గోమా: విలువైన నిక్షేపాలున్న ఈ నగరంలో ఏం జరుగుతోంది?

డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, గోమా, రువాండా

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, గోమా ప్రాంతంలో M23 రెబల్స్‌కు, కాంగో సాయుధ బలగాల మధ్య ఘర్షణలతో ప్రజలు ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు.
    • రచయిత, కెయిన్ పియెరి
    • హోదా, బీబీసీ వరల్డ్ న్యూస్

డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (డీఆర్ కాంగో)లో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఘర్షణలకు తూర్పుప్రాంతంలోని గోమా నగరం మరోసారి కేంద్రంగా మారింది. ఈ ప్రాంతంలో కాంగో సైన్యానికి, సాయుధ గ్రూపు అయిన M23 మధ్య జరుగుతున్న ఘర్షణలు తీవ్రమయ్యాయి.

ఘర్షణల కారణంగా ఈ ఏడాది ఆరంభం నుంచి, దాదాపు 4,00,000 మందికి పైగా ప్రజలు తమ ఇళ్లను వదిలి వెళ్లిపోవాల్సి వచ్చింది.

అసలు ఈ గోమా నగరం ఎందుకంత కీలకం, ప్రాంతీయ రాజధాని అయిన ఈ నగరంపై పట్టు కోసం ఎందుకంత పోటీ?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఏమిటీ M23

అనాదిగా హింసకు, వివక్షకు గురవుతున్నట్లు చెబుతున్న టుట్సీ ప్రజల రక్షణ కోసమంటూ దశాబ్దం కిందట కాంగో సైన్యం నుంచి చీలిపోయిన సాయుధ సమూహమే M23. ఈ గ్రూపుకి పొరుగు దేశం రువాండా మద్దతు ఇస్తోందని ఐక్యరాజ్యసమితి నిపుణులు చెబుతున్నారు, కానీ రువాండా ప్రభుత్వం ఆ వాదనలను తిరస్కరిస్తూ వస్తోంది.

సంప్రదాయ టుట్సీలు, ఆధునిక హుటు ప్రజలపై 1994లో రువాండాలో జరిగిన మారణహోమానికి కారణమైన కొంతమందితో కాంగో అధికారవర్గాలు కలిసి పనిచేస్తున్నాయని గతంలో రువాండా చెప్పింది.

2012లో గోమా నగరాన్ని రెబల్స్ ఆక్రమించుకున్నారు, కానీ అంతర్జాతీయ ఒత్తిడి కారణంగా పది రోజుల తర్వాత వెనక్కితగ్గారు.

తదనంతర పరిణామాలలో, మల్టీనేషనల్ ఫోర్స్ మద్దతు కలిగిన కాంగో సైన్యం చేతిలో M23 గ్రూపు భారీ ఓటములను చవిచూసింది, దేశ బహిష్కరణకు గురైంది. టుట్సీలకు రక్షణ కల్పిస్తామనే హామీతో తిరిగి సైన్యంలో విలీనమయ్యేందుకు M23 రెబల్స్ అంగీకరించారు.

అయితే, ఆ హామీలను గాలికొదిలేశారంటూ 2021లో M23 మళ్లీ ఆయుధాలు చేతబట్టింది.

తూర్పు కాంగోలోని చాలా ప్రాంతాలోను నియంత్రణలోకి తీసుకుంది. ఈ ప్రాంతంలో M23 గ్రూపుతో పాటు రువాండాకి చెందిన 4వేల మంది సైనికులు ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి నిపుణులు చెబుతున్నారు.

కాంగో, గోమా, M23 రెబల్స్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, 2012 నవంబర్‌లో గోమాను స్వాధీనం చేసుకున్న తర్వాత ట్రక్కులో తిరుగుతూ నగరంలో M23 రెబల్స్ గస్తీ

కీలకప్రాంతంలో గోమా

రువాండా సరిహద్దులో, కివు సరస్సుకి ఉత్తరం వైపున ఉండే గోమా నగరం రాజకీయంగా, వాణిజ్యపరంగా చాలా కీలకం.

పది లక్షలకు పైగా జనాభా ఉన్న ఈ నగరం, కాంగోలో అత్యధిక జనాభా కలిగిన ప్రధాన నగరాల్లో ఒకటి. అగ్నిపర్వతాలు, సారవంతమైన నేలలున్న ఈ ప్రాంతం పొరుగునే ఉన్న రువాండాతో చరిత్రాత్మక వాణిజ్య కేంద్రంగా ఉంది.

అంతర్జాతీయంగా ఎంతో డిమాండ్ ఉన్న బంగారం, టిన్, కోబాల్ట్, కోల్టాన్ వంటి లోహాలు, ఖనిజాలు ఉత్పత్తయ్యే ప్రధాన మైనింగ్ ప్రాంతాలకు దగ్గర్లో గోమా నగరం ఉంటుంది. రోడ్డు, వాయు రవాణా సదుపాయాలున్నాయి. ఇక్కడ ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక శిబిరం ఉండడంతో వాణిజ్య కార్యకలాపాలకు, అంతర్జాతీయ సంస్థలు రావడానికి, దౌత్య కార్యాలయాల ఏర్పాటుకు అనుకూలంగా మారింది.

కాంగో, గోమా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రెబల్స్ చొచ్చుకొస్తుండడంతో తూర్పు ప్రాంతంలోని చిన్నచిన్న గ్రామాలకు చెందిన వేలాది మంది ఇళ్లను వదిలేసి తరలివెళ్తున్నారు

ఖనిజ సంపద

మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, అనేకా రకాల ఇ - సిగరెట్లలో వాడే లిథియం - అయాన్ బ్యాటరీల తయారీలో కీలకమైన కోబాల్ట్ ఇక్కడ విరివిగా దొరుకుతుంది. ప్రపంచంలోని కోబాల్ట్ నిల్వల్లో 70 శాతం డీఆర్ కాంగోలోనే ఉన్నట్లు అంచనా.

గ్రీన్‌హౌస్ ఉద్గారాలను తగ్గించడం కోసం శిలాజ ఇంధన వినియోగ నియంత్రణకు ప్రపంచ దేశాలు కట్టుబడి ఉండడంతో, క్లీన్ ఎనర్జీ సోర్సెస్‌కు డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది.

అయితే, డీఆర్ కాంగోలో తలెత్తిన ఈ కొత్త యుద్ధం ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసును దెబ్బతీయడంతో పాటు టెక్నాలజీ, క్లీన్ఎనర్జీ పరిశ్రమలలో ధరల పెరుగుదలకు, ఖనిజాల కొరతకు కారణమయ్యే అవకాశముంది.

కాంగో, గోమా, ఆఫ్రికా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఈ ఘర్షణలు ప్రాంతీయ యుద్ధంగా మారే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది.

గోమా చేజారితే..

''గోమా ఎప్పటికీ చేజారదు'' అని 2023లో కాంగో అధ్యక్షులు ఫీలిక్స్ తిషెకడి అన్నారు. గోమాను రెబల్స్ చేతికి చిక్కనివ్వబోమనేది కాంగో ప్రజలకు ఆయన ఇచ్చిన ప్రధాన హామీల్లో ఒకటి. అంటే, గోమా చేజారడం రాజకీయంగా తనకూ నష్టమేనని దానర్థం.

పొరుగు దేశమైన రువాండాతో డీఆర్ కాంగో అన్ని సంబంధాలను తెంచుకుంది. ప్రస్తుత ఘర్షణలు ప్రాంతీయ యుద్ధంగా మారే ప్రమాదం పొంచివుందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ హెచ్చరించారు.

M23 రెబల్స్ చొచ్చుకొస్తుండడంతో తూర్పు ప్రాంతంలోని చిన్నచిన్న గ్రామాలకు చెందిన వేలాది మంది ఇళ్లను వదిలేసి, గోమా సమీపంలోని ఆస్పత్రులకు వెళుతుండటంతో అవి కిటకిటలాడుతున్నాయి.

రెబల్స్‌తో కాంగో సైన్యం పోరాటం కారణంగా, సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు పెరుగుతున్నాయని హ్యూమన్ రైట్స్ వాచ్ హెచ్చరించింది. ఇరువర్గాలు సామాన్యులపై దాష్టీకాలకు పాల్పడుతున్నాయని ఆరోపించింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)