గోళ్లు మీ ఆరోగ్యం గురించి ఏం చెబుతాయి?

వేలి గోళ్లు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జాస్మిన్ ఫాక్స్ స్కెల్లీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

వేలి గోళ్లు, మన ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని విషయాలను వెల్లడిస్తాయని అంటుంటారు.

గోళ్లను చూసి ఆరోగ్యాన్ని అంచనా వేసే వాళ్లని కూడా మీరు చూసే ఉంటారు.

అప్పుడప్పుడు గోళ్లపై కనిపించే తెల్లటి మచ్చలు, కాల్షియం లోపానికి సంకేతం.

ఆరోగ్య పరిభాషలో ఈ పరిస్థితిని లుకోనికియా అని పిలుస్తారు.

కానీ, గోళ్లను చూసి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయడం వెనుక ఏమైనా ఆధారాలు ఉన్నాయా?

వైద్యులు మీ గోళ్లను చూసి చర్మసంబంధమైన సమస్యలు, మూత్రపిండాల వ్యాధులు, ఆటో ఇమ్యూన్ రుగ్మతలు ఉన్నాయా అనేది అంచనా వేసే అవకాశం ఉంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
గోళ్లు

ఫొటో సోర్స్, Getty Images

ఏదో తీవ్రమైన సమస్యకు సంకేతం

''మెడికల్ స్కూల్లో నేను నేర్చుకున్న మొదటి విషయాల్లో 'క్లబ్బింగ్' కూడా ఒకటి. అంటే గోరుకు, దాని కింది పొర (నెయిల్ బెడ్)కు మధ్య ఉండే కోణంలో మార్పులు రావడం. క్లబ్బింగ్ కారణంగా గోళ్లు, వేలికి అతికినట్లుగా కాకుండా పైకి ఉబ్బినట్లుగా కనిపిస్తాయి.

మునివేళ్లు కూడా పెద్దగా లేదా ఉబ్బినట్లుగా అనిపిస్తాయి. చూడటానికి అది అసాధారణంగా, వేళ్లకు వాపు వచ్చినట్లుగా కనిపిస్తుంది'' అని బ్రిస్టల్ యూనివర్సిటీలో న్యూరోసైన్స్, ఫిజియాలజీ లెక్చరర్, జనరల్ ప్రాక్టీషనర్ డాన్ బామ్‌గార్డ్ చెప్పారు.

క్లబ్బింగ్ అనేది రక్తంలో అతి తక్కువ ఆక్సిజన్ స్థాయిలు ఉన్నాయని చెప్పడానికి ఒక సంకేతం. అలాగే, ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు కూడా దీనితో సంబంధం ఉంటుంది.

గుండె గదులు, కవాటాల మధ్య ఉండే పొరల్లో ఇన్ఫెక్షన్‌ను కూడా సూచిస్తుంది. సెలియాక్ డిసీజ్ (ఉదరకుహర వ్యాధి), లివర్ సిరోసిస్, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు వంటి వాటికి కూడా దీన్నొక సంకేతంలా చూస్తారు.

గోళ్లు

ఫొటో సోర్స్, Getty Images

''క్లబ్బింగ్ ఉన్న వ్యక్తిని మీరు చూసినట్లయితే, అత్యవసరంగా వారికి ఎక్స్-రే తీయించాలి. ఎందుకంటే అది అంతర్లీనంగా ఉన్న ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు సంకేతం కావొచ్చు. అయితే, డాక్టర్‌గా నా 14 ఏళ్ల అనుభవంలో ఒకసారి మాత్రమే ఇలా జరగడం నేను చూశాను'' అని డాన్ బామ్‌గార్డ్ చెప్పారు.

శరీరంలో విటమిన్, మినరల్ లోపాలకు సంకేతం గోరుపై తెల్లటి మచ్చలు(లుకోనికియా) అని తరచుగా చెబుతుంటారు. అయితే, ఈ వాదనకు మద్దతు ఇచ్చే ఆధారాలు మిశ్రమంగా ఉన్నాయి. అండర్ గ్రాడ్యుయేట్లపై జరిపిన ఒక చిన్న అధ్యయనం, ఈ లక్షణానికి వ్యక్తిలో విటమిన్లు, ఖనిజాల లోపానికి మధ్య ఎటువంటి సంబంధం లేదని తెలిపింది.

క్రోహ్ వ్యాధి ఉన్న మరో వ్యక్తిపై చేసిన అధ్యయన ఫలితాలు మరోలా వచ్చాయి. సెలీనియం లోపంతో ఆయన వేలిగోళ్లపై లుకోనికియా తీవ్రంగా పెరిగింది. ఆయనకు మినరల్స్‌తో చికిత్స చేయడంతో లుకోనికియా తగ్గింది.

సాధారణంగా బొటనేవేలిపై బలంగా గాయం తగలడం, తలుపు సందుల్లో వేళ్లు చిక్కుకొని గాయం కావడం, ఎక్కువగా మానిక్యూర్ చేయడం, కాళ్లపై బరువులు పడటం వల్ల ఇలాంటి మచ్చలు ఏర్పడతాయి.

గోరుపై తెల్లటి రంగు మారడం అనేది ఆరోగ్య సమస్యను సూచిస్తుంది. సీసం లేదా ఆర్సెనిక్‌ వంటి వాటితో విష ప్రయోగం జరిగిందని చెప్పడానికి తెల్లటి మచ్చలు ఒక సంకేతం కావొచ్చు.

సొరియాసిస్ అనే చర్మవ్యాధిని సూచించవచ్చు. ఒకవేళ గోరు మొత్తం తెల్లగా మారితే రక్తంలో ప్రొటీన్ లోపం ఉన్నట్లు. ఇది మూత్రపిండాలు, కాలేయంలో సమస్యలు, డయాబెటిస్‌ను సూచిస్తుంది.

''ఒకవేళ రక్తప్రవాహంలో ప్రొటీన్ కొరత ఉంటే గోళ్లు మొత్తం తెల్లబడతాయి. అప్పుడు మేం కాలేయంలో సమస్య ఉన్నట్లుగా అనుమానిస్తాం'' అని డాన్ తెలిపారు.

మరోవైపు గోళ్లు నీలిరంగులోకి మారితే శరీరంలో ఆక్సిజన్ లేకపోవడానికి సంకేతంగా పరిగణించవచ్చు. ఇది తీవ్రమైన గుండె జబ్బు లేదా ఎంఫిసెమాకు సంకేతం కావచ్చు. వీలైనంత త్వరగా సదరు వ్యక్తి వైద్యుడిని సంప్రదించాలి. గోరు కింద నల్లటి గీతలు కనిపిస్తే ఇలాగే భావించాలి. ఇది తీవ్రమైన చర్మ క్యాన్సర్ 'సుబంగువల్ మెలనోమా'కు కూడా సంకేతం కావొచ్చు.

గోరు కింద రక్తస్రావం జరిగి అది నయం కాని పక్షంలో ఈ పరిస్థితిని కూడా తీవ్రంగానే పరిగణించాలి. ఇది రక్తనాళాల వాపును సూచిస్తుందని డాన్ చెప్పారు.

గోళ్లు

గోళ్లను చూసి ఇంకేం గుర్తించవచ్చంటే...

గోళ్లను చూసి ఇతర సాధారణ అనారోగ్య పరిస్థితులను కూడా అంచనా వేయవచ్చు. వైద్యులు, రోగిని పరీక్షించేటప్పుడు గోళ్ల రంగును, వాటి మందాన్ని, ఆకారాన్ని చూస్తారు.

ఉదాహరణకు, గోరు కింది భాగం గులాబీ రంగులో, కొనలు తెల్లగా ఉంటే వాటిని ఆరోగ్యమైన గోళ్లుగా పరిగణిస్తారు. ఇవి కాకుండా గోళ్లపై వేరే రంగులు కనిపిస్తే, అవి గోరులోని ఇన్‌ఫెక్షన్‌ను లేదా అంతర్లీనంగా ఉన్న ఆరోగ్య పరిస్థితిని సూచిస్తాయి.

''ముఖ్యంగా మీ బొటనవేలి మీద తెలుపు లేదా పసుపు రంగు మచ్చలు ఏర్పడితే అది ఫంగల్ ఇన్‌ఫెక్షన్‌కు సంకేతం'' అని హల్ యూనివర్సిటీకి చెందిన వూండ్ హీలింగ్ లెక్చరర్ హోలీ విల్కిన్సన్ చెప్పారు.

''గోళ్లు రంగు మారినప్పుడు చాలామంది అదొక ఇన్‌ఫెక్షన్ అని గ్రహించరు. తర్వాత అది తీవ్రమవుతుంది. అప్పటికి కూడా పట్టించుకోకపోతే చికిత్స చేయడం కష్టం అవుతుంది'' అని విల్కన్సన్ హెచ్చరించారు.

గోళ్లు

ఫొటో సోర్స్, Getty Images

గోళ్లు పెలుసు బారడం

గోరు ఆకారం కూడా అంతర్లీన సమస్యలను వెల్లడిస్తుంది. ఆరోగ్యకరమైన బొటనవేలు, వేలిగోళ్లు కుంభాకారంగా ఉండాలి. అంటే అవి కాస్త బయటకు వంగినట్లు ఉండాలి. ఎలాంటి లోతులు, వంపులు ఉండకూడదు. ఒకవేళ ఇలా ఉంటే, 'కొయిలోనికియా'కు సంకేతం కావచ్చు. ఈ పరిస్థితిలో గోరు కాస్త లోపలికి వంగి, సన్నగా, పెళుసుగా కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో కొయిలోనికియా ఉన్నవారి గోరులో ఒక నీటి చుక్క పట్టేంత లోతు ఉంటుంది. కాబట్టి ఈ పరిస్థితిని 'స్పూన్ నెయిల్స్' అని కూడా పిలుస్తారు.

మీ గోళ్లలో ఏదైనా ఒకటి ఒక చెంచాలా కనిపిస్తుంటే అది రక్తహీనతకు సంకేతం కావచ్చు. అంటే కణజాలాల వరకు ఆక్సీజన్‌ను తీసుకెళ్లడానికి తగినంత ఆరోగ్యకరమైన రక్తకణాలు లేనప్పుడు ఈ పరిస్థితి తలెత్తుతుంది. ఐరన్ లోపం వల్ల కూడా రక్తహీనత సంభవిస్తుంది.

జీవన శైలిలో మార్పులు

గోరులో కనిపించే కొన్ని మార్పులు పోషకాహార లోపాలను సూచిస్తాయి. కొంతమంది గోళ్లపై 'బ్యూస్ లైన్స్' అని పిలిచే సమాంతర గట్లు ఉంటాయి. ప్రొటీన్ లోపం ఉందని చెప్పడానికి ఇదో సంకేతం.

ఈ సంకేతం మామూలుగా డయాబెటిస్, పెరిపెరల్ వాస్క్యులర్ డిసీజ్‌కు సంకేతం కావొచ్చు. శరీరంలోని కొన్ని భాగాలను రక్త ప్రసరణ తగ్గిపోవడం వల్ల వాస్క్యులర్ డిసీజ్ వస్తుంది. కాబట్టి గోళ్లపై ఇలాంటి గీతలు కనిపిస్తే వైద్యున్ని సంప్రదించడం చాలా ముఖ్యం.

''బ్యూస్ లైన్స్, జింక్ లోపాన్ని సూచిస్తాయి. పెళుసు గోళ్లు అనేవి హైపోథైరాయిడిజం, విటమిన్ బీ7 లోపానికి సంకేతం'' అని యూనివర్సిటీ హాస్పిటల్ ఆఫ్ వేల్స్‌కు చెందిన పీడియాట్రిషియన్ మేరీ పియర్సన్ చెప్పారు.

కొన్నిసార్లు ఆరోగ్య సమస్యల వల్లే కాకుండా జీవనశైలి కారణంగా కూడా గోళ్లలో మార్పులు వస్తాయి.

గోళ్లను చూసి ఒక వ్యక్తి ఆరోగ్యాన్ని ఎలా తెలుసుకుంటారని మీరు ఆశ్చర్యపోవచ్చు. శరీరానికి సంబంధించి బయట నుంచి చూడగలిగే కొన్ని భాగాల్లో గోళ్లు కూడా ఒకటి.

''మన చర్మానికి పొడిగింపు గోళ్లు. మీ చర్మం మీ శరీరంలో జరిగే చాలా విషయాలను చెప్పగలదు'' అని డాన్ చెప్పారు.

కానీ, చాలాసార్లు గోర్లలో వచ్చే మార్పులు ప్రమాదకరం కావు. అయితే, గోరు ఆకారం, రంగుల్లో శాశ్వత మార్పుల్ని మీరు గమనించినట్లయితే మీరు తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి.

(గమనిక: ఈ కథనం ప్రాథమిక అవగాహన కోసం మాత్రమే. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్యున్ని సంప్రదించాలి)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)