శరీరంలో క్యాన్సర్ ఎలా వ్యాపిస్తుంది, ఎన్ని రకాల క్యాన్సర్లు ఉన్నాయి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, డాక్టర్ దిలీప్ నికమ్
- హోదా, ఆంకాలజిస్ట్, బొంబే హాస్పిటల్, ముంబయి నుంచి
క్యాన్సర్. ఈ పేరు వినగానే తెలియని భయం పట్టుకుంటుంది. ఈ వ్యాధి సోకిన రోగులు, వారి కుటుంబసభ్యుల్లోనే కాదు, డాక్టర్లు, పరిశోధకులలోనూ ఒక రకమైన నిరాశ కనిపిస్తుంది.
అసలు క్యాన్సర్ చరిత్ర ఏమిటి? ఎన్నిరకాల క్యాన్సర్లు మానవాళిని పట్టి పీడిస్తున్నాయి. ఇప్పటిదాకా దీన్ని రూపుమాపడానికి చేసిన ప్రయత్నాలు ఇచ్చిన ఫలితాలు ఏమిటి?
ప్రపంచ క్యాన్సర్ చరిత్రను పరిశీలిస్తే గ్రీకు, రోమన్ పుస్తకాల్లో దీని ప్రస్తావన ఉంది.
క్రీస్తు పూర్వం 470, 370 మధ్యలో, గ్రీక్ వైద్యానికి పితామహుడిగా భావించే హిప్పోక్రేట్స్ తొలుత క్యాన్సర్‌కు సంబంధించి కార్సినోస్ లేదా కార్సినోమా అనే పదాలను వాడారు. కార్సినోస్ అంటే గ్రీక్ భాషలో పీత అని అర్థం.
చాలామంది క్యాన్సర్ రోగులను పరిశీలించిన తర్వాత, వారికి గట్టి గడ్డలు ఉన్నట్లు గుర్తించారు. అవి ఒక భాగం నుంచి మరో భాగానికి వ్యాపిస్తున్నట్లు కూడా కనుగొన్నారు. తుది దశల్లో బాధ భరించలేనిదిగా ఉందని తెలిపారు.
క్యాన్సర్‌కు పీత పేరును ఎందుకు పెట్టారంటే.. పీత వెనుకభాగంగా చాలా గట్టిగా ఉంటుంది,అది కొండెంతో కాటు వేస్తే భరించలేని నొప్పి వస్తుంది. ఈ రెండు లక్షణాలు క్యాన్సర్ రోగులలోనూ కనిపిస్తాయి. అందుకే ఆ వ్యాధికి క్యాన్సర్ అని పేరు పెట్టారు.

గ్రీక్ ఫిజిషియన్ గాలెన్ ఆంకోస్ అనే పదాన్ని ప్రసిద్ధం చేశారు. గ్రీక్‌లో ఆంకోస్ అంటే ఉబ్బడం. రోమన్ ఫిజీషియన్ సెల్సస్ తొలుత 'క్యాన్సర్' అనే పదాన్ని వాడారు.
ఎందుకంటే, లాటిన్‌లో పీతను (క్రాబ్‌ను) క్యాన్సర్ అని పిలుస్తారు. అలా, ఈ వ్యాధికి క్యాన్సర్ అనే పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ సమయంలో క్యాన్సర్‌ను గుర్తించడం చాలా కష్టమయ్యేది. క్యాన్సర్‌కు ఒక అంతుచిక్కని, నయం చేయలేని వ్యాధిగా చూసేవాళ్లు. 17వ శతాబ్దంలో మైక్రోస్కోప్‌ను కనుగొన్నాకే క్యాన్సర్‌పై అసలైన పరిశోధనలు మొదలయ్యాయి.
19వ శతాబ్దంలో వైద్యపరమైన పురోగతి సాధించినప్పుడు, అంతుచిక్కని క్యాన్సర్ రహస్యం బయటపడటం మొదలైంది.
అయితే, శరీరంలో అసలు క్యాన్సర్ ఎలా ప్రారంభమవుతుంది? అదెలా పెరుగుతుంది? శరీరంలోని ఇతర భాగాలకు ఎలా వ్యాపిస్తోంది? వీటన్నింటినీ కనుగొనడం ఇప్పటివరకు జరిగిన అత్యంత ముఖ్యమైన ఆవిష్కరణల్లో ఒకటి. క్యాన్సర్ గురించి అనేక అపోహలను ఇవి తొలగించాయి.
క్యాన్సర్ గురించి తెలుసుకునే ముందు, మానవ శరీర నిర్మాణం కూడా గురించి మనం తెలుసుకోవాలి. మానవ శరీరం కోట్ల కొద్దీ కణాలతో రూపొందుతుంది. వివిధ కండరాలు కలిసి అవయవాలను ఏర్పరుస్తాయి.
కొత్త కణాలు పుట్టడం, వాటికి కేటాయించిన పనులు సక్రమంగా నిర్వర్తించడం, వాటి పని పూర్తయిన తర్వాత నశించడం, మళ్లీ కొత్త కణాలు పుట్టడం ఇవన్నీ మన శరీరంలో మనకు తెెలియకుండా జరిగే ప్రక్రియ. కణాలలోని జన్యువులు వీటిన్నింటినీ గట్టిగా నియంత్రిస్తుంటాయి. అందుకే మనం ఆరోగ్యంగా ఉంటాం.
ఒకవేళ, కార్సినోజెన్ ఎక్స్‌పోజర్, ఇన్‌ఫెక్షన్, వైరల్ ఇన్‌ఫెక్షన్, వంశపారపర్యం వల్ల ఈ జన్యువుల్లో మ్యుటేషన్ జరిగితే, పైన చెప్పిన నియంత్రణ కోల్పోతాయి. కణాలు అనియంత్రిత స్థాయిలో పెరుగుతాయి. వాటి పరిమాణం, సహజత్వంలో మార్పులు సంభవిస్తాయి. దీన్నే క్యాన్సర్ అని అంటాం.
సాధారణ కణాల కంటే క్యాన్సర్ కణాలు తక్కువ దూకుడుగా ఉంటూ.. అనియంత్రిత స్థాయిలో పెరిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

ఫొటో సోర్స్, Getty Images
క్యాన్సర్ కణాలు స్వీయ మార్పుల గుణం కారణంగా నశించవు. శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకుంటూ.. ఒక భాగం నుంచి మరో భాగానికి విస్తరిస్తాయి. అక్కడ ఇతర కణాలను, అవయవాలను దెబ్బతీస్తాయి. దీన్ని అరికట్టడం చాలా కష్టం.
అయితే, శరీరంలోని ప్రతి గడ్డ కూడా క్యాన్సర్‌కు సంబంధించినదై ఉండదు. కొన్నిసార్లు సాధారణమైన గడ్డలు కూడా కావొచ్చు.సాధారణ కణితి ఒక భాగం నుంచి మరో భాగానికి వ్యాపించదు. అదే క్యాన్సర్ కణితి అయితే, శరీరంలోని ఏ భాగానికైనా విస్తరిస్తుంది. దీన్ని వ్యాప్తిని బట్టే అది క్యాన్సరో కాదో చెప్పొచ్చు.
క్యాన్సర్ వ్యాప్తి ఎన్నిరకాలు?
నేరుగా వ్యాపించడం: క్యాన్సర్ కణాలు నేరుగా పక్కనున్న కణాలు లేదా అవయవాలపై దాడి చేస్తాయి.
లింఫాటిక్ విస్తరణ: క్యాన్సర్ కణాలు లింఫాటిక్ డ్రైనేజ్ సిస్టమ్‌లోకి ప్రవేశించి, లింఫ్ నోడ్స్‌లో పెరుగుతాయి.
హెమటోలాజికల్ విస్తరణ: రక్త నాళాల ద్వారా క్యాన్సర్ కణాలు ఊపిరితిత్తులు, ఎముకలు, కాలేయం, మెదడులోకి వ్యాపిస్తాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఎన్ని రకాల క్యాన్సర్లు ఉన్నాయి?
రెండు విధాలుగా క్యాన్సర్‌ను విభజించవచ్చు.
అవయవ రకాన్ని బట్టి వర్గీకరణ... ఇది ఏ అవయవంలో మొదలవుతుందో దాన్ని బట్టి క్యాన్సర్‌కు పేరు పెడతారు. అంటే.. ఊపిరితిత్తుల క్యాన్సర్, పేగు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ మొదలైనవి.
కణాన్ని బట్టి క్యాన్సర్ వర్గీకరణ
కార్సినోమా – ఇది చాలా సాధారణమైన క్యాన్సర్. శరీరంలోని ఎపిథీలియల్ కణాలు లేదా అవయవాల్లో పుడుతుంది. కార్సినోమా కింద, అడెనోకార్సినోమా (ఊపిరితిత్తులు, రొమ్ము), బాసల్ సెల్ కార్సినోమా (చర్మ), ట్రాన్సిషనల్ (కిడ్నీ) వంటి రకాలు ఉంటాయి.
సార్కోమా – ఈ క్యాన్సర్ శరీరంలోని బంధన కణజాలం, సహాయక కణాలలో సంభవిస్తుంది.
మెలనోమా – చర్మంపై మెలనిన్‌ను ఉత్పత్తి చేసే మెలానోటైప్ కణాలలో ఈ క్యాన్సర్ వస్తుంది. శరీరంలో వేగంగా వ్యాపించే క్యాన్సర్‌గా దీన్ని పరిగణిస్తారు.
బ్రెయిన్ ట్యూమర్ – గ్లియోబ్లాస్టోమా, ఆస్ట్రోసైటోమా వంటి క్యాన్సర్లు దీని కిందకే వస్తాయి. మెదడులో వివిధ కణాల నుంచి ఇది పుడుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
బ్లడ్ క్యాన్సర్ రకాలు..
బ్లాక్ క్యాన్సర్‌లో చాలా రకాలు ఉన్నాయి. అవి లుకేమియా, లింఫోమా, మల్టిపుల్ మైలోమా.
లుకేమియా: ఎముక మజ్జలో తెల్ల రక్త కణాల వృద్ధి సరిగా జరగదు. ఫలితంగా, రక్త నాళాల ద్వారా శరీరమంతా వ్యాపించే ఇమ్మెచ్యూర్ సెల్స్ అధికంగా ఉత్పత్తి అవుతాయి. ఈ వ్యాధిలో, ఎలాంటి ట్యూమర్లు కనపడకపోవచ్చు.
లింఫోమా: లింఫో నోడ్స్‌లో లింఫోసైట్లు అనియంత్రిత స్థాయిలో పెరుగుతాయి. దీనివల్ల లింఫ్ నోడ్ ట్యూమర్లు వస్తాయి.
మల్టిపుల్ మైలోమా: రోగనిరోధక వ్యవస్థకు బాధ్యతగా వ్యవహరించే ఎముక మజ్జలో ప్లాస్మా కణాలు అనియంత్రిత స్థాయిలో పెరిగి, ఎముకలను దెబ్బతీసే మైలోమా కణాలకు దారితీస్తాయి.
పీతను పోలిన వ్యాధిగా హిప్పోక్రేట్స్ అభివర్ణించడంతో మొదలైన క్యాన్సర్ ప్రయాణం, ప్రస్తుతం అత్యంత శాస్త్రీయ పరిశోధనల ద్వారా చికిత్స కనుగొనే దాకా సాగింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనలు క్యాన్సర్‌లాంటి వ్యాధులను జయించవచ్చనే ఆశను కల్పిస్తున్నాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














