యూజీసీ కొత్త ప్రతిపాదనలు ఏమిటి, తెలంగాణ,కర్ణాటక,కేరళ,తమిళనాడు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి?

ఉస్మానియా యూనివర్సిటీ

ఫొటో సోర్స్, OsmaniaUniversity

ఫొటో క్యాప్షన్, యూజీసీ ఇటీవల డ్రాఫ్ట్ రూల్స్‌ విడుదల చేసింది.
    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) తాజా ముసాయిదాలోని నిబంధనలను కొన్ని రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లతోపాటు అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ల నియామకాలు, పదోన్నతులపై యూజీసీ ఇటీవల డ్రాఫ్ట్ రూల్స్‌ విడుదల చేసింది.

ఈ నిబంధనలను తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక సహా వివిధ రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.ఈమేరకు తమిళనాడు, తెలంగాణ, కేరళ ముఖ్యమంత్రులు ప్రకటనలు కూడా చేశారు.

మరోవైపు, ఉన్నత విద్యాసంస్థల్లో మరింత పారదర్శకత కోసమే మార్గదర్శకాలు తీసుకొస్తున్నట్లుగా యూజీసీ చెబుతోంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
కాకతీయ యూనివర్సిటీ
ఫొటో క్యాప్షన్, యూజీసీ తాజా ముసాయిదాలో అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ నియామకాలన్నీ అఖిల భారత స్థాయిలో ఇచ్చే ప్రకటన ఆధారంగా, మెరిట్ ప్రాతిపదికన జరుగుతాయి.

యూజీసీ ముసాయిదా నిబంధనల్లో ఏముంది?

యూనివర్సిటీల్లో బోధనా సిబ్బంది నియామకం, పదోన్నతులు, వీసీల నియామకంపై చివరిసారిగా 2018 జులై యూజీసీ నిబంధనలు విడుదల చేసింది. వాటిల్లో మార్పులు తీసుకొస్తూ తాజాగా ముసాయిదా తెస్తూ అభ్యంతరాలు స్వీకరించాలని నిర్ణయించింది.

ముసాయిదా ప్రకారం చూస్తే…

  • అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ నియామకాలన్నీ అఖిల భారత స్థాయిలో ఇచ్చే ప్రకటన ఆధారంగా, మెరిట్ ప్రాతిపదికన జరుగుతాయి.
  • నాలుగేళ్ల డిగ్రీ లేదా పోస్టు గ్రాడ్యుయేషన్ చదివిన తర్వాత పీహెచ్‌డీ వేరొక సబ్జెక్టులో చేస్తే, పీహెచ్‌డీ చేసిన సబ్జెక్టులో నియామకాలకు అర్హత పొందే వీలుంటుంది.
  • నాలుగేళ్ల డిగ్రీ, పీజీ ఒక సబ్జెక్టులో చదివి, నెట్ లేదా సెట్(జాతీయ అర్హత పరీక్ష లేదా రాష్ట్ర అర్హత పరీక్ష)లో వేరొక సబ్జెక్టులో ఉత్తీర్ణత సాధిస్తే, ఆ సబ్జెక్టులోనే నియామకాలకు వీలుంటుంది.

వైస్ ఛాన్సలర్ నియామకాల్లోనూ యూజీసీ నిబంధనలను సడలించింది. ఇప్పుడు ప్రధానంగా వీటి విషయంలోనే కొన్ని రాష్ట్రాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.ఈ విషయంపై బీబీసీతో తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి మాట్లాడారు.

''90 శాతానికిపైగా నిధులు కేటాయిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ అజయాయిషీ లేకుండా వీసీల నియామకం చేయడమంటే రాష్ట్రాల అధికారాలు తీసుకోవడమే అవుతుంది'' అని చెప్పారు.

దిల్లీ యూనివర్సిటీ

ఫొటో సోర్స్, du.ac.in

ఫొటో క్యాప్షన్, 2018లో ఇచ్చిన నిబంధనల్లో సెర్చ్ కమ్ సెలక్షన్ కమిటీని ఎవరు నియమిస్తారనేది స్పష్టంగా లేకపోవడంతో రాష్ట్ర వర్సిటీలకు రాష్ట్ర ప్రభుత్వమే నియమిస్తోంది.

వీసీల నియామకంపై ఏముందంటే..

వైస్ ఛాన్సలర్ల నియామకాలపై యూజీసీ తాజా ముసాయిదాలో ఏం చెప్పారంటే..

  • వైస్ ఛాన్సలర్‌గా ఎంపికయ్యే వ్యక్తికి ఉన్నత విద్యాసంస్థలు లేదా రీసర్చ్/అకడమిక్ అడ్మినిస్ట్రేటివ్ సంస్థల్లో సీనియర్ స్థాయి హోదా లేదా పరిశ్రమలు/పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్/పబ్లిక్ పాలసీ ప్రభుత్వ రంగ సంస్థల్లో విద్యాపరంగా ఉన్నతమైన సేవలందించి, పదేళ్ల అనుభవం ఉండాలి.
  • పత్రికల్లో లేదా బహిరంగ ప్రకటన ఇచ్చి దరఖాస్తులు స్వీకరించాలి. నామినేషన్ లేదా సెర్చ్ కమ్ సెలక్షన్ కమిటీ ప్రక్రియ ద్వారా దరఖాస్తులు తీసుకోవచ్చు.
  • సెర్చ్ కమ్ సెలక్షన్ కమిటీలో ముగ్గురు నిపుణులు ఉంటారు. ఈ కమిటీని గవర్నర్ నియమిస్తారు.
  • విజిటర్ లేదా ఛాన్సలర్ ఎంపిక చేసిన నామినీ, సెర్చ్ కమ్ సెలక్షన్ కమిటీకి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు.(సహజంగానే రాష్ట్ర యూనివర్సిటీలకు ఛాన్సలర్‌గా గవర్నర్ వ్యవహరిస్తారు. కేంద్రీయ వర్సిటీలకు రాష్ట్రపతి విజిటర్‌గా ఉంటారు.)
  • యూజీసీ చైర్మన్ తరఫున నామినీ ఉంటారు. మరో నామినీ యూనివర్సిటీ ఉన్నతస్థాయి కమిటీ (సిండికేట్ లేదా సెనేట్ లేదా కార్యనిర్వాహక మండలి లేదా మేనేజ్‌మెంట్ బోర్డు) నుంచి ఉంటారు.
  • సెర్చ్ కమ్ సెలక్షన్ కమిటీ సమావేశమై వైస్ ఛాన్సలర్ల కోసం వచ్చిన దరఖాస్తులపై పరిశీలన చేసి 3-5 పేర్లను విజిటర్ లేదా ఛాన్సలర్‌కు పంపించాలి.
  • కమిటీ పంపిన పేర్ల నుంచి ఒకరిని వైస్ ఛాన్సలర్‌గా నియమించే అధికారం ఛాన్సలర్ లేదా విజిటర్‌కు ఉంటుంది.
  • బాధ్యతలు తీసుకున్న రోజు నుంచి వైస్ ఛాన్సలర్ ఐదేళ్లపాటు లేదా 70 ఏళ్లు వచ్చే వరకు పదవిలో ఉంటారు. వయో పరిమితి మించకుంటే రెండోసారి కూడా వైస్ ఛాన్సలర్‌గా ఎంపిక చేయొచ్చు.

''మా ప్రధాన అభ్యంతరం వీసీల నియామకంపై అనుసరించాల్సిన విధివిధానాల ముసాయిదాపైనే. ఇది ఫెడరల్ వ్యవస్థ. అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేకుండా రాష్ట్ర వర్సిటీలకు ఉపకులపతులను నియమించడం ఏమిటన్నదే మా ప్రశ్న. దానివల్ల వర్సిటీల్లో ఎలాంటి మార్పులొస్తాయో చెప్పాలి.పైగా ఆచార్యులు కాకుండా బయటి వ్యక్తులకు కూడా వీసీలు అయ్యే అవకాశముంది'' అని చెప్పారు ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి.

2018లో ఇచ్చిన నిబంధనల్లో సెర్చ్ కమ్ సెలక్షన్ కమిటీని ఎవరు నియమిస్తారనేది స్పష్టంగా లేకపోవడంతో రాష్ట్ర వర్సిటీలకు రాష్ట్ర ప్రభుత్వమే నియమిస్తోంది. ఇప్పుడు తీసుకొచ్చిన ముసాయిదాలో గవర్నర్ నియమిస్తారని యూజీసీ ప్రతిపాదించింది. దీనివల్ల వీసీల నియామకం పూర్తిగా గవర్నర్ చేతుల్లోకి వెళుతుందని, ఆయా రాష్ట్రాలు అభ్యంతరం చెబుతున్నాయి.

యూనివర్సిటీ

ఫొటో సోర్స్, Getty Images

రాష్ట్రాలు వర్సెస్ గవర్నర్

ఉప కులపతుల నియామకం విషయంలో గత కొన్నేళ్లుగా రాష్ట్రాలు, గవర్నర్ మధ్య వివాదాలు నడుస్తున్నాయి.

రాష్ట్ర వర్సిటీలకు గవర్నర్లను ఛాన్సలర్లుగా తొలగించే బిల్లులకు పశ్చిమ బెంగాల్, తమిళనాడు ప్రభుత్వాలు ఆమోదం తెలిపాయి.

కర్ణాటకలోనూ నిరుడు డిసెంబరులో కర్ణాటక రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్ యూనివర్సిటీ ఛాన్సలర్‌గా గవర్నర్‌కు బదులు ముఖ్యమంత్రిని నియమిస్తూ ఆ రాష్ట్ర అసెంబ్లీ చట్టం చేసింది.

2023లో కేరళ ప్రభుత్వం కూడా రాష్ట్ర అసెంబ్లీలకు గవర్నర్ బదులుగా విద్యారంగ నిపుణులు ఛాన్సలర్లుగా ఉంటారంటూ అసెంబ్లీలో బిల్లును ఆమోదించింది.

వరుసగా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు, గవర్నర్ల మధ్య వివాదాలు నడుస్తున్న నేపథ్యంలో యూజీసీ ముసాయిదా నిబంధనలు తీసుకొచ్చిందని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు.

ఎంకే స్టాలిన్

ఫొటో సోర్స్, MKSTALIN

ఫొటో క్యాప్షన్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్

ఇంతకీ రాష్ట్రాల అభ్యంతరాలేంటి?

యూజీసీ ముసాయిదా నిబంధనలను పూర్తిగా వ్యతిరేస్తున్నట్లుగా కేరళ, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు ప్రభుత్వాలు చెప్పాయి.

దీనిపై ఇప్పటికే కేరళ అసెంబ్లీ తీర్మానం చేసింది.

''వైస్ ఛాన్సలర్ల నియామకంలో రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాన్ని యూజీసీ డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్ పూర్తిగా పక్కనపెట్టినట్లుగా ఉంది. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం'' అని చెప్పారు కేరళ సీఎం పినరయి విజయన్.

తమిళనాడు కూడా యూజీసీ రెగ్యులేషన్స్‌ను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసింది. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్న నిబంధనలను వ్యతిరేకించాలని దిల్లీ, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, పంజాబ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ లేఖ రాశారు.

డ్రాఫ్ట్ వెనక్కి తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌కూ లేఖ రాశారు.

రేవంత్ రెడ్డి

ఫొటో సోర్స్, FACEBOOK/TELANGANA CMO

ఫొటో క్యాప్షన్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

‘యూజీసీ నిబంధనలను అంగీకరించం’

యూజీసీ తీసుకొచ్చిన నిబంధనలను వ్యతిరేకిస్తున్నట్లుగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రకటించారు.

''రాష్ట్రాల హక్కులను హరించేలా ఉన్న యూజీసీ ముసాయిదా నిబంధనలను వెనక్కి తీసుకోవాలి'' అని డిమాండ్ చేశారు.

ఎవరికైతే రాష్ట్రాల గవర్నర్లతో ఇబ్బందులున్నాయో.. వారంతా ఈ ముసాయిదాను వ్యతిరేకిస్తున్నారని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ మాజీ వైస్ ఛాన్సలర్ పొదిలె అప్పారావు చెప్పారు.

''యూజీసీ నిబంధనల్లో ప్రధానంగా వైస్ ఛాన్సలర్ల నియామకంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కచ్చితంగా రాష్ట్రాల పరిధిలోని యూనివర్సిటీలకు నేరుగా గవర్నర్ ఆధ్వర్యంలో వైస్ ఛాన్సలర్లను నియమించాలని యూజీసీ చెప్పడం సబబు కాదు'' అని చెప్పారాయన.

గతంలో ఉన్న నిబంధనలు కొనసాగించాల్సిన అవసరం ఉందని వివరించారు.

''గతంలో గవర్నర్‌కు సెర్చ్ కమిటీ సిఫార్సు చేస్తే, వాటికి ఆమోదం తెలిపేవారు. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఇష్టంపై ఆధారపడి ఉండేది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా గవర్నరే నియమించేలా నిబంధన తీసుకొచ్చారు. దీనిపైనే ఆయా రాష్ట్రాలు అభ్యంతరం చెబుతున్నాయి. రాష్ట్ర వర్సిటీలకు వైస్ ఛాన్సలర్లను నియమించే బాధ్యత ఆయా రాష్ట్రాలకే ఉంటే మేలు'' అని చెప్పారు పొదిలె అప్పారావు.

పొదిలె అప్పారావు

ఫొటో సోర్స్, Appa Rao Podile/facebook

ఫొటో క్యాప్షన్, పొదిలె అప్పారావు

రాష్ట్ర వర్సిటీలపై ఉన్న అభ్యంతరాలేమిటి?

విశ్వవిద్యాలయాల ఉపకులపతుల నియామకంపై ఎప్పటి నుంచో అభ్యంతరాలు ఉన్నాయి. రాజకీయ ప్రమేయం కారణంగా ప్రభుత్వాలకు అనుకూలంగా ఉండే వ్యక్తులను ఎంపిక చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.

''ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉంటే వారికి 'నచ్చిన' వ్యక్తులను వీసీలుగా నియమించడం ఆనవాయితీగా వస్తోంది. దానివల్ల హైకోర్టులో కేసులు కూడా దాఖలు అవుతున్నాయి. ఈ మధ్యనే తెలంగాణలో బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయానికి ఘంటా చక్రపాణిని నియమించాక అర్హతలపై వివాదం తలెత్తి కొందరు హైకోర్టును ఆశ్రయించారు'' అని ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ ఒకరు చెప్పారు.

ఇలాంటి చర్యలకు అడ్డుకట్ట వేసేలా యూజీసీ నిబంధనలు తీసుకురావాల్సిన అవసరం ఉందనేది విద్యావేత్తల వాదన. పైగా రాష్ట్ర వర్సిటీల్లో పెద్దసంఖ్యలో ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల ఖాళీలున్నాయి.

''ఉన్నత విద్యలో మార్పులు తీసుకురావాలంటే దానికి తగ్గట్టుగా ప్రణాళికలు రావాలి. అంతేకానీ, రాష్ట్ర పరిధిలో ఉండే వీసీల నియామకాలు గవర్నర్‌కు కట్టబెట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు'' అని చెప్పారు ఓయూకు చెందిన సీనియర్ ప్రొఫెసర్ ఒకరు.

బాలకిష్టారెడ్డి

ఫొటో సోర్స్, tgche.ac.in

ఫొటో క్యాప్షన్, వి.బాలకిష్టారెడ్డి

పదోన్నతులతో నాణ్యత తగ్గుతుందా?

ప్రొఫెసర్ల పదోన్నతుల ప్రక్రియలో సర్వీసు నిబంధనలు మార్చడంపై విద్యావేత్తలు అభ్యంతరం చెబుతున్నారు.

''సర్వీసు నిబంధనల విషయంలో తీసుకొచ్చిన ముసాయిదా నిబంధనలు అమల్లోకి వస్తే నాణ్యత, పరిశోధనల సంఖ్య తగ్గిపోయే అవకాశం ఉంది.

గతంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ నుంచి అసోసియేట్ ప్రొఫెసర్ అవ్వాలంటే ఐదేళ్ల నిబంధన, ఐదు రీసర్చ్ పేపర్లు సమర్పించి ఉండాలనే నిబంధనలుండేవి. ఇప్పుడు వాటిని మూడేళ్లకు తగ్గించడంతోపాటు మూడు రీసర్చ్ పేపర్లకే పరిమితం చేశారు.

రీసర్చ్ పేపర్లు గతంలో పేరున్న జర్నల్స్‌లో ప్రచురితం కావాలని జాబితా ఇచ్చారు. ఇప్పుడు ఆ విషయంలో సడలింపులు ఇవ్వడం వల్ల నాణ్యతా ప్రమాణాలు పడిపోయే ప్రమాదం ఉంది'' అని చెప్పారు పొదిలె అప్పారావు.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ
ఫొటో క్యాప్షన్, కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో వసతులతో రాష్ట్ర విశ్వవిద్యాలయాలను పోల్చలేం అంటున్నారు ప్రొఫెసర్ అప్పారావు.

'సెంట్రల్ యూనివర్సిటీలతో రాష్ట్ర వర్సిటీలను పోల్చలేం'

''రాష్ట్ర వర్సిటీల్లో పోస్టులు ఖాళీగా ఉండటం, వసతుల లేమి ఉన్నట్లుగా చెబుతున్నారు. అవును, ఆ ఇబ్బందులున్నాయి.అలాగని రాష్ట్ర పరిధిలో ఉండే విశ్వవిద్యాలయాల స్వయంప్రతిపత్తిని తీసుకునేలా నిబంధనలు రూపొందించడం కూడా సబబు కాదు కదా'' అని చెప్పారు తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి.

ఈ విషయంపై ప్రొఫెసర్ పొదిలె అప్పారావు మాట్లాడుతూ.. 'వీసీలను నియమించుకునే అవకాశం ప్రైవేటు వర్సిటీలకు ఎలాగైతే ఇచ్చారో.. అలాగే రాష్ట్ర విశ్వవిద్యాలయాల విషయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అవకాశం కల్పించాలి. దేశంలో ప్రైవేటు, డీమ్డ్, రాష్ట్ర, కేంద్రీయ.. నాలుగు కేటగిరీల్లో విశ్వవిద్యాలయాలున్నాయి. అన్నింటికీ వేర్వేరుగా నిబంధనలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో వసతులతో రాష్ట్ర విశ్వవిద్యాలయాలను పోల్చలేం'' అని చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)