జీబీఎస్: పక్షవాతానికి గురిచేసే ఈ వ్యాధి ఏంటి, భారత్‌లో విజృంభణకు కారణాలేంటి?

గీయాన్ బార్ సిండ్రోమ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత్‌లో జీబీఎస్ మహమ్మారి అంతకుముందు కూడా వ్యాపించింది. ఉత్తర భారతంలో ఈ వ్యాధితో 2019లో ఒక పాప చనిపోయింది.
    • రచయిత, సౌతిక్ బిశ్వాస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

పుణేలోని ఒక పాఠశాల అధ్యాపకురాలు కిందటి నెల తన ఆరేళ్ల కొడుకు హోమ్‌వర్క్ చేయడంలో ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించారు.

''నేను కొన్ని పదాలను తుడిచి, వాటిని మళ్లీ రాయమని అడిగాను. బాబు కోపంగా ఉన్నాడేమో అనుకున్నా. అందుకే, పెన్సిల్ సరిగ్గా పట్టుకోలేకపోతున్నాడని భావించా.'' అని ఆమె ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వార్తా పత్రికకు చెప్పారు.

కానీ, నాడీ కణాలపై రోగనిరోధక వ్యవస్థనే దాడి చేసే అత్యంత అరుదైన వ్యాధి గీయాన్-బరే సిండ్రోమ్ (జీబీఎస్)తో తన కొడుకు పెన్సిల్ కూడా పట్టుకోవడానికి ఇబ్బంది పడటం ఆ వ్యాధి మొదటి లక్షణంగా ఆమె ఊహించలేకపోయారు. దీనివల్ల, కండరాల బలహీనత ఏర్పడి, పక్షవాతం వస్తుంది.

కొన్ని రోజుల్లోనే, బాబును ఇంటెన్సివ్ కేర్‌లో చేర్పించాల్సి వచ్చింది. పిల్లాడు చేతులు, కాళ్లను కదపలేకపోయాడు. పరిస్థితి ప్రమాదకరంగా మారింది. మింగలేకపోవడం, మాట్లాడలేకపోవడం, క్రమంగా శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బందులు పడ్డాడు. వెంటిలేటర్ సపోర్టుపై ఉంచాల్సి వచ్చింది. ప్రస్తుతం బాబు కోలుకుంటున్నాడు.

పారిశ్రామిక వాడల పరిసరాలతో విద్యా,సాంకేతికరంగాలకు కేంద్రమైన పుణే నగరంలో జనవరి ప్రారంభం నుంచి 160 జీబీఎస్ కేసులు రిపోర్టు అయ్యాయి. వాటిలో ఈ బాబు కేసు కూడా ఒకటి.

జీబీఎస్‌తో ఐదుగురుచనిపోయినట్లు అనుమానాలు ఉన్నాయి. ప్రస్తుతం 48 మంది రోగులు ఇంటెన్సివ్ కేర్‌లో, 21 మంది వెంటిలేటర్‌పై ఉన్నారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 38 మంది ఈ వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు పేర్కొంటున్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
పుణే అవుట్‌బ్రేక్‌లో క్యాంపిలోబ్యాక్టర్ అనే పాథోజెన్ ఉన్నట్లు గుర్తింపు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పుణే అవుట్‌బ్రేక్‌లో క్యాంపిలోబ్యాక్టర్ అనే పాథోజెన్ ఉన్నట్లు గుర్తింపు

జీబీఎస్ వ్యాధి తొలుత పాదాలు, చేతుల్లో తిమ్మిరి, మొద్దుబారడంతో మొదలవుతుంది. ఆ తర్వాత కండరాలు బలహీనపడి, కీళ్లు కదిలించడంలో కూడా ఇబ్బందులు ఎదురవుతాయి.

రెండు లేదా నాలుగు వారాల్లో లక్షణాలు మరింత ముదురుతాయి. ఈ వ్యాధి తీవ్రత, వారికి అందే ఆరోగ్య సంరక్షణ కారణంగా ఈ వ్యాధి సోకినవారి మరణాల రేటు 3 నుంచి 13 శాతం మధ్యలో ఉంటుంది.

పుణేలో విజృంభించిన ఈ వ్యాధిలో ఆహార పదార్థాల ద్వారా ఇన్‌ఫెక్షన్‌ సోకే క్యాంపిలోబ్యాక్టర్ జీజుని అని పిలిచే సూక్ష్మజీవి ఉన్నట్లు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా జీబీఎస్ సోకేందుకు ఇదే అతిపెద్ద కారకం.

గ్రామీణ చైనాలో 1990ల్లోనే ఈ రెండింటి మధ్య సంబంధం ఉన్నట్లు గుర్తించారు. అక్కడ ఈ సూక్ష్మజీవి కోళ్లలో సర్వసాధారణంగా కనిపిస్తుంటుంది. కోళ్లు, కోడి పిల్లల విసర్జనల ద్వారా కలుషితమైన నీటిలో ఆడుకునే పిల్లలకు వర్షాకాలంలో జీబీఎస్ మహమ్మారి సోకుతూ ఉంటుంది.

భారత్‌లో గతంలోనూ ఉంది

జీబీఎస్ భారత్‌లో పూర్తిగా అసాధారణమైంది కాదు. 2014 నుంచి 2019 మధ్య ఐదేళ్ల కాలంలో 150 మంది జీబీఎస్ రోగులపై బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్, న్యూరోసైన్సెస్ (నిమ్‌హాన్స్)‌కు చెందిన మోనోజిత్ దేబ్‌నాథ్, మధు నాగప్ప అధ్యయనం చేశారు.

వీరి అధ్యయనంలో 79శాతం మంది రోగులకు గతంలోనూ క్యాంపైలోబాక్టర్ కారణంగా ఇన్ఫెక్షన్లు సోకినట్టు తేలింది. అలాగే 33 శాతమందికి క్యాంపైలోబాక్టర్ పాజిటివ్‌గా తేలింది. మొత్తంగా 65 శాతం మంది రోగులకు బ్యాక్టీరియా, వైరస్‌లు రెండూ జీబీఎస్ సోకడానికి దోహదపడ్డాయని తెలిపారు.

సూక్ష్మజీవులతో అనుసంధానమైన మహమ్మారులు ప్రపంచవ్యాప్తంగా ఇటీవల తలెత్తుతున్నాయి. 2023 తొలి ఏడు నెలల్లో, పెరూలో జీబీఎస్‌కు చెందిన 200కి పైగా అనుమానిత కేసులు, సుమారు నాలుగు మరణాలు నమోదయ్యాయి. కేసులు పెరగడంతో, అక్కడి ప్రభుత్వం జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ప్రజారోగ్య చర్యలను బలోపేతం చేసింది. వీటిలో మూడింట రెండొంతుల కేసులు క్యాంపిలోబ్యాక్టర్‌తో అనుసంధానమై ఉన్నాయి.

పరిశుభ్రంగా ఉండే దేశాల్లో కూడా కొన్ని జీబీఎస్ కేసులు క్యాంపిలోబ్యాక్టర్‌తో ముడిపడి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. 2015లో బ్రెజిల్‌లో జికా వైరస్‌తో సంబంధం ఉన్న జీబీఎస్ కేసులు నమోదయ్యాయి.

మహిళ

ఫొటో సోర్స్, Getty Images

టీకాలు అరుదుగా జీబీఎస్‌ను కలిగిస్తూ ఉంటాయి. కానీ, ఒక కోవిడ్ టీకా 2021లో బ్రిటన్‌లో కొన్ని వందల జీబీఎస్ కేసులను కలిగించిందని తెలిసింది.

''క్యాంపిలోబ్యాక్టర్ అన్ని వేళల్లో వేలాది కేసులకు కారణమయ్యే వ్యాధికారకం. పర్యావరణంలో ఇదెల్లప్పుడూ ఉంటుంది.'' అని యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గౌ న్యూరాలజీ ప్రొఫెసర్ హ్యూ విల్లిసన్ చెప్పారు. అయినప్పటికీ, జీబీఎస్‌ సోకడం అంత తేలిక కాదని శాస్త్రవేత్తలు అన్నారు.

క్యాంపిలోబ్యాక్టర్‌కు చెందిన ఒక నిర్దిష్ట స్ట్రెయిన్ ఉంటుంది. అది షుగర్‌ పూతతో బయట పొరను కలిగి ఉంటుంది. అరుదైన కేసులలో మాత్రమే, దాని కణ నిర్మాణం మానవులు నాడీ కణాలపై ఉన్న పూతకు సరిపోతుంది.

రోగుల రోగ నిరోధక వ్యవస్థ బ్యాక్టీరియాపై దాడి చేసినప్పుడు, కొన్నిసార్లు నాడీ కణాలను కూడా లక్ష్యంగా చేసుకోవచ్చు. ఈ ప్రక్రియను మాలిక్యులర్ మిమిక్రీ అంటారు. ఇదే జీబీఎస్‌కు దారితీస్తుంది. అయితే, క్యాంపిలోబ్యాక్టర్ స్ట్రెయిన్స్‌కు చెందిన కొన్ని మాత్రమే నాడీ కణాల మాదిరి పూతను కలిగి ఉంటాయి.

పుణేలో ఈ మాలిక్యులర్ లక్షణాలు ఉన్న క్యాంపిలోబ్యాక్టర్ స్ట్రెయిన్ వ్యాపి చెందుతుండొచ్చని, అందుకే, ఈ స్ట్రెయిన్‌తో ఇన్‌ఫెక్షన్లు పెరిగి, జీబీసీ కేసులు పెరిగేందుకు కారణమవుతున్నాయని ప్రొఫెసర్ విల్లిసన్ చెప్పారు.

100 క్యాంపిలోబ్యాక్టర్ స్ట్రెయిన్‌లో ఒక్కటే జీబీఎస్ ప్రమాదాన్ని కలిగిస్తాయని చాలామంది నిపుణులు అంటున్నారు. ఆ స్ట్రెయిన్ సోకిన వందమందిలో ఒక్కరికే జీబీఎస్ వస్తుందన్నారు. అంటే మొత్తం రిస్క్.. 10 వేల మందిలో ఒక్కరికే.

జీబీఎస్‌ ఎప్పుడు ప్రమాదకరం

బీబీఎస్‌లో, శరీరం క్యాంపిలోబ్యాక్టర్‌తో పోరాడే యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుంది. తర్వాత నాడీ కణాలపై దాడి చేస్తుంది. వైద్యులు దీనికి ''ప్లాస్మా ఎక్స్చేంజ్''ను వాడతారు. ఈ ప్రక్రియలో హానికరమైన యాంటీబాడీలను తొలగించేందుకు రక్తాన్ని ఫిల్టర్ చేస్తారు.

దీంతో పాటు ఈ వ్యాధి తీవ్రతను తగ్గించేందుకు ఇంట్రావీనస్ ఇమ్యునోగ్లోబులిన్ (ఐవీఐజీ)ని కూడా చేస్తారు.

జీబీఎస్‌ను గుర్తించేందుకు ఏ పరీక్షా లేకపోవడం సవాలు. దీంతో లక్షణాలను బట్టే ఈ వ్యాధి సోకినట్టుగా వైద్యులు నిర్థరిస్తున్నారు. ఇది పక్షవాతానికి మరో రూపంగా ఉంటుంది. అయితే పక్షవాతమనేది పోలియో, వైరస్‌లు, అరుదైన నాడీవ్యాధుల ద్వారానూ సంభవించవచ్చు.

పుణేలో జీబీఎస్ రోగుల కోసం ప్రత్యేక వార్డులు

ఫొటో సోర్స్, Pune Municipal Corporation

ఫొటో క్యాప్షన్, పుణేలో జీబీఎస్ రోగుల కోసం ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశారు

భారత్‌లో అసమానంగా ఉండే ప్రజా ఆరోగ్య వ్యవస్థ సవాలుగా నిలుస్తోంది. గ్రామాల్లోని వైద్యులు జీబీఎస్‌ను గుర్తించడంలో ఇబ్బంది పడుతున్నారు. అందుకే, పుణేలోని ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన బృందాలు కేంద్ర, రాష్ట్ర వైద్య కార్మికులతో అనుసంధానమై, జీబీఎస్‌ను గుర్తించడం, పరీక్షించడం చేస్తున్నారు. కేసులను పర్యవేక్షిస్తూ.. సమర్థవంతమైన చికిత్సను అందించేందుకు ప్రయత్నిస్తున్నారు.

60వేలకు పైగా ఇళ్లను తాము పరీక్షించామని, పరీక్షల కోసం 160కి పైగా నీళ్ల శాంపుళ్లను తీసుకెళ్లినట్లు అధికారులు తెలిపారు. కాచి చల్లార్చిన నీటినే తాగాలని, తాజా, శుభ్రమైన ఆహారం తినాలని సూచిస్తున్నారు. పాడైపోయిన, ఉడికీ ఉడకని కోడి లేదా మాంసం కూరలను తినొద్దని చెబుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా నమోదైన చాలా జీబీఎస్ కేసుల్లో సరిగ్గా వండని కోడి మాంసం నుంచే వచ్చినట్లు నిపుణులు చెబుతున్నారు. అలాగే, నీరు ద్వారా కూడా ఇది వ్యాపిస్తున్నట్లు తెలిపారు.

కలుషితమైన నీటిని గిన్నెలు కడిగేందుకు, రోడ్డుపై ఆహారం తయారు చేసేందుకు వాడటం వల్ల బ్యాక్టీరియా సలుభంగా వ్యాపిస్తున్నట్లు తెలిపారు. పుణేలో క్యాంపిలోబ్యాక్టర్ స్ట్రయిన్ భిన్నమైన లక్షణాలతో పెద్ద ఎత్తున వ్యాపిస్తోంది.

అయితే, కలుషితమైన నీటిద్వారా ఇది వ్యాపిస్తోందా, లేక ప్రజలు పెద్ద ఎత్తున పాడైపోయిన కోడి మాంసాన్ని వినియోగించారా అనేది అంతుపట్టడం లేదు. ప్రజలు ఆందోళన చెందొద్దని సూచించినట్టు ప్రజారోగ్య అధికారి ఒకరు చెప్పారు .

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)