IncomeTax: రూ.12 లక్షల వరకు మినహాయింపు మధ్య తరగతి ప్రజలకు ఎంత వరకు ప్రయోజనం?

12 లక్షల వరకు వార్షిక ఆదాయంపై ఎలాంటి పన్ను ఉండబోదని ఆర్థిక మంత్రి ప్రకటించారు.

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, దీపక్ మండల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం ప్రకటించిన పన్ను నిబంధనల్లో మార్పులు మధ్య తరగతి ప్రజలకు కొంత ఊరట కల్పించాయని చెబుతున్నారు.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం తన బడ్జెట్ ప్రసంగంలో ఆదాయపు పన్ను కొత్త శ్లాబ్‌లను ప్రకటించారు.

ఇందులో 12 లక్షల వరకు వార్షిక ఆదాయంపై ఎలాంటి పన్ను ఉండబోదని ఆర్థిక మంత్రి ప్రకటించారు. జీతభత్యాలకు ఈ పరిమితిని రూ.12 లక్షల 75 వేలకు పెంచుతున్నట్లు చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ప్రస్తుతం దేశ జనాభాలో 40 శాతం మంది మధ్య తరగతిలో ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

మధ్య తరగతికి ఎంత ప్రయోజనం?

భారతదేశంలో మధ్య తరగతి అంటే వార్షిక ఆదాయం రూ. 5లక్షలు- 30 లక్షల వరకు (2020-21 ధరల ఆధారంగా) ఉన్న వారని అర్ధం.

పీపుల్స్ రీసెర్చ్ ఆన్ ఇండియాస్ కన్స్యూమర్ ఎకానమీ ప్రకారం.. ప్రస్తుతం (2025) దేశ జనాభాలో 40 శాతం మంది మధ్య తరగతిలో ఉన్నారు. 2016లో ఇది 26 శాతంగా ఉంది.

భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం డిమాండ్‌ కొరతను ఎదుర్కొంటోంది. వస్తు, సేవలను ఎక్కువగా వినియోగించే మధ్యతరగతి వారి చేతిలో డబ్బులు లేకపోవడంతో కొనుగోలు శక్తి దెబ్బతిని, ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌ తగ్గిపోయింది. వినియోగంలో తగ్గుదలతో కంపెనీలు ఉత్పత్తిని పెంచడం లేదు, కొత్త పెట్టుబడులు పెట్టడం లేదు. ఇది ఆర్థిక వృద్ధిపై ప్రభావం చూపుతోంది.

2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధి రేటు 6.4 శాతం. గత నాలుగేళ్లలో ఇది అతి తక్కువ వృద్ధి. ఆర్థిక సర్వే 6.3 నుంచి 6.8 శాతం వృద్ధిని అంచనా వేస్తోంది. దీనిని మందగమనానికి సంకేతంగా పరిగణిస్తున్నారు.

2047 నాటికి 'అభివృద్ధి చెందిన భారతదేశం' (ఇది మోదీ ప్రభుత్వ లక్ష్యం) లక్ష్యాన్ని చేరుకోవాలంటే కనీసం 8 శాతం నిరంతర వృద్ధి అవసరం.

దిగువ మధ్యతరగతి ప్రజలు ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఆర్థిక వ్యవస్థకు ఎలా ప్రయోజనం?

మధ్యతరగతికి మరింతగా ఆదాయపు పన్ను మినహాయింపు ఇస్తే డిమాండ్‌ పెరుగుతుందని, ఇది ఆర్థిక వ్యవస్థను మళ్లీ వేగంగా కదిలించేలా చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

వినియోగదారులపై అధ్యయనం చేసే ఆర్థికవేత్త రాజేశ్ శుక్లా మాట్లాడుతూ.."దిగువ మధ్యతరగతి ప్రజలు ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త పన్ను శ్లాబ్ ద్వారా ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఏటా రూ.70 నుంచి 80 వేలు పొందడం పెద్ద విషయం. ఈ డబ్బు వినియోగానికి బదులుగా పొదుపులోకి వెళ్లినా మంచి ప్రయోజనమే. ఎందుకంటే ఆ పొదుపు అంతిమంగా వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది" అని అన్నారు.

"మధ్యతరగతి వారే వినియోగదారులు, ఉద్యోగులు, యజమానులు. డ్రైవర్లు, గృహ, ఇతర సహాయకుల సేవలనూ వారు తీసుకుంటారు. అందువల్ల, వారి చేతుల్లో ఆదా అయిన అదనపు డబ్బు ఈ సర్వీసులు అందించిన వారి దగ్గరికి వస్తుంది. తర్వాత ఈ డబ్బు మార్కెట్‌లోకి వస్తుంది. కాబట్టి, ఆదాయపు పన్నులో మరింత మినహాయింపు ఇచ్చే ప్రక్రియ మధ్యతరగతి, దేశ ఆర్థిక వ్యవస్థకు ఉపశమనం కలిగిస్తుంది'' అని రాజేశ్ శుక్లా అన్నారు.

అయితే మధ్యతరగతి ప్రజల జేబులకు ఉపశమనం కలిగించడం ద్వారా ఆర్థిక వ్యవస్థను పెంచే ప్రభుత్వ వ్యూహాన్ని కొందరు నిపుణులు విమర్శిస్తున్నారు.

6 కోట్ల మంది జీరో రిటర్న్‌లు దాఖలు చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

3.5 కోట్ల మందికే..

మధ్యతరగతి ప్రజలకు ప్రత్యక్ష పన్ను మినహాయింపు ఇవ్వడం కంటే పరోక్ష పన్ను రేట్లను తగ్గిస్తే డిమాండ్‌ను పెంచడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుందని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో మాల్కం ఆదిశేషయ్య చైర్ ప్రొఫెసర్, ప్రముఖ ఆర్థికవేత్త అరుణ్ కుమార్ చెప్పారు.

పేద వినియోగదారుడు కూడా పరోక్షంగా పన్ను చెల్లించాల్సి వస్తోందని ఆయన చెప్పారు. దేశంలో చాలా వస్తువులు, సేవలపై విధించే పరోక్ష పన్ను రేట్లు 28 శాతం వరకు ఉన్నాయన్నారు.

అరుణ్ కుమార్ మాట్లాడుతూ "సుమారు 140 కోట్ల జనాభాలో 9.5 కోట్ల మంది మాత్రమే ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేస్తున్నారు. వారిలో 6 కోట్ల మంది జీరో రిటర్న్‌లు దాఖలు చేస్తున్నారు. కాబట్టి కేవలం 3.5 కోట్ల మందికి మాత్రమే పన్ను మినహాయింపు మార్కెట్లో డిమాండ్‌ను అంతగా పెంచదు." అని అన్నారు.

"దిల్లీలో మధ్యతరగతి వర్గానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగులు అధిక సంఖ్యలో నివసిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నందున మధ్యతరగతి వర్గాలకు ఆదాయపు పన్ను రాయితీ కల్పించే దిశగా ప్రభుత్వం ఇలా చేసింది'' అని అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు.

పరోక్ష పన్ను

ఫొటో సోర్స్, Deepak Sethi/Getty Images

'పరోక్ష పన్నులో ఉపశమనం ఇవ్వాలి'

దేశంలో జీఎస్టీ వసూళ్లు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అంటే పరోక్ష పన్నుల ద్వారా ప్రజల జేబుల నుంచి ప్రభుత్వానికి మరింత సొమ్ము చేరుకుంటోంది. 2023 డిసెంబర్‌తో పోలిస్తే 2024 డిసెంబర్‌లో 7.3 శాతం పెరిగి రూ.1.77 లక్షల కోట్లకు చేరుకుంది.

జీఎస్టీ రూపంలో అధిక పరోక్ష పన్ను ప్రభావం సాధారణ వినియోగదారుల వినియోగ సామర్థ్యాన్ని తగ్గిస్తోందని నిపుణులు భావిస్తున్నారు. అంటే, పెరుగుతున్న ధరల కారణంగా వినియోగదారులు తక్కువ వస్తువులను కొనుగోలు చేస్తున్నారు.

దేశంలో చాలా వినియోగ వస్తువులు, సేవలపై జీఎస్టీ రేటు 18 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఉంది. దీంతో ఈ వస్తువులు ఖరీదైనవిగా మారుతున్నాయి. నిత్యవసర వస్తువుల అమ్మకాలపై ప్రభావం పడుతోంది.

ఆర్థిక వ్యవస్థలో ఉపాధి కల్పించే అవకాశం ఉన్న రంగాల్లో ప్రభుత్వం పెట్టుబడులను పెంచాలని అరుణ్ కుమార్ సూచిస్తున్నారు.

"వీటిలో గ్రామీణాభివృద్ధి, విద్య, ఆరోగ్యం వంటి రంగాలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో గృహనిర్మాణం, మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి పెట్టుబడి పెట్టాలి. అప్పుడే ప్రజలకు డబ్బు అందుతుంది. సామాన్యుల చేతుల్లో ఆదా చేసిన ఈ డబ్బు మార్కెట్లోకి వచ్చి డిమాండ్‌ను పెంచుతుంది. ఆర్థిక వ్యవస్థ ఊపందుకుంటుంది. మధ్యతరగతికి ఉపశమనం ఇవ్వడం వల్ల సమస్య పరిష్కారం కాదు" అని అరుణ్ కుమార్ వివరించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)