ ఎయిర్‌పోర్టును - డీసీఏ డీసీ ఎయిర్‌పోర్ట్‌గా కూడా పిలుస్తారు) సమీపంలో ప్రమాదానికి గురైంది. ఈ విమానాన్ని పీఎస్‌ఏ ఎయిర్‌లైన్స్ ఆపరేట్ చేస్తోంది.
విమానంలో 60 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నట్లు ప్రకటనలో అమెరికన్ ఎయిర్‌లైన్స్ తెలిపింది.
విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది గురించి ఆందోళన చెందుతున్నామని, అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొంది.
హెలికాప్టర్‌లో ముగ్గురు సైనికులు
ప్రమాదానికి గురైన బ్లాక్ హాక్ ఆర్మీ హెలికాప్టర్‌లో ముగ్గురు అమెరికన్ సైనికులు ఉన్నారు.
హెలికాప్టర్ వర్జీనియాలోని ఫోర్ట్ బెల్వోయిర్ నుంచి వస్తున్నట్లు యూఎస్ ఆర్మీ అధికారి చెప్పినట్లు బీబీసీ భాగస్వామి సీబీఎస్ న్యూస్ తెలిపింది.
మృతదేహాలు గుర్తించాం: పోలీసులు
ప్రమాద స్థలంలో 30 మృతదేహాలను గాలింపు బృందాలు గుర్తించాయని, ప్రాణాలతో ఉన్నవారెవరూ ఇంకా కనిపించలేదని బీబీసీ యూఎస్ భాగస్వామి సీబీఎస్ న్యూస్‌తో పోలీసు అధికారులు తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














