యాపిల్‌ కంపెనీపై కాంగో దేశం ఎందుకు కేసు పెట్టింది?

కాంగోలో ఖనిజాలు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, డిఆర్ కాంగోలోని విలువైన ఖనిజ సంపద సంవత్సరాల తరబడి సంఘర్షణకు కారణమవుతోంది.
    • రచయిత, విల్ రాస్, డామియన్ జేన్
    • హోదా, బీబీసీ న్యూస్

యాపిల్ కంపెనీ అనుబంధ సంస్థలు 'కాన్‌ఫ్లిక్ట్ మినరల్స్' వాడుతున్నాయంటూ ఫ్రాన్స్, బెల్జియం దేశాలలో డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో క్రిమినల్ ఫిర్యాదులు దాఖలు చేసింది. తూర్పు డీఆర్ కాంగోలోని సాయుధ గ్రూపుల ఆధీనంలోని గనులలో ఈ ఖనిజాలు ఉన్నాయి.

ఈ సాయుధ గ్రూపులు చేస్తున్న నేరాలలో యాపిల్‌కు పాక్షిక బాధ్యత ఉందని కాంగో ప్రభుత్వం తరపు న్యాయవాదులు ఆరోపించారు.

యాపిల్ ఈ ఆరోపణలను ఖండించింది. కాగా, దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఈ ఆధారాలు సరిపోతాయో లేదో ఫ్రాన్స్, బెల్జియంలోని అధికారులు పరిశీలించనున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఏమిటీ ఖనిజాలు?

కాన్‌ఫ్లిక్ట్ మినరల్స్ (ఖనిజాలు) అంటే టిన్, టాంటాలమ్, టంగ్‌స్టన్‌, గోల్డ్.. వీటిని 3టీజీ మినరల్స్ అని పిలుస్తారు. వీటిని స్మార్ట్‌ఫోన్‌, ఇయర్‌ఫోన్‌, కంప్యూటర్‌ ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలలో వాడుతుంటారు. ఈ 3టీజీ ఖనిజాలకు కాంగో నిలయంగా ఉంది.

కాంగో తూర్పు ప్రాంతంలో ఈ గనులు ఉన్నాయి. ఈ ఖనిజాల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్ కారణంగా కాంగో- పొరుగున ఉన్న రువాండా మధ్య ఘర్షణ తలెత్తింది.

కాంగో న్యాయవాదులు విడుదల చేసిన ప్రకటనలో.. యాపిల్ సప్లై చెయిన్‌లో 'బ్లడ్ మినరల్స్' (అసాంఘిక శక్తులకు నేరాలు చేయడానికి ఈ ఖనిజాల ద్వారా అందే నిధులు) ఉన్నాయని తెలిపారు.

సాయుధ గ్రూపుల అధీనంలోని గనుల నుంచి టిన్, టాంటాలమ్, టంగ్‌స్టన్‌లను సేకరించి "అంతర్జాతీయ సప్లై చెయిన్‌ ద్వారా తరలిస్తున్నారు" అని న్యాయవాదులు ఆరోపిస్తున్నారు.

"ఈ చర్యలు మిలీషియా, టెర్రరిస్టు గ్రూపులకు నిధులు సమకూర్చడం ద్వారా మరింత హింస, సంఘర్షణకు కారణమయ్యాయి. అదే సమయంలో పిల్లలను బలవంతంగా కార్మికులుగా మార్చడం, పర్యావరణ వినాశనానికి దారితీశాయి" అని ఆ ప్రకటనలో తెలిపారు.

యాపిల్

ఫొటో సోర్స్, Getty Images

యాపిల్ ఏం చెప్పింది?

కాంగో ఆరోపణలను యాపిల్ సంస్థ ఖండించింది. తన ఖనిజాల సరఫరాదారులకు అత్యున్నత పారిశ్రామిక ప్రమాణాలున్నాయని పేర్కొంది.

"ఈ సంవత్సరం ప్రారంభంలో సదరు ప్రాంతంలో ఘర్షణలు పెరగడంతో కాంగో, రువాండా నుంచి వచ్చే టిన్, టాంటాలమ్, టంగ్‌స్టన్, బంగారం తీసుకోవద్దని మా సరఫరాదారులకు, ఖనిజాల శుద్ధిదారులకు తెలియజేశాం " అని యాపిల్ ప్రతినిధి ఒకరు బీబీసీకి చెప్పారు.

కాంగో తూర్పు ప్రాంతంలో ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. వాటికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉండటం దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో యుద్ధాలకు దారితీసింది.

చట్టబద్ధమైన గనులతోపాటు సాయుధ గ్రూపుల అధీనంలో ఉన్న గనుల నుంచి పెద్ద మొత్తంలో ఖనిజాలు పొరుగున ఉన్న రువాండాకు రవాణా అవుతున్నాయని, తరువాత అవి మన ఫోన్లు, కంప్యూటర్లలో చేరుతున్నాయని హక్కుల సంఘాలు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నాయి.

యాపిల్‌పై కాంగో ప్రభుత్వ చర్యలను గతంలో మీడియా స్టంట్‌గా పేర్కొన్న రువాండా యాపిల్‌‌కు ఖనిజాలు విక్రయించడం లేదని స్పష్టం చేసింది.

యూరో, అమెరికా చట్టాలు

ప్రజలను నిర్భంధ కూలీలుగా మార్చడానికి ఈ 'కాన్‌ఫ్లిక్ట్ మినరల్స్' సరఫరా కారణమవుతోందని యూరోపియన్ కమిషన్ వెబ్‌సైట్ తెలిపింది. ఈ ఖనిజాలను కేవలం చట్టబద్ధమైన గనుల నుంచే తీసుకోవాలని సూచించింది.

'కాన్‌ఫ్లిక్ట్ మినరల్స్' సరఫరా నియంత్రణ కోసం 2021 జనవరి 1న యూరోపియన్ యూనియన్ అంతటా ఒక నియంత్రణను కూడా తీసుకొచ్చింది.

అయితే, ఈయూ తన నియంత్రణను టిన్, టాంటాలమ్, టంగ్‌స్టన్, బంగారం వరకు మాత్రమే పరిమితం చేసింది. ఎందుకంటే ఈ నాలుగు ఖనిజాలే తరచుగా సాయుధ-సంఘర్షణలు, మానవ హక్కుల ఉల్లంఘనలతో ముడిపడి ఉంటున్నాయి.

ఈ ఖనిజాల వాణిజ్యాన్ని నిరోధించడంలో సహాయపడటానికి పలు నియమాలను కూడా రూపొందించారు.

పరిశ్రమ, పౌర సమాజం, ఇతర ప్రభుత్వాల సహకారంతో 35 అభివృద్ధి చెందిన దేశాల సమూహం అయిన ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (ఓఈసీడీ) నిపుణులు వీటిని రూపొందించారు. ఈ ఖనిజాలపై అమెరికా కూడా చట్టం చేసింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)