కంకషన్ సబ్‌స్టిట్యూట్: శివమ్ దుబేకు బదులు హర్షిత్ రాణా ఆడడంపై ఇంగ్లండ్ జట్టు ఆగ్రహం ఎందుకు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మాథ్యూ హేన్రి
- హోదా, బీబీసీ ప్రతినిధి
పుణేలో జరిగిన నాలుగో టీ20లో ఇంగ్లండ్‌పై భారత్ విజయం తరువాత 'మేం ఈ నిర్ణయాన్ని ఒప్పుకోం' అని ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ జాస్ బట్లర్ అన్నారు.
బ్యాటింగ్ ఆల్ రౌండర్ శివమ్ దుబే స్థానంలో కంకషన్ సబ్ స్టిట్యూట్(ఆటగాళ్లకు ఏదైనా గాయమైనప్పుడు వారి స్థానంలో వచ్చే మరో ఆటగాడు)గా బౌలర్ హర్షిత్ రాణా బరిలోకి దిగారు. ఆటను తన బౌలింగ్‌తో మలుపు తిప్పారు హర్షిత్.
కంకషన్ సబ్‌స్టిట్యూట్‌ల అవసరాన్ని ఎవరూ తగ్గించరు కానీ ఈ సందర్భంలో కంకషన్ సబ్‌స్టిట్యూట్ గా హర్షిత్‌ను ఎంచుకోవడంపై ఇంగ్లాండ్ జట్టు అభ్యంతరం వ్యక్తం చేసింది.
'తరువాత మ్యాచ్ టాస్ సమయంలో మేం 12 మంది ఆటగాళ్లతో ఆడతాం మరి' అని బట్లర్ ఆట తరువాత జోక్ చేశారు.


ఫొటో సోర్స్, Getty Images
అసలేం జరిగింది?
ఇండియా బ్యాటింగ్ సమయంలో 20వ ఓవర్‌లో జేమీ ఓవర్టన్ వేసిన 5వ బంతి దుబే హెల్మెట్‌కు తగిలింది.
దీంతో దుబే ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన భారత వైద్య సిబ్బంది, చివరి బంతిని ఆడేందుకు దుబేకు అనుమతినిచ్చారు. కానీ, ఆ తరువాత దుబే స్థానంలో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా ఆడేందుకు హర్షిత్‌ను మ్యాచ్ రిఫరీ జవగల్ శ్రీనాథ్ అనుమతించారు.
ఈ నిర్ణయంపై ఇంగ్లండ్ జట్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. కంకషన్ సబ్‌స్టిట్యూట్ ఎంపిక ' లైక్ ఫర్ లైక్' నియమాన్ని అనుసరించి ఉండాలి. అంటే దాదాపు సమాన నైపుణ్యాలున్న ఆటగాళ్లనే కంకషన్ సబ్ స్టిట్యూట్లుగా ఎంచుకోవాలి.
దుబే మీడియం పేసర్, ప్రాథమికంగా బ్యాటర్. 2024లో తాను ఆడిన టీ20 మ్యాచ్‌లలో చాలా మ్యాచ్‌లలో ఆయన అసలు బౌలింగే చేయలేదు.
మరోవైపు హర్షిత్ 140 కిలోమీటర్లకు పైగా వేగంతో బౌలింగ్ చేస్తాడు. టీ20లలో ఆయన బ్యాటింగ్ చేసింది తక్కువే.
23 ఏళ్ల హర్షిత్ ఈ మ్యాచ్‌లో లియామ్ లివింగ్‌స్టన్, జాకబ్ బెథెల్, జేమీ ఓవర్‌టన్‌లను అవుట్ చేశాడు. 15 పరుగుల తేడాతో భారత్ సాధించిన ఈ విజయంలో ఆయన 33 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు తీశాడు.

ఫొటో సోర్స్, Getty Images
నిబంధనలు ఏం చెబుతున్నాయి?
కంకషన్ సబ్‌లను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ మొదట 2019లో ప్రారంభించింది.
సాధారణంగా ఐసీసీ మ్యాచ్ రిఫరీ కంకషన్ రీప్లేస్‌మెంట్ అభ్యర్థనను ఆమోదించాలంటే, 'లైక్ ఫర్ లైక్' నియమాన్ని పాటిస్తూ ఆ ఆటగాడిని చేర్చుకోవడం వల్ల మిగిలిన మ్యాచ్ వ్యవధిలో ఆ జట్టుకు అదనపు ప్రయోజనం కలగకుండా ఉండేలా ఎంచుకోవాలి" అని ఐసీసీ ఆట నియమాలు తెలుపుతున్నాయి.
గాయపడిన ఆటగాడు మిగిలిన ఆట వ్యవధిలో ఎలా ఆడేవాడో అంచనావేసి, భర్తీ చేస్తున్న ఆటగాడు అదే స్థాయిలో ఉండేలా చూసుకోవాలి.
అంతే కాకుండా, భర్తీ అభ్యర్థి వల్ల జట్టుకు అధిక లాభం కలిగే అవకాశం ఉందని మ్యాచ్ రిఫరీకి అనిపిస్తే, షరతులను విధించే హక్కు రిఫరీకి ఉంటుంది.
దుబే స్థాన్నాన్ని భర్తీ చేయడానికి భారత జట్టులో ఉన్న ఇతర ఆప్షన్లు - బౌలర్ మహ్మద్ షమీ, వికెట్ కీపర్-బ్యాటర్ ధ్రువ్ జురెల్, స్పిన్-బౌలింగ్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్, దుబే వలె మీడియం పేస్ బౌలింగ్ చేసే బ్యాటింగ్ ఆల్-రౌండర్ రమణదీప్ సింగ్.
ఎవరేమన్నారు?
ఇంగ్లండ్ ఓటమికి మ్యాచ్ లో హర్షిత్ చేరిక ఒక్కటే కారణం కాదని బట్లర్ అంగీకరించారు. కానీ మ్యాచ్ రిఫరీ నిర్ణయాన్ని తప్పుపట్టారు.
మ్యాచ్ రిఫరీ జవగల్ శ్రీనాథ్ నుంచి మరింత స్పష్టతను కోరతానన్న బట్లర్, హర్షిత్ ఒక 'లైక్ ఫర్ లైక్' ఎంపిక కాదని అభిప్రాయపడ్డారు.
బ్యాటింగ్ చేయడానికి నేను వెళ్ళినప్పుడు, 'హర్షిత్ ఎవరి స్థానంలో వచ్చాడు?' అనుకున్నా.
నా జట్టు సభ్యులు హర్షిత్ ఒక కంకషన్ సబ్‌స్టిట్యూట్ అని చెప్పారు.నాకు అదొక తప్పుడు నిర్ణయం అనిపించింది.
ఇంగ్లండ్ జట్టు మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ ఈ నిర్ణయాన్ని అర్థం లేనిదిగా అభివర్ణించారు.
ఐపీఎల్‌లో 2024లో కేవలం ఒక ఓవర్ బౌలింగ్ చేసిన పెద్ద హిట్టింగ్ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ స్థానంలో బ్యాటింగ్ చేయలేని, మంచి వేగంతో బౌలింగ్ చేసే ఆటగాడిని ఎన్నుకోవడం నాకు అర్థం కాలేదు. అసలు ఆలా చేయడానికి అనుమతి ఇవ్వడమే సరి కాదు. అరంగేట్రం చేసిన హర్షిత్‌కు అభినందనలు. కానీ ఈ ఆటలో తాను ఆ స్థానంలో ఆడి ఉండకూడదు. కెప్టెన్ ను ఒక చక్కటి అవకాశం ఇచ్చినట్టు అయింది’ అని ఆయన టీఎన్‌టీ స్పోర్ట్స్‌తో అన్నారు.
ఇంగ్లండ్ ఓటమితో భారత్ ఈ సిరీస్‌లో 3-1 ఆధిక్యం సాధించింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








