మీ చేతిలోని మొబైల్ ఫోన్‌కు, కాంగోలో అంతర్యుద్ధానికి లింకు ఉందా?

కాంగో అంతర్యుద్ధం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, టాంటాలమ్ స్మా ర్ట్‌ఫోన్‌లు సమర్థవంతంగా పనిచేసేందుకు ఉపయోగపడుతుంది.
    • రచయిత, డేమియన్ జేన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మొబైల్ ఫోన్‌లో ఉండే ఓ పదార్థానికి, కాంగో అంతర్యుద్ధంతో సంబంధముంది. అందుకే మనం స్మార్ట్ ఫోన్‌లు వాడటం వల్ల కాంగోలో తిరుగుబాటుదారులకు నిధులు అందుతున్నాయన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

అసలు కల్లోలిత కాంగోకు, మన చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్లకు లింకేంటి?

ఫోన్‌లు సమర్థవంతంగా పనిచేసేలా చేయగల ఓ లోహం తిరుగుబాటుదారులకు ఆదాయవనరుగా ఎలా మారుతుంది?

డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో తిరుగుబాటుదారులు ఏం చేస్తున్నారు?

కాంగో అంతర్యుద్ధం

ఫొటో సోర్స్, Monusco

ఫొటో క్యాప్షన్, కోల్టన్ వెలికితీత ఎలా ఉంటుందో 2014లో తీసిన ఫోటోలో చూడొచ్చు.

కల్లోలిత కాంగో నుంచి మొబైల్ ఫోన్లలోకి లోహం ఎలా చేరుతోంది?

చాలా మొబైల్ ఫోన్‌లో కొద్ది పరిమాణంలో ఓ లోహం ఉంటుంది. ఆ లోహం పేరు టాంటాలమ్. దీని ప్రయాణం ఎక్కడ మొదలవుతుందంటే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో తూర్పు ప్రాంతంలోని భూమి పొరల నుంచి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో అంతర్యుద్ధం జరుగుతోంది.

ఎం23 అనే తిరుగుబాటు సంస్థకూ, డీఆర్ కాంగోలో జరుగుతున్న అంతర్యుద్ధానికి సంబంధం ఉంది. కాంగోలో యుద్ధం గురించి ప్రపంచవ్యాప్తంగా వార్తలొస్తున్నాయి.

మన ఫోన్‌లో ఉండే టాంటాలమ్ బరువు ఎంత ఉంటుందంటే...బఠానీ గింజ బరువులో సగంకన్నా తక్కువ. ఇంత తక్కువ పరిమాణంలో ఉన్నప్పటికీ స్మార్ట్ ఫోన్ బాగా పని చేయడానికి ఇది తప్పనిసరి. ఫోన్‌లోనే కాదు..దాదాపు అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలకూ దీని అవసరం ఉంటుంది.

ఇది అరుదైన లోహం. బ్లూ-గ్రే రంగులో ఉంటుంది. మెరుస్తుంటుంది. అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోగలదు. తాత్కాలికంగా ఎనర్జీ నిల్వ చేసే చిన్న కెపాసిటర్లను అనేక రకాల ఉష్ణోగ్రతల్లో ఆపరేట్ చేసేటప్పుడు ఈ లోహం చాలా ఉపయోగపడుతుంది.

రువాండా, బ్రెజిల్, నైజీరియాలో కూడా ఈ లోహం దొరుకుతుంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా సరఫరా అవుతున్న మొత్తం టాంటాలమ్ పరిమాణంలో 40శాతం కన్నా ఎక్కువ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో నుంచే వస్తోంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
కాంగో అంతర్యుద్ధం

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, కోల్టన్ గనుల నుంచి వచ్చే ఆదాయాన్ని తిరుగుబాటు దళాల కోసం ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

ఎం23 గ్రూప్ రెబల్స్‌కు ప్రధాన ఆదాయవనరు

డీఆర్ కాంగోలో ప్రస్తుత పోరాటం చాలా నెలల నుంచి సాగుతోంది. అయితే గోబాలోని రవాణా, వాణిజ్య హబ్‌పై గత ఆదివారం తిరుబాటుదారులు చేసిన దాడి తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఈ పోరాటం చర్చనీయాంశమయింది. రువాండాకు సరిహద్దుల్లో ఉండే గోబా ప్రాంతం మైనింగ్ వ్యాపారానికి రీజినల్ సెంటర్‌.

అపార ఖనిజ నిక్షేపాలకు నిలయమైన డీఆర్ కాంగో తూర్పు ప్రాంతంపై గత ఏడాదిగా ఎం23 పట్టు సాధిస్తోంది. కోల్టాన్ అనే ఖనిజం దొరికే ప్రాంతాలను ఎం23 ఆధీనంలోకి తీసుకుంది. టాంటలమ్‌ను సేకరించేది కోల్టాన్ ముడిపదార్థం నుంచే.

అనేక ఇతర సాయుధ దళాలలాగే, ప్రమాదంలో పడిన ఓ జాతి హక్కులను పరిరక్షించే పేరుతో ఎం23 ప్రారంభమైంది. అయితే ఆ గ్రూప్ ఆక్రమించుకునే భూభాగం పెరుగుతున్నకొద్దీ, వారికి మైనింగ్ ప్రధాన ఆదాయవనరుగా మారింది. పోరాటంలో పనిచేస్తున్నవారికి జీతాలకు, ఆయుధాలకు ఇదే ప్రధాన వనరు.

దేశంలో కోల్టాన్ పరిశ్రమకు ప్రధానకేంద్రమైన రుబాయాను గత ఏడాది ఏప్రిల్‌లో ఎం23 రెబల్స్ స్వాధీనం చేసుకున్నారు.

కాంగో అంతర్యుద్ధం

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, ఖనిజం వెలికి తీసేవారికి ఎం23 రెబల్స్ గ్రూప్ వేతనాలు పెంచింది.

ఖనిజాలకు నిలయమైన ప్రాంతంపై రెబల్స్ పట్టు

ఈ ప్రాంతంలో ఖనిజాల వెలికితీత బహుళజాతి కంపెనీల చేతుల్లో లేదు. వేలమంది భూమిని తవ్వి ఖనిజాన్ని బయటకు తీస్తుంటారు. ఏ మాత్రం సురక్షితం కాని పద్ధతుల్లో ఇది జరుగుతుంటుంది. వాళ్లు పనిచేసేచోట ఎలాంటి భద్రత లేదు. అనధికారికంగానే ఖనిజం వెలికితీత సాగుతుంటుంది.

రుబాయాను ఆక్రమించుకున్నతర్వాత తవ్వకాలు జరిపేవారికి, వ్యాపారులకు ఎం23 అనుమతులిచ్చింది. తవ్వినందుకు 25 డాలర్లు, అమ్మినందుకు 250 డాలర్లు వార్షిక ఫీజు చెల్లించాలని డిమాండ్ చేసింది. తవ్వకాలు జరిపేవారు తమ పని కొనసాగించేందుకు వీలుగా ఎం23 వారి వేతనాలను రెట్టింపు చేసింది.

రుబాయాలో రెబల్స్ సమాంతర ప్రభుత్వాన్ని నడిపిస్తుంటారు. అక్కడ ప్రభుత్వ యంత్రాంగం తరహా వ్యవస్థ ఉందని ఐక్యరాజ్యసమితి నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఆ ప్రాంతంపై ఎం23 రెబల్స్‌దే ఏకఛత్రాధిపత్యం. అక్రమంగా తవ్వకాలు జరిపితే అరెస్టు చేయడం లేదా నిర్బంధించడం వంటివి జరుగుతాయి. అందువల్ల అధికారికంగా ఎం23 నుంచి అనుమతులు ఉన్న వారే ఇక్కడ వ్యాపారం చేయగలరు.

రువాండా, డీఆర్ కాంగో, మొబైల్ ఫోన్

ఫొటో సోర్స్, EPA-EFE/REX/Shutterstock

రెబల్స్‌కు రువాండా మద్దతు

ఒక కేజీ కొల్టాన్‌కు 7 డాలర్ల లెవీ కూడా వసూలు చేస్తోంది ఎం23 గ్రూప్. రుబాయాలో కొల్టాన్‌పై విధించే పన్ను ద్వారా ఈ గ్రూప్ నెలకు 8 లక్షల డాలర్లు సంపాదిస్తోందని ఐక్యరాజ్య సమితి నిపుణుల బృందం అంచనా వేసింది. తిరుగుబాటుకు నిధులు సమకూర్చడం కోసమే ఆ డబ్బును ఉపయోగిస్తోంది.

ఎం23 నియంత్రణలో ఉన్న ప్రాంతాల నుంచి సేకరించిన ఖనిజం గ్లోబల్ సరఫరా చైన్‌లోకి ఎలా చేరుతోందన్నది ప్రధానంగా తలెత్తే ప్రశ్న.

పొరుగుదేశం రువాండా ఎం23కి మద్దతుగా ఉందన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఈ ప్రశ్నకు ఇదే సమాధానమని ఐక్యరాజ్యసమితి నిపుణులు అంటున్నారు.

ఇన్నోవేటివ్ టిన్ సప్లై చైన్ ఇనీషియేటివ్(ఐటీఎస్‌సీఐ) ప్రకారం ఫోన్ హ్యాండ్ సెట్, ఇతర ఎలక్ట్రానిక్స్‌లో ఉండే పదార్థాలు సంక్షోభిత ప్రాంతాలనుంచి రాకూడదు.

అణిచివేతకు పాల్పడే సాయుధ సంస్థలకు ఈ అమ్మకాలు నిధులు సమకూర్చే అవకాశం ఉంటుందని భావిస్తారు.

టిన్, టాంటలమ్, టంగస్టన్, బంగారం వంటి ఖనిజాలు, హింసకు నిధులు సమకూర్చేవిగా ఉండకూడదని 2010లో ఆమోదం పొందిన అమెరికా డోడ్-ఫ్రాంక్ చట్టం, ఈయూ చట్టాలు చెబుతున్నాయి.

అయితే, అనేక చిన్నస్థాయి గనులు వేర్వేరుచోట్ల ఉండడం వల్ల స్థానిక అధికారులకు ప్రతిచోటా కచ్చితంగా ఏం జరుగుతోందో పరిశీలించడం కష్టంగా ఉంటుందని స్వతంత్ర పరిశోధన సంస్థ ఐపిస్ గ్రూప్‌కు చెందిన భద్రత, వనరుల నిర్వహణా నిపుణులు కెన్ మత్థిసెన్ తెలిపారు.

రువాండా, డీఆర్ కాంగో, మొబైల్ ఫోన్

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, డీఆర్ కాంగోలో అంతర్యుద్ధం కారణంగా వలసపోతున్న ప్రజలు (ఫైల్ ఫోటో)

స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఏమంటున్నాయి?

రువాండా విధానాలను ప్రభుత్వ ప్రతినిధి యొలండె మకోలో గట్టిగా సమర్థించుకున్నారు. తమ దేశంలో ఖనిజాలు ఎక్కువగా ఉన్నాయని, వాటిని శుద్ది చేసే సామర్థ్యమూ ఉందని బీబీసీతో చెప్పారు.

''వేధింపులకు గురైన కమ్యూనిటీ తూర్పు డీఆర్‌సీలో తమ హక్కుల కోసం పోరాడుతోంది. ఆ విషయం పట్టించుకోకుండా వారు పొందే లాభం గురించి మాట్లాడుకునేలా సమస్యను పక్కదారి పట్టిస్తున్నారు. ఇది మంచిది కాదు'' అని ఆమె అన్నారు.

ఐక్యరాజ్యసమితి నిపుణులు నివేదికల ఆరోపణలను రువాండా అధ్యక్షుడు పాల్ కగామె కూడా తోసిపుచ్చారు.

తూర్పు డీఆర్ కాంగోలో చాలా ప్రాంతం చాలా ఏళ్లగా సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతోంది. ఆ సంక్షోభాలనుంచి ఎవరు లబ్ది పొందారు, అక్కడి భూమి నుంచి వెలికితీసేదానితో సాయుధ బలగాలు లాభపడ్డాయా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

స్మార్ట్‌ఫోన్‌తో ఈ అంశం ముడిపడి ఉండడాన్ని అందరి దృష్టికీ తీసుకెళ్లేందుకు కాంగో ప్రభుత్వం ఫ్రాన్స్, బెల్జియంలో గత ఏడాది చివర్లో ఫిర్యాదులు చేసింది. టెక్ దిగ్గజం యాపిల్, సంక్షోభ ప్రాంతాల నుంచి రవాణా అవుతున్న ఖనిజాలను ఉపయోగిస్తోందని డీఆర్ కాంగో ప్రభుత్వం ఆరోపించింది.

ఈ ఆరోపణలను యాపిల్ తోసిపుచ్చింది. 2024 ప్రారంభం నుంచి టాంటాలమ్‌తో పాటు డీఆర్ కాంగో, రువాండా నుంచి ఇతర ఖనిజానలు ఉపయోగించడం నిలిపివేశామని తెలిపింది. సంక్షోభ పరిస్థితులు, సర్టిఫికేషన్‌లో తలెత్తుతున్న ఇబ్బందుల దృష్ట్యా ఇలా చేస్తున్నామని తెలిపింది.

ఇతర కంపెనీల్లో దీనిపై ఎలాంటి స్పష్టతా లేదు. మరోవైపు ఎం23 మరిన్ని భూభాగాలను స్వాధీనం చేసుకుంటోంది. అంటే టాంటలమ్ వారు నియంత్రించే గనుల నుంచి మనం వాడే ఎలక్ట్రానిక్ వస్తువుల్లోకి ఇప్పటికీ ప్రవేశించే అవకాశం ఉందన్నమాట.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)