టాంగ్‌తోడ్: నాగ సాధువు కాబోయేవారు పాటించే ఈ తంతు ఏంటి?

- రచయిత, వినాయక్ హొగడే
- హోదా, బీబీసీ ప్రతినిధి
''నాగ సాధువుగా మారడం అంత సులభం కాదు. దానికి ఎంతో కృషి, అంకితభావం అవసరం. గురువుకు చాలా ఏళ్లు సేవలు చేయాలి. అప్పుడే మీరు దీక్ష స్వీకరించి, నాగ సాధువు అవుతారు. కానీ, అక్కడితో అయిపోదు. దీక్ష స్వీకరించిన తర్వాత కఠినమైన తపస్సు ఆచరించాలి. నేనూ అదే మార్గాన్ని అనుసరించాలి'' అని బప్పా మండల్ అన్నారు.
పశ్చిమ బెంగాల్‌లోని అలీద్వార్‌పూర్‌కి చెందిన 32 ఏళ్ల బప్పా మండల్, ఆవాహన్ అఖాడాకు చెందిన వ్యక్తి. ఈ నెల 26న మహాకుంభమేళాలో రెండో రాజ స్నానం తర్వాత, నాగ సాధువుగా మారేందుకు ఈయన దీక్షను స్వీకరించనున్నారు.
దీక్ష స్వీకరించిన తర్వాత ఈయన పేరు కూడా మారుతుంది. ఈయన తండ్రి కూడా ఒక సాధువే. కానీ నాగ సాధువు కావాలన్న నిర్ణయం బప్పా తనంతట తానుగా తీసుకున్నారు.
ఒంటికి బూడిద పూసుకుని, నుదిటిపై గంధపు బొట్టు, కాళ్లకు ఇనుప కడియాలు, మెడలో బంతిపూల దండలు, చేతుల్లో డమరుకం లేదా శంఖం చేతబూని కనిపిస్తారు నాగ సాధువులు. గంజాయి కోసం చిలిమ్(నిప్పుల కుండ) చేతిలో ఉంటుంది.
నాగ సాధువులుగా పిలిచే ఈ వ్యక్తులు ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నారు.
అసలీ నాగ సాధువులు ఎవరు? నగ్నంగా ఎందుకుంటారు? ఎక్కడి నుంచి వస్తారు? కుంభమేళా సమయంలో భారీగా కనిపించే ఈ నాగ సాధువులు, ఆ తర్వాత అదృశ్యమైపోతారు.
మరి వాళ్లు ఎక్కడికి వెళ్తారు? నిజంగా హిమాలయాల్లోనే ఉంటారా? ఒక వ్యక్తి నాగ సాధువుగా ఎలా మారతారు? నాగ సాధువుగా మారే ప్రక్రియ ఏంటి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు మేం సమాధానాలు కనుక్కునే ప్రయత్నం చేశాం.
నాగ సాధువులుగా ఎలా మారతారనేది తెలుసుకోవడంపై చాలా మందికి ఆసక్తి ఉంటుంది. వారి జీవనం ఎలా ఉంటుంది, దీక్షా ప్రక్రియ గురించి తెలుసుకునేందుకు బప్పా మండల్‌తో పాటు ప్రయాగ్‌రాజ్‌లోని కుంభమేళాకు వచ్చిన ఇతర నాగ సాధువులతోనూ మాట్లాడాం.
అయితే, ఆ వివరాలు బయటికి చెప్పేందుకు చాలామంది నాగ సాధువులు ఇష్టపడలేదు. అది 'అంతర్గత విషయం' అని అన్నారు. కొందరు కొంత సమాచారం మాత్రమే అందించారు, పూర్తిగా చెప్పలేదు.

నాగ సాధువుల గురించి తెలుసుకోవడానికి ముందు, మొదట అఖాడాల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే, నాగ సాధువులకు ఈ అఖాడాల ఆచార వ్యవహారాలతో లోతైన సంబంధం ఉంటుంది.
అఖాడాలకు చెందని సాధువులను నకిలీలుగా పరిగణిస్తారు. అలాంటి వారిని 'ఖడియా పల్టన్'గా పిలుస్తారు.

కుంభమేళాలో అఖాడాల పాత్ర ఏమిటి?
హిందువుల్లో ప్రధానంగా రెండు సంప్రదాయాలు కనిపిస్తాయి. ఒకటి వైష్ణవ, రెండు శైవ సంప్రదాయం. వైష్ణవులు విష్ణుమూర్తిని, ఆయన అవతారాలు చెప్పే రాముడు, కృష్ణుడిని పూజిస్తారు. శైవులు శివుడిని ఆరాధిస్తారు.
అఖాడాలు కీలకంగా వ్యవహరించే భారీ ఆధ్యాత్మిక కార్యక్రమం కుంభమేళా. ఈ రెండు సంప్రదాయాలకు చెందిన దేశంలోని ఎన్నో శాఖలు, మఠాలు ఈ అఖాడాల పరిధిలోకి వస్తాయి. అఖాడా అనే పదం కుస్తీ (రెజ్లింగ్)లోనూ వింటుంటాం. రెజ్లింగ్ రింగ్, లేదా బరిని అఖాడా అంటారు.
దేశంలో మొత్తం 13 అఖాడాలు ఉన్నాయి. ప్రతి పన్నెండేళ్లకొకసారి కుంభమేళా నిర్వహించే కేంద్ర కమిటీ (సెంట్రల్ బాడీ) ఈ అఖాడాలనూ పర్యవేక్షిస్తుంటుంది. ఈ 13 అఖాడాలను మూడు విభాగాలుగా విభజించారు.
వాటిలో రెండు హిందూ మతంలోనివి (వైష్ణవ, శైవ) కాగా, మరో వర్గానికి సిక్కు మూలాలున్నాయి. వీటిని ఉదాసిన్ అఖాడాలుగా పిలుస్తారు. అందువల్ల, మొత్తం మూడు రకాల అఖాడాలు ఉన్నాయని చెప్పొచ్చు. అవి వైష్ణవ, శైవ, ఉదాసిన్.

ఈ 13 అఖాడాల్లో 7 శైవ అఖాడాలు కాగా, వైష్ణవులు, సిక్కులకు 3 చొప్పున అఖాడాలు ఉన్నాయి. మహానిర్వాణి, జునా, నిరంజని, అటల్, ఆనంద్, ఆవాహన్, అగ్ని అనేవి శైవ అఖాడాలు. ఇక నిర్వాణి, నిర్మోహి, దిగంబర్ అనేవి వైష్ణవ అఖాడాలు కాగా, బాబా ఉదాసిన్, చోటా ఉదాసిన్, నిర్మల్ అనేవి సిక్కు అఖాడాలు. మూడు రకాల అఖాడాలు ఉన్నప్పటికీ, ప్రతి దానికీ ప్రత్యేక ఆచారాలున్నాయి.
వైష్ణవ అఖాడాలకు చెందిన సాధువులను వైరాగి అంటారు. శైవ అఖాడాలకు చెందిన వారిని దశనామి లేదా సన్యాసి అని పిలుస్తారు.
శైవ అఖాడాల్లో మాత్రమే ఈ నాగ సాధువులు ఉంటారు. శైవ అఖాడాలలో ప్రాథమికమైనది ఆవాహన్ అఖాడా. ఎక్కువ మంది నాగ సాధువులు ఈ అఖాడాకు చెందినవారే.
అయితే, ఈ వాదనలను ధ్రువీకరించే రాతపూర్వక, చారిత్రక ఆధారాలు లేకపోవడంతో వివాదాలూ జరిగాయి. ప్రాథమికంగా 13 అఖాడాలు మాత్రమే ఉన్నట్లు పరిగణిస్తున్నప్పటికీ, అంతర్గత వివాదాల కారణంగా అదనపు అఖాడాలు కూడా ఏర్పాటయ్యాయి. కానీ, వాటికి పెద్దగా గుర్తింపు లేదు.

నాగ సాధువుగా మారే కచ్చితమైన క్రతువు ఏంటి?
బాబా బాలక్ గిరి 2016లో నాగ సాధువు అయ్యారు. ''మన పూర్వజన్మల మరణాలకు అంతిమ సంస్కారాలతో పాటు, పూర్వీకులను స్మరించుకుంటూ శ్రాద్ధకర్మలు నిర్వహించి, నాగ సాధువుగా కొత్త జీవితాన్ని స్వీకరించాలి.
ఆ తర్వాత మనపై ఐదు పవిత్ర కార్యాలు నిర్వహిస్తారు. ఐదుగురు గురువులు, ఒక్కొక్కరు ఒక్కో కార్యాన్ని పూర్తి చేస్తారు. ఒకరు మంత్రోపదేశం చేస్తారు, మరొకరు విభూతితో అభిషేకం చేస్తారు, మూడో గురువు తలనీలాలు సమర్పిస్తారు, నాలుగో గురువు రుద్రాక్ష మాలధారణ చేస్తారు, ఐదో గురువు మనకు లంగోటా (పవిత్రమైన వస్త్రం) అందిస్తారు.
ఆ తర్వాత, వీర్యహననం(క్యాస్ట్రేషన్) చేస్తారు'' అని బాబా బాలక్ గిరి చెప్పారు.
ఈ వీర్యహనన ప్రక్రియను వేర్వేరు నాగ సాధువులు, వేర్వేరు రకాలుగా వివరించారు. జననేంద్రియాలను దెబ్బతీయడం, లైంగిక శక్తి నిర్వీర్యం అయ్యేలా చేయడం, మరికొందరు తమ 'టాంగ్'ను విచ్ఛిన్నం చేసినట్లు చెప్పారు. అలా, దానికి 'టాంగ్‌తోడ్' వేడుకగా పేరొచ్చినట్లు వివరించారు.
ఈ ప్రక్రియను ఆవాహన్ అఖాడాకు చెందిన నాగ సాధు థానాపతి విజయ్ పురి సవివరంగా తెలియజేశారు. ఆయన సాధువు కావడం కోసం 16 ఏళ్ల వయసులో దీక్ష స్వీకరించారు.
ఈయనొక దిగంబర సాధువు, అంటే దుస్తులు ధరించని నగ్న సాధువు.
''ప్రస్తుతం కుంభమేళాలో మా అఖాడా తరఫున కార్యకలాపాలు నిర్వహించాల్సిన బాధ్యత ఉండడం వల్ల, ప్రస్తుతం కాషాయ వస్త్రాలు ధరిస్తున్నా'' అని విజయ్ పురి మాతో చెప్పారు.

థానాపతి విజయ్ పురి మాట్లాడుతూ,
''నాగ సాధువుగా మారాలంటే, మీరు కొంతకాలం సాధువుతో కలిసి జీవనం సాగించాలి. 16 పవిత్ర కర్మలు, విజయ్ హవన్ (హోమం) పూర్తి చేసి, బ్రహ్మచర్య ప్రతిజ్ఞ చేసిన తర్వాత, సాధకుడికి తెల్లటి వస్త్రాలు ఇస్తారు.
ఆ తర్వాత సాధకుడు తన గురువుకు 3,5,8, లేదా 12 ఏళ్లు సేవ చేయాలి.
గురువు సాధకుడి సామర్థ్యాలను అంచనా వేస్తారు, ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తేనే సాధకుడికి నాగ సాధువు దీక్ష లభిస్తుంది. ఆ తర్వాత 5 పవిత్ర కర్మలు నిర్వహిస్తారు.
అప్పటి నుంచి మహాపురుష్‌గా సంబోధిస్తారు. ఆ తర్వాత తన పాతజన్మలకు కుంభమేళాలో అంతిమ సంస్కారాలతో పాటు మరో 16 పవిత్ర కర్మలు పూర్తి చేస్తారు.''

ఆవాహన్ అఖాడాకు చెందిన పూజారి మహంత్ కైలాష్ పురి మాట్లాడుతూ, ''ఈ ప్రక్రియలను పూర్తి చేసిన తర్వాత, నాగ సాధువు కావాలనుకుంటున్న వ్యక్తి దిగంబర్ గురువుగా పిలిచే తన గురువును ఎంచుకోవాలి. ఆవాహన్ అఖాడా మధ్యలో జెండా ఎగరేసి, విజయ్ హవన్ (హోమం) ప్రారంభిస్తారు.
తర్వాత వృషణ హనన ప్రక్రియ (టాంగ్‌తోడ్) నిర్వహిస్తారు. సాధకుడు జెండాపై దృష్టి పెట్టాలని, భగవంతునిపైనే ధ్యాస ఉంచాలని ఆదేశిస్తారు. గురువులు మంత్రాలు చదువుతారు. సాధకుడి వీర్యహనన ప్రక్రియ పూర్తి చేస్తారు.
ఆ సమయంలో ఆయన ట్రాన్స్ లాంటి స్థితిలోకి వెళ్తారు. ఇక ఆపై వివరాలను బహిరంగంగా చెప్పలేం'' అని అన్నారు.

నాగ సాధువులుగా మారాలనుకునే వారు చేత్తో వృషణాలను తొలగించే 'టాంగ్‌తోడ్' క్రతువు పూర్తి చేసుకోవాలి. అది చాలా నొప్పితో కూడుకున్న పనే, కాకపోతే కొందరు నాగ సాధువులు దీనిని అంగీకరించరు.
నొప్పి ఎలా ఉంటుందని అడిగినప్పుడు, "అస్సలు నొప్పి ఉండదు, వాస్తవానికి అవి గురువు ఇచ్చే ఆశీస్సులు" అని కొంతమంది నాగ సాధువులు అన్నారు. అయితే, ఆవాహన్ అఖాడాకు చెందిన థానాపతి మహంత్ విజయ్ పురి 'టాంగ్‌తోడ్' ప్రక్రియ గురించి, దాని తీవ్రత గురించి వివరించారు.
''నాకు టాంగ్‌తోడ్ చేసినప్పుడు, భరించలేనంత నొప్పి పుట్టింది. నేను నా జననేంద్రియాలను పట్టుకుని నెలరోజులు ఏడ్చా. ఆ బాధ వర్ణనాతీతం.'' అన్నారాయన.
వివరాలు వెల్లడించడానికి ఇష్టపడని ఒక నాగ సాధువు బీబీసీతో మాట్లాడుతూ, ''అంత బాధ అనుభవించాల్సి వస్తుందని తెలిసివుంటే, నేను నాగ సాధువుగా మారడానికి దీక్ష స్వీకరించే వాడినే కాదు. అంత బాధాకరంగా ఉంటుంది'' అన్నారు.

'టాంగ్‌తోడ్' ఎంతవరకూ శాస్త్రీయం?
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాజీ చైర్మన్, కన్సల్టింగ్ సర్జన్ డాక్టర్ రవీంద్ర వాంఖేడ్కర్ దీని గురించి వివరించారు.
''పురుషుల జననేంద్రియాల్లో మూడు సన్నని నాళాలు ఉంటాయి. మొదటిది మూత్రనాళం. ఇది మూత్రపిండాల నుంచి మూత్రాశయానికి మూత్రం తీసుకెళ్తుంది. మిగిలిన రెండూ రక్తాన్ని సరఫరా చేస్తాయి, పురుషాంగం ఉత్తేజితం కావడంలో పాత్రపోషిస్తాయి.
ఇవి పురుషాంగానికి రక్తాన్ని సరఫరా చేస్తాయి, తద్వారా అంగస్తంభన కలుగుతుంది.
టాంగ్‌తోడ్ ప్రక్రియలో, పురుషాంగాన్ని బలవంతంగా సాగదీయడంతో, రక్తం సరఫరా చేసే రక్తనాళాలు విచ్ఛిన్నమవుతాయి. రక్త సరఫరా దెబ్బతినడంతో పురుషాంగంలో చలనం కలగదు. నాగ సాధువులు జీవితాంతం బ్రహ్మచర్మం పాటించాలని అనుకుంటారు.
ఒకవేళ లైంగిక ప్రేరణ కలిగినా పురుషాంగంలో చలనం కలగకుండా ఉండడానికి వారు టాంగ్‌తోడ్ చేస్తారు. అయితే, ఇది అమానవీయం, అనాగరికం కూడా. భరించలేనంత నొప్పి పుడుతుంది. దీర్ఘకాలంలో తీవ్రమైన పరిణామాలు కూడా ఎదుర్కొనే అవకాశముంది.'' అని అన్నారు.
సన్యాసం
నాగ సాధువుగా మారడాన్ని సవాలుగా పరిగణిస్తారు. దీక్ష స్వీకరించే ముందు కఠినమైన ఉపవాసం ఉండాలి. చాలా రోజుల పాటు లంగోట్ మాత్రమే ధరించాలి, కుటుంబాన్ని విడిచిపెట్టాలి. గత జీవితానికి సంబంధించిన అన్ని బంధాలను తెంచుకోవడం కోసం వారితో పాటు వారి తల్లిదండ్రులకు అంత్యక్రియలు కూడా చేయాలి.
ఒక్కమాటలో చెప్పాలంటే నాగ సాధువు కావాలంటే సన్యాసం స్వీకరించాలి.
కుటుంబం, స్నేహితులను విడిచిపెట్టాలి. కోరికలు, ఆనందాలను త్యజించాలి. అప్పుడే గురువు వారికి మంత్రోచ్ఛరణ చేస్తారు. కొత్త పేరు పెడతారు. వారి పాత గుర్తింపును చెరిపేసి, నాగ సాధువుగా కొత్త వ్యక్తిగా మారుస్తారు.
రచయిత, చరిత్రకారుడు సర్ జదునాథ్ సర్కార్ తన పుస్తకం 'ఎ హిస్టరీ ఆఫ్ దాశ్‌నామి నాగ సన్యాసిస్'లో ఇలా రాశారు.
"నాగ సాధువు దీక్షను స్వీకరించే వ్యక్తి రోజుకు ఒక్కసారే భోజనం చేయాలి. ఆహారం కోసం అడుక్కోవాలి. ఏడుకంటే ఎక్కువ ఇళ్లలో అడగకూడదు. నేలపై పడుకోవాలి. ఇతరులను ఎక్కువగా ప్రశంసించడం లేదా విమర్శించడం మానుకోవాలి.
సీనియర్ సన్యాసులను కలిసినప్పుడు వారికి నమస్కరించాలి. వారు దుస్తులు ధరించకూడదు. కాషాయ వస్త్రాలు కట్టుకోవచ్చు'' అని రాశారు.

దీక్ష స్వీకరించిన తర్వాత ఒక సాధువు మానవ భావోద్వేగాలు, భౌతిక వాంఛలు , ప్రాపంచిక సుఖాలను వదిలేసి సన్యాసి జీవనశైలిని అవలంబించాలని అనుకుంటారు. అయితే, వాస్తవం అందుకు భిన్నంగా ఉంది.
కుంభమేళా సమయంలో నాగ సాధువుల గురించి మేం గమనించిన విషయాలు వారి సన్యాస వాదనలకు విరుద్ధంగా ఉన్నాయి. వారు ప్రాపంచిక ఆనందాల్లో మునిగిపోయారు, స్టైలిష్ కళ్లద్దాలు ధరించారు. స్మార్ట్‌ఫోన్లు వాడుతున్నారు, లగ్జరీ కార్లలో ప్రయాణిస్తున్నారు, దుర్భాషలాడుతున్నారు. గంజాయి సేవించడం కూడా సర్వసాధారణంగా కనిపిస్తోంది.

సమావేశాలకు చాలామంది నాగ సాధువులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. దాని కోసం బెదిరిస్తున్నారు. స్నానాలకు లేదా అక్కడ ఉండడానికి కొంత స్థలం వంటి చిన్నచిన్న విషయాల కోసం కూడా తరచూ గొడవ పడుతున్నారు.
కుంభమేళా సమయంలో వివిధ అఖాడాల మధ్య విభేదాలు సర్వసాధారణంగా మారాయి. నిజానికి, నాగ సాధువుల చరిత్ర నరమేధంతో గుర్తింపు పొందింది.
ఖడియా పల్టన్ అలియాస్ నకిలీ నాగ సాధువులు
నకిలీ నాగ సాధువులపై థానాపతి మహంత్ ప్రశాంత్ గిరి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీబీసీతో ఆయన మాట్లాడుతూ
"కుంభమేళాలో చాలామంది నకిలీ నాగ సాధువులు తిరుగుతున్నారు. కుంభమేళాలో ఇలాంటి మోసగాళ్లు చాలామంది ఉన్నారు. ఆధ్యాత్మికత పేరుతో డబ్బు సంపాదించడానికే ఇక్కడికి వచ్చారు. దీక్ష తీసుకున్న వారు, అఖాడాల సర్టిఫికెట్ ఉన్నవారు మాత్రమే నిజమైన నాగ సాధువులు. నకిలీ నాగ సాధువుల దగ్గర ఇవి ఉండవు.
నిజమైన, నకిలీ నాగ సాధువుల మధ్య తేడాను సామాన్యులు గుర్తించలేరు. ఎందుకంటే, నకిలీ వ్యక్తులు నిజమైన సాధువుల మాదిరే దుస్తులు ధరిస్తారు, స్టైల్‌గా ప్రవర్తిస్తారు. ఖడియా పల్టన్ అని పిలుచుకునే ఈ నకిలీ నాగ సాధువులు.. గురువు నుంచి దీక్ష పొందలేదు. ఏ అఖాడా సభ్యులు కాదు'' అని అన్నారు.

మహంత్ ప్రశాంత్ గిరి వాదనకు 'ఆసెటిక్ జెమ్స్: సాధూస్, అఖాడాస్, మేకింగ్ ఆఫ్ హిందూ ఓట్' పుస్తకంలో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ధీరేంద్ర ఝా భిన్నమైన కోణాన్ని ఆవిష్కరించారు.
ఆ పుస్తకంలో "కుంభమేళా వంటి ప్రధాన కార్యక్రమంలో పవిత్ర స్నానం సమయంలో అఖాడాలు తమ బలం, ప్రాభవాన్ని ప్రదర్శించడం లక్ష్యంగా పెట్టుకుంటాయి. దీని కోసం ప్రత్యర్థి అఖాడాల కంటే ఎక్కువ మందిని చూపించుకోవడం కోసం నకిలీ నాగ సాధువులను నియమించుకుంటాయి.
ఈ అఖాడాలు తమ తరపున నాగ సాధువులుగా నటించడానికి యాచకులు, ఇతరులకు డబ్బు చెల్లిస్తాయి. ఈ నకిలీ నాగ సాధువుల్లో చాలామంది కుంభమేళాకు భిక్షాటన కోసం వచ్చే యాచకులే. అఖాడాలే వారిని నాగ సాధువులుగా ప్రకటించుకుంటాయి'' అని తెలిపారు.
నిజమైన నాగ సాధువులను ఒక పరీక్ష ద్వారా గుర్తించవచ్చని ధీరేంద్ర ఝా చెప్పారు.
"దీక్ష చేసిన నాగ సాధువు పురుషాంగం శాశ్వతంగా క్రియారహితంగా లేదా మృదువుగా మారుతుంది. ఇది నిజమైన నాగ సాధువు కచ్చితమైన సంకేతం'' అని పుస్తకంలో రాశారు.
నాగ సాధువులు ఎక్కడుంటారు?
జర్నలిస్ట్ దీప్తి రౌత్ తన పుస్తకం 'కుంభమేళా: ఎ పెర్స్పెక్టివ్'లో.. "నాగ సాధువులు దీక్ష తీసుకున్న తర్వాత అన్ని సంబంధాలను త్యజించాలనే కఠినమైన నిబంధనలను అనుసరిస్తారని చెబుతారు. కానీ, మునుపటిలా చాలామంది ఈ నియమాలకు కట్టుబడి ఉండరని ఇప్పుడు తెలిసింది. చాలామంది ఆధునిక నాగ సాధువులు తమ కుటుంబాలతో అడపాదడపా సంబంధాలు కొనసాగిస్తున్నారు. అందువల్ల, నాగ సాధువు గుర్తింపు ఆచారాలు చెప్పినంత కఠినంగా ఉండవు'' అని తెలిపారు.
త్వరలో నాగ సాధువు కాబోతున్న బప్పా మండల్‌కి మేం ఈ ప్రశ్న వేశాం.
బప్పా మాట్లాడుతూ "నేను నా తల్లిదండ్రులను కలవను, కానీ వారు నన్ను కలవడానికి వస్తే, కలుస్తాను" అన్నారు.

"కుంభమేళా లేదా ఇలాంటి ఆధ్మాత్మిక కార్యక్రమాలు లేనప్పుడు మేం హిమాలయాల్లో ఉంటాం, తపస్సు చేస్తాం" అని కొంతమంది నాగ సాధువులు తెలిపారు.
"కుంభమేళా లేనప్పుడు చాలామంది సాధువులు లక్ష్యం లేకుండా తిరుగుతారు. కొందరు తమ అఖాడాల ఆశ్రమాలలో ఉంటారు'' అని ఆవాహన్ అఖాడాకు చెందిన థానాపతి మహంత్ విజయ్ పురి అన్నారు.
అసలీ నాగ సాధువులు ఎవరు?
సనాతన ధర్మాన్ని కాపాడడానికి, నిలబెట్టడానికి నాగ సాధువులు పోరాడారని పూర్వీకులు చెబుతుంటారు. అయితే, విద్యావంతులైన చరిత్రకారులు ఈ వాదనలతో పూర్తిగా ఏకీభవించడం లేదు.
చరిత్రను పరిశీలిస్తే.. నాగ సాధువులు ఆయుధాలతో తిరిగారు. ఈ ఆయుధాలు వారి దగ్గరికి ఎప్పుడు వచ్చాయో చరిత్ర పుస్తకాలు సరిగ్గా పేర్కొనలేదు. అయితే, ఆర్థిక కార్యకలాపాలపై నియంత్రణ సాధించేందుకు అధికారంలో ఉన్న వారితో నాగ సాధువులు వ్యూహాత్మకంగా మంచి సంబంధాలను కొనసాగించారని సూచించే అనేక కథనాలు ఉన్నాయి.
చరిత్ర ప్రకారం ఒకానొక సమయంలో నాగ సాధువులు యోధులైన సన్యాసులు. మొఘల్ శకం నుంచి రాజ్‌పుత్‌ల పాలన వరకు, వారు అధికారంలో ఉన్నవారికి సేవలందించారు. పాలకులు వారికి ఆర్థిక ప్రయోజనాలను అందించగలరు.
నాగ సాధువులు వారికి అదనపు సైన్యాలుగా వ్యవహరించారు. వారి సేవలకు బదులుగా రాజుల నుంచి జీతాలు, భూమి వంటి వాటిని స్వీకరించారు.
నాగ సాధువులను శిక్షణ పొందిన రిజర్వ్ ప్లాటూన్లుగా చరిత్రకారులు అభివర్ణించారు.
ఆనంద్ భట్టాచార్య తన పుస్తకంలో "కొంతమంది గిరి గోసవిలు (ఒక రకమైన నాగ సాధువులు) తమ రిజర్వ్ ప్లాటూన్‌లను సమీకరించి, డబ్బు తీసుకొని పాలకుల కోసం యుద్ధాలు చేశారు. వారు అవధ్ నవాబ్, భరత్‌పూర్ జాట్ రాజు, బనారస్ రాజు, బుందేల్‌ఖండ్ రాజు, మరాఠా రాజు మాధవ్ జీ సింధియా, జైపూర్, జైసల్మేర్ రాజులకు సేవలందించారు.

దీప్తి రౌత్ తన పుస్తకంలో "అఖాడాకు తనను పూర్తిగా అంకితం చేసి, మతం కోసం పోరాడే యోధులు నాగ సాధువులు. ఎప్పుడూ బూడిద రాసుకొని, నగ్నంగా, ఆయుధాలు చేతబూని కనిపించడం మిస్టరీగా అనిపిస్తుంది, ఉత్సుకత కలుగుతుంది. అయితే, వారు పైకి కనిపించే దానికంటే కాస్త ఎక్కువే.'' అని తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














