Women's U19 T20 వరల్డ్ కప్: తెలుగమ్మాయి గొంగడి త్రిష ఆల్‌రౌండ్ ప్రతిభతో భారత్ కైవసం

ఫొటో సోర్స్, Getty Images
భారత మహిళల జట్టు ఐసీసీ అండర్-19 టీ 20 వరల్డ్ కప్‌ను గెలుచుకుంది. మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై భారత జట్టు 9 వికెట్ల తేడాతో గెలిచింది.
మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 82 పరుగులకు ఆలౌటైంది.
83 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు ఇంకా 8.4 ఓవర్లు మిగిలి ఉండగానే ఈ లక్ష్యాన్ని ఛేదించింది.
ఈ వరల్డ్ కప్‌లో అద్భుతంగా రాణించిన తెలుగమ్మాయి గొంగడి త్రిష ఫైనల్స్‌లోనూ అటు బంతితోనూ, ఇటు బ్యాట్‌తోనూ సత్తా చాటింది.
మూడు వికెట్లు తీసిన త్రిష, బ్యాటింగ్‌లో 44 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. భారత జట్టులో ఆమెదే అత్యధిక స్కోరు. పరునికా సిసోదియా, ఆయుషి శుక్లా, వైష్ణవి శర్మ ముగ్గురూ తలా రెండేసి వికెట్లు తీశారు.
ఫైనల్లో ఆల్ రౌండ్ ప్రదర్శన చేసిన త్రిషకు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. మొత్తంగా టోర్నీలో అత్యధిక పరుగులు (309), ఏడు వికెట్లతో రాణించినందుకు 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డు కూడా అందుకున్నారు త్రిష.
మొత్తం టోర్నమెంట్‌లో ఒక్కమ్యాచ్ కూడా ఓడిపోకుండా భారత్ వరల్డ్ కప్ సొంతం చేసుకుంది.


ఫొటో సోర్స్, Getty Images
టోర్నమెంట్‌లో గొంగడి త్రిష హవా
దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్స్‌లో బ్యాట్, బంతి రెండింటితో మ్యాజిక్ చేసిన త్రిష, అంతకుముందు స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ సెంచరీతో రికార్డు నెలకొల్పడమే కాక మూడు వికెట్లూ పడగొట్టింది.
గత మంగళవారం స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ సాధించి, మహిళల టీ20 అండర్ 19 వరల్డ్ కప్‌లో ఈ ఘనత సాధించిన మొదటి ప్లేయర్‌గా నిలిచింది త్రిష.
59 బంతుల్లో 13 ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 110 పరుగులు చేసిన త్రిష ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచింది. భారత జట్టు ఈ మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 208 పరుగులు సాధించింది.
అనంతరం 209 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన స్కాట్లాండ్ జట్టు కుప్పకూలింది.
భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 14 ఓవర్లలో 58 పరుగులకే స్కాట్లాండ్ 0 ఆలౌటైంది.
భారత బౌలర్లలో ఆయూషీ శుక్లా 4 వికెట్లు తీసుకోగా, గొంగడి త్రిష, వైష్ణవి శర్మలు చెరో మూడు వికెట్లు పడగొట్టారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, Getty Images
త్రిష నేపథ్యం
19 ఏళ్ల త్రిష స్వస్థలం తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం. రైట్ హ్యాండ్ బ్యాటింగ్‌తో పాటు రైట్ ఆర్మ్ లెగ్ బ్రేక్ బౌలింగ్ కూడా వేసే త్రిష దేశవాళీ క్రికెట్‌లో హైదరాబాద్ జట్టుకు ప్రాతినిథ్యం వహించారు.
దక్షిణాఫ్రికాలో జరిగిన 2023 అండర్ 19 టీ20 వరల్డ్ కప్‌లో కూడా త్రిష ఆడారు. ఆ టోర్నీలో ఏడు మ్యాచ్‌లు ఆడిన త్రిష 23.20 సగటుతో 116 పరుగులు సాధించారు. ఫైనల్లో 24 పరుగులు చేసి, జట్టు విజయానికి తోడ్పడ్డారు.
గత ప్రపంచకప్‌లో భారత జట్టుకు మిడిలార్డర్‌లో ఆడిన త్రిష ఇపుడు మలేసియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో ఓపెనింగ్ బ్యాటర్‌గా ఆడుతున్నారు. ఈ టోర్నీలో త్రిష నిలకడగా రాణించారు.
కౌలాలంపూర్‌లో 2024 డిసెంబర్‌లో జరిగిన అండర్-19 మహిళల ఆసియా కప్ ప్రారంభ ఎడిషన్‌లో కూడా త్రిష టాప్ స్కోరర్. ఆమె ఐదు ఇన్నింగ్స్‌లలో 53 సగటుతో 159 పరుగులు చేశారు.
టోర్నీ ఫైనల్లో ఆమె 52 పరుగులు చేసి జట్టుకు ట్రోఫీని అందించారు. ప్లేయర్ ఆప్ ది సిరీస్ అవార్డును గెలుచుకున్నారు.
విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2025 వేలంలో త్రిష తన పేరును నమోదు చేసుకున్నారు. కనీస ధరను రూ.10 లక్షలుగా నిర్ణయించినా ఏ జట్టూ కొనలేదు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














