ఏపీతో పాటు తెలంగాణలోనూ బర్డ్ ఫ్లూ విస్తరిస్తోందా, మనుషులకూ ఈ వ్యాధి సోకుతుందా?

- రచయిత, గరికిపాటి ఉమాకాంత్
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలోనూ బర్డ్ ఫ్లూ ఆందోళన కలిగిస్తోంది. మూడు రోజుల కిందట గోదావరి జిల్లాల్లోని రెండు కోళ్ల ఫారాలలో బర్డ్ ఫ్లూ కేసులు బయటపడ్డాయి. తరువాత సమీప ఏలూరు జిల్లా, ఎన్టీఆర్ జిల్లాల్లోని కోళ్ల ఫారాల్లోనూ ఉన్నట్టుండి కోళ్లు చనిపోవడంతో వాటి శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపారు.
మరోవైపు ఏపీలోని కోళ్లల్లో బర్డ్ ఫ్లూ కేసులు బయటపడటంతో అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం ఏపీ నుంచి కోళ్లు, గుడ్లు తమ రాష్ట్రంలోకి రాకుండా రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేసింది.


ఎలా బయటపడిందంటే..
ఏపీలోని పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లో సంక్రాంతి తరువాత కోళ్లు చనిపోవడం మొదలైంది. మొదట నాటుకోళ్లు, తర్వాత బాయిలర్..ఫారం కోళ్లు లక్షలసంఖ్యలోనే మృత్యువాత పడ్డాయి.
ప్రధానంగా తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు అగ్రహారంలోని రామకృష్ణ కోళ్ల ఫారంలోనూ, పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరు గ్రామంలోని కృష్ణానందం కోళ్ల ఫారంలోనూ రోజుల వ్యవధిలో వేల సంఖ్యలో కోళ్లు చనిపోయాయి.
దీంతో ఆయా కోళ్ల ఫారాల యజమానులు ఈ విషయాన్ని పశు సంవర్ధకశాఖ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.
దీనిపై స్పందించిన అధికారులు ఆ ఫారాల్లో చనిపోయిన కోళ్ళ శాంపిల్స్‌ను ఏలూరులోని ల్యాబ్ ద్వారా సేకరించి మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఉన్న నేషనల్ హైసెక్యూరీటీ డిసీజ్ డయాగ్నోసిస్ లేబొరేటరీకి ఈనెల 6వ తేదీన పంపించారు.
చనిపోయిన కోళ్లల్లో బర్డ్‌ఫ్లూ (వైరస్ ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా– హెచ్5ఎన్1) నిర్థరణ అయినట్టు నివేదిక వచ్చింది.

10 కిలోమీటర్ల వరకు అలర్ట్ జోన్
బర్డ్‌ఫ్లూపై నివేదిక వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రెండు జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసింది. కలెక్టర్ల ఆదేశాల మేరకు ఆయా ప్రాంతాల్లోని పశు సంవర్ధకశాఖ, వైద్య ఆరోగ్యశాఖ,రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకున్నారు.
ముందుగా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం బర్డ్ ఫ్లూ నిర్ధరణ అయిన పౌల్ట్రీల నుంచి కిలోమీటరు పరిధి వరకు పరిధి రెడ్ జోన్‌గా, అక్కడి నుంచి పది కిలోమీటర్ల వరకు అలర్ట్ జోన్‌గా ప్రకటించారు.
రెడ్ జోన్ పరిధిలోని కోళ్ల పారాల్లోని అన్ని కోళ్లనూ, గుడ్లనూ పూడ్చిపెట్టాలని ఆదేశించారు.
మూడు నెలల వరకు ఈ పౌల్ట్రీలు, చికెన్ షాపులు తెరుచుకోవు.
కోడిమాంసం, గుడ్లపై అమ్మకాలపై మూడు నెలలపాటు నిషేధం ఉంటుంది.
అలర్ట్ జోన్ పరిధిలోని కోళ్ల ఫారాలు, చికెన్ షాపులను కూడా మూడు వారాలపాటు మూసివేస్తారు.
బర్డ్ ఫ్లూ వైరస్ ప్రస్తుతం అదుపులో ఉందని, మనుషులకు సోకే అవకాశం లేదని పశు సంవర్ధకశాఖ డైరెక్టర్ డాక్టర్ దామోదర్ బీబీసీకి తెలిపారు.
"కోడి మాంసం, గుడ్లు బాగా ఉడికించి తినడం వల్ల ఈ వైరస్ సోకే ప్రమాదం ఉండదు. ఈ వైరస్ 70 డిగ్రీల సెంటీగ్రేట్ వద్ద పూర్తిగా నాశనం అవుతుంది. భారతీయ ఆహారపు అలవాట్లలో భాగంగా ఆహారాన్ని ఉడికించి తినడం వల్ల ప్రజలకు ఎలాంటి అనారోగ్యం కానీ, బర్డ్ ఫ్లూ సోకడం గానీ జరగదు. బర్డ్ ఫ్లూ వల్ల మనుషులు చనిపోయిన దాఖలాలు లేవు కాబట్టి ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదు.'' అని ఆయన బీబీసీతో చెప్పారు.

కోళ్ల ఫారాలను మూసేస్తే రైతుల పరిస్థితేంటి ?
రెడ్‌జోన్ పరిధిలో అన్ని కోళ్లఫారాలను మూసివేయడం, చికెన్ గుడ్ల అమ్మకాలపై నిషేధం విధించడంపై పౌల్ట్రీ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
''పౌల్ట్రీ పరిశ్రమ బర్డ్ ఫ్లూ ప్రచారంతో ఇబ్బందుల్లోకి వెళ్లిపోయింది. కొద్ది రోజులుగా వివిధ కారణాలతో కోళ్ల పరిశ్రమ ఇబ్బందుల్లో ఉంది. దాణా ధర పెరిగి గుడ్డు ధర కూడా గిట్టుబాటు కావడం లేదు.. ఇప్పటికే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. పరిశ్రమను గాడిలో పెట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేదంటే రైతుకు చాలా నష్టం వస్తుంది. ఓ పౌల్ట్రీలో కోళ్లకు వైరస్ సోకితే కిలోమీటరు పరిధిలో ఉన్న ఫారాలన్నీ మూసివేయడం అన్యాయం.. '' అని ప్రస్తుతం రెడ్‌జోన్‌గా ప్రకటించిన పశ్చిమగోదావరి జిల్లా వేల్పూరులోని ఓ పౌల్ట్రీ యజమాని అయిన పెనుమర్తి మోహన్ బీబీసీతో అన్నారు.
అదే రెడ్ జోన్ పరిధిలోనే ఉన్న వేల్పూరుకు చెందిన మరో పౌల్ట్రీ యజమాని జీవీఆర్‌ఎస్ కుమార్ బీబీసీతో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు.
'' మా ఫారంలో 30వేల కోళ్లు ఉన్నాయి. వాటిల్లో ఏ ఒక్క దానికి కూడా బర్డ్ ఫ్లూ ఎటాక్ కాలేదు.. అయితే పక్క ఫారం ఎఫెక్ట్ వల్ల మేం కూడా బలైపోయాం., మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా గవర్నమెంట్ వారిని కోరుతున్నాం.'' అన్నారు.
ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లోనూ ఆందోళన
మూడు రోజులుగా గోదావరి జిల్లాల్లో కలకలం రేపుతున్న బర్డ్ ఫ్లూ బుధవారం నుంచి ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లోనూ ఆందోళన కలిగిస్తోంది. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం అనుమ్మోలంకలోని ఓ పౌల్ట్రీ ఫామ్‌లో మూడు రోజుల్లో 11 వేల కోళ్లు మృతి చెందాయి. దీంతో చనిపోయిన కోళ్లను పరిశీలించి శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపించారు.
పౌల్ట్రీల వద్ద బయో సెక్యూరిటీ మెజర్స్ అమలు చేస్తున్నారు, ఇప్పటికే పశు వైద్యాధికారుల పర్యవేక్షణలో యన్.టి.ఆర్.జిల్లాలో 19 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ కోళ్ల ఫారాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని ఎన్టీఆర్ జిల్లా పశుసంవర్ధకశాఖ జేడీ డాక్టర్ హనుమంతరావు మీడియాకు తెలిపారు.
మరోవైపు ఏలూరు జిల్లా బాదంపూడి సమీపంలోని ఓ పౌల్ట్రీలో బుధవారం పెద్దసంఖ్యలో కోళ్లు చనిపోవడంతో శాంపిల్స్ తీసి పరీక్షకు పంపారు.

ఇతర రాష్ట్రాల నుంచి కోళ్లు రాకుండా చెక్ పోస్టులు
రాష్ట్రంతో సరిహద్దు ఉన్న ఎన్టీఆర్ జిల్లా బోర్డర్ వద్ద ఇతర రాష్ట్రాల నుంచి కోళ్లు, కోళ్ల ఉత్పత్తులు రాకుండా 12 చెక్ పోస్ట్‌లను ఏర్పాటు చేశామని పశుసంవర్ధకశాఖ జేడీ డాక్టర్ హనుమంతరావు తెలిపారు.
జిల్లాలో మృతి చెందిన కోళ్లను భూమిలో పూడ్చిపెడుతున్నామని తెలిపారు.
ఏలూరు జిల్లా ఉంగుటూరుకి చెందిన ఓ వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకిందంటూ వస్తోన్న వార్తలను ఏలూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మాలిని ఖండించారు.
అదంతా తప్పుడు ప్రచారమని ఆమె బీబీసీతో చెప్పారు.
"బాదంపూడిలో కోళ్లు పెద్ద సంఖ్యలో చనిపోవడంతో శాంపిల్స్ తీసి పంపించాం, అంతే కానీ అక్కడ మనుషులెవరికీ బర్డ్ ఫ్లూ సోకలేదు. వైద్యశాఖ అధికారులు ఎక్కడికక్కడ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజలను పరీక్షిస్తున్నారు" అని ఆమె చెప్పారు.

5 లక్షల కోళ్లు చనిపోయాయి: మంత్రి అచ్చెన్నాయుడు
రాష్ట్రంలో బర్డ్ ప్లూ వల్ల దాదాపు 5 లక్షల కోళ్లు మరణించినట్లు సమాచారం ఉందని ఏపీ పశుసంవర్ధక, వ్యవసాయ శాఖల మంత్రి కె. అచ్చెన్నాయుడు వివరించారు.
40 లక్షల కోళ్లు మరణించినట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఆయన మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
స్వల్ప ఉష్ణోగ్రతల వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చిందని, ఉష్ణోగ్రతలు ఎంత వేగంగా పెరిగితే అంతే వేగంగా ఈ వ్యాధి తగ్గుతుందని చెప్పారు.
బర్డ్ ఫ్లూ వల్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదని మంత్రి స్పష్టం చేశారు
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














