గాజా: ట్రంప్ సొంతం చేసుకుంటానంటున్న ఈ ప్రాంతం అసలు ఎవరిది? చరిత్ర ఏం చెబుతోంది

గాజా, ఇజ్రాయెల్, అమెరికా

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, గాజా స్ట్రిప్‌ను స్వాధీనం చేసుకోవాలని అనుకుంటున్నట్లు ట్రంప్ చేసిన ప్రతిపాదనలను బ్రిటన్ ప్రధాని స్టార్మర్ సహా పలువురు ఖండించారు.
    • రచయిత, ఎథర్ షెల్బీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

గాజా స్ట్రిప్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలని కోరుకుంటున్నానని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ గతవారం ప్రతిపాదించారు. స్ట్రిప్‌ను అభివృద్ధి చేసి, దానిని 'రివేరా ఆఫ్ మిడిల్ ఈస్ట్'గా మార్చాలనుకుంటున్నట్లు కూడా ఆయన అన్నారు.

పాలస్తీనియన్లను శాశ్వతంగా ఈజిప్ట్, జోర్డాన్‌లకు 'తరలించాలి' అని ఆయన గతంలో సూచించారు. తాజాగా ఈ ప్రతిపాదనలు చేశారు.

ఆ వెంటనే బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ సహా ప్రపంచ దేశాల నాయకులు ట్రంప్ ప్రతిపాదనలను ఖండించారు. మరోవైపు గాజా అమ్మకానికి లేదంటూ ఆ ప్రాంతానికి చెందిన నేతలు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అసలు గాజా ప్రాంతం ఎవరిది, దాని చరిత్ర ఏంటి? తెలుసుకుందాం

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గాజా ఎవరి నియంత్రణలో ఉంది?

వాస్తవానికి, 2007 నుంచి గాజాలో హమాస్ పాలన ఉంది. అంతకుముందు సంవత్సరమే, ఆక్రమిత ప్రాంతాల్లో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో హమాస్ గెలిచింది. తన ప్రత్యర్థి ఫతాను ఈ భూభాగం నుంచి బహిష్కరించిన తర్వాత, గాజాలో తన అధికారాన్ని బలోపేతం చేసుకుంది హమాస్.

ఇజ్రాయెల్, అమెరికా సహా కొన్ని పాశ్చాత్య దేశాలు టెర్రరిస్ట్ సంస్థగా పిలుస్తున్న ఈ సంస్థ నియంత్రణలోనే గాజా స్ట్రిప్ ఉంది.

ఇజ్రాయెల్, ఈజిప్ట్‌, మరోవైపు మధ్యధరా సముద్రం హద్దులుగా ఉండే 41 కిలోమీటర్ల పొడవు, 10 కిలోమీటర్ల వెడల్పైన భూభాగం ఇది.

ఆ తర్వాతి కాలంలో హమాస్ - ఇజ్రాయెల్ మధ్య ఎన్నోసార్లు ఘర్షణలు జరిగాయి. ప్రతిసారీ ఇరువైపులా ఎంతోమంది చనిపోయారు. వారిలో గాజాకి చెందిన పాలస్తీనియన్లే ఎక్కువ.

2023 అక్టోబర్ 7న హమాస్ ఫైటర్లు గాజా వైపు నుంచి ఇజ్రాయెల్‌పై దాడులు చేశారు. ఇజ్రాయెల్‌లో దాదాపు 1200 మందిని చంపేసి, 250కి పైగా మందిని బందీలుగా తీసుకెళ్లారు. ఫలితంగా, గాజాలో ఇజ్రాయెల్ భారీ సైనిక దాడి చేసింది. ఈ సైనిక దాడి 15 నెలల పాటు కొనసాగింది. హమాస్ ఆరోగ్య మంత్రిత్య శాఖ లెక్కల ప్రకారం, 47,540 మంది చనిపోయారు. వారిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులు.

ఇజ్రాయెల్-హమాస్ మధ్య తాజా యుద్ధాన్ని నిలువరించేందుకు, ఎన్నో ప్రయాసలకోర్చి నెలల తరబడి జరిగిన పరోక్ష చర్చల తర్వాత, 2025 జనవరిలో కాల్పుల విరమణ ఒప్పందానికి ఇరుపక్షాలూ అంగీకరించాయి.

యుద్ధానికి ముగింపు పలకడంతో పాటు ఇజ్రాయెల్ వద్ద ఉన్న పాలస్తీనియన్ ఖైదీల విడుదల, దానికి బదులుగా హమాస్ వద్దనున్న బందీలను విడిపించడమే లక్ష్యంగా ఈ ఒప్పందం జరిగింది.

గాజా, ఇజ్రాయెల్, అమెరికా, ట్రంప్
ఫొటో క్యాప్షన్, గాజాను ఇజ్రాయెల్ ఆక్రమిత భూభాగంనే ఐక్యరాజ్యసమితి ఇప్పటికీ పరిగణిస్తోంది.

చరిత్రపరంగా, గాజా ఎవరిది?

1948లో ఇజ్రాయెల్ ఏర్పడడానికి ముందు గాజా బ్రిటిష్ వలస పాలనలో ఉండేది. ఇజ్రాయెల్‌‌ స్వతంత్ర దేశంగా ప్రకటించిన మరుసటి రోజు, ఐదు అరబ్ దేశాల సైన్యాలు దానిని చుట్టుముట్టి, దాడులు చేశాయి. 1949లో యుద్ధ విరమణ ఒప్పందంతో పోరాటం ముగిసే నాటికి, ఇజ్రాయెల్ చాలా భూభాగాన్ని తన నియంత్రణలోకి తెచ్చుకుంది.

అయితే, ఒప్పందం జరిగేనాటికే గాజా స్ట్రిప్‌ను ఈజిప్ట్, వెస్ట్ బ్యాంక్, తూర్పు జెరూసలేంను జోర్డాన్, పశ్చిమ జెరూసలేంను ఇజ్రాయెల్ ఆక్రమించుకున్నాయి.

1967 యుద్ధంలో ఈజిప్టును గాజా నుంచి తరిమేసి, స్ట్రిప్‌ను ఇజ్రాయెల్ ఆక్రమించింది. సెటిల్‌మెంట్లు నిర్మించి, పాలస్తీనా ప్రజలను సైనిక పాలనలో ఉంచింది.

2005లో ఇజ్రాయెల్ తనంతట తానుగా గాజా నుంచి దళాలను, అక్కడ స్థిరనివాసం ఏర్పరచుకున్న తమవారిని ఉపసంహరించుకుంది. అయినప్పటికీ.. బోర్డర్, వైమానిక స్థావరం, తీరప్రాంతంపై తన పట్టును నిలుపుకుంది. తద్వారా ప్రజల కదలికలు, సరుకుల రాకపోకలపై నియంత్రణ సాధించింది.

ఇప్పటికీ గాజాను ఇజ్రాయెల్ ఆక్రమిత భూభాగంనే ఐక్యరాజ్యసమితి పరిగణిస్తోందంటే, ఇజ్రాయెల్ నియంత్రణ ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

2006లో జరిగిన పాలస్తీనా ఎన్నికల్లో హమాస్ గెలిచింది. ఆ మరుసటి సంవత్సరం తీవ్ర ఘర్షణల తర్వాత, తన ప్రత్యర్థులను హమాస్ ఈ ప్రాంతం నుంచి తరిమేసింది.

దానికి ప్రతిస్పందనగా ఇజ్రాయెల్, ఈజిప్ట్‌లు దిగ్బంధనం చేశాయి, ఇజ్రాయెల్ వీలైనంత మేర భూభాగాన్ని నియంత్రణలోకి తీసుకుంది.

ఆ తర్వాతి కాలంలో, హమాస్ - ఇజ్రాయెల్ మధ్య 2008-09, 2012, 2014 ఘర్షణలతో సహా ఎన్నోసార్లు తీవ్రమైన ఘర్షణలు జరిగాయి. 2021 మే నెలలో ఇరువర్గాల మధ్య భారీ ఘర్షణ చోటుచేసుకుంది. అది 11 రోజుల తర్వాత కాల్పుల విరమణ ఒప్పందంతో ముగిసింది.

గాజా, ఇజ్రాయెల్, ట్రంప్, అమెరికా
ఫొటో క్యాప్షన్, ఆర్థిక ప్రయోజనాల కంటే రాజకీయపరమైన ప్రయోజనాల కోసమే ట్రంప్ ఆసక్తి చూపిస్తున్నట్లు కొందరు నిపుణులు భావిస్తున్నారు.

గాజాలో చమురు, సహజవాయువు నిక్షేపాలున్నాయా?

ఐక్యరాజ్యసమితి ప్రకారం, ఆక్రమిత పాలస్తీనా భూభాగాల్లో భారీగా చమురు, సహజవాయువు నిక్షేపాలున్నాయి. యునైటెడ్ నేషన్స్ ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (UNCTAD) 2019లో విడుదల చేసిన నివేదికలో, ఈ ప్రాంతంలో 3 బిలియన్ బ్యారెళ్లకు పైగా నిక్షేపాలు ఉండొచ్చని అంచనా వేసింది.

''ఆక్రమిత పాలస్తీనా భూభాగం, వెస్ట్ బ్యాంక్‌లోని కొంత ప్రాంతం , మధ్యదరా సముద్ర తీరంలో రిజర్వాయర్ల కంటే పెద్దస్థాయిలో చమురు, సహజవాయువు నిక్షేపాలున్నాయని జియాలజిస్టులు, నేచురల్ రిసోర్సెస్ ఎకనమిస్టులు నిర్ధరించారు'' అని నివేదికలు చెబుతున్నాయి.

ఇది మధ్యధరా సముద్రంలోని లెవాంట్ బేసిన్‌లో నూతనంగా గుర్తించిన చమురు, సహజ వాయువు నిక్షేపాలను సూచిస్తోంది. ఇవి ''(2017 నాటి ధరల్లో) 453 బిలియన్ డాలర్ల నికర విలువ చేసే 1.7 బిలియన్ బ్యారెళ్ల సహజ వాయువు, 71 బిలియన్ డాలర్లు విలువ చేసే చమురు నిక్షేపాలు'' ఉన్నట్లు పేర్కొంటున్నాయి.

చమురు, సహజవాయువు నిక్షేపాలను వెలికితీయడానికే ట్రంప్ ఈ ప్రతిపాదనలు చేసి ఉండొచ్చని కొందరు నిపుణులు భావిస్తున్నారు. లేదు, ఆర్థిక ప్రయోజనాల కంటే రాజకీయపరమైన ప్రయోజనాల కోసమే ట్రంప్ ఆసక్తి చూపిస్తున్నట్లు మరికొందరు వాదిస్తున్నారు.

గాజాకు చెందిన ఆర్థిక నిపుణులు మహెర్ తబా మాట్లాడుతూ, ''గాజా కంటే ఎక్కువ మొత్తంలో చమురు, గ్యాస్ నిక్షేపాలున్న గల్ఫ్, ఇతర దేశాలు చాలా ఉన్నాయి. గాజాపై ట్రంప్ దృష్టి పెట్టడానికి రాజకీయపరమైన కారణాలకే ఎక్కువ అవకాశముంది'' అన్నారు.

గతంలో ఇజ్రాయెల్‌‌‌కు అమెరికా రాయబారిగా పనిచేసిన డెన్నిస్ రాస్ బీబీసీతో మాట్లాడుతూ, డోనల్డ్ ట్రంప్ గాజా సంక్షోభాన్ని ''రియల్ ఎస్టేట్ సమస్య''గా చూస్తున్నారని అన్నారు.

''ఎప్పుడూ పేదరికంలో ఉన్న ఈ ప్రాంతాన్ని మేం మార్చేస్తాం'' అనే ఉద్దేశమే ఈ ప్రతిపాదనల్లో ఎక్కువగా కనిపిస్తోందని తాను భావిస్తున్నట్లు ఆయన చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)