వల్లభనేని వంశీని ఏ కేసులో అరెస్టు చేశారంటే..

Vallabhaneni Vamsi

ఫొటో సోర్స్, facebook/Vallabhaneni Vamsi

    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్‌
    • హోదా, బీబీసీ కోసం

ఎన్టీఆర్‌ జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు గురువారం ఉదయం హైదరాబాద్‌లో అరెస్టు చేశారు.

కిడ్నాప్, బెదిరింపుల కేసులో అరెస్టు చేసినట్లు విజయవాడ పటమట పోలీసులు బీబీసీతో చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

కేసు నేపథ్యం ఏంటి?

2023, ఫిబ్రవరి 20న గన్నవరం టీడీపీ కార్యాలయంపై వల్లభనేని వంశీ అనుచరులు దాడికి పాల్పడి విధ్వంసం సృష్టించారంటూ.. అప్పట్లో టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పని చేస్తున్న సత్యవర్ధన్‌ ఫిర్యాదు చేశారు.

వైసీపీ ప్రభుత్వంలో ఆ కేసును పట్టించుకోలేదని ఆరోపిస్తూ టీడీపీ కూటమి ప్రభుత్వం రాగానే కేసును సీఐడీకి అప్పగించారు.

మొత్తంగా ఆ ఘటనకు సంబంధించి 94మందిపై కేసులు నమోదు కాగా, ఆ కేసులో వంశీ ఏ71గా ఉన్నారు.

క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌(సీఐడీ) ఇప్పటి వరకు ఆ కేసులో 40మందిని అరెస్టు చేసింది.

అయితే, ఫిర్యాదుదారు సత్యవర్ధన్‌ రెండు రోజుల క్రితం కేసు వెనక్కి తీసుకుంటున్నట్టు కోర్టులో అఫిడవిట్‌ వేశారు.

విజయవాడలో ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం ముందు సత్యవర్ధన్‌ హాజరై తనకు కేసుతో సంబంధం లేదంటూ అఫిడవిట్‌ సమర్పించారు.

వల్లభనేని వంశీ

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, హైదరాబాద్‌లోని వంశీ ఇంట్లో పోలీసులు

కిడ్నాప్‌ చేసి బెదిరించడంతోనే వెనక్కి తీసుకున్నానన్న ఫిర్యాదుదారు

వంశీ తనను కిడ్నాప్‌ చేసి బెదిరించడంతోనే కేసు వెనక్కి తీసుకోవాలని నిర్ణయించినట్టు సత్యవర్ధన్‌ ఫిర్యాదు చేయడంతో హుటాహుటిన హైదరాబాద్‌కి వెళ్లి రాయదుర్గంలోని అపార్ట్‌మెంట్‌లో ఉన్న వంశీని అరెస్ట్‌ చేసినట్టు పటమట పోలీసులు తెలిపారు.

వంశీపై 140 (1), 308, 351 (3), రెడ్‌విత్‌ 3(5) సెక్షన్లతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు.

ఈ మేరకు వల్లభనేని వంశీ భార్యకు పోలీసులు నోటీసులు అందించారు.

హైదరాబాద్‌లో అరెస్టు చేసి విజయవాడకు తరలిస్తున్నట్టు పటమట పోలీసులు బీబీసీకి తెలిపారు.

వల్లభనేని వంశీ

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, వంశీ అరెస్టు నోటీసు

ఎన్నికల తరువాత పెద్దగా కనిపించని వంశీ

తెలుగుదేశంతో రాజకీయాల్లోకి వచ్చిన వంశీ 2019 వరకు ఆ పార్టీలోనే కొనసాగారు.

2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచిన తర్వాత వంశీ ఆ పార్టీ నుంచి బయటకొచ్చి అప్పటి అధికారపక్షం వైసీపీతో నడిచారు.

2024లో వైసీపీ నుంచి గన్నవరం అభ్యర్థిగానే పోటీ చేసి టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకటరావు చేతిలో పరాజయం పాలయ్యారు.

వైసీపీలో చేరిన తర్వాత అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు కుటుంబసభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న విమర్శలు ఎదుర్కొన్నారు.

2024 ఎన్నికల ఫలితాల రోజున కౌంటింగ్‌ మధ్యలోనే నిరాశతో వెనుదిరిగారు.

ఫలితాల తర్వాత కేవలం ఒకటి రెండు సార్లు మాత్రమే మీడియాకి కనిపించిన ఆయన అప్పట్నుంచి దాదాపుగా అజ్ఞాతంలోనే గడుపుతున్నారు.

గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసుతో పాటు పలు కేసుల్లో నిందితుడు అయిన వంశీ గురించి ఏపీ పోలీసులు కొన్నాళ్లుగా గాలిస్తున్నారు.

గన్నవరం టీడీపీ నేత రంగబాబుపై దాడి కేసుతో పాటు బాపులపాడు మండలం ఆరుగొలనులో టీడీపీ నాయకుడు వేములపల్లి శ్రీనివాస్‌ రావు దుకాణాలను కూల్చివేసిన కేసులో వంశీ నిందితుడిగా ఉన్నారు.

అదేవిధంగా ఎన్నికల సమయంలో టీడీపీ అభ్యర్ధి, ప్రస్తుత గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుపై హత్యాయత్నానికి పాల్పడ్డారనే కేసులో కూడా వంశీ నిందితుడిగా ఉన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి).