ఏపీలోని ఈ 2 లక్షల ఎకరాల మంచినీటి సరస్సుకు మళ్లీ మంచి రోజులొస్తాయా?

కొల్లేరు
ఫొటో క్యాప్షన్, కొల్లేరు
    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్
    • హోదా, బీబీసీ కోసం

'ఆపరేషన్‌ కొల్లేరు' మళ్లీ తెరపైకి వచ్చింది. ఆసియాలోనే అతిపెద్ద మంచినీటి సరస్సుగా పర్యావరణ వేత్తలు పేర్కొనే కొల్లేరు పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అక్కడి ఆక్రమణలను తొలగించాలని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించింది.

చుట్టుపక్కల పరిశ్రమలు, పట్టణాలు, గ్రామాల నుంచి వచ్చే మురుగునీటిని, వ్యర్థాలను కొల్లేరులోకి వదలకుండా అడ్డుకట్ట వేయాలని స్పష్టం చేసింది.

గతేడాది డిసెంబరు 11న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, మూడు నెలల్లోపు కొల్లేరు సరిహద్దులను ఖరారు చేయాలని జనవరి 16న నిర్దేశించిన సుప్రీంకోర్టు, తదుపరి విచారణను మార్చి 19కి వాయిదా వేసింది.

ఎప్పుడో దశాబ్దాల కిందట నిర్ధరించిన సరస్సు కాంటూర్ (పరిధి) ఆధారంగా 'ఆపరేషన్‌' చేపడితే కొల్లేరును నమ్ముకుని ఏళ్లుగా చేపల సాగు చేస్తున్న తమ జీవనం ప్రశ్నార్థకం అవుతుందని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
కొల్లేరు గ్రామం
ఫొటో క్యాప్షన్, కొల్లేరు గ్రామం

పర్యావరణవేత్త పిటిషన్‌తో

ఏళ్ల తరబడి ఆక్రమణలకు గురై కొల్లేరు సరస్సు కుచించుకుపోతోందని కాకినాడకు చెందిన పర్యావరణవేత్త మృత్యుంజయరావు గతేడాది సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

కృష్ణా, గోదావరి డెల్టాల మధ్య సహజసిద్ధంగా ఏర్పడి, వరదలు వచ్చినప్పుడు ప్రకృతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌గా పనిచేసే అరుదైన సరస్సు కొల్లేరు అని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

కొల్లేరు సంరక్షణ కోసం 2006 ఏప్రిల్‌ 10న సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను ఉల్లంఘిస్తున్న ప్రభుత్వ అధికారులపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన 2024 ఆగస్టు 30న పిటిషన్‌ దాఖలు చేశారు.

అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ను ప్రతివాదిగా చేరుస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు విచారించింది.

జస్టిస్‌ బీఆర్‌ గవాయ్, జస్టిస్‌ అగస్టీన్‌ జార్జ్‌ మసీహ్, జస్టిస్‌ కె. వినోద్‌ చంద్రన్‌తో కూడిన ధర్మాసనం, కొల్లేరు పరిరక్షణపై రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది.

కొల్లేరు సరస్సులో సహజ నీటి ప్రవాహాన్ని అడ్డుకొని, వన్యప్రాణుల మనుగడకు ప్రమాదకరంగా మారిన ఆక్రమణలను తొలగించడంతో పాటు భవిష్యత్తులో అవి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

మత్స్యకారుల జీవనోపాధికి ఎలాంటి అడ్డంకులు ఉండబోవనే విషయంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించింది.

గుర్రపు డెక్క, ఇతర వ్యర్ధాలతో కొల్లేరు
ఫొటో క్యాప్షన్, గుర్రపు డెక్క, ఇతర వ్యర్థాలతో కొల్లేరు

ఎప్పటి నుంచి కొల్లేరు అభయారణ్యమంటే...

ప్రపంచ వ్యాప్తంగా చిత్తడి నేతలు, అక్కడి జీవజాతుల సంరక్షణ కోసం పని చేసే రామ్‌‌సార్ కన్వెన్షన్ 2002లో వెల్లడించిన వివరాల ప్రకారం కొల్లేరు సరస్సు విస్తీర్ణం సుమారు 90,100 హెక్టార్లు ( సుమారు 222641.95 ఎకరాలు )

అంతకు చాలా ఏళ్ల ముందు అంటే 1963 సెప్టెంబర్‌లో కొల్లేరును పక్షుల అభయారణ్యంగా ప్రకటిస్తూ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్‌ 1986ను విడుదల చేసింది.

1995లో కొల్లేరును వన్యప్రాణుల అభయారణ్యంగా ప్రకటిస్తూ అదే ఏడాది సెప్టెంబర్‌ 25న ఉత్తర్వులు జారీ చేసింది. 1999 అక్టోబర్‌ 4వ తేదీన కొల్లేరును అభయారణ్యంగా ప్రకటిస్తూ తుది నోటిఫికేషన్‌ జీవో నెంబర్‌ 120ను విడుదల చేసింది.

ఈ ఉత్తర్వుల ప్రకారం ఉమ్మడి పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లోని తొమ్మిది మండలాల్లో అయిదో కాంటూరు( సముద్ర మట్టానికి 5 అడుగుల ఎత్తులో ఉండే ప్రాంతం) పరిధి వరకు 77,138 ఎకరాలను కొల్లేరు అభయారణ్యంగా గుర్తించారు.

కాంటూరు లెక్కలు ఇలా

పదో కాంటూరు వరకు 2,25,250ఎకరాలు

ఏడో కాంటూరు వరకు 1,68,750 ఎకరాలు

ఐదో కాంటూరు వరకు 77,148 ఎకరాలు (కొల్లేరు అభయారణ్యం)

మూడో కాంటూరు వరకు 33,750 ఎకరాలు

తొమ్మిది మండలాల వారీగా ఇలా

ఏలూరు మండలంలో 23,900 ఎకరాలు, ఉంగుటూరులో 134 ఎకరాలు, పెదపాడులో 789, దెందులూరులో 586, ఆకువీడులో 6914, నిడమర్రులో 6838, భీమడోలులో 20,323, కైకలూరులో 10,295, మండవల్లిలో 7359 ఎకరాలను అభయారణ్యంగా గుర్తించారు.

మొత్తంగా 77,138 ఎకరాలు కాగా, అందులో 14, 218.77 ఎకరాలను జిరాయితీ భూములుగా, 62, 919.23 ఎకరాలను ప్రభుత్వ భూములుగా నోటిఫై చేశారు.

కొల్లేరు
ఫొటో క్యాప్షన్, కొల్లేరు

2006లో తొలిసారి కొల్లేరు ఆపరేషన్‌

కొల్లేరు చెరువుల్లో చేపల సాగుతో జీవించే మత్య్సకారుల పేరుతో వ్యాపారులు చొరబడటం, ఆక్రమణలకు పాల్పడటం, ఇష్టారాజ్యంగా తవ్వకాలకు దిగిన పరిస్థితుల్లో పక్షులు, వన్యప్రాణుల ఆవాసాలకు ప్రమాదం ఏర్పడుతోందని పర్యావరణవేత్తలు ఇరవై ఏళ్ల కిందటే సుప్రీంకోర్టుని ఆశ్రయించారు.

దీంతో 2006లో సుప్రీంకోర్టు ఆదేశాలతో మొదటిసారిగా కొల్లేరు ఆపరేషన్‌ చేపట్టారు.

అప్పట్లో దాదాపు 3 నెలలకుపైగా అటవీ, రెవిన్యూ, పోలీసు అధికారులు ఈ అక్రమ చెరువులను ధ్వంసం చేశారు.

గట్లను బాంబులతో పేల్చివేశారు. స్థానికుల నుంచి వ్యతిరేకత వచ్చినా నాటి అధికారులు మత్స్యకారుల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా చూస్తామని ఒప్పించి కొల్లేరు ఆపరేషన్‌ను కొనసాగించారు.

గుర్రపు డెక్క, ఇతర వ్యర్ధాలతో కొల్లేరు

మళ్లీ 15వేల ఎకరాల్లో ఆక్రమణలు

''2006లో మొదలుపెట్టిన కొల్లేరు ఆపరేషన్‌ పూర్తిస్థాయిలో జరగలేదు. పైగా తర్వాతి కాలంలో దురాక్రమణలు పెరిగాయి. చేపల చెరువుల పేరిట వేల ఎకరాల్లో తవ్వకాలు జరుగుతున్నాయి. ఎరువులు, పురుగు మందుల వాడకంతో మంచినీటి సరస్సు మురుగు కాసారమైంది. సహజ సిద్ధంగా పెరిగే చేపలు తగ్గుముఖం పట్టాయి. దేశ, విదేశాల నుంచి కొల్లేరుకు చేరుకునే అరుదైన పక్షుల ఆవాసం దెబ్బతింది'' అని పర్యావరణవేత్త మృత్యుంజయరావు గతేడాది వేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు.

సుప్రీంకోర్టు ఇటీవల సీరియస్‌ అయిన నేపథ్యంలో మళ్లీ కొల్లేరు ఆపరేషన్‌ తప్పదా అనే చర్చ ఇప్పుడు నడుస్తోంది.

ఇప్పటికే కొల్లేరు వన్యప్రాణి అభయారణ్యంలో దాదాపు 15,339 ఎకరాల్లో ఆక్రమిత చెరువులు ఉన్నట్టు సమాచార హక్కు చట్టం ద్వారా అటవీశాఖ అధికారులు సమాచారం ఇచ్చారు.

901 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన సరస్సులో 308.55 చదరపు కిలోమీటర్లు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం కింద నోటిఫై చేసినట్లు పేర్కొన్నారు.

6,908 హెక్టార్లలో ఆక్వాకల్చర్‌ ఉండటంతో పాటు చెరువు గట్ల నిర్మాణం వల్ల సరస్సులో సహజ నీటి ప్రవాహానికి అడ్డంకులు ఎదురవుతున్నాయని వివరించారు.

కాగా, దీనిపై మరిన్ని వివరాల కోసం పిటిషనర్‌ మృత్యుంజయరావును బీబీసీ సంప్రదించగా, సుప్రీంలో విచారణ సాగుతున్నందున దీనిపై తాను బహిరంగంగా ఇప్పుడేమీ మాట్లాడలేనని చెప్పారు.

గుర్రపు డెక్క, ఇతర వ్యర్ధాలతో కొల్లేరు

''సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేస్తాం కానీ,''

''కొల్లేరు ఆక్రమణలకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాలను పక్కాగా అమలు చేస్తాం. అందులో అనుమానం లేదు. అయితే ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు రాలేదు. కానీ కొల్లేరులో అక్రమ చెరువులు, నిబంధనలకు విరుద్ధమైన నిర్మాణాల తొలగింపు అనేది నిరంతర ప్రక్రియ.కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ లేనప్పటికీ ఆక్రమణల తొలగింపును ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానం మార్గదర్శకాల నేపథ్యంలో ప్రభుత్వ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాక పూర్తిస్థాయి బలగాలతో ఆక్రమణల తొలగింపు చేపడతాం'' అని పేరు చెప్పడానికి ఇష్టపడని అటవీ శాఖ ఉన్నతాధికారి ఒకరు బీబీసీకి తెలిపారు.

గుర్రపు డెక్క, ఇతర వ్యర్ధాలతో కొల్లేరు

అటవీ శాఖ పని

''కొల్లేరు అభయారణ్యంలో ఆక్రమణల తొలగింపు అనేది ప్రధానంగా అటవీశాఖ పని. 2006 ఆపరేషన్‌ తర్వాత 2008లో కొల్లేరు సరిహద్దులను నిర్ధారించి అటవీశాఖకు అప్పగించేశాం. రికార్డులు కూడా అందజేశాం.

ఆ భూముల్లో 270 సర్వే రాళ్లు పాతాల్సి ఉండగా, 100 రాళ్లు పాతారు. మిగిలిన సర్వే రాళ్లు కూడా పాతాల్సి ఉంది. ఇప్పుడు ఆక్రమణల తొలగింపుపై శాఖాపరంగా మేం సహకరిస్తాం'' అని కొల్లేరు ఎక్కువ భాగం విస్తరించి ఉన్న ఏలూరు జిల్లా ఆర్డీవో అంబరీష్‌ బీబీసీకి తెలిపారు.

''కేవలం అభయారణ్య పరిధిలోని చెరువులను మాత్రమే ధ్వంసం చేస్తారు. మిగిలిన చెరువులను సంరక్షిస్తాం. మత్స్యకారులు, కొల్లేరు గ్రామ ప్రజలు ఎటువంటి ఆందోళన చెందనక్కరలేదు'' అని ఆర్డీవో భరోసానిచ్చారు.

మత్స్యకార సంఘం నేత ఘంటశాల మహాలక్ష్మి రాజు
ఫొటో క్యాప్షన్, మత్స్య సంఘం నేత ఘంటశాల మహాలక్ష్మి రాజు

మత్స్యకారులు ఏమంటున్నారంటే..

అరుదైన జాతుల‌ ప‌క్షులు, ప‌లు ర‌కాల చేప‌ల‌కు కొల్లేరు ప్రసిద్ధి. ఎన్నో అరుదైన విదేశీ ప‌క్షుల‌కు కొల్లేరు ఆవాసంగా ఉంటోంది. దీని ప‌రిధిలో 122 లంక గ్రామాల్లో దాదాపు మూడు ల‌క్ష‌ల మంది నివస్తున్నారు

కొల్లేరులో 5వ కాంటూరు నుంచి 3వ కాంటూరుకి కుదించాల‌ని స్థానికులు చాలాకాలంగా కోరుతున్నారు. గ‌తంలో భీమ‌వ‌రం బ‌హిరంగ‌స‌భ‌లో 2014 ఎన్నిక‌ల‌కు ముందు న‌రేంద్ర మోదీ కూడా దీనిపై హామీ ఇచ్చారు.

ఆ త‌ర్వాత 2015లో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అసెంబ్లీలో కాంటూరు కుదింపు కోసం తీర్మానం కూడా చేసింది. కానీ, అది కేంద్రం ప‌రిధిలో ఉన్న అంశం కావడంతో వారికి నివేదిస్తున్న‌ట్టు రాష్ట్ర ప్ర‌భుత్వం తెలిపింది.

ఆ తర్వాత ఎన్నికల్లోనూ రాజకీయా పక్షాలు కాంటూరు కుదింపు మీద హామీలు ఇచ్చాయి.

''కొల్లేరు అభయారణ్యం పరిధిని మూడో కాంటూర్‌కి తగ్గించాలి. ఎప్పుడో దశాబ్దాల క్రితం నిర్ధరించిన కాంటూర్‌లను పట్టుకుని ఇప్పుడు మళ్లీ ఆపరేషన్‌ చేపడితే ఆ కొల్లేరునే నమ్ముకుని ఏళ్లుగా చేపల సాగు చేస్తున్న వేలాదిమంది జీవనం ప్రశ్నార్థకమవుతుంది'' అని కొల్లేరు మత్స్యకార సంఘం నాయకుడు ఘంటసాల మహాలక్ష్మిరాజు ఆందోళన వ్యక్తం చేశారు.

''అప్పట్లోనే పాలకులు కాంటూర్‌ల నిర్ధరణ సరిగ్గా చేయలేదు. శాస్త్రీయంగా నిర్ధరించకుండా సర్వే నంబర్లను హడావుడిగా వేశారు. ఉదాహరణకు మండవల్లి మండలంలో అయిదో కాంటూరులో ఉండాల్సిన కొన్ని వందల ఎకరాల భూములను ఏడో కాంటూర్‌లో వేశారు. ఇలా కాంటూర్‌ లెక్కల్లోనే తేడా ఉంది. ఇక ఏళ్ల తరబడి క్రమక్రమంగా కొల్లేరు కుచించుకుపోయిన నేపథ్యంలో మళ్లీ తాజాగా కాంటూర్‌లను నిర్ణయించాలి. లేనిపక్షంలో ప్రస్తుతమున్న అభయారణ్యం పరిధిని మూడో కాంటూర్‌కి తగ్గించాలి'' అని మహాలక్ష్మి రాజు కోరారు.

పక్షుల గూళ్లతో పాటు ప్రజల ఊళ్లనూ కాపాడాలని మహాలక్ష్మి రాజు విజ్ఞప్తి చేశారు.

''ఆ పక్షులను కాపాడేది మేమే. పక్షులకు, పర్యావరణానికి మేం వ్యతిరేకం కాదు. కానీ, చేపల సాగునే వృత్తిగా చేసుకుని జీవిస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజల కడుపు కొట్టొద్దు. ఇప్పటికే 2006 ఆపరేషన్‌ దెబ్బకు వేలాదిమంది కొల్లేరువాసులు ఊళ్లు విడిచి వెళ్లిపోయారు. 2006లో మాకు ఎన్నో హామీలు ఇచ్చి మా ద్వారానే చెరువులు ధ్వంసం చేయించారు. కానీ ఆ తర్వాత ఏమీ పట్టించుకోలేదు. ఈసారి అలా చేయొద్దు. క్షేత్రస్థాయిలో వాస్తవాలను చూసి పాలకులు నిర్ణయం తీసుకోవాలి'' అని ఆయన విజ్ఞప్తి చేశారు.

మత్స్యకార సంఘం నేత పెద్దిరాజు
ఫొటో క్యాప్షన్, మత్స్యకార సంఘం నేత పెద్దిరాజు

‘మాకు వెట్‌ ల్యాండ్‌ వద్దు.. డ్రై ల్యాండ్‌ వదిలేయండి’

''కొల్లేరులో వెట్‌ ల్యాండ్‌తో పాటు డ్రై ల్యాండ్‌ చాలా ఉంది. మేం కేవలం డ్రై ల్యాండ్‌ మాత్రమే సాగుకోసం అడుగుతున్నాం. ఒకవేళ మా వద్ద వెట్‌ ల్యాండ్‌ ఉంటే మేమే అప్పగిస్తాం. లేదంటే మీరే ధ్వంసం చేసుకోవచ్చు. కానీ మేం ఏళ్లతరబడి సాగు చేసే చెరువులను మాత్రం వదిలేయండి'' అని బీబీసీతో కొల్లేరు మత్య్యకార సంఘం నేత పెద్దిరాజు అన్నారు.

''కొల్లేరు కాలుష్యం అనగానే మత్య్యకారులపై పడిపోతున్నారు. కానీ పరిశ్రమలు, ఎన్నో సంస్థల వ్యర్థాల వల్లనే సరస్సు కాలుష్య కాసారంలా మారింది. ముందు వాటిపై దృష్టిసారించండి'' అని ఆయన కోరారు.

మురుగునీరు అంశంపై పెదవి విప్పట్లేదు

బుడమేరు, రామిలేరు, తమ్మిలేరు వంటి ప్రధాన ఏరులతో పాటు కృష్ణా, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి 67 మేజర్‌ మీడియం డ్రెయిన్ల ద్వారా కొల్లేరు సరస్సులోకి లక్షా 11 వేల క్యూసెక్కుల మురుగునీరు చేరుతుంది.

ఈ నీళ్లన్నీ కొల్లేరు నుంచి ఉప్పుటేరు మీదుగా సముద్రంలో కలుస్తాయి. అయితే మురుగునీరు కొల్లేరులో కలవకుండా చర్యలు తీసుకోవాలన్న సుప్రీంకోర్టు మార్గదర్శకాల అమలుపై ఇరిగేషన్‌ ఉన్నతాధికారులు సైతం పెదవి విప్పడం లేదు.

ఇరిగేషన్‌ ఏలూరు ఎస్‌ఈ నాగార్జున, మరో అధికారి సుబ్బరాజును బీబీసీ సంప్రదించగా, సుప్రీం మార్గదర్శకాలు చూడలేదని, దానిపై మాట్లాడలేమని అన్నారు.

ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ వెంకటేశ్వరరావును సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.

అలా కుదరదు.. అయితే..

''పెదలంక డ్రయిన్‌ మినహా కృష్ణా జిల్లా నుంచి వెళ్లే డ్రయిన్లన్నీ కొల్లేరులో కలిసి ఉప్పుటేరు మీదుగా సముద్రంలోకి వెళ్లాల్సిందే. ఇందుకు వేరే ప్రత్యామ్నాయమే లేదు'' అని గోదావరి జిల్లాల్లో గతంలో నీటిపారుదలశాఖలో పనిచేసిన రిటైర్డ్‌ ఎస్‌ఈ కృష్ణారావు బీబీసీతో అన్నారు.

వీటి కంటే ముందుగా పరిశ్రమలు, మున్సిపల్‌ వ్యర్థాలు కొల్లేరులో కలవకుండా చర్యలు తీసుకోవాలి. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో ఆ వ్యర్థాలు కలవాలంటే శుద్ధి చేసిన తర్వాతే కలిసేలా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు.

మొత్తం మీద కాలుష్యాన్ని నివారించి ఈ ప్రఖ్యాత మంచి నీటి సరస్సును కాపాడేందుకు ఆపరేషన్ 2.0 తప్పదన్న డిమాండ్లు ఒకవైపు, స్థానికుల ఉపాధి అంశం మరోవైపు బలంగా వినిపిస్తుండటంతో తదుపరి ఏం జరగబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)