‘స్లాపింగ్ థెరపీ’తో డయాబెటిస్ తగ్గిస్తామన్న మాటలు నమ్మి ఇన్సులిన్ తీసుకోవడం ఆపేసిన మహిళ మృతి.. థెరపిస్ట్‌కు పదేళ్ల జైలు శిక్ష

హాంగ్చీ జియావో

ఫొటో సోర్స్, PA

ఫొటో క్యాప్షన్, కేసు విచారణ కోసం హాంగ్చీ జియావోను ఆస్ట్రేలియా నుంచి రప్పించారు.

స్లాపింగ్ థెరపీతో మధుమేహాన్ని(డయాబెటిస్) తగ్గిస్తానంటూ మోసం చేసిన ఓ వ్యక్తికి పదేళ్ల జైలు శిక్ష పడింది.

ఆయన స్లాపింగ్ థెరపీ వర్క్‌షాప్‌లకు హాజరైన 71 ఏళ్ల డేనియల్ కార్‌గామ్‌ అనే మహిళ తాను డయాబెటిస్‌తో బాధపడుతున్నప్పటికీ ఇన్సులిన్‌ తీసుకోవడం ఆపేశారు.

టైప్ 1 డయాబెటిస్‌తో బాధపడుతున్న ఆమె తన రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రణలో ఉంచేందుకు రోజూ ఇన్సులిన్ తీసుకోవాలి.

కానీ, ఇన్సులిన్ ఆపేయడంతో ఆమె మరణించారు.

దీంతో ఆ వృద్ధురాలి మృతి కేసులో స్లాపింగ్ థెరపిస్ట్‌కు శిక్ష పడింది.

పైడా లాజిన్(స్లాపింగ్ అండ్ స్ట్రెచింగ్) థెరపీ ఈవెంట్‌లో పాల్గొన్నప్పుడు 2016 అక్టోబర్‌లో డేనియల్ కార్‌గామ్ అనే ఈ మహిళ మృతి చెందారు.

ఆ ఈవెంట్‌లో రోగులు పదేపదే దెబ్బలు తినడానికి, లేదంటే తమను తాము దెబ్బలు కొట్టుకోవడానికి వస్తుంటారు.

అలా చేస్తే డయాబెటిస్ తగ్గుతుందనేది వారి మూఢ నమ్మకం.

విల్ట్‌షైర్‌లోని జరిగిన ఈ కార్యక్రమంలో డేనియల్ కార్‌గామ్‌కు కావాల్సిన వైద్య సహాయం అందివ్వడంలో విఫలమయ్యారనే కారణంతో, తీవ్ర నిర్లక్ష్యానికి పాల్పడినందుకు జులైలో వించెస్టర్ క్రౌన్ కోర్టు కాలిఫోర్నియాలోని క్లౌడ్‌బ్రేక్‌కు చెందిన హాంగ్చీ జియావోను హత్య కేసులో దోషిగా తేల్చింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అంతకుముందు ఆరేళ్ల బాలుడి మృతి కేసులోనూ ఈయన దోషిగా తేలారు.

సిడ్నీలో ఈయన వర్క్‌షాప్‌లకు హాజరైన తరువాత తమ కొడుక్కి ఇన్సులిన్ ఇవ్వడం ఆపేశారు తల్లిదండ్రులు. దాంతో, ఆ బాలుడు మృతి చెందాడు.

ప్రస్తుత కేసు విచారణ నిమిత్తం ఆయన్ను ఆస్ట్రేలియా నుంచి బ్రిటన్‌కు రప్పించారు.

2016 అక్టోబర్‌లో పైడా లాజిన్ థెరపీ ఈవెంట్‌లో పాల్గొనప్పుడు విల్ట్‌షైర్‌లోని సీన్డ్‌లో ఉన్న క్లీవ్ హౌస్‌లో కార్ గామ్ మృతి చెందారు. క్లీవ్ హౌస్ అనేది విల్ట్‌షైర్‌లోని ఒక ఈవెంట్ వేదిక.

కార్ గామ్‌కు టైప్ 1 డయాబెటిస్ ఉంది. ఆమె రోజూ ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకోవాలి.

కానీ, ఆమెకు ఇంజక్షన్ అంటే భయం ఉండడంతో ప్రత్యామ్నాయ మార్గాల కోసం చూస్తుండేవారు. అందులో భాగంగానే ఈ 'పైడా లాజిన్' థెరపీ ప్రయత్నించారు.

ఈ థెరపీలో ప్రజలు తమకు తాము కొట్టుకోవడం కానీ ఇతరులను కొట్టడం కానీ చేయాలి.

దీనివల్ల శరీరంలోని విషపూరితమైన మలినాలు బయటకి వస్తాయని కొందరు నమ్ముతుంటారు.

కార్ గామ్ కూడా అలాగే నమ్మి, మంచి ఫలితం ఇస్తుందని అనుకున్నారని కోర్టు వాదనల్లో తెలిసింది.

జియావో

ఫొటో సోర్స్, Wiltshire Police

కార్ గామ్ వర్క్‌షాప్‌లో పాల్గొన్నప్పుడు తాను వారం అంతా ఇన్సులిన్ తీసుకోవడం ఆపేస్తానని చెప్పగా ‘వెల్ డన్’ అని ఆమెను జియావో మెచ్చుకున్నట్లు కోర్టు విచారణలో తెలిసింది.

అయితే, అలా ఆపేసిన మూడో రోజునే డేనియల్ కార్ గామ్‌కు వాంతులు మొదలయ్యాయి. ఆమె బాగా నీరసించిపోయారు. సాయంత్రానికి తనకు తట్టుకోలేనంత నొప్పి వచ్చింది.

ఏం జరుగుతుందని అడుగుతున్న ప్రశ్నలకు తాను సమాధానం కూడా చెప్పలేకపోయారని ప్రాసిక్యూటర్ డంకన్ అట్కిన్సన్ కేసీ చెప్పారు.

1999లోనే కార్ గామ్‌కు టైప్ 1 డయాబెటిస్ వచ్చింది. వర్క్‌షాపు జరిగిన నాలుగో రోజు ఆమె మరణించడానికి ముందు తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. నోటి నుంచి నురగ రావడం, విపరీతమైన నొప్పి వచ్చాయి.

సిడ్నీలో 2015లో ఒక ఆరేళ్ల బాలుడి కేసులో కూడా దోషిగా తేలిన జియావోను విచారణ కోసం ఆస్ట్రేలియా నుంచి రప్పించారు. జియావో మాటలు నమ్మి, ఆ బాలుడి తల్లిదండ్రులు కూడా ఇన్సులిన్ ఇవ్వడం ఆపేశారు.

''ఆమె ఇన్సులిన్ తీసుకోవడం ఆపేశారని తెలిసినప్పుడు, మీరు ఆమెను అభినందించారు. కానీ, ఇన్సులిన్ లేకపోతే ఆమె చనిపోతుందని అందరికీ తెలిసినప్పుడు ఎమర్జెన్సీ మెడికల్ కేర్‌ ఇవ్వడంలో విఫలయ్యారు'' అని జియావోకు శిక్ష విధిస్తున్నప్పుడు జస్టిస్ బ్రైట్ అన్నారు.

‘మీ విధానాన్ని కొనసాగించాలని మీరు భావించినట్లు నాకనిపిస్తుంది. మెడికేషన్‌ను తగ్గించేందుకు మీ ఫాలోవర్లను ప్రోత్సహించడంలో ప్రమాదం పొంచి ఉంది’ అని జస్టిస్ అన్నారు.

‘మీ మద్దతుదారుల నుంచి వచ్చిన లేఖలు, పైడా లాజిన్‌పై మీకు, వారికున్న అపారమైన విశ్వాసం నన్ను భయపెడుతుంది’ అని జస్టిస్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

''చరిత్ర మళ్లీ పునరావృతమవుతుంది. ఇది ప్రజలకు ప్రమాదకరంగా మారుతుంది. ఈ కారణంతో మిమ్మల్ని నేను ప్రమాదకరమైన వ్యక్తిగా పరిగణిస్తున్నా'' అని జడ్జి బ్రైట్ వ్యాఖ్యానించారు.

కార్ గామ్

ఫొటో సోర్స్, Wiltshire Police

ఈ వ్యాధిని సొంతంగా నయం చేసుకునేందుకు తన అమ్మ చాలా ప్రయత్నించిందని ఆమె కొడుకు మాథ్యూ కార్-గామ్ తెలిపారు.

''ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించేది. సంపూర్ణ జీవితాన్ని అనుభవించేందుకు ఆమెను ఏదీ ఆపలేదు. అమ్మ తన భాగస్వామితో ఒక మంచి ప్రాంతంలో నివసించేవారు. అందమైన ఇల్లు ఉండేది. ప్రపంచవ్యాప్తంగా ప్రయాణించేది. ఆమె జీవితంలో ఇంకా చాలా జీవితం మిగిలి ఉంది'' అని ఆయన అన్నారు.

''డేనియల్ తల్లిగా, నాన్నమ్మగా తన జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించారు. ఆమెకు ప్రయాణాలంటే ప్రాణం. ఆమె మరణం తన కుటుంబానికి, స్నేహితులకు పెద్ద షాక్.'' అని విల్ట్‌షైర్ పోలీసుకు చెందిన డిటెక్టివ్ చీఫ్ ఇన్పెక్టర్ ఫిల్ వాకర్ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)