టీడీపీ ప్రధాన కార్యాలయం, నేతల ఇళ్లపై దాడులు... బుధవారం ఏపీ బంద్‌కు పిలుపునిచ్చిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి జరిగింది. మంగళవారం సాయంత్రం కొంతమంది కర్రలు చేతబట్టుకుని టీడీపీ కార్యాలయంలోకి చొరబడ్డారు. హఠాత్తుగా గుంపుగా వచ్చి దాడికి పాల్పడడంతో అంతా అవాక్కయ్యారు.
మంగళగిరి ఆత్మకూరులో ఉన్న ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లోపలికి వారంతా చొచ్చుకొచ్చి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. కొన్ని కార్ల అద్దాలు ధ్వంసం చేశారు. దాంతో కార్యాలయంలో ఉన్న టీడీపీ నేతలు, కార్యకర్తలు అప్రమత్తమయ్యారు. వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొందరు కార్యకర్తలపై కూడా దాడి జరిగిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనకారులను అడ్డుకున్నారు. కొందరిని అదుపులోకి తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ మీద టీడీపీ ఇటీవల తీవ్ర విమర్శలు చేస్తోంది. ముఖ్యంగా డ్రగ్స్, గంజాయి స్మగ్లింగ్ వ్యవహారాలపై ఆరోపణలకు పూనుకుంటోంది. ఆ క్రమంలోనే కాకినాడ టీడీపీ కార్యాలయంలో గత వారం టీడీపీ అధికార ప్రతినిధి కే పట్టాభిని కొందరు నిలదీశారు. వైసీపీకి చెందిన నేతలు టీడీపీ ఆఫీసులోకి చొరబడి కాకినాడలో కలకలం రేపారు.

ఆ ఘటన జరిగిన పదిరోజులకు తాజాగా మంగళగిరితో పాటుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో టీడీపీ కార్యాలయాల వద్ద ఆందోళనలు జరిగాయి. కడపలో టీడీపీ నేతల ఇళ్లను వైసీపీ కార్యకర్తలు చుట్టుముట్టారు. మైనార్టీలపై ఆపార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
విజయవాడలోని టీడీపీ నేత పట్టాభి ఇంటి మీద కూడా దాడి జరిగినట్టు చెబుతున్నారు. ఆయన ఇంటి వద్ద కూడా కారు, ఫర్నీచర్ ధ్వంసం చేసిన విజువల్స్ విడుదల చేశారు.
టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడులు చేయడాన్ని టీడీపీ నేతలు తీవ్రంగా పరిగణిస్తున్నారు. వ్యూహాత్మకంగా దాడి జరిగిందని టీడీపీ ఏపీ శాఖ అధ్యక్షుడు కే అచ్చెన్నాయుడు విమర్శించారు. ఇది వైసీపీ గూండాల పనేనని అన్నారు. విశాఖలో కూడా టీడీపీ ఆఫీసు మీద కూడా దాడి చేశారు. ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా, ఫాసిస్టు పాలనలో ఉన్నామా అనేది అర్థం కావడం లేదని అచ్చెన్నాయుడు అన్నారు.

"ప్రభుత్వం చేసిన తప్పులను ఎండగడితే దాడులకు పూనుకోవడం ఎంతవరకూ సమంసజం? రాష్ట్రంలో శాంతిభద్రలున్నాయా? పోలీస్ వ్యవస్థ పని చేస్తోందా? ఇంతకన్నా దుర్మార్గం ఇంకేమీ లేదు. ఈ దాడులకు పాల్పడిన వారిని శిక్షించాలి. దీనికి సీఎం, డీజీపీ బాధ్యత వహించాలి. ఈ ఘటనకు బాధ్యతగా సీఎం రాజీనామా చేయాలి" అని ఆయన డిమాండ్ చేశారు.
తమ పార్టీ కార్యాలయాలపై దాడులు జరగడం గురించి టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు గవర్నర్‌తో ఫోన్లో మాట్లాడారు. కేంద్ర బలగాల సహాయం కావాలని ఆయన కోరినట్లు తెలిసింది.
ఇదిలా ఉంటే, ఇవాళ హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చిన చంద్రబాబు. ఉద్దేశ పూర్వకంగానే ఉదయం పట్టాభితో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి, ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేయించారని వైసీపీ కార్యాలయం ఒక ప్రకటన చేసింది.
ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ద్వారా చంద్రబాబు రాష్ట్రంలో హింసకు, అలజడికి పన్నాగం పన్నారని. దీనినుంచి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

మరోవైపు, మంగళగిరి సాక్షి టీవీ రిపోర్టర్ అభిరామ్ పై టీడీపీ నేతల దాడి చేసినట్లు వార్తలు వచ్చాయి. టీడీపీ నాయకులు చొక్కా పట్టుకుని కొట్టారని, చైన్ దొంగిలించారని ఆరోపిస్తూ ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దాడి జరిగిన అనంతరం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పార్టీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర ఆయన వెంట వచ్చారు. పట్టాభి అక్కడే ఉన్నారు.
దీనిపై సీపీఎం రాష్ట్ర శాఖ స్పందించింది. టీడీపీ కార్యాలయాలపై వైసీపీ కార్యకర్తలు జరుపుతున్న దాడులను పార్టీ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తోందని కార్యదర్శి పి. మధు ఒక ప్రకటనలో తెలిపారు. తక్షణం ఈ దాడులను ఆపేందుకు ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా పార్టీ కార్యాలయాలపై దాడులు జరిగాయని, ఇలాంటి సంస్కృతి ప్రజాస్వామ్యానికి ఏ మాత్రం శ్రేయస్కరం కాదని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. "ఇది ప్రజాస్వామ్యానికి క్షేమకరం కాదు. దీని మీద కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోం శాఖ దృష్టి సారించాలి" ఆయన కోరారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి సంఘటనలు చాలా విషాదకరమని వ్యాఖ్యానించారు. "పార్టీ కార్యాలయాలపైన ఇలాంటి దుశ్చర్యలను భారతీయ జనతా పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తోంది" అని ఆయన అన్నారు.

చంద్రబాబు ప్రెస్ మీట్
ఈ దాడులు ఒక ప్రణాళిక ప్రకారమే జరిగాయని చెప్పిన చంద్రబాబు, బుధవారం రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చారు. ప్రభుత్వ ప్రమేయంతోనే ఈ దాడులు జరిగాయని ఆయన ఆరోపించారు.
మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, "ముఖ్యమంత్రి, పోలీసులు లాలూచీ పడ్డారు. డీజీపీ కార్యాలయం పక్కనే టీడీపీ కార్యాలయం ఉన్నా పోలీసులు పట్టించుకోలేదు. ఇలాంటి వారు రాష్ట్రంలో శాంతిభద్రతలను ఏం కాపాడుతారు?" అని చంద్రబాబు అన్నురు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని చెప్పిన చంద్రబాబు, ఇక్కడ 356 అధికరణం ఎందుకు అమలు చేయకూడదని ప్రశ్నించారు. గవర్నర్, కేంద్ర మంత్రి ఫోన్ చేస్తే స్పందించారని, డీజీపీ మాత్రం ఫోన్ చేస్తే ఎత్తలేదని చంద్రబాబు చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- భారతదేశంలోని అతిపెద్ద 'చెత్త' కొండ... దీనిని కరిగించడం సాధ్యమా?
- కాఫీ నుంచి కంప్యూటర్ చిప్‌ల వరకు అన్నీ కొరతే, ఏ దేశంలో ఏ వస్తువులు దొరకడం లేదంటే
- టీ-20 వరల్డ్ కప్-2007 ఫైనల్: మిస్బా-ఉల్-హక్‌ను ఇప్పటికీ వెంటాడుతున్న పెడల్ స్వీప్ షాట్
- చైనా పరీక్షించిన హైపర్సోనిక్ క్షిపణి ఏమిటి? మొత్తం ప్రపంచానికి ఇది ప్రమాదమా
- బ్రిటన్ ఎంపీ హత్య: ప్రపంచ వ్యాప్తంగా ఎంపీలు, రాజకీయ నాయకులకు ఎలాంటి భద్రత ఉంటుంది?
- తరతరాలుగా అమ్మమ్మలు, నానమ్మలు చేసే సంప్రదాయ మసాజ్ రహస్యం కనిపెట్టిన అమెరికా పరిశోధకులు
- విక్రాంత్‌ను ముంచాలని వచ్చిన పాక్ 'ఘాజీ' విశాఖలో జలసమాధి ఎలా అయ్యింది?
- మలేరియాపై పోరాటంలో చరిత్రాత్మక ముందడుగు.. వ్యాక్సినేషన్‌కు అనుమతి
- టీటీడీ బోర్డును జగన్ తన 'సంపన్న మిత్రుల క్లబ్'గా మార్చేశారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)









