డైనోసార్ల కాలం నాటి ఈ పదార్థం ఏంటి?

ఫొటో సోర్స్, Sten Lennart Jakobse
డెన్మార్క్‌లో డైనోసార్ల కాలం నాటి అరుదైన శిలాజాన్ని కనుగొన్నారు. పీటర్ బెన్నికే అనే స్థానిక శిలాజ వేటగాడు తీరం వెంబడి ఉన్న ప్రసిద్ధ కొండ అయిన స్టీవ్న్స్ క్లింట్ వద్ద ఈ శిలాజాన్ని కనుగొన్నారు.
అక్కడ సుద్ద గడ్డలో కొన్ని వింత ముక్కలను చూసినట్లు, తర్వాత అవి సీ లిల్లీస్‌కు సంబంధించిన భాగాలుగా తెలుసుకున్నట్లు పీటర్ చెప్పారు. సీ లిల్లీలు... స్టార్ ఫిష్, సముద్రపు అర్చిన్ల వంటి నీటి అడుగున ఉండే జీవులు.
పీటర్ వెంటనే ఆ ముక్కలను తూర్పు జీలాండ్ మ్యూజియానికి తీసుకువెళ్లారు.
ఈ పదార్థం దాదాపు 6.6 కోట్ల సంవత్సరాల కిందటిదని అక్కడి నిపుణులు నిర్ధరించారు.
ఆ కాలంలో టైరన్నోసారస్ రెక్స్, ట్రైసెరాటాప్స్ వంటి డైనోసార్‌లు భూమిపై సంచరించినట్లు వారు చెప్పారు.


ఫొటో సోర్స్, Laila Bennicke
'అసాధారణమైన అన్వేషణ'
ఇది 'చాలా అసాధారణమైన అన్వేషణ' అని మ్యూజియం క్యూరేటర్, పాలియోంటాలజిస్ట్ జెస్పెర్ మిలన్ బీబీసీతో చెప్పారు.
సీ లిల్లీని ఒక చేప తినేందుకు యత్నించి వాంతి చేసుకుందని, ఆ పదార్థమే ఇదని ఆయన అంచనా వేస్తున్నారు.
ఇది కోట్ల సంవత్సరాల క్రితం నుంచి ఆహార గొలుసును అర్థం చేసుకోవడంలో సహాయపడుతుందన్నారు.
"6.6 కోట్ల సంవత్సరాల కిందట ఏ జీవి, ఏ జీవిని తిన్నదో ఇది మనకు తెలియజేస్తుంది" అని మిలన్ అన్నారు.
ఆ కాలంలో చేపలు, సొరచేపలు సీ లిల్లీలను తినేవని ఆయన చెప్పారు.
అయితే సీ లిల్లీలను జీర్ణం చేసుకోవడం కష్టం కాబట్టి, జీర్ణం కాని వాటిని చేపలు వాంతి చేసుకునేవని తెలిపారు.
ఈ సీ లిల్లీల లోపల సుద్ద ముక్కలు ఉంటాయని, వాటిని చేపలు వాంతిగా బయటకు వదిలేస్తుండేవని మిలన్ చెప్పారు.
డైనోసార్ల కాలంలో సముద్రపు అడుగుభాగంలో జీవుల మనుగడ ఎలా ఉండేదో ఇది తెలియజేస్తుందని ఆయన తెలిపారు.
పురాతన కాలంనాటి పర్యావరణ వ్యవస్థల గురించి మరింత తెలుసుకోవడానికి ఈ అన్వేషణ కూడా ముఖ్యమైనది.
స్థానిక మీడియాతో మాత్రమే మ్యూజియం ఈ వార్తను పంచుకుందని, అయితే ఈ ఆవిష్కరణ ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించిందని మిలన్ చెప్పారు.
"ఇది బహుశా ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధ వాంతి " అని ఆయన చమత్కరించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














