ముగ్గురు ఇజ్రాయెలీలకు, 183 మంది పాలస్తీనియన్‌లు...బందీలను మరోదఫా విడుదల చేసిన ఇరువర్గాలు

హమాస్-ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందం
ఫొటో క్యాప్షన్, 183 మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేసింది.

హమాస్, ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందంలో భాగంగా అనేకమందికి స్వేచ్ఛా జీవితం లభిస్తోంది. 2023 అక్టోబరు 7 దాడుల్లో ఇజ్రాయెల్ నుంచి బందీలుగా పట్టుకుని వెళ్లిన వారిలో మరో ముగ్గురిని శనివారం హమాస్ విడుదల చేసింది. దీంతో 183 మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ తమ జైళ్ల నుంచి విడిచిపెట్టింది.

జైళ్ల నుంచి విడుదలయిన పాలస్తీనా ఖైదీలను తీసుకుని బస్సులు వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్‌లకు చేరుకున్నాయి.

183 మందిని విడుదల చేస్తామని ఇజ్రాయెల్ ప్రకటించడంతో వారికి స్వాగతం చెప్పేందుకు పెద్దసంఖ్యలో బంధువులు, కుటుంబసభ్యులు, స్థానికులు తరలివచ్చారు.

ఈజిప్టు, గాజా సరిహద్దుల్లోని రఫాను 8 నెలల తర్వాత తిరిగి తెరిచారు. పాలస్తీనా బందీలలో గాయాలతో బాధపడుతున్న కొంతమందిని చికిత్స కోసం ఈజిప్టు తీసుకెళ్లారు. గత ఏడాది మేలో రఫా సరిహద్దును మూసివేశారు. ఇప్పుడు మళ్లీ తెరవడంతో సహాయ సామాగ్రితో ట్రక్కులు రఫా బోర్డర్ ద్వారా గాజా చేరుకుంటున్నాయి.

ఇజ్రాయెల్ బందీలు ముగ్గురిని హమాస్ విడుదల చేసిన తర్వాత ఈ పరిణామాలన్నీ జరిగాయి. యార్డెన్ బిబాస్, ఓఫర్ కల్డెరాన్, కీత్ సైగల్‌ అనే ముగ్గురు ఇజ్రాయెలీలను హమాస్ విడుదల చేసింది.

హమాస్, ఇజ్రాయెల్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం జనవరి 19 నుంచి అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా హమాస్ నాలుగుసార్లు ఇజ్రాయెలీ బందీలను విడుదల చేసింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
హమాస్-ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందం

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, కీత్‌సైగల్ కుటుంబం

హమాస్ విడుదల చేసిన ముగ్గురు బందీలెవరు?

34 ఏళ్ల యార్డెన్ బిబాస్, 53ఏళ్ల ఓఫర్ కల్డెరాస్‌ను మొదట ఖాన్ యూనిస్ దగ్గర రెడ్‌క్రాస్‌కు అప్పగించిన హమాస్, రెండు గంటల తర్వాత 65 ఏళ్ల కీత్ సైగల్‌ను గాజా నగరంలో విడిచిపెట్టింది. ఖాన్ యూనిస్‌లో ఇద్దరు ఇజ్రాయెలీలను, ఐదుగురు థాయ్ జాతీయులను పెద్ద సంఖ్యలో జనం చుట్టముట్టారని బీబీసీ ప్రతినిధి అలైస్ కడ్డీ వెల్లడించారు.

శనివారం ఉదయం (ఫిబ్రవరి 1,2005) యార్డెన్ బిబాస్ అనే బందీని దక్షిణ గాజా నగరం ఖాన్ యూనిస్‌లో హమాస్ విడిచిపెట్టింది. ఆయన భార్య, ఇద్దరు కుమారులు ఐదేళ్ల ఏరియల్, రెండేళ్ల కఫిర్ ఇప్పటికీ హమాస్ దగ్గరే బందీలుగా ఉన్నారు.

హమాస్ విడుదల చేసిన మరో ఖైదీ ఓఫర్ కల్డెరాస్‌ ఫ్రెంచ్ సంతతి ఇజ్రాయెలీ. ఆయన్ను కూడా ఖాన్ యూనిస్‌లో హమాస్ విడిచి పెట్టింది. ఆయన ఇద్దరు పిల్లలు ఎరెజ్, షాహార్‌ను కూడా హమాస్ అపహరించింది. అయితే 2023 నవంబరులో కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం తర్వాత వారిద్దరినీ విడిచిపెట్టింది. ఓఫర్ కల్డెరాన్‌ తన కుటుంబాన్ని కలుసుకున్నారు.

హమాస్-ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందం

ఫొటో సోర్స్, Maayan Toaf / GPO

ఫొటో క్యాప్షన్, కుటుంబాన్ని కలుసుకున్న ఓఫర్ కల్డెరాస్‌

ఓఫర్ విడుదలను ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్‌ స్వాగతించారు.

కీత్ సైగల్ అమెరికాలో పుట్టిన ఇజ్రాయెల్ జాతీయుడు. కఫ్ర్ అజాలోని వారి ఇంటి నుంచి ఆయన్ను, ఆయన భార్య అవీవాను హమాస్ అపహరించింది. తాత్కాలిక శాంతి ఒప్పందం సమయంలో 2023 నవంబరులో అవీవాను విడిచిపెట్టింది.

కీత్ సైగల్ విడుదలతో ఆయన కుటుంబం సంతోషంలో మునిగి తేలుతోంది. ఆయన తిరిగి ఇజ్రాయెల్‌లో అడుగుపెట్టడం మాటల్లో చెప్పలేనంత ఆనందం కలిగిస్తోందని ఆయన కుటుంబం తెలిపింది. 484 రోజుల అనంతరం, భయంకరమైన రాత్రులు, పగళ్లు అంతులేని వేదన అనుభవించిన తర్వాత మళ్లీ తాము ఊపిరి తీసుకోగలుగుతున్నామని ఓ ప్రకటనలో కీత్ సైగల్ కుటుంబం తెలిపింది.

ముగ్గురు బందీల విడుదలను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్వాగతించారు. ''మీరు ఇంటికి తిరిగి రావడంపై ఇజ్రాయెల్ పౌరులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇజ్రాయెల్ ప్రజలతో పాటు నేను, నా భార్యా చాలా సంతోషిస్తున్నాం'' అని నెతన్యాహు తెలిపారు.

మిగిలిన బందీలను సురక్షితంగా ఇంటికి తీసుకురావడంపై దృష్టిపెట్టామని నెతన్యాహు అన్నారు.

హమాస్-ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందం
ఫొటో క్యాప్షన్, ఇజ్రాయెల్ జైళ్ల నుంచి బస్సుల్లో వచ్చిన ఖైదీలకు పెద్దఎత్తున ప్రజలు స్వాగతం పలికారు.

ఖైదీల విడుదలపై ఇజ్రాయెల్‌లో విమర్శలు

ముగ్గురు బందీల విడుదల తర్వాత పాలస్తీనా ఖైదీలను తీసుకుని ఓఫర్ జైలు నుంచి బయలుదేరిన బస్సులు జనసందోహం కేరింతల మధ్య ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోని రమల్లాకు చేరుకున్నాయి.

మరోవైపు పాలస్తీనా ఖైదీల విడుదలపై ఇజ్రాయెల్‌లో కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. హమాస్ విడుదల చేస్తున్న బందీల సంఖ్య చాలా తక్కువగా ఉందని, ప్రతిగా ఇజ్రాయెల్ పెద్ద సంఖ్యలో ఖైదీలను విడిచిపెడుతోందని విమర్శిస్తున్నారు.

శాంతి ఒప్పందంపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ జాతీయ భద్రతా శాఖ మంత్రి పదవికి ఇతామర్ బెన్-గవిర్ రాజీనామా చేశారు. జీవితఖైదు పడ్డ ఉగ్రవాదులను విడుదల చేయాలనుకోవడం తనకు భయం కలిగిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.

హమాస్-ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందం

ఫొటో సోర్స్, Google, Planet Labs PBC

ఫొటో క్యాప్షన్, దక్షిణ గాజా నుంచి పెద్ద ఎత్తున ప్రజలు సొంతూళ్లకు వెళుతున్నారు.

ఖాళీ అవుతున్న దక్షిణ గాజా శిబిరాలు

శాంతి ఒప్పందంతో దక్షిణ గాజాలోని శిబిరాలు ఖాళీ అవుతున్నాయి. ప్రజలు ఇళ్లకు తిరిగి వెళ్తున్నారు. దక్షిణ గాజా శాటిలైట్ చిత్రాల్లో జనవరి 21నాటి ఫోటోకు, జనవరి 30నాటి ఫోటోకు మధ్య చాలా తేడా కనిపిస్తోంది.

ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం సమయంలో పాలస్తీనా ప్రజలు ఎక్కువమంది ఇజ్రాయెల్ మిలటరీ ఆదేశించినట్టు గాజాలో తలదాచుకున్నారు. శాంతిఒప్పందం తర్వాత ఉత్తర ప్రాంతంలోని తమ ఇళ్లకు తిరిగి వెళ్తున్నారు.

హమాస్-ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందం

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, రాఫా సరిహద్దు తెరుచుకోవడంతో గాజా ప్రజలు చికిత్స కోసం ఈజిప్టు వెళ్తున్నారు.

హమాస్ దగ్గర ఇంకెంతమంది బందీలున్నారు?

జనవరి 19న శాంతి ఒప్పందం అమల్లోకి వచ్చిన దగ్గరి నుంచి ఇప్పటిదాకా మొత్తం 19 మంది బందీలను హమాస్ విడుదల చేసింది. ఇంకా 79 మంది బందీలు విడుదల కావాల్సి ఉన్నప్పటికీ వారిలో 44 మందే జీవించి ఉన్నారని ఇజ్రాయెల్ అంటోంది.

ఒప్పందంలో మొదటి దశలో భాగంగా మొదటి 6 వారాల్లో 33 మంది బందీలను హమాస్ విడుదల చేయాల్సి ఉంది. బదులుగా పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేస్తుంది.

ఒప్పందం రెండో దశలో మిగిలిన బందీలను హమాస్ విడుదల చేస్తుంది. మరణించిన బందీల మృతదేహాలను ఇజ్రాయెల్‌కు చివరి దశలో అప్పగిస్తుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)