మృతదేహంపైనా అమానుషాలకు పాల్పడే వైఖరి ఎందుకు పెరుగుతోంది?

మృతురాలు వెంకట మాధవి

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, ‘‘ఒక మనిషిని ఇంత క్రూరంగా చంపుతారా’’.. అని అనుకున్నామని రాచకొండ పొలీసు కమిషనర్ సుధీర్ బాబు చెప్పారు
    • రచయిత, కమలాదేవి నల్లపనేని
    • హోదా, బీబీసీ ప్రతినిధి

హెచ్చరిక: ఈ కథనంలో మిమ్మల్ని కలిచివేసే అంశాలుంటాయి.

నేరం ఏదైనా నేరంగానే చూడాలంటారు ఫ్రెంచ్ తత్త్వవేత్త ఆల్బర్ట్ కామూ. అయితే నేర తీవ్రతను బట్టి ఆ నేరాన్ని చూసే విధానం మారుతుంటుంది.

దొంగతనం, దోపిడీ, దాడి వంటి ప్రాణనష్టం లేని నేరాల గురించి సమాజం పెద్దగా పట్టించుకోదు. ఆ నేరం గురించి తెలుసుకుని వదిలేస్తారు. కానీ ప్రాణాలను తీసే హత్యానేరాలు మనిషి స్మృతిపథం నుంచి అంత తొందరగా తొలగిపోవు.

ఆర్థిక వ్యవహారాలకు సంబంధించో, మానవ సంబంధాల్లో ఘర్షణల వల్లో సమాజంలో హత్యలు జరుగుతుంటాయి. పట్టలేని ఆగ్రహమో, క్షణికావేశమో కొన్నిసార్లు హత్యలకు కారణమైతే మరికొందరు పథకం ప్రకారమే ప్రత్యర్థులను, కుటుంబ సభ్యులను, అయినవారిని హతమారుస్తుంటారు.

హత్య ఏ తరహాదైనా చట్టానికి దొరికితే, విచారణ ఎదుర్కోవడం, శిక్ష అనుభవించడం వంటివి జరుగుతుంటాయి. అయితే ఇటీవలికాలంలో జరిగిన కొన్ని హత్యలు పెను సంచలనంగా మారడానికి ప్రధాన కారణం..హత్యలు జరిగిన తీరు కాదు..హంతకులు పోలీసులకు దొరకకుండా తప్పించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు. హత్యల తర్వాత కూడా కసి తీరనట్టుగా వారు ప్రవర్తిస్తున్న విధానం.

ఒకరి జీవించే హక్కును కాలరాస్తున్నవారు...తమ జీవితాన్ని కొనసాగించేందుకు వీలుగా నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు అతి భయంకరమైన ఆలోచనలు చేస్తున్నారు. హత్యకు మించిన నేరప్రవృత్తి..పోలీసులకు దొరక్కుండా తప్పించుకునేందుకు నిందితులు చేస్తున్న ప్రయత్నాల్లో కనిపిస్తోంది.

ముఖ్యంగా ఆడా, మగా కలిసి జీవిస్తున్న(పెళ్లి, సహజీవనం) కారణంగా తలెత్తుతున్న సమస్యల్లో హత్యలు జరిగినప్పుడు..పోలీసుల కళ్లుగప్పేందుకు హంతకులు భయానక ప్రవర్తనను కనబరుస్తున్నారు.

తాము తప్పించుకోవాలన్న భావనతో పాటు చచ్చినా వదిలిపెట్టము అన్న తరహా కసి ప్రదర్శించడం ఇలాంటి వాటికి కారణమని సామాజిక వేత్తలు, సైకాలజిస్టులు చెబుతున్నారు. విపరీత మనస్తత్వమే హత్యానంతర క్రూరత్వానికి కారణమని వారు విశ్లేషిస్తున్నారు.

శ్రద్ధావాల్కర్
ఫొటో క్యాప్షన్, 2022లో సహజీవనం చేస్తున్న వ్యక్తి చేతిలో శ్రద్ధ హత్యకు గురయ్యారు.

హత్యతో ఆగడం లేదు..మృతదేహాన్నీ విడిచి పెట్టడం లేదు...

హత్య చేయడం, మృతదేహంతోనూ కిరాతకంగా ప్రవర్తించడం...ఇటీవల కాలంలో తరచుగా జరుగుతున్న సంఘటనలివి. దేశంలో ఏదో ఓ మూల ఇలాంటివి బయటికొస్తూనే ఉన్నాయి. శత్రువులనో, ప్రత్యర్థులనో కాదు...అప్పటిదాకా తమతో కలిసి జీవించినవారితో ఇంత నిర్దయగా, కర్కశంగా మనుషులు ఎలా ప్రవర్తించగలుగుతున్నారు అన్నదే ఇక్కడ ఉత్పన్నమవుతున్న ప్రశ్న.

ఎక్కువగా మహిళలు ఇలాంటి ఘటనల్లో బాధితులవుతున్నారు. పెళ్లి, సహజీవనం ఇలా ఏదైనప్పటికీ మహిళలు భాగస్వాముల చేతుల్లో హత్యకు గురవుతున్నారు.

కొన్ని ఘటనల్లో పురుషులూ బాధితులవుతున్నారు. అయితే ఎక్కువగా నష్టం జరుగుతోంది మాత్రం మహిళలకే అంటున్నారు సామాజిక వేత్తలు.

మృతదేహంతోనూ అమానుషంగా ప్రవర్తించడానికి కారణం హింసను ఆనందించే సంస్కృతి పెరగడమేనంటున్నారు. సినిమాలు, వెబ్‌సిరీస్‌ల ప్రభావం ఎక్కువగా ఉంటోందని వారు అభిప్రాయపడుతున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
శ్రద్ధావాల్కర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, శ్రద్ధావాల్కర్ హత్యలో న్యాయం కావాలంటూ నిరసనలు జరిగాయి

దిల్లీలో రెండున్నరేళ్ల కిందట ఏం జరిగింది?

రెండున్నరేళ్ల కిందట దేశ రాజధాని దిల్లీలో శ్రద్ధావాల్కర్ అనే యువతి హత్య తీవ్ర సంచలనం సృష్టించింది. మృతదేహంతో కిరాతకంగా ప్రవర్తించారన్న విషయం విన్నప్పుడల్లా శ్రద్ధావాల్కర్ హత్య గుర్తుకొస్తుంది.

2022 మే 18న శ్రద్ధావాల్కర్‌ను ఆమెతో సహజీవనం చేస్తున్న ఆఫ్తాబ్ అమీన్ పూనావాలా హత్యచేశారని దిల్లీ పోలీసులు కేసు నమోదుచేశారు. హత్యతో ఆగడం, తర్వాత ఆఫ్తాబ్ పోలీసులకు లొంగిపోవడమో, దొరికిపోవడమో జరిగితే ఇప్పుడీకేసు గురించి మాట్లాడుకోవడానికి ఏమీ ఉండేది కాదు.

కానీ శ్రద్ధావాల్కర్‌ను హత్య చేసిన తర్వాత ఆ హత్యానేరం తన మీద పడకుండా తప్పించుకోవడానికి, తన జీవితాన్ని యథాతథంగా కొనసాగించడానికి అఫ్తాబ్ చేసిన ప్రయత్నాలు...ఇప్పటికీ ఈ కేసు గురించి మాట్లాడుకునేలా చేస్తున్నాయి.

శ్రద్ధావాల్కర్ హత్యకు గురయిన విషయం బయటకువచ్చిన తర్వాత దర్యాప్తు చేపట్టిన పోలీసులు అప్పట్లో చెప్పిన వివరాలు, మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం శ్రద్ధావాల్కర్‌కు, ఆఫ్తాబ్‌కు ముంబైలో ఒక డేటింగ్ యాప్ ద్వారా పరిచయం అయ్యారు. హత్యకు గురికావడానికి మూడేళ్ల ముందు నుంచి శ్రద్ధావాల్కర్, అఫ్తాబ్ కలిసి జీవిస్తున్నారు.

2022 జనవరిలో వారు దిల్లీ వెళ్లారు. ముంబైలో ఉన్నప్పుడు, ఆ తర్వాత దిల్లీలోనూ పలుమార్లు వారు గొడవలు పడ్డారని, శ్రద్ధను తరచుగా ఆఫ్తాబ్ కొట్టేవారని, ఆ దెబ్బలకు ఆమెకు గాయాలు కూడా అయ్యాయని పోలీసులు తెలిపారు.

2022 మే 18న జరిగిన గొడవ తీవ్రమై శ్రద్ధావాల్కర్‌ను ఆఫ్తాబ్ గొంతునులిమి చంపినట్టు పోలీసులు కేసు నమోదుచేశారు. పెళ్లిచేసుకోవాలని శ్రద్ధావాల్కర్ ఒత్తిడి చేయడం వల్లే అఫ్తాబ్ ఆమెను హత్యచేసినట్టు తొలుత ప్రచారం జరిగింది. కానీ శ్రద్ధావాల్కర్‌పై అనుమానంతో ఆమెను హత్యచేసినట్టు తర్వాత పోలీసుల దర్యాప్తులో తేలింది.

అప్పటిదాకా తనతో కలిసి జీవించిన శ్రద్ధావాల్కర్‌ను హత్య చేసిన అఫ్తాబ్ ఆ తర్వాత మరింత అమానవీయంగా ప్రవర్తించడం ఈ కేసు సంచలనానికి కారణమైంది. హత్యానేరం నుంచి తప్పించుకునేందుకు శ్రద్ధావాల్కర్ మృతదేహంతోనూ ఆఫ్తాబ్ అమానుషంగా ప్రవర్తించారు. శరీరభాగాలు పాడవకుండా ఉండేందుకు కొత్త ఫ్రిజ్ కొని, వాటిని అందులో ఉంచారని, అదే ఫ్రిజ్‌లో పాలప్యాకెట్లు, ఇతర ఆహారపదార్థాలు కూడా పెట్టుకునేవారని పోలీసులు తెలిపారు.

దక్షిణ దిల్లీలోని ఛత్తర్‌పూర్‌లో అద్దెకుంటున్న ఇంట్లో శ్రద్ధావాల్కర్‌ను హత్య చేసిన ఆఫ్తాబ్...రాత్రి వేళల్లో ఆమె మృతదేహంలోని విడిభాగాలను దగ్గరలోని మెహ్రౌలి అడవుల్లో పారేసివచ్చేవారు. ఇలా కొన్నిరోజుల పాటు సాగింది. ఆరు నెలల తర్వాత తండ్రి ఫిర్యాదుతో శ్రద్ధావాల్కర్ హత్య విషయం బయటికొచ్చింది. ప్రస్తుతం ఈ కేసుపై విచారణ సాగుతోంది.

పెరుగుతున్న నేరాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, హింసను ఆనందించే సంస్కృతి పెరుగుతోందంటున్న సామాజికవేత్తలు

ముంబైలోనూ ఇలాంటి కేసే...

శ్రద్ధావాల్కర్ హత్య వెలుగుచూసిన కొన్ని నెలలకు ముంబైలోనూ ఇలాంటి దారుణమే జరిగింది.

మూడేళ్లగా తనతో సహజీవనం చేస్తున్న 36 ఏళ్ల సరస్వతి వైద్యను, 56 ఏళ్ల మనోజ్ సహానీ హత్య చేశారు. తర్వాత అత్యంత కిరాతకంగా ప్రవర్తించారు. పొరుగింటి నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కలవారు పోలీసులకు సమాచారమందించారు.

2023 జూన్ 7న ఈ కేసు వెలుగుచూసింది. అంతకు నాలుగురోజుల ముందే సరస్వతి జైన్ హత్య జరిగినట్టు పోలీసులు గుర్తించారు. మనోజ్ సహానీ మానసిక సమస్యలతో బాధపడుతున్నారని పోలీసులు తెలిపారు.

వెంకటమాధవి

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, మృతదేహాన్ని మాయం చేసే క్రమంలో గురుమూర్తి అత్యంత క్రూరంగా వ్యవహరించారని పోలీసులు చెప్పారు.

వెంకటమాధవి హత్యోదంతం వార్తలతో ఉలిక్కిపడ్డ హైదరాబాద్

ఇటీవల హైదరాబాద్‌లో వెంకటమాధవి అనే విహహిత కేసూ శ్రద్ధావాల్కర్, సరస్వతి హత్యోదంతాలను గుర్తుచేస్తోంది. మీర్‌పేటలో గురుమూర్తి అనే వ్యక్తి , భార్య మాధవిని హత్య చేశారు. మృతదేహం ఎవరి కంటా పడకుండా ఉండేందుకు, ఆ హత్యానేరం నుంచి తప్పించుకునేందుకు ఎవరి ఊహకూ అందని రీతిలో ప్రణాళికలు రచించారు. భార్య మృతదేహాన్ని మాయం చేసేందుకు గురుమూర్తి చేసిన ప్రయత్నాలను పోలీసులు మీడియాకు వివరించారు. ఆ మాటలు ప్రజలను భయకంపితులను చేస్తున్నాయి.

''గత నెల 16న గురుమూర్తి భార్యతో ఉద్దేశపూర్వకంగా గొడవ పెట్టుకుని ఆమెను గట్టిగా గోడకేసి కొట్టారు. స్పృహ కోల్పోయిన ఆమెను గొంతునులిమి చంపేశారు. ఆ తర్వాత భార్య మృతదేహాన్ని మాయం చేసేందుకు గురుమూర్తి అత్యంత అమానవీయంగా ప్రవర్తించారు’’ అని రాచకొండ పొలీసు కమిషనర్ సుధీర్ బాబు చెప్పారు.

ఒక మహిళ ఇంట్లో ఉంటే చాలా భద్రంగా ఉన్నానని భావిస్తారని, అలాంటి ఇంట్లోనే మాధవి దారుణంగా హత్యకు గురయ్యారని ఆయనన్నారు.

శ్రద్ధావాల్కర్, వెంకట మాధవి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

విపరీత మనస్తత్వమే దీనికి కారణమా...?

శ్రద్ధావాల్కర్, సరస్వతి, మాధవినే కాదు....దేశంలో అనేక చోట్ల ఇలాంటి కిరాతక హత్యలు ఎక్కడో ఓ చోట వెలుగుచూస్తూనే ఉన్నాయి.

మనిషి నేర ప్రవృత్తి హత్యతో ఆగడం లేదు. ఓ ప్రాణం పోయిన తర్వాత కూడా మనిషిలో పశ్చాత్తాపం కలగడం లేదు. తాను చేసింది తప్పని ఏ క్షణంలోనూ గుర్తించడం లేదు. విపరీత మనస్తత్వం హత్య తర్వాత కూడా కొనసాగుతోంది.

హత్యకు, మృతదేహంతో అమానవీయంగా ప్రవర్తించేంత కోపం, కసి పెరగడానికీ ఏ పరిస్థితులు కారణమవుతున్నాయనేదానిపై భిన్నవాదనలున్నాయి. శ్రద్ధావాల్కర్ హత్య జరిగినప్పుడు ఆమె సహజీవనం చేయడమే దీనికి కారణమని, అఫ్తాబ్ ఆమెకు భర్త అయ్యుంటే ఇంత క్రూరంగా ప్రవర్తించేవారుకాదని కొందరు సంప్రదాయవాదులు ఆరోపించారు.

ఇప్పుడు వెంకటమాధవి విషయం చూస్తే గురుమూర్తి ఆమె భర్త. 13 ఏళ్ల నుంచి వారు భార్యాభర్తలుగా ఉన్నారు. ‘‘ఒక మనిషిని ఇంత క్రూరంగా చంపుతారా’’ అని అనుకున్నామని పోలీసు కమిషనరే అన్నారు.

భాగస్వామిపై క్రూరత్వం ప్రదర్శించేవారికి పెళ్లా, సహజీవనమా అన్నదానితో సంబంధం లేదని, వారి మనస్తత్వంలో ఉన్న లోపమే దీనికి కారణమని సైకాలజిస్ట్ విశేష్ అభిప్రాయపడ్డారు. ‘‘హత్య తర్వాత మృతదేహంపైనా క్రూరత్వం ప్రదర్శించడానికి కారణం తాము తప్పించుకోవాలన్న భావనతో పాటు, వారిలోని విపరీత మనస్తత్వం ప్రభావం. ఓ బంధం నుంచి తాము సురక్షితంగా (పరువు పోకుండా ఉండడం, విడాకులు తీసుకునే పరిస్థితి లేకపోవడం, వేరుగా జీవించలేకపోవడం)బయటపడలేము అన్న భావన కలిగినప్పుడు అవతలివారిని అడ్డు తొలగించుకునే ప్రయత్నం చేస్తారు’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

సమాజం ప్రభావం ఎంత?

హింసను ఓ నేరంలా కాకుండా గొప్పగా చూసే సమాజం ప్రభావం నేరస్థులపై ఉంటోందని సామాజిక కార్యకర్త దేవి అభిప్రాయపడ్డారు. సాధారణంగా మనుషుల్లో రెండు నుంచి మూడు శాతం మంది విపరీత మనస్తత్వంతో ఉంటారని, ఏదో ఓ సందర్భంలో వారు తమపై తాము అదుపుకోల్పోతారని ఆమె చెప్పారు.

‘‘హింసను ఆనందించే సంస్కృతి పెరుగుతోంది. మృతదేహంపైనా క్రూరత్వం ప్రదర్శించడం ద్వారా పూర్తిస్థాయిలో పగతీర్చుకుంటున్నామన్న ప్రత్యేకమయిన ఆనందం నేరస్థులు పొందుతున్నారు.’’ అని ఆమె విశ్లేషించారు.

సినిమాలు, యూట్యూబ్, ఓటీటీల వంటి కంటెంట్ ప్రభావం సమాజంపై తీవ్రంగా ఉంటోందని, ఈ స్థాయిలో నేరాల తీవ్రత పెరగడానికి అదే ప్రధాన కారణమని ఆమె తెలిపారు.

భార్యాభర్తలు లేదా సహజీవనంలో ఉన్న జంట మధ్య గొడవలు తీవ్రమైనప్పుడు ఒకరిలో నేరపూరిత ఆలోచనలు రావడానికి కారణం వారి విపరీత మనస్తత్వమేనని సైకాలజిస్ట్ విశేష్ అభిప్రాయపడ్డారు.

‘‘గొడవలు పరిష్కరించుకునేందుకు సైకాలజిస్టుల దగ్గరకు భార్యాభర్తలు వచ్చినప్పుడు.. వారిలో క్రిమినల్ ఆలోచనలు ఉంటే, మనస్తత్వ శాస్త్రవేత్తలు గుర్తించగలరు. కౌన్సెలింగ్ ద్వారా ఆ ఆలోచనలు మార్చవచ్చు. అయితే అసలు సైకాలజిస్టుల దగ్గరకు వచ్చే వారి సంఖ్య సమాజంలో 10శాతం కన్నా తక్కువ.’’ అని విశేష్ అన్నారు. ఆన్‌లైన్ కంటెంట్ ప్రభావం నేరస్థులపై ఎక్కువగా ఉంటోందని ఆయన అభిప్రాయపడ్డారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)