దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు: ఫిబ్రవరి 5న పోలింగ్, 8న ఫలితాలు.. దిల్లీలో బీజేపీ ఎందుకు గెలవలేకపోతోంది?

ఫొటో సోర్స్, Sonu Mehta/Hindustan Times via Getty Images
- రచయిత, చందన్ కుమార్ జజ్వాడే
- హోదా, బీబీసీ ప్రతినిధి
దేశ రాజధాని దిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రకటించారు. ఒకే దశలో ఫిబ్రవరి 5న దిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు ఉంటుందని చెప్పారు.
దిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా, అందులో 12 సీట్లు రిజర్వ్‌డ్ అని రాజీవ్ కుమార్ చెప్పారు. దిల్లీ ఓటర్లు మొత్తం 1.55 కోట్ల మందిఅని, వారిలో 83.49 లక్షలమంది పురుషులు, 71.74 మంది స్త్రీ ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఈసారి ఎన్నికల్లో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునేవారు 2 లక్షలమందని చెప్పారు. మొత్తం 13వేల పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.
ఇప్పటికే ఆప్ 70 స్థానాలకూ తన అభ్యర్థులను ప్రకటించగా, బీజేపీ తన తొలి జాబితాలో 29మంది అభ్యర్థులను ప్రకటించింది. మరోపక్క కాంగ్రెస్ పార్టీ 40కు పైగా స్థానాలలో తన అభ్యర్థులను నిలిపింది. మూడుపక్షాలు ఎన్నికల వేడిని రాజేశాయి. పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి.
లోక్‌సభ ఎన్నికలలో కలిసి పనిచేసిన ఆప్, కాంగ్రెస్ ఈసారి విడివిడిగా పోటీ చేస్తున్నాయి. ఒకదానిపై ఒకటి విమర్శలు గుప్పించుకుంటున్నాయి.


ఫొటో సోర్స్, ANI
ఎన్నికల ప్రచారంలో మోదీ, షా
దిల్లీ ఎన్నికల భేరీ మోగిన నేపథ్యంలో దిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. గడిచిన ఆరు ఎన్నికలలో ఆ పార్టీ అధికారాన్ని దక్కించుకోలేకపోయింది.
గతంలో బీజేపీ మూడుసార్లు కాంగ్రెస్ చేతిలో, ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ చేతిలో మూడుసార్లు ఓడిపోయింది.
మూడు దశాబ్దాలనుంచి బీజేపీకి దిల్లీ అందని ద్రాక్షలానే ఉంది. గత మూడు లోక్‌సభ ఎన్నికల్లో కూడా దిల్లీలో అన్ని సీట్లను గెలుచుకున్న బీజేపీ, అసెంబ్లీ ఎన్నికల్లో గెలవకపోవడం ఆశ్చర్యకరం.
ఈ సమయంలో దిల్లీ రాష్ట్ర నాయకత్వంలో ఎన్నో ముఖాలను బీజేపీ పరిచయం చేసింది. కానీ, ఎన్నికల విషయంలో మాత్రం విజయం సాధించలేకపోయింది.
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీ ప్రకటనకు ముందు నుంచే ప్రధాని నరేంద్ర మోదీ, హోమ్ మంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ నేతలు ఎన్నికల ప్రచారంలో కనిపిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
'బీజేపీకి స్థానిక నేతలు కరువు'
దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నెలలో అంటే ఫిబ్రవరిలో జరగనున్నాయి. ఈ సమయంలో, దిల్లీలో రెండు ప్రధాన పార్టీలు అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. కేజ్రీవాల్ ప్రభుత్వ అవినీతి ఆరోపణల నుంచి దిల్లీ అభివృద్ధి వరకు పలు ప్రశ్నలను లేవనెత్తుతున్నారు.
దిల్లీలో కాంగ్రెస్‌ను ఆమ్ ఆద్మీ పార్టీ గద్దెదింపింది. ఆప్ ప్రభుత్వాన్ని, ఉచిత విద్యుత్, ఉచిత నీరు వంటి ఆ పార్టీ విధానాలను ప్రజలు ఇష్టపడ్డారని సీనియర్ జర్నలిస్ట్ వినోద్ శర్మ చెప్పారు.
ఆమ్ ఆద్మీ పార్టీ ఏ వాగ్దానం ఇచ్చినా నెరవేరుస్తుందని ప్రజలు భావిస్తున్నారని, అందుకే వారు బీజేపీకి ఓటు వేయరని వినోద్ శర్మ పేర్కొన్నారు.
అంతేకాక, దిల్లీలో బీజేపీకి స్థానిక నేతలు కరువు కావడం కూడా దీనికి ప్రధాన కారణమని చెప్పారు.
'' మదన్‌లాల్ ఖురానా లేదా కేదర్ నాథ్ సాహ్ని వంటి స్థానిక నేతలు ప్రస్తుతం బీజేపీకి దిల్లీలో లేరు. ప్రధానమంత్రి ప్రచారం చేసినప్పటికీ, వారు ఓడిపోతారు.'' అని అన్నారు.
''కేంద్రంలో ప్రధాని మోదీపై ఉన్న విశ్వసనీయత, దిల్లీలో లేదు. ప్రజలు నమ్మే వ్యక్తిని, కేజ్రీవాల్‌ను సవాలు చేయగలరని భావించే వారిని పార్టీ ముందుకు తీసుకురావడం లేదు.'' అని సీనియర్ జర్నలిస్ట్ నీర్జా చౌదరి చెప్పారు.

ఫొటో సోర్స్, ANI
దిల్లీలో ఎవరికెంత బలం?
చివరిసారి 1993లో బీజేపీ దిల్లీలో గెలిచింది. ఆ సమయంలో దిల్లీ ముఖ్యమంత్రిగా మదన్ లాల్ ఖురానా పనిచేశారు.
ఈ గెలుపులో ఓట్ల విభజన కీలక పాత్ర పోషించినట్లు చెబుతారు. ఆ ఏడాది ఎన్నికల్లో, వీపీ సింగ్ 'మండల్' రాజకీయాలు ప్రభావం దిల్లీలో స్పష్టంగా కనిపించడంతో, రాష్ట్రంలో జనతాదళ్ 12 శాతానికి పైగా ఓట్లు సాధించింది. కాంగ్రెస్‌కు 35 శాతం, బీజేపీకి 43 శాతం ఓట్లు వచ్చాయి.
దిల్లీలో బీజేపీ గెలుపుకు అప్పుడు ఓట్ల విభజన బాగా సాయపడిందని చెబుతారు.
1993లో 49 సీట్లతో భారీ గెలుపు సాధించినప్పటికీ, ఐదేళ్ల కాలంలో మూడుసార్లు దిల్లీ ముఖ్యమంత్రిని బీజేపీ మార్చింది. బీజేపీ తొలిసారి మదన్ లాల్ ఖురానాను, ఆ తర్వాత సాహిబ్ సింగ్ వర్మను, చివరికి సుష్మా స్వరాజ్‌ను దిల్లీ ముఖ్యమంత్రిగా చేసింది. ఆ సమయంలో పెరిగిన ఉల్లిగడ్డల ధరలు, సుదీర్ఘకాలంగా బీజేపీకి కంట్లో నీళ్లు తెప్పిస్తున్నాయని అంటుంటారు.
మూడుసార్లు ముఖ్యమంత్రులను మార్చిన ప్రయోగంతో, మూడు దశాబ్దాలుగా మళ్లీ దిల్లీలో అధికారాన్ని బీజేపీ దక్కించుకోలేకపోతుందని చెబుతుంటారు.
ఆ తర్వాత మూడుసార్లు కాంగ్రెస్‌ను గెలిపించారు దిల్లీ ప్రజలు. ముఖ్యమంత్రిగా షీలా దీక్షిత్ పనిచేశారు.
ఆమ్ ఆద్మీ పార్టీని దిల్లీ ప్రజలు అభిమానిస్తున్నారు. కానీ, బీజేపీపై మాత్రం ప్రజలు ఇంకా ఎలాంటి నమ్మకాన్ని పెట్టలేకపోతున్నారు.
2013లో 70 అసెంబ్లీ సీట్లున్న దిల్లీ అసెంబ్లీలో 31 సీట్లను బీజేపీ గెలుచుకుంది. ఆ తర్వాత, 2015 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 3 సీట్లను, 2020లో 8 సీట్లను మాత్రమే పొందింది.
అయితే, 2014, 2019, 2024లలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం దిల్లీలో ఉన్న ఏడు సీట్లను బీజేపీ గెలుపొందింది.
''దిల్లీ అధికారాన్ని కాంగ్రెస్‌కు వదిలేసినప్పుడు, ఆ సమయంలో బీజేపీ అంత బలంగా లేదు. కానీ, మోదీ వచ్చిన తర్వాత, పార్టీ బలపడింది. అయినా దిల్లీలో బీజేపీ గెలవలేకపోతోంది.'' అని ఎన్నికల నిపుణులు, సీఎస్‌డీఎస్ ప్రొఫెసర్ సంజయ్ కుమార్ అన్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి, అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేయాలనే స్పష్టతతో దిల్లీ ఓటర్లు ఉన్నారని సంజయ్ కుమార్ భావిస్తున్నారు. అందుకే, ఈ రెండు ఎన్నికల్లో ఓట్ల పంపిణీలో చాలా వ్యత్యాసం ఉందన్నారు.

ఫొటో సోర్స్, ANI
దిల్లీలో బీజేపీ ప్రయోగాలు
2020లో దిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల గురించి మాట్లాడుకుంటే, ఆప్‌కు సుమారు 54 శాతం ఓట్లు వచ్చాయి. బీజేపీ కూడా సుమారు 40 శాతం ఓట్లను పొందింది. అదే సమయంలో కాంగ్రెస్ సుమారు 4 శాతం ఓట్లను మాత్రమే సొంతం చేసుకోగలిగింది.
2019 ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో, బీజేపీకి 56 శాతం, ఆమ్ ఆద్మీ పార్టీకి 18 శాతం, కాంగ్రెస్‌కు సుమారు 23 శాతం ఓట్లు వచ్చాయి. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి ప్రధాన కారణం దిల్లీలోని మురికి వాడలు, దళితులు, ముస్లింలే అని భావిస్తారు.
బీజేపీ కొన్నిసార్లు కిరణ్ బేడీని, కొన్నిసార్లు కాంగ్రెస్ నుంచి అర్విందర్ సింగ్ లవ్లీని, కొన్నిసార్లు హర్షవర్ధన్‌ను తెరపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించిందని నీర్జా చౌదరి చెప్పారు.
దిల్లీలో ఎంతోమంది నేతలను బీజేపీ మార్చింది. కానీ, ఎవర్నీ కూడా బలమైన నేతగా జనం ముందు ఉంచలేకపోయింది.
ప్రతి వర్గానికి చెందిన ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాల్లో భాగంగా, గత కొన్నేళ్లలో దిల్లీ రాష్ట్ర యూనిట్ అధ్యక్షునిగా ప్రతి వర్గానికి చెందిన నేతలను బీజేపీ నియమించుకుంటూ వెళ్లింది.
వీరిలో, ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా, అంతకుముందు అదేష్ గుప్తా, మనోజ్ తివారి, సతీష్ ఉపాధ్యాయ్, విజేంద్ర గుప్తా, హర్షవర్ధన్, ఓపీ కోహ్లిలు ఉన్నారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీజేపీ ఎన్నో రాష్ట్రాలను గెలుచుకుంది. కానీ, దిల్లీలో మాత్రం గెలవలేకపోయింది.
''ఒకవేళ మీరు చూస్తే, బీజేపీ బలమైనది అయినప్పటికీ, బీజేపీ ఎక్కడ గెలిచినా, అక్కడ సాధారణంగా కాంగ్రెస్‌ను ఓడించి అధికారంలోకి వస్తుంది. దిల్లీలో కాంగ్రెస్‌ను ఓడించడానికి బీజేపీ కంటే మెరుగైన ఆప్షన్‌గా ఆమ్ ఆద్మీ పార్టీ రూపంలో చూశారు.'' అని ప్రొఫెసర్ సంజయ్ కుమార్ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














