ఆంధ్రప్రదేశ్-తెలంగాణ: ఏనుగులు పగబడతాయా, హఠాత్తుగా ఎదురైతే ఏం చేయాలి?

ఏనుగులు, వైల్డ్ లైఫ్, ఆంధ్రప్రదేశ్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి నంగా
    • హోదా, బీబీసీ కోసం

గత కొద్దికాలంగా ఆంధ్రప్రదేశ్‌లో ఏనుగుల విధ్వంసం, మనుషులపై దాడి చేయడం వంటి ఘటనలు జరిగాయి. ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఈ ఘటనలు ఎక్కువగా నమోదవుతున్నాయి.

ఇటీవల తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కందులవారిపల్లి సమీపంలో ఏనుగులు సంచరిస్తున్నాయనే సమాచారంతో ఆ గ్రామ ఉప సర్పంచ్ రాకేశ్ చౌదరి కొంతమంది రైతులతో కలిసి వాటిని తరిమేసేందుకు పొలాల దగ్గరకు వెళ్లారు.

అయితే, ఏనుగులు వారిని వెంబడించడంతో, తప్పించుకోవడానికి పరిగెత్తే క్రమంలో ఏనుగులు ఆయన్ను తొక్కి చంపేశాయి.

అసలు ఏనుగులు మనుషులపై ఎందుకు దాడి చేస్తాయి? ఒకవేళ హఠాత్తుగా ఏనుగు ఎదురైతే ఏం చేయాలి? దాని నుంచి తప్పించుకోవడమెలా? వంటి ప్రశ్నలకు ఫారెస్ట్ అధికారులు ఏం చెబుతున్నారో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
వైల్డ్ లైఫ్ , ఏనుగులు
ఫొటో క్యాప్షన్, ఏనుగు దాడి అనంతర దృశ్యాలు

1.ఏనుగు హఠాత్తుగా కనిపిస్తే..

ఏనుగు మనకు 30 మీటర్ల దూరంలో కనిపించిందంటే వీలైనంతవరకు మనం కిందికి (లోతట్టు ప్రాంతానికి) పరిగెత్తడానికి ప్రయత్నించాలని తిరుపతి జిల్లా చంద్రగిరి సెక్షన్ ఫారెస్ట్ ఆఫీసర్ అనిత చెప్పారు.

ఏనుగుల ప్రవర్తన ఎలా ఉంటుంది, అవి ఎందుకు దాడి చేస్తాయనే అంశాల గురించి బీబీసీతో ఆమె మాట్లాడారు. ఏనుగు హఠాత్తుగా కనిపించినప్పుడు, వాటి నుంచి ఎలా తప్పించుకోవాలనే విషయాలను వివరించారు.

''ఏనుగు పైకి(మెరక) ఎక్కగలిగినంత వేగంగా, కిందికి దిగలేదు. కిందికి దిగడానికి ప్రయత్నించినప్పుడు అది స్లో అవుతుంది. అప్పుడు మనం వెళ్లి ఏదైనా చాటు చూసి దాక్కోవచ్చు'' అన్నారామె.

ఏనుగులు, వైల్డ్ లైఫ్, ఆంధ్రప్రదేశ్

ఫొటో సోర్స్, Getty Images

2.ఏనుగు దాడిని పసిగట్టడం ఎలా?

ఏనుగు ప్రవర్తించే విధానాన్ని బట్టి అది దాడి చేయబోతుందని పసిగట్టవచ్చని ఫారెస్ట్ ఆఫీసర్ అనిత తెలిపారు.

''ఏనుగు చెవులు వెనక్కు మడిచి, తర్వాత ఎడం కాలుతో నేలను గీరుతుందంటే అటాక్ చేయడానికి సిద్ధమైందని అర్థం. అప్పుడు దాని నుంచి తప్పించుకోవడానికి నేరుగా కాకుండా, జిగ్‌జాగ్‌గా పరిగెత్తాలి. ఏనుగు నేరుగా మాత్రమే పరిగెడుతుంది కాబట్టి అప్పుడు దాని నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది.''

''తెలుపు రంగు దుస్తులు ధరించి ఉంటే, వెంటనే తీసేయాలి. కారం లాంటిది ఏదైనా దగ్గరుంటే, గాల్లోకి చల్లితే ఆ ఘాటుకు అది తల కిందకు వంచేస్తుంది. అప్పుడు మనం ఎక్కడైనా దాక్కోవచ్చు. ఏదైనా చెట్టు పైకెక్కి మనల్ని మనం రక్షించుకోవచ్చు.''

''ఏదైనా గుంత ఉండి, దాని తొండానికి అందనంత లోతు ఉంటే, అందులో కూర్చుని, ఎలాంటి శబ్దం చేయకుండా ఉంటే అది వెళ్లిపోయే అవకాశం ఉంది. తేనెటీగల శబ్దమంటే దానికి భయం. తేనెటీగలు ఏనుగు ముక్కులోకి, నోట్లోకి వెళ్లిపోతాయి కాబట్టి అది వాటి సౌండ్‌కి భయపడుతుంది. చుట్టుపక్కల ఎక్కడైనా తేనె తుట్టె ఉంటే దానిపై ఒక రాయి వేసి కూడా మనల్ని మనం కాపాడుకోవచ్చు'' అని అనిత చెప్పారు.

ఏనుగులు, వైల్డ్ లైఫ్

ఫొటో సోర్స్, Getty Images

3.ఒంటరిగా ఉందా, మందలో ఉందా?

ఏనుగు ఒంటరిగా ఉందా, గుంపులో ఉందా? అనేది చాలా ముఖ్యం. మిగిలిన జంతువుల తరహాలోనే ఏనుగులతో పాటు వాటి పిల్ల ఏనుగులు వాటితోపాటు ఉంటే అవి మరింత ప్రమాదకరంగా ప్రవర్తిస్తాయి.

''టపాకాయలు పేలిస్తే బెదురుతాయి. కానీ వాటి పిల్లలు ఉన్నప్పుడు కొంచెం వైల్డ్‌గా ఉంటాయి. ఆ టైంలో టపాకాయలు పేలిస్తే ఇరిటేట్ అవుతాయి. అప్పుడు మనపై దాడులు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది'' అని అనిత చెప్పారు.

''కళ్లలోకి నేరుగా చూడకూడదు. మద్యం తాగి ఉంటే ఆ స్మెల్‌కి అట్రాక్ట్ అయ్యి మనపై అటాక్ చేసే అవకాశముంది.''

''ముందుగా ఏనుగు సింగిల్‌గా ఉందా...గ్రూపుగా ఉన్నాయా? అనేది తెలుసుకోవాలి. ఏనుగుని చూడాలని కూడా కొందరు వస్తుంటారు. మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఏనుగులు మనకంటే వేగంగా పరిగెత్తగలవు. 100 మీటర్ల దూరంలో ఉన్నాయని, ఇటువైపు వస్తే పరిగెత్తి తప్పించుకోవచ్చనే ఉద్దేశంలో ఉంటారు, కానీ అవి ఇంకా వేగంగా రాగలవు. వాటికి చాలా దూరంగా ఉండాలి'' అని మరిన్ని జాగ్రత్తలు చెప్పారు తిరుపతి కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సెల్వం.

ఏనుగులు, వైల్డ్ లైఫ్

4.ఎలాంటి ఏనుగులు ప్రమాదకరం?

కన్జర్వేటర్ సెల్వం ఇంకా వివరిస్తూ, ''కొన్ని సందర్భాల్లో ఒంటరి ఏనుగు, టస్కర్ అంటారు. అవి గ్రూప్ నుంచి విడిపోయి, బయటకు వస్తుంటాయి. అలాంటి ఏనుగు ఇంకా చాలా డేంజర్. గ్రూపులో ఉన్న ఏనుగుల కంటే ఒంటరిగా ఉన్న ఏనుగు దాడి చేసే అవకాశం ఎక్కువ''

''రాత్రివేళలో ఒకవేళ తెలియకుండా వాటి దగ్గరకు వెళ్లినా, టార్చ్‌లైట్ లాంటివి వాడకూడదు. హఠాత్తుగా లైట్ చూసినా అది మీ దగ్గరికి వస్తుంది. వాటికి ఎంతదూరం పాటించగలిగితే అంత దూరంగా ఉండాలి. రెచ్చగొట్టకూడదు. తారసపడిన వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నించాలి, ఇది చాలా ఇంపార్టెంట్'' అన్నారు.

ఏనుగులు, వైల్డ్ లైఫ్

ఫొటో సోర్స్, The Shola Trust

5.ఏనుగులు గుర్తుపెట్టుకుని దాడి చేస్తాయా?

ఎవరైనా తమకు నష్టం కలిగిస్తే ఏనుగులు వారిని గుర్తు పెట్టుకుంటాయని, ఎంతమందిలో ఉన్నా వారిని గుర్తించి దాడి చేస్తాయని తిరుపతి డీఎఫ్‌వో వివేక్ చెప్పారు.

''మనం మామూలు నేల మీద బాగా నడవగలుగుతాం. కానీ, ఏనుగులు ఎలాంటి ప్రాంతం అయినా ఒకే వేగంతో నడవగలవు. ఒకసారి ఎవరైనా వాటి విషయంలో తప్పు చేస్తే అది వారిని గుర్తుపెట్టుకుంటుంది. ఎప్పుడైనా, ఎంతమంది ఉన్నా వారిపై మాత్రమే దాడి చేస్తుంది'' అన్నారాయన.

ఇలాంటి ఘటనే ఇటీవల చిత్తూరు జిల్లాలో చూశామని వివేక్ తెలిపారు.

''అటవీ శాఖకు చెందిన ఒక వ్యక్తి చనిపోయారు. ఆయన ఏనుగులతో మిస్‌బిహేవ్ చేసినట్టు రిపోర్ట్ వచ్చింది. అక్కడ 20 మంది జనం ఉన్నా ఆ ఒక్కడినే చంపడం అనేది దాని జ్ఞాపకశక్తి గురించి చెబుతుంది.'' అని వివేక్ తెలిపారు.

సాధారణంగా, గంటకు పది కిలోమీటర్ల వేగంతో నడిచే ఏనుగు, పరిగెత్తితే 40 కిలోమీటర్లు వేగాన్ని అందుకోగలదని ఆయన వెల్లడించారు.

ఏనుగులు, వైల్డ్ లైఫ్
ఫొటో క్యాప్షన్, కన్జర్వేటర్ సెల్వం, ఫారెస్ట్ ఆఫీసర్లు అనిత, వివేక్

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

ఏనుగుల సంచారం ఉన్న ప్రాంతాల్లో, ఎంత అత్యవసరమైనా సాయంత్రం 5 గంటల తర్వాత బయటకు వెళ్లకూడదు.

ఒకవేళ వెళ్లాల్సి వస్తే ఫ్లాష్ లైట్ తీసుకెళ్లాలి. ఏనుగులు నలుపు రంగులో ఉండడం వల్ల దగ్గరగా వచ్చేంత వరకూ కనిపించవు. 100 మీటర్లకు ఒకసారి చూస్తూ వెళ్లాలి.

ఏనుగులు వెంటపడినప్పుడు జిగ్ జాగ్‌గా పరిగెత్తడం ఉత్తమం.

గుంతలు (ట్రెంచ్)‌లు లాంటివి ఉంటే వాటిలో దిగి, తప్పించుకోవచ్చు.

తారసపడిన వెంటనే, వీలైనంత త్వరగా వాటికి కనిపించకుండా దాక్కోవడం మేలు.

పంట పొలాల్లోకి వస్తాయనుకుంటే, ఎండు మిరపకాయలతో ఫైర్ క్యాంప్ పెట్టుకుంటే అటువైపు రావు. ఎండు మిరపకాయ ఘాటు ఏనుగులకు పడదు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)