మినికాగ్ టెస్ట్: అల్జీమర్స్‌ను గుర్తించడానికి ఇదొక్కటే మార్గమా? వ్యాధి వచ్చాక ఎన్నేళ్లు బతుకుతారు

అల్జీమర్స్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, డాక్టర్ దేశం పీఆర్
    • హోదా, బీబీసీ కోసం

19వ శతాబ్దం వరకు మనిషి పుట్టినప్పుడు లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ (సగటు ఆయుర్దాయం) 35 ఏళ్లకు మించి ఉండేది కాదు.

చాలా మంది పిల్లలు పుట్టాక ఏడాదిలోపే చనిపోయేవారు. అంటువ్యాధులు విపరీతంగా ఉండేవి. దాంతో శిశు మరణాల రేటు ఎక్కువగా ఉండేది.

20, 21వ శతాబ్దంలో శాస్త్ర విజ్ఞానంలో చరిత్రాత్మక మార్పుల వల్ల సగటు ఆయుర్దాయం ఎంతో పెరిగింది.

అభివృద్ధి చెందిన జపాన్ వంటి దేశాల్లో ప్రస్తుతం జీవితకాలం 84 సంవత్సరాలు ఉండగా మన దేశంలో 70 సంవత్సరాలుగా ఉంది.

ఇలా పెరుగుతున్న వయసు వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు ముందు శతాబ్దంలో చూసిన సమస్యల కంటే భిన్నమైనవిగా ఉంటాయి. సమాజాభివృద్ధిలో జరిగిన మార్పులు, మన ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గతంలో లేని, ఒకవేళ ఉన్నప్పటికీ మనకు తెలియని వ్యాధులు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఇదివరకు అంటు వ్యాధులు ఎక్కువగా ఉండగా.. ఇప్పుడు దీర్ఘకాలిక వ్యాధులు ఎక్కువవుతున్నాయి.

ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధుల్లో అల్జీమర్స్ వ్యాధి ఒకటి. ఈ వ్యాధిని అలోయిస్ అల్జీమర్ అనే జర్మన్ వైద్యుడు 1906లో ఒక 50 ఏళ్ల మహిళలో కనుగొన్నారు.

ఆ మహిళలో కనిపించిన లక్షణాలు వైద్యుడికి విచిత్రంగా అనిపించడంతో ఆమెను గమనిస్తూ చికిత్స చేస్తూ వచ్చారు.

అయితే, వ్యాధిని గుర్తించిన అయిదు సంవత్సరాలకు ఆవిడ మరణించాక పోస్ట్‌మార్టమ్ చేసి ఆమెకి వచ్చింది మెదడుకి సంబంధించిన ఒక కొత్త వ్యాధి అని నిర్ధరించారు.

అల్జీమర్స్

ఫొటో సోర్స్, Getty Images

భారతదేశంలో 40 లక్షల మంది జ్ఞాపక శక్తి లోపంతో బాధపడుతున్నారు. జ్ఞాపక శక్తి లోపం కలిగించే చాలా వ్యాధులలో ప్రధాన వ్యాధి అల్జీమర్స్.

ఈ వ్యాధి వల్ల జ్ఞాపకశక్తి, ఆలోచన శక్తి, మనం ప్రవర్తించే తీరులో మార్పులు వస్తాయి. మొదట్లో జ్ఞాపకశక్తి లోపం తక్కువగా ఉన్నా, మెల్లగా మెదడుకు సంబంధించిన లక్షణాలు పెరుగుతాయి.

ఒక్కొక్కరిలో ఒక్కో స్థాయిలో మెదడు పనితీరు క్షీణిస్తూ వస్తుంది. అల్జీమర్స్ వ్యాధిని గుర్తించాక, వారికి అందే సహాయాన్ని బట్టి 8 నుంచి 10 ఏళ్లు బతుకుతారు.

అల్జీమర్స్‌ను వృద్ధాప్యంలో భాగంగా వచ్చే సామాన్య సమస్యగా చూడకూడదు.

వృద్ధాప్యంలో మెదడులో వచ్చే మార్పులకు, అల్జీమర్స్‌ కారణంగా వచ్చే మార్పులకు చాలా తేడా ఉంటుంది.

మామూలు వృద్ధాప్యంలో మెదడు మాత్రమే కుంచించుకుపోతుంది. నాడీ కణాలు ఎక్కువగా దెబ్బతినవు. అదే అల్జీమర్స్‌లో చాలా నాడీ కణాలు పనిచేయడం మానేస్తాయి. మిగితా నాడీ కణాలతో సంబంధం తెగిపోతుంది. సంకేతాలు పంపుకోలేవు. దెబ్బ తిన్న కణాలను రిపేర్ కూడా చేసుకోలేవు.

అల్జీమర్స్ వచ్చిన కొత్తలో మెదడులో జ్ఞాపక శక్తికి సంబంధించిన భాగం (హిప్పోక్యాంపస్) ప్రభావితం అవుతుంది. తర్వాత భాషకు సంబంధించిన భాగాలు, తార్కికంగా ఆలోచించే భాగాలు, సామాజిక ప్రవర్తనకు సంబంధించిన భాగాలు దెబ్బ తింటాయి.

రోజులు గడుస్తున్నా కొద్దీ మెదడులోని చాలా భాగాలు దెబ్బ తింటాయి. చివరికి మనిషి తనకు తానుగా బతికే శక్తిని కోల్పోయి, వేరే వాళ్లపై ఆధారపడాల్సిన స్థితికి చేరుకుని చివరకు మరణిస్తారు.

అల్జీమర్స్

ఫొటో సోర్స్, Getty Images

మన మెదడులో కనీసం పది లక్షల కోట్ల నాడీ కణాలు ఉంటాయి. అవి మెదడులోని భాగాల మధ్యలో, మెదడు నుండి అన్ని కండరాలకి, మన శరీరంలోని వివిధ భాగాలకు సమాచారం పంపుతూ ఉంటాయి.

అల్జీమర్స్ వచ్చిన వ్యక్తులకు నాడీ సమాచార వ్యవస్థ పాడవుతుంది. అప్పుడు మెదడు నుండి సంకేతాలు సరిగ్గా అందక శరీరంలోని వివిధ కణాలు మరణిస్తాయి.

ఈ వ్యాధిలో బీటా అమైలాయిడ్ అనే ప్రోటీన్ ( ఒక రకం మాంసకృత్తులు) నాడీ కణాల మధ్యలో జమవుతుంది. ఇవి ఒకదానికి ఒకటి అంటుకొని మెదడులో ఫలకాల్లలా ఏర్పడతాయి.

ఇవే కాకుండా నాడీ కణాల లోపల కూడా ఒక రకం మాంసకృత్తులు (టౌ ప్రోటీన్) జమవడం వల్ల నాడీ కణాల లోపల చిక్కుముడులు (న్యూరోఫైబ్రిల్లరీ టాంగ్లెస్) ఏర్పడతాయి. దీని వల్ల కూడా నాడీ కణాలు ఒకదానితో మరొకటి సంభాషించుకోలేవు.

అల్జీమర్స్ వ్యాధి వల్ల మెదడులో జరిగే మార్పులు చాలావరకు సూక్ష్మంగా అర్థమైనప్పటికీ ఈ జబ్బు రావడానికి గల అసలు కారణాలు ఇంతవరకు కనుక్కోలేకపోయారు.

అల్జీమర్స్ వ్యాధి మన జ్ఞాపకాలను, ఆలోచనలను, భాషను ప్రభావితం చేస్తుంది. ఈ జబ్బు మెల్లమెల్లగా పెరుగుతుంది.

జ్ఞాపక శక్తి క్షీణించడంతో మొదలై, ఎదుటి వ్యక్తితో సంభాషించలేకపోవడం.. పరిసరాలకు తగ్గట్టుగా స్పందించలేకపోవడం వంటివి జరుగుతాయి.

దీంతో రోగి దైనందిక జీవితం కష్టం అవుతుంది.

అల్జీమర్స్

ఫొటో సోర్స్, Getty Images

అల్జీమర్స్ వచ్చే అవకాశం ఎవరికి ఎక్కువ?

వయసు పెరగడం అల్జీమర్స్‌కు ఒక పెద్ద ప్రమాద కారకం. అరవై ఐదేళ్లు దాటాక ప్రతి అయిదేళ్లకు అల్జీమర్స్ వచ్చే అవకాశం రెండింతలు ఎక్కువగా ఉంటుంది.

రక్త పోటు ఎక్కువగా ఉన్నవాళ్లకు, షుగర్ వ్యాధి ఉన్నవారికి, పొగ తాగే వారికి, ఎక్కువ మోతదులో మద్యం తాగే వారికి అల్జీమర్స్ వచ్చే అవకాశం ఎక్కువ.

వీరందరికీ మెదడులో రక్త ప్రసరణ సక్రమంగా జరగదు. అందువల్ల వీరికి అల్జీమర్స్ వచ్చే అవకాశం ఉండొచ్చు.

మెదడుకు రక్తం సరఫరా సరిగ్గా జరగాలంటే గుండె బాగా పని చేయాలి. హృద్రోగులలో కూడా అల్జీమర్స్ వచ్చే అవకాశం ఉంటుంది.

శారీరక శ్రమ లేనివారు, వ్యాయామం చేయనివారు ఈ వ్యాధి బారినపడే అవకాశాలు ఎక్కువ.

ఒంటరిగా జీవించేవారు, డిప్రెషన్‌లో ఉన్న వారు కూడా అల్జీమర్స్‌తో బాధపడే అవకాశం ఉంది.

తల్లిదండ్రులకు కానీ, తోబుట్టువులకు కానీ ఈ వ్యాధి ఉంటే మనకు కూడా వచ్చే అవకాశం ఎక్కువ.

అయితే, జన్యుపరమైన మార్పులు వచ్చి అల్జీమర్స్ రావడం అనేది కేవలం పావు వంతు పేషెంట్‌లలోనే చూస్తాం.

తలకు తీవ్రమైన గాయాలైనవారికి అల్జీమర్స్ వచ్చే ప్రమాదం ఉంది.

అల్జీమర్స్

ఫొటో సోర్స్, Getty Images

అల్జీమర్స్ లక్షణాలు

జ్ఞాపక శక్తి క్షీణించడం అల్జీమర్స్‌‌లో కనిపించే మొదటి లక్షణం. ఇంటికి లేదా ఆఫీసుకి దారి మరచిపోవడం, సరకుల దుకాణాలకు దారి మరచిపోవడం లాంటివి మాములుగా వచ్చే వృద్ధాప్య సమస్యలు కావు. అవి జ్ఞాపక శక్తి క్షీణించడం వల్ల వచ్చాయని గుర్తించాలి.

ఈ లక్షణాలు కనిపిస్తే డాక్టరును సంప్రదించండి

1. రోజువారీ పనులను కూడా చేసుకోలేనంత మతి మరుపు: ముఖ్యమైన కార్యక్రమాలను మరచిపోవడం, చిన్న వాటికి అలారం లేదా నోట్ ప్యాడ్ పెట్టుకోవాల్సి రావడం

2. ప్రణాళిక వేయలేకపోవడం, చిన్న సమస్యలను పరిష్కరించలేకపోవడం, బిల్లులను సమయానికి కట్టకపోవడం, బాగా వచ్చిన వంటకం ఎలా చేయాలో మరచిపోవడం, ఇదివరకు బాగా ఆడగలిగిన ఆట ఆడలేకపోవడం.

3. బాగా తెలిసిన/ ఇదివరకు చేయగలిగిన పనులు చేయలేకపోవడం లేదా చేయడానికి ఇబ్బంది పడటం : వంట చేయలేకపోవడం, ఫోను ఎలా వాడాలో తెలియకపోవడం, సరకులు తెచ్చుకోలేకపోవడం

4. పరిసరాలు అర్థం కాకుండా ఉండటం: నిలకడగా ఒక చోట ఉండలేకపోవటం, మాటి మాటికీ (చాలా ఎక్కువ సార్లు) వస్తువులు జారవిడుస్తూ ఉండటం.

5. వస్తువుల పేర్లు/పదాలు మరచిపోతూ ఉండటం, చాలా కష్టంగా గుర్తు తెచ్చుకోవడం, ఉదాహరణకు గడియారం అనే పదం గుర్తు రాక, సమయం చూసుకునే వస్తువు అని అనడం

6. వస్తువులను అర్థం లేని చోట్లలో పెట్టడం: తాళం చెవులు ఫ్రిజ్‌లో పెట్టడం, వాచ్‌ని వాషింగ్ మెషిన్‌పైన పెట్టడం లాంటివి

7. పరిస్థితులను సరిగా అంచనా వేయలేకపోవడం: ఊరికే మోసపోవడం, తనని తాను శుభ్రంగా ఉంచుకోలేకపోవడం

8. ఇదివరకు ఇష్టంగా పాల్గొనే సామాజిక కార్యక్రమాల నుంచి కూడా దూరంగా ఉండటం

9. చిన్న విషయాలకు చిరాకు పడటం, భయపడటం, దగ్గరి వ్యక్తులనూ అనుమానించడం.

10. సమయం, తేదీలు సరిగ్గా అర్థం కాకపోవడం. ఎక్కడికైనా వెళ్ళాక, ఎందుకు వెళ్లారో గుర్తురాక తికమక పడటం.

ప్రతి అల్జీమర్స్ రోగిలోనూ ఇవే లక్షణాలు ఉండకపోవచ్చు కానీ వ్యాధి ముదురుతున్న కొద్దీ వీటిలో చాలా లక్షణాలు కనిపిస్తాయి.

అల్జీమర్స్

ఫొటో సోర్స్, Getty Images

అసలు దీన్ని డాక్టర్లు ఎలా గుర్తిస్తారు?

దీన్ని గుర్తించడానికి తేలిక పాటి పరీక్షలేవీ అందుబాటులో లేవు.

మొత్తం కుటుంబ ఆరోగ్య చరిత్ర, పూర్తి మానసిక, నాడీ వ్యవస్థ యొక్క పనితీరు పరీక్ష, జ్ఞాపక శక్తి ఎంతుందో పరీక్షించడం, రకరకాల రక్త పరీక్షలు, మెదడు స్కానింగ్ - వీటన్నింటిని ఉపయోగించి డాక్టర్లు ఒక నిర్ణయానికి వస్తారు.

జ్ఞాపక శక్తి లోపాన్ని ముందుగానే కనుక్కోవడానికి రకరకాల టెస్టులు అందుబాటులో ఉన్నాయి. అందులో మినికాగ్ టెస్ట్ ఒకటి.

ఈ టెస్టులో మనం పరిష్కరించాల్సిన సమస్యలు ఉంటాయి. అవి పరిష్కరించడానికి ఎంత సమయం పడుతుంది అనే దాని బట్టి జ్ఞాపక శక్తి లోపం ఉందో లేదో తెలుసుకోవచ్చు.

ఇప్పటివరకు అల్జీమర్స్ వ్యాధికి చికిత్స అనేది లేదు. కొన్ని రకాల మందులు వాడితే తాత్కాలిక ఉపశమనం లభించొచ్చు.

ఈ వ్యాధి వచ్చిన వారికి మనం అందించగలిగే సహాయం వారికి సహాయకులుగా ఉండటమే.

చిన్న పనులు వాళ్ళకి వాళ్లే చేసుకునే లాగా ప్రోత్సహించాలి. మిగతా వ్యాధులకు సరైన చికిత్స అందించాలి.

అల్జీమర్స్

ఫొటో సోర్స్, Getty Images

ఈ జాగ్రత్తలు పాటిస్తే..

ఈ వ్యాధి గురించి ఇంకా మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది. దీని పైన జరుగుతున్న పరిశోధనల బట్టి, మంచి ఆరోగ్య అలవాట్లు ఉంటే జ్ఞాపక శక్తి లోపాలు రాకుండా ఉంటాయి అని తెలుస్తుంది.

గుండె సంబంధిత జబ్బులను తగ్గించుకోవడానికి, షుగర్ వ్యాధిని తగ్గించుకోవడానికి మనం ఏ అలవాట్లు చేసుకుంటామో అవి అల్జీమర్స్ రాకుండా కాపాడతాయి అని అనుకోవచ్చు.

రోజూ వ్యాయామం చేయడం, పొగ తాగకుండా ఉండటం, మద్యం తాగకుండా ఉండటం, బీపీ, షుగర్ నియంత్రణలో ఉంచుకోవడం, మిగతా వ్యాధులకు సరైన మందులు వాడటం వంటివి ఇతర దీర్ఘకాలిక సమస్యలతో పాటు అల్జీమర్స్‌ను కూడా నివారించడానికి చాలా ఉపయోగపడతాయి.

తలకు దెబ్బలు తగలకుండా జాగ్రత్త పడటం, అంటే వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్లు, సీట్ బెల్టులు పెట్టుకోవడం వంటివి చేయాలి.

ఆయుష్షు పెరగడం అనేది మనందరికీ ఎంత ముఖ్యమో, మానసికంగా ఆరోగ్యంగా ఉండటం కూడా అంతే ముఖ్యం.

ప్రభుత్వాలు కూడా ప్రజలకు వృద్దాప్యంలో వచ్చే మానసిక సమస్యలకు, జ్ఞాపక శక్తి సమస్యలకు సరైన ఆరోగ్య పరమైన చర్యలు తీసుకొని, రిహాబిలిటేషన్ సెంటర్లు నిర్వహించాలి.

అల్జీమర్స్ వ్యాధి వచ్చిన వారు, వారి కుటుంబసభ్యుల పైన చాలా ఆధారపడే అవసరం వస్తుంది. కుటుంబసభ్యులకు అల్జీమర్స్ వ్యాధిగ్రస్తులను ఎలా చూసుకోవాలో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలి.

వ్యాధి గ్రస్తులకు బట్టలు వేసుకోవడం దగ్గర నుండి, వాళ్ళ స్నానం, ఆహరం, మల మూత్ర విసర్జనలో సహాయం చేయవలసి వస్తుంది.

మందులు సరైన సమయానికి వేయడం, వారికి డబ్బులు ఉపయోగించుకోవడంలో సహాయ పడటం వంటివి చేయాలి.

మానవ హక్కుల ఉల్లంఘన

ఇతర మానసిక సమస్యలున్న వారిలాగే జ్ఞాపక శక్తి లోపాలున్న చాలా మంది విషయంలోనూ ప్రాథమిక హక్కులు ఉల్లంఘన జరుగుతుంది.

వారిని ఇళ్లల్లో, వృద్ధాశ్రమాలలో, ఆసుపత్రుల్లో శారీరకంగా లేదా మత్తు మందులు వాడి ఒక చోట ఉండేలా చేస్తుంటారు కొందరు.

ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు కలిసి వీరికి సంబంధించిన చట్టాలు చేసుకొని, అమలు చేయాల్సిన అవసరం ఎంతో ఉంది.

(గమనిక: రచయిత డాక్టర్. వైద్యపరమైన విషయాలను సులభంగా వివరించి అవగాహన కల్పించడానికి రాసిన కథనం మాత్రమే ఇది)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)