''ఇక్కడ పురుగుల్లా బతుకుతున్నాం. ఏ పార్టీ గెలిచినా మా బతుకులు మారవు''

ఫొటో సోర్స్, Rohit Lohia/BBC
- రచయిత, దిల్‌నవాజ్ పాషా
- హోదా, బీబీసీ ప్రతినిధి
వ్యర్థాలు పర్వతంలా పెరిగిపోతున్న భలస్వా ల్యాండ్‌ఫిల్ చుట్టుపక్కల కలాందర్ కాలనీ, దాదా శివ్ పాటిల్ నగర్ ఉన్నాయి. అంతకంతకూ పెరుగుతున్న ఈ వ్యర్థాల గుట్ట, ప్రజలు నివసిస్తోన్న ప్రాంతాలు పూర్తిగా ఒకదానిలో ఒకటి కలిసిపోయాయి.
ఇలాంటివి దిల్లీలో మూడు ప్రాంతాలు ఉన్నాయి. నగరంలోని చెత్తను, వ్యర్థాలను ఇక్కడకు తీసుకొచ్చి ప్రాసెస్ చేస్తారు. ప్రతి రోజూ ట్రక్కులలో వేల టన్నుల వ్యర్థాలను ఇక్కడకు తీసుకొస్తారు.
వ్యర్థాలు చుట్టూ ఉన్న ఈ ప్రాంతాల్లో జనసాంద్రత కూడా చాలానే ఉంటుంది. ఎంత మంది ఇక్కడ నివసిస్తారనే దానికి కచ్చితమైన లెక్కలు లేవు.
వేల మంది ఇక్కడ నివసిస్తుంటారు. చాలామంది పిల్లలు ఇక్కడ శక్తిమంతమైన అయస్కాంతాల సాయంతో ఈ చెత్తలోని ఇనుప ముక్కలను బయటకు తీస్తుంటారు.
''ఇది మా పికర్స్ పార్టీ. ఈ వ్యర్థాలలో మనకు అన్ని రకాల వస్తువులు కనిపిస్తాయి. కొన్నిసార్లు మాకు రోజుకు రెండు వందల రూపాయలు కూడా రావు. అదృష్టం బాగున్న రోజు మాత్రం వేల రూపాయల విలువైన వస్తువులు కూడా దొరుకుతాయి'' అని ఒక టీనేజీ కుర్రాడు నవ్వుతూ చెప్పాడు.
భలస్వా ప్రదేశానికి ఆనుకుని ఉన్న కలాందర్ కాలనీలో మురికిగుంత నుంచి నీరు బయటకు వస్తూ వీధుల్లో ప్రవహిస్తూ ఉంది.
ఎక్కడ చూసినా ఈగలు గుంపులు గుంపులుగా ఎగురుతూ ఉన్నాయి. కొందరు పిల్లలు వీధుల్లో పొడిగా ఉన్న ప్రాంతాల్లో ఆడుకుంటున్నారు.

రోషిణి తన ఇంట్లోకి వెళ్లే మార్గాన్ని శుభ్రం చేస్తూ కనిపించారు.
''మేం ఇక్కడ పురుగుల్లా బతుకుతున్నాం. మమ్మల్ని ఎవరూ పట్టించుకుంటారు. నేను గుంతలో పడిపోవడంతో కాలు విరిగింది. బాగు చేయించుకునేందుకు చాలా ఖర్చుపెట్టాల్సి వచ్చింది'' అని రోషిణి బాధతో చెప్పారు.
''మా సొంత డబ్బుతో ఈ వీధిలో రోడ్డు వేయించాం. మాది మేమే శుభ్రం చేసుకుంటాం'' అని తెలిపారు.
ఈ కాలనీలో చాలామంది నివాసితులు ఇదే రకమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు.
చాలామందికి వీధుల్లో కుళాయిల నుంచి వచ్చే మురికి నీరు అతిపెద్ద సమస్యగా ఉంది.
గుల్షన్ కాలు తీవ్రంగా దెబ్బతింది. వీధిలో మురికి గురించి మాట్లాడిన గుల్షన్, ఇక్కడ ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నా నాయకులు ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు.
''నా కాళ్లలో చీము ఉంది. స్టీఫెన్ ఆస్పత్రిలో చికిత్స తీసుకోవాల్సి వచ్చింది'' అని గుల్షన్ చెప్పారు.

ఫొటో సోర్స్, Rohit Lohia/BBC
మురికిలో మగ్గిపోతున్న జీవితాలు
మురికివాడలో ఉన్న రెండు అంతస్థుల భవనం మెట్ల పైనుంచి కొందరు పిల్లలు చేతిలో పుస్తకాలు పట్టుకుని దిగుతూ కనిపించారు.
దిల్లీ యూనివర్సిటీలో డిగ్రీ చదువుతున్న తనూ, ఇక్కడ పిల్లలకు చదువు చెబుతున్నారు. ఈ రోడ్డంతా గుంతలే. మురికి నీరు ప్రవహిస్తూ ఉంటుంది.
పిల్లలకు రోడ్డు దాటడం కష్టమవుతుంది. వారిని రోడ్డు దాటించడంలో తనూ సాయం చేస్తున్నారు. రోడ్డు దాటే సమయంలో తరచూ పిల్లలు ఈ మురికి గుంతలలో పడిపోతుంటారు.
''ఈ మురికి గుంతల చుట్టుపక్కలే మేం నివసిస్తుంటాం. ఇలాంటి మురికివాడల్లో ఎవరూ ఇష్టానుసారం నివసించరు. మాకెలాంటి ఆప్షన్ లేకపోవడంతోనే ఇక్కడ నివసిస్తున్నాం'' అని తనూ చెప్పారు.
తనూ చదువుకోవాలని అనుకుంటోంది. ఎందుకంటే, తానేదైనా చేసి, ఇక్కడి నుంచి తమ కుటుంబాన్ని బయటికి తీసుకెళ్లాలన్నది తన లక్ష్యం.
ఒకవైపు వ్యర్థాల గుట్ట.. మరోవైపు ప్రజలు నివసించే మురికివాడ. ఇది వారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని ప్రజలు వాపోతున్నారు.
పెద్ద మొత్తంలో చెత్తను కాల్చే ఈ ప్రదేశాలకు తరలించడానికి ముందే 90 శాతం వ్యర్థాలను శుద్ధి చేయాలి. దీనికి సామాజిక స్పృహ అవసరం. ప్రజలకు తెలిస్తే, వారు తక్కువ వ్యర్థాలను ప్రొడ్యూస్ చేస్తారు.
– అతిన్ బిశ్వాస్, రీసర్చర్, సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్
ఇదే మురికివాడలో ఒక అద్దె గదిలో ఇద్దరు చెల్లెళ్లతో కలిసి ఉంటున్నారు 19 ఏళ్ల తమన్నా.
తమన్నా తల్లిదండ్రులు మరణించారు. తొమ్మిదేళ్ల క్రితం తన తల్లి క్యాన్సర్‌తో మృతి చెందగా.. ఏడాదిన్నర క్రితం టీబీతో తండ్రి చనిపోయారు.
ప్రస్తుతం తన ఇద్దరు చెల్లెళ్ల బాధ్యత తమన్నాదే.
''ఇక్కడ నివసించడం ఎంత కష్టమో మాకు తెలుసు. మేం అద్దె చెల్లించాలి. కొన్నిసార్లు రోజులు తరబడి మాకు తినడానికి ఏం దొరకదు. కొందరు మాకు తినేందుకు రోటీలు ఇస్తారు'' అని తమన్నా చెప్పారు.
తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత అనాథలైన ఈ పిల్లలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం రాలేదు. వారు తమ డాక్యుమెంట్లను పొందలేకపోవడంతో, జీవనం మరింత కష్టతరంగా మారింది.
''తరచూ ఇక్కడ ప్రజలు అనారోగ్యం పాలవుతుంటారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సైతం చికిత్స పొందేందుకు మేం కష్టపడాల్సి వస్తుంది'' అని తమన్నా ఇంటి పక్కన నివసించే ఒకరు చెప్పారు.

ఫొటో సోర్స్, Rohit Lohia/BBC
ఏదైనా మెరుగవుతుందనే ఆశ లేదు
భలస్వా ల్యాండ్‌ఫిల్ పక్కనే ఆనుకుని సుధర్ సింగ్ ఇల్లు ఉంది. ఆయన ఇంటికి వెళ్లే దారంతా చెత్తాచెదారమే.
ఇంటి పైన నిల్చుని మాట్లాడిన సుధర్ సింగ్, '' మా గ్రామం నుంచి వచ్చినప్పుడు చాలా ఆరోగ్యంగా, బలంగా ఉన్నాం. కానీ, ఇక్కడ వాతావరణం వల్ల మా శరీరాలు పాడైపోతున్నాయి. అనారోగ్యం పాలవుతున్నాం. నాకు 80 లేదా 90 ఏళ్లు ఉంటాయని అనిపిస్తుంటుంది'' అని చెప్పారు.
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన మైకులు ఇక్కడ మురికివాడల్లో కూడా వినిపిస్తున్నాయి. అంతటా అభ్యర్థుల పోస్టర్లు కనిపిస్తున్నాయి. పెద్ద పెద్ద స్పీకర్లు పెట్టుకుని వాహనాలు వెళ్తున్నాయి. అభ్యర్థుల ఎన్నికల వాగ్దానాలను ప్రచారం చేస్తున్నాయి.
కానీ, పరిస్థితిలో ఏదైనా మార్పు వస్తుందని సుధర్ సింగ్ ఆశిస్తున్నారా? అని అడిగితే..
ఆయన ముఖంపై ఒక చిన్ననవ్వు కనిపించింది. ''నాకిప్పుడు 40 ఏళ్లు. కానీ, ఇప్పటి వరకు ఏదీ చూడలేదు. ఇన్నేళ్లలో ఎలాంటి మార్పు, మెరుగుదల కనిపించలేదు. నా జీవితంలో ఇది జరుగుతుందని నేననుకోవడం లేదు'' అని సమాధానమిచ్చారు.
ఇక్కడ శ్వాస సంబంధిత సమస్యలతో చాలామంది ప్రజలు బాధపడుతున్నారు.
''డంపింగ్ యార్డు నుంచి పొగ వచ్చినప్పుడు మాకు శ్వాస తీసుకోవడం ఇబ్బందవుతోంది'' అని సుధర్ సింగ్ తెలిపారు.
కాలుష్యాన్ని నియంత్రించి, పర్యావరణాన్ని కాపాడేందుకు దేశంలో చాలా చట్టాలున్నాయి. ఈ చట్టాల ప్రకారం.. ఏదైనా ల్యాండ్‌ఫిల్ ప్రాంతానికి చుట్టూ 200 మీటర్ల మేర ప్రజలు నివసించేందుకు అనుమతి లేదు. అంతేకాక, నీటి, గాలి కాలుష్యాన్ని అరికట్టేందుకు చాలా కఠినమైన నిబంధనలు ఉన్నాయి.

ఫొటో సోర్స్, Rohit Lohia/BBC
మరుగుదొడ్లు, క్రీడా మైదానాలు లేవు
ఇక్కడున్న పరిస్థితులను ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు.
ల్యాండ్‌ఫిల్ నుంచి వచ్చే కలుషిత నీటి లీకేజీని అడ్డుకునే బాధ్యత మున్సిపల్ శాఖదే. భలస్వా ల్యాండ్‌ఫిల్ ప్రదేశానికి పక్కనే జనావాసాలు ఉన్నాయి.
ఇక్కడ పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం పెద్ద టాయిలెట్ కాంప్లెక్స్‌ను నిర్మించింది. ప్రస్తుతం ఇది మురికితో నిండిపోయింది.
ఇక్కడ పెట్టిన క్లీన్ ఇండియా మిషన్ పోస్టర్‌పై – ‘పరిశుభ్రత దిశగా ఒక అడుగు..’ అని రాసి ఉంది. ఆ పోస్టర్‌లో సందేశం తప్ప ఇక్కడసలు పరిశుభ్రతే లేదు.
టాయిలెట్ కాంప్లెక్స్‌కు బయట పిల్లలు ఆడుకునేందుకు క్రీడా మైదానం ఉంది. అది కూడా మురికితో నిండిపోయింది.
పిల్లలు ఆడుకునేందుకు ఒకే ఒక్క ప్రాంతం ఉంది. అది ఆ పార్కుకు ఉన్న గోడ. ఆ గోడను ఎక్కుతూ, దిగుతూ పిల్లలు ఆడుకుంటున్నారు.
''ఇక్కడ వేల మంది పిల్లలు ఉన్నారు. కానీ, వారు ఆడుకునేందుకు ఒక్క పార్క్ కూడా లేదు. ఈ మురికి, చెత్తాచెదారం మధ్యనే ఆడుకుంటూ, అనారోగ్యం పాలవుతున్నారు'' అని స్థానిక నివాసి చంద్ చెప్పారు.

ఫొటో సోర్స్, Rohit Lohia/BBC
ఇంట్లో కాంతి లేదు, ప్రభుత్వ ప్రయోజనాల ఆశ లేదు...
ఈ మురికివాడల్లో చాలా ప్రాంతాలకు సూర్యకాంతి పడదు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు రావు. ఇక్కడున్న మహిళలు చాలామంది తమ ఇళ్ల బయట కూర్చుని శెనగల పొట్టు తీస్తున్నారు. వీటిని హోల్‌సేల్ మార్కెట్‌కు పంపిస్తారు. రోజంతా పనిచేస్తూ కష్టంగా రూ.50 సంపాదిస్తారేమో.
ముగ్గురు పిల్లల తల్లి సునీత శెనగల పొట్టు తీయడంలో బిజీగా ఉన్నారు. డిమ్‌గా వెలుగుతున్న ఒకే బల్బుతో తన గదిలో అసలు కాంతే రావడం లేదు.
''శెనగలు ఒలచడం వల్ల రోజుకు రూ.40 నుంచి రూ.50 వస్తాయి. వాటితో నేను పిల్లలకు ఆహారం తీసుకుంటాను'' అని బాధతో చెప్పారు.
కొన్నిసార్లు పిల్లలకు ఆహారం కూడా వండి పెట్టలేనని చెప్పారు. ''నా వద్ద చిన్న గ్యాస్ సిలిండర్ ఉంది. ఒకవేళ సడెన్‌గా అది అయిపోతే, నేను ఖరీదైనది తీసుకోవాల్సి ఉంటుంది.'' అని అన్నారు.
రేషన్ కార్డు లేకపోవడంతో కనీసం సునీతకు ప్రభుత్వ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం కూడా రావడం లేదు. తొమ్మిదేళ్ల క్రితం కట్టుకున్న వారింటికి కనీసం ఆమె పేరుపై ఎలక్ట్రిక్ మీటర్ కూడా లేదు.
''ఎలక్ట్రిక్ మీటర్ లేదని రేషన్ కార్డు ఇవ్వడం లేదు. అందుకే, ఓటర్ కార్డు కూడా లేదు.'' అని చెప్పారు.
కానీ, ఆమె వేసే ఓటుకు ఎంత ప్రాధాన్యత ఉందో సునీతకు తెలుసు. తాను ఓటేస్తే ఆమె జీవితం మారుతుందేమోనని సునీత భావిస్తోంది. కానీ, ఇక్కడున్న చాలామందికి ఆ ఆశ లేదు.

ఫొటో సోర్స్, Rohit Lohia/BBC
పురుగుల్లా బతుకుతున్నాం..
ఇంటి బయట మంట దగ్గర కూర్చున్న చనౌతా దేవిని ఎన్నికల గురించి అడగగా.. ఆమె బాధను వ్యక్తం చేశారు.
''చలిలో మేమెలా ఉంటున్నామో కనీసం ఎవరూ అడగరు. మంచినీటిని కొనుక్కునేందుకు కనీసం రూ.50 లేవు. మురికి నీటినే తాగాల్సి వస్తుంది. మురికి నీరు, గుంతల గురించి మా సమస్యలను వినే నాథుడే లేడు. పేదల సమస్యలను ఎవరూ పట్టించుకోరు'' అని చనౌతా దేవి చెప్పారు.
ఇప్పటి వరకు ఎవరూ తమకోసం ఏం చేయలేదేని, అధికారంలోకి ఎవరూ వచ్చిన తమ పరిస్థితులు మారవని అన్నారు. పురుగుల్లా తాము ఇక్కడ జీవించాల్సిందేనని చెప్పారు.

ఫొటో సోర్స్, Rohit Lohia/BBC
ఘాజీపూర్ ల్యాండ్‌ఫిల్‌లో కూడా ఇదే పరిస్థితి..
ఈస్ట్ దిల్లీలో ఉన్న ఘాజీపూర్ ల్యాండ్‌ఫిల్‌లో పరిస్థితి ఇందుకు భిన్నమైనది ఏమీ కాదు. ఇక్కడ నివసిస్తోన్న వారికి శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బందవుతుంది.
''ఎన్నోసార్లు దీని గురించి ఎంతో మందికి ఫిర్యాదు చేశాం. కానీ, ఏం జరగలేదు'' అని బిల్కిస్ అన్నారు.
''ఈ ల్యాండ్‌ఫిల్‌లో మంటలు అంటుకున్నప్పుడు, మా ఇళ్లలోకి పొగ వస్తుంది. అప్పుడు కనీసం శ్వాస తీసుకోలేం. గాలిలో అంతా చెత్త వాసనే. ఇక్కడ ప్రజలు సాధారణంగా జబ్బు పడుతూ ఉంటారు. మా అమ్మ ఎప్పుడూ మాస్క్ పెట్టుకునే ఉంటుంది. నా భార్య శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతూ ఉంటుంది. పిల్లలకు ఊపిరితిత్తుల దగ్గర నొప్పి వస్తూ ఉంటుంది.'' అని ఈ ప్రాంతంలో నివసించే మొహమ్మద్ అఖీల్ చెప్పారు.
ఈ ల్యాండ్‌ఫిల్స్ కట్టినప్పుడు ప్రజలు ఇక్కడ జీవించే వారు కాదు. కానీ, ప్రస్తుతం ఈ ల్యాండ్‌ఫిల్స్‌కు చుట్టూ పెద్ద నివాసిత ప్రాంతం ఏర్పాటైంది.
ఇక్కడ నుంచి ల్యాండ్‌ఫిల్స్‌ను లేదా రెసిడెన్షియల్ ఏరియాలను తరలించడం సాధ్యం కాదు. కానీ, ఎన్నోసార్లు రాజకీయ నాయకులు ల్యాండ్‌ఫిల్స్‌ను రెసిడెన్షియల్ ఏరియాల నుంచి తరలిస్తామని వాగ్దానం చేస్తున్నారు.
అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయినప్పుడు, ఇక్కడ నుంచి పూర్తిగా వాటిని తొలగిస్తామని చెప్పారు. కానీ, ఈ వ్యర్థాల గుట్ట అలానే పెరిగిపోతుందని స్థానికులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Rohit Lohia/BBC
పరిష్కారం అంత తేలిక కాదు
ఘాజీపూర్ ల్యాండ్‌ఫిల్ నుంచి జనాలను తరలించడం అంత తేలికైన పని కాదు.
''ఘాజీపూర్ ల్యాండ్‌ఫిల్ నుంచి జనాలను తరలించడం అంత తేలికైన పని కాదు. బలహీన వర్గాల ప్రజలు ఇక్కడ ఉంటున్నారు. భూమి చౌకగా రావడంతో, ఇక్కడే స్థిరపడ్డారు'' అని అతిన్ బిశ్వాస్ చెప్పారు.
ఈ ల్యాండ్‌ఫిల్‌ను తొలగిస్తామని, ఈ ప్రాంతాన్ని శుభ్రం చేస్తామని రాజకీయ నాయకులు వాగ్దానం చేస్తుంటారని, కానీ, వాస్తవం దానికి అందనంత దూరంలో ఉందన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














