12 ఏళ్ల తర్వాత దేశవాళీ క్రికెట్‌లోకి విరాట్ కోహ్లీ, అభిమానులతో కిక్కిరిసిన స్టేడియం

విరాట్ కోహ్లీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కొన్నేళ్లగా టెస్టుల్లో పరుగులు చేసేందుకు కోహ్లీ తీవ్రంగా శ్రమిస్తున్నాడు.
    • రచయిత, నికితా యాదవ్
    • హోదా, బీబీసీ న్యూస్, దిల్లీ

దేశవాళీ క్రికెట్‌లోకి విరాట్ కోహ్లీ తిరిగివచ్చిన వేళ, అతని ఆట చూసేందుకు దేశ రాజధాని దిల్లీలోని స్టేడియం వేలాదిమంది అభిమానులతో నిండిపోయింది. 12 ఏళ్ల తరువాత కోహ్లీ దేశవాళీ క్రికెట్‌లోకి గురువారం అడుగుపెట్టాడు.

రైల్వేపై జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్ కోసం 36 ఏళ్ల స్టార్ బ్యాటర్ కోహ్లీ ప్రేక్షకులతో నిండిపోయిన అరుణ్ జైట్లీ స్టేడియంలో దిల్లీ తరఫున ఆడుతున్నాడు.

బోర్డర్-గావాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా చేతిలో ఇండియా 3-1 తేడాతో ఓడిపోయిన తర్వాత కాంట్రాక్ట్ ఆటగాళ్లందరూ దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ ఆదేశించింది. క్రికెట్ బోర్డు ఆదేశాల మేరకు కోహ్లీ దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు.

టెస్టు క్రికెట్‌లో పేలవమైన ఫామ్ కనపరుస్తున్న కోహ్లీ దేశవాళీ క్రికెట్ ద్వారా మునుపటి ఫామ్‌ను అందుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది.

కోహ్లీపై భారీ అంచనాలు

భారత్ అత్యుత్తమ బ్యాటర్లలో ఒకరైన కోహ్లీ దూకుడు, సాంకేతికత మేళవించిన ఆటతీరుతో ఆధునిక క్రికెట్‌కు కొత్త నిర్వచనం ఇచ్చాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి అంతర్జాతీయ మ్యాచుల్లో 27వేలకు పైగా పరుగులు సాధించాడు. దశాబ్దానికి పైగా భారత మిడిల్ ఆర్డర్‌కు కోహ్లీ వెన్నెముకలా ఉన్నాడు.

కానీ ఇటీవల కోహ్లీ తన స్థాయిలో ఆడడం లేదు. 2019 వరకు టెస్టు క్రికెట్‌లో కోహ్లీ సగటు 54.97ఉండేది. తర్వాత అది 30.72కు పడిపోయింది. గత పది టెస్టుల్లో కోహ్లీ సగటు కేవలం 22.47.

ఇక 2024 ప్రారంభం నుంచి అయితే కోహ్లీ సగటు 23.2గా ఉంది. పది ఇన్నింగ్స్‌లలో సగటు ఇంత తక్కువగా ఉన్న ఆటగాళ్లలో కోహ్లీ తొమ్మిదో స్థానంలో ఉన్నాడు.

దేశవాళీ క్రికెట్‌లోకి కోహ్లీ తిరిగి రావడంపై ప్రేక్షకులు, అభిమానులు సంతోషంతో ఉన్నారు. కోహ్లీ తిరిగి మునుపటి ఫామ్‌లోకి రావడానికి ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

మ్యాచ్‌కు ముందు దిల్లీ జట్టుతో కలిసి కోహ్లీ ప్రాక్టీస్‌లో పాల్గొంటాడన్న విషయం తెలియడంతో స్టేడియం దగ్గరకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. దేశవాళీ మ్యాచ్‌కు ముందు ఇలాంటి దృశ్యం కనిపించడం అరుదని టీవీ, యూట్యూబ్ జర్నలిస్టులు అంటున్నారు.

''నెట్స్‌లో ప్రాక్టీస్ చేసే ముందు దిల్లీ జట్టులోని సభ్యులతో కలిసి కోహ్లీ ఫుట్‌బాల్ డ్రిల్స్‌లో పాల్గొన్నాడు. ఆ ప్రాక్టీస్‌లో కాసిన్ని నవ్వులు, వందమీటర్ల పరుగులు ఉన్నాయి’’ అని ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌ఫో తెలిపింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
విరాట్ కోహ్లీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2006లో రంజీ ట్రోఫీలో తొలి మ్యాచ్ ఆడిన కోహ్లీ

ఆరేళ్లపాటు దిల్లీకి ఆడిన కోహ్లీ

మ్యాచ్ చూసేందుకు అభిమానులను ఉచితంగా అనుమతించడంతో స్టేడియం బయట భారీ క్యూ లైన్లు కనిపించాయి. మ్యాచ్ ప్రారంభం కావడానికి దాదాపు ఐదుగంటల ముందు నుంచి తాను స్టేడియం బయట నిల్చుని ఉన్నానని ఆకాశ్ కుమార్ అనే వ్యక్తి ఏఎన్ఐతో చెప్పారు. దేశవాళీ మ్యాచ్ కోసం ఈ స్థాయి రద్దీ తానెప్పుడూ చూడలేదన్నారు.

కోహ్లీ రాకతో జట్టులోని ప్రతి ఒక్కరు ఆనందంతో ఉన్నారని, అతని నుంచి స్ఫూర్తి పొందుతున్నారని దిల్లీ టీమ్ కెప్టెన్ అయుష్ బదోని చెప్పారు.

కోహ్లీని చూడడం తమకు స్ఫూర్తి కలిగిస్తుందని దిల్లీ టీమ్ ప్రత్యర్థి జట్టయిన రైల్వేస్ టీమ్ కెప్పెన్ ప్రథమ్ సింగ్ అన్నారు. ఈ మ్యాచ్‌లో మరింత మెరుగ్గా రాణించాలన్న ఉత్సాహం కలిగిందని చెప్పాడు.

దిల్లీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో కోహ్లీ బ్యాటింగ్ చూడడానికి ప్రేక్షకులు కాస్త ఎదురుచూడాల్సి ఉంది.

ఎర్ర బంతితో ఆడే భారత దేశవాళీ రంజీ ట్రోఫీ సీజన్ జనవరి 5 నుంచి మార్చి 10 వరకు జరుగుతుంది. 32 జట్లు పోటీపడుతున్నాయి.

కోహ్లీ 2006లో 18 ఏళ్ల వయసులో దేశవాళీ క్రికెట్‌లో తొలి మ్యాచ్ ఆడాడు. మొదటి మ్యాచ్‌లో కోహ్లీ కేవలం 10 పరుగులు మాత్రమే చేశాడు.

తర్వాత ఆరేళ్లపాటు దిల్లీ టీమ్‌కు ఆడిన కోహ్లీ ఐదు సెంచరీలు చేశాడు. పలుమార్లు 50కి పైగా పరుగులు చేశాడు. 2012లో కోహ్లీ చివరిసారి దేశవాళీ మ్యాచ్‌లో ఆడాడు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)