కుంభమేళా: తొక్కిసలాటలు ఎందుకు జరుగుతాయి, అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాలో సోమవారం (ఫిబ్రవరి 3న) వసంత పంచమిని పురస్కరించుకుని కోట్లాదిమంది భక్తులు తరలివస్తారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేసింది.
మొత్తంగా కుంభమేళా ముగిసేనాటికి అంటే 45 రోజులలో 45 కోట్ల మందికిపైగా భక్తులు వస్తారని, వీరిలో 15 లక్షలమంది విదేశీ యాత్రికులు రావచ్చని ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన తెలిపింది.
ప్రయాగ్‌రాజ్ జనాభా 2011 లెక్కల ప్రకారం 12 లక్షలపైనే. ఇప్పుడీ సంఖ్య అంటే 2025 నాటికి 16 నుంచి 17 లక్షలకు పైగా చేరుకుంటుందదని అంచనా వేశారు.
అలాంటి చోటకు 200 రెట్లు ఎక్కువగా జనం వస్తున్నారని ప్రభుత్వం చెబుతోంది.
మరి ఇంత భారీగా ప్రజలు తరలివస్తున్నచోట రద్దీ నియంత్రణ (క్రౌడ్ మేనేజ్‌మెంట్) ఎలా? అనేదే ఇప్పుడు అందరి మదిలోనూ మెదిలే ప్రశ్న


జనవరి 29వ తేదీన మౌని అమావాస్యనాడు జరిగిన తొక్కిసలాటలో 30 మంది చనిపోయారు. 60 మంది గాయపడ్డారు.
ఆ రోజున దాదాపు 7-8 కోట్ల మంది వచ్చారని యూపీ ప్రభుత్వం చెబుతోంది.
ఫిబ్రవరి 3న వసంత పంచమి, ఫిబ్రవరి 12న మాఘ పౌర్ణమి, ఫిబ్రవరి 26న మహాశివరాత్రి సందర్భంగానూ ఒకేరోజు కోట్ల సంఖ్యలో భక్తులు వస్తారని భావిస్తున్నారు.
రద్దీ నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లుగా యూపీ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, ఈ విషయంలో గతంలో పలు అధ్యయనాలు ఏం చెబుతున్నాయనేది కీలకంగా మారింది.

సమూహంలో వ్యక్తి ప్రవర్తన మారుతుందా?
సమూహంలో ఉన్నప్పుడు, ఆ సమూహంపై ఆధారపడి ప్రజల ప్రవర్తన ఉంటుందంటు న్నారు అలహాబాద్ ట్రిపుల్ ఐటీ ప్రొఫెసర్లు అశోక్ కుమార్ కనౌజియా, వినీత్ తివారీ.
2019లో అర్థ కుంభమేళాకు అశోక్ కుమార్ అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌గా వ్యవహరించారు.
''క్రౌడ్ మేనేజ్‌మెంట్ అండ్ స్ట్రాటజీస్ ఫర్ సెక్యురిటీ అండ్ సర్వైలెన్స్ డ్యూరింగ్ ది లార్జ్ మాస్ గేదరింగ్ ఈవెంట్స్; ది ప్రయాగ్‌రాజ్ కుంభమేళా 2019 ఎక్స్ పీరియన్స్'' పేరుతో వీరు రాసిన పరిశోధనా పత్రం నేషనల్ అకాడమీ ఆఫ్ సెన్సెస్‌కు చెందిన ‘ది స్ప్రింగర్ జర్నల్’లో ప్రచురితమైంది.
రద్దీ నియంత్రణకు ఎలాంటి ప్రజలు (క్రౌడ్) ఈవెంట్‌కు వస్తారనే విషయంపై అవగాహన ఉండాలని చెబుతున్నారు అశోక్ కుమార్ కనౌజియా.
''వయసు, సమాజ నేపథ్యం, లింగం, స్థానికత, ఏయే రవాణా సౌకర్యాల ద్వారా వస్తున్నారు.. అనే విషయాలపై సమాచారం ఉండాలి.'' అని వివరించారు.
కుంభమేళాకు సాధువులు, కల్పవాసీలు (ఎక్కువగా గ్రామీణ నేపథ్యం ఉన్నవారు), దేశ విదేశాల నుంచి సాధారణ యాత్రికులు వస్తుంటారు. వీరిలో కల్పవాసీలు మినహా మిగిలిన యాత్రికులు త్రివేణి సంగమానికి వచ్చి పుణ్య స్నానాలు చేసి వెనక్కి వెళ్లిపోతుంటారు.
''యాత్రికులు ఎక్కువగా త్రివేణి సంగమంలోనే స్నానాలు చేయాలని భావిస్తుంటారు. అలా కాకుండా వారిని చిన్న చిన్న సమూహాలుగా ఘాట్ మొత్తం విస్తరించేలా నియంత్రించాలి.'' అని చెప్పారు అశోక్ కుమార్.

ఆ మూడు అంశాలు కీలకం
రద్దీ నియంత్రణ మూడు అంశాలపై ఆధారపడి ఉంటుందని తమ పరిశోధనా పత్రంలో అశోక్ కుమార్, వినీత్ తివారీ ప్రస్తావించారు.
''ప్రజలను లోపలికి అనుమతించడం, వేదిక (సంగమం) వద్ద నియంత్రించడం, బయటకు పంపించడం అనే మూడు అంశాలను నియంత్రించడం ద్వారా తొక్కిసలాటకు అవకాశం లేకుండా చూడవచ్చు.'' అని వివరించారు.
అలాగే, రద్దీ నియంత్రణ విషయంలో ఎటువైపు వెళ్లాలి.. ఎలా బయటకు రావాలనే విషయంపై ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని బిహార్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ గతంలో చేసిన ఓ సర్వేలోనూ సూచించింది.
''లోపలికి ప్రవేశించే ప్రదేశాలు, బయటకు వచ్చే ప్రాంతాలను ప్రదర్శించాలి. సాధారణ యాత్రికులు, వీఐపీ, మీడియా పరంగా విభజన ఉండాలి. మేళా జరిగే ప్రదేశంలో స్పష్టమైన సూచనలతో కూడిన బోర్డులు ఏర్పాటు చేయాలి.'' అని పేర్కొన్నారు.

రెండున్నరేళ్లుగా ఏర్పాట్లు
క్రౌడ్ మేనేజ్‌మెంట్ పరంగా రెండు, రెండున్నరేళ్లుగా అవసరమైన చర్యలు తీసుకున్నట్లు కుంభమేళా అదనపు అధికారి వివేక్ చతుర్వేది బీబీసీకి చెప్పారు.
''ప్రయాగ్‌రాజ్‌లో రద్దీ నియంత్రణను దృష్టిలో పెట్టుకుని రోడ్లు వెడల్పు చేయడం, వంతెనలు కట్టడం, కొత్తగా రోడ్లు వేయడం చేశాం.
కుంభమేళా ప్రాంతంలో 30 పాంటూన్ బ్రిడ్జిలు నిర్మించాం. గత కుంభమేళాతో పోల్చితే 8 బ్రిడ్జిలు ఎక్కువగా నిర్మించాం.'' అని చెప్పారు.
సంగమం సమీప ప్రాంతాలకు వచ్చే రోడ్లను ప్రభుత్వం విస్తరించింది. సంగమం లోయర్ 160 అడుగులు, త్రివేణి మార్గం 150 అడుగుల వెడల్పు చేసినట్లుగా చెబుతోంది.
దాదాపు 50వేల మంది పోలీసులు బందోబస్తులో ఉన్నారని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు రాజేశ్ ద్వివేది చెప్పినట్లుగా ఎన్డీటీవీ వెల్లడించింది.
అయినప్పటికీ, జనవరి 29వ తేదీన మౌని అమావాస్య రోజున తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది.
ఈ నేపథ్యంలో కుంభమేళా నిర్వహణా బాధ్యతల కోసం మరో ఇద్దరు అధికారులను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కేటాయించింది.
సీనియర్ ఐఏఎస్‌లు భానుచంద్ర గోస్వామి, అశిష్ గోయల్‌కు బాధ్యతలు అప్పగించింది.
వీరిద్దరికీ 2019లో అర్ధ కుంభమేళా నిర్వహించిన అనుభవం ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
తొక్కిసలాటలు ఎందుకు జరుగుతాయి?
జనసమూహాల్లో తొక్కిసలాటలు జరగడానికి వివిధ కారణాలు కనిపిస్తుంటాయి. అందులో కొన్నింటిని ప్రొఫెసర్ అశోక్ కుమార్ వెల్లడించారు.
''నిర్మాణాలు కూలిపోవడం, అగ్ని ప్రమాదాలు, జనం ప్రవర్తన, భద్రతా పరమైన లోపం, రద్దీ నియంత్రణలో ప్రణాళిక లేకపోవడం, భాగస్వామ్య సంస్థల మధ్య సమన్వయ లోపం, ట్రాఫిక్‌ను నియంత్రించకపోవడం.. ఇలా వివిధ కారణాలతో తొక్కిసలాట జరిగే అవకాశం ఉందని గుర్తించాం.'' అని చెప్పారు.
ముఖ్యంగా గత రెండు దశాబ్దాలలో కుంభమేళాకు వచ్చే ప్రజల సంఖ్య బాగా పెరిగింది. గ్రామీణ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో గుంపులుగా వస్తున్నారు.
''గ్రామాల నుంచి వచ్చిన వారు ఆ గుంపునకు నాయకత్వం వహిస్తున్న వ్యక్తిని అనుసరిస్తుంటారు. ఎక్కడైనాట్రాఫిక్ డైవర్షన్ ఉన్న చోట గుంపులోని వ్యక్తుల నడిచే వేగం ఒక్కసారిగా పెరుగుతుంది. అది తొక్కిసలాటకు దారితీసే అవకాశం ఉంది.'' అని అశోక్ కుమార్ వివరించారు.
2013లో జరిగిన కుంభమేళాపై బిహార్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ తరఫున ''మాస్ గేదరింగ్ ఈవెంట్ మేనేజ్‌మెంట్'' పేరిట ఒక అధ్యయనం చేశారు. దీనికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అనిల్ కె.సిన్హా సారథ్యం వహించారు.
2013లో కుంభమేళా 56 రోజులపాటు జరిగింది. ఆ సమయంలో పది కోట్ల మంది అలహాబాద్ వచ్చినట్లుగా ఈ సర్వే చెబుతోంది.
2013 జనవరి 25న టెంట్లలో అగ్నిప్రమాదం జరిగి ఐదుగురు చనిపోగా, 19 మంది గాయపడినట్లు నివేదికలో పేర్కొన్నారు.
ఇప్పుడు జరుగుతున్న కుంభమేళాలోనూ రెండుసార్లు అగ్నిప్రమాదాలు జరిగాయి.
''కుంభమేళాలో అగ్నిప్రమాదాలు 37 శాతం మేర విద్యుత్ కారణంగానూ, మరో 37 శాతం గ్యాస్ సిలిండర్ల నిర్వహణ సరిగా లేని కారణంగా జరుగుతుంటాయి.'' అని బిహార్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ స్పష్టం చేసింది.

ఏం చేయాలంటే…
కొన్ని ముఖ్యమైన తేదీల్లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయడం, సాధారణ రోజుల్లో (పుణ్య స్నానాలున్నప్పుడు) డిస్కౌంట్లు ప్రకటించడం, అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న వారికి ప్రత్యేక క్యూ సదుపాయం, పుణ్య స్నానాలున్నప్పుడు వీఐపీల రాకపోకలపై నియంత్రణ, ప్రైవేటు వాహనాలకు బదులుగా ప్రజా రవాణాను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు.
తమ పరిశోధనలో రద్దీ నియంత్రణకు కొన్ని సూత్రాలు పాటించవచ్చని తేలిందని చెప్పారు అశోక్ కుమార్.
- క్యూలో ఉన్న ప్రజలకు వేదిక (సంగమం ప్రదేశం లేదా నదీ తీరం) ఎంత దూరంలో ఉంది? రద్దీ ఎలా ఉంది? వేచి ఉండే సమయం గురించి ఎప్పటికప్పుడు తెలియజేయాలి.
- ఏవైనా నిర్దేశిత ప్రదేశాల నుంచి సంగమం ఎంత దూరంలో ఉందో చెప్పాలి.
- సైన్ బోర్డులు లేదా డిస్ ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలి.
- వృద్ధులు, మహిళలు, దివ్యాంగులపై ప్రత్యేక దృష్టి సారించాలి.
- రద్దీ సమయాల్లో యాత్రికుల రాకపోకలలో మార్పులు చేయాలి.
- రద్దీ నియంత్రణ సిబ్బంది ప్రత్యేక డ్రెస్ కోడ్‌తో కనిపించేలా ఏర్పాటు చేయాలి.
- అత్యవసర పరిస్థితి తలెత్తితే గ్రీన్ కారిడార్ ఉండేలా చూసుకోవాలి
- కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సీసీ కెమెరా, డ్రోన్‌లో పర్యవేక్షిస్తూ రద్దీని మళ్లించాలి.
ఈ క్రౌడ్ మేనేజ్‌మెంట్ గురించి కుంభమేళా అదనపు అధికారి వివేక్ చతుర్వేది బీబీసీతో మాట్లాడుతూ.. ఈసారి 2700 ఏఐ ఆధారిత కెమెరాలు ఏర్పాటు చేసినట్లుగా చెప్పారు.
''కెమెరాల లైవ్ ఫీడ్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు వస్తుంది. దాని ద్వారా కుంభమేళా జరిగే ప్రతి ప్రాంతాన్ని పర్యవేక్షించే వీలుంది. రద్దీ ఎక్కడ పెరుగుతుందనే విషయమై ఏఐ కెమెరాలు అప్రమత్తం చేస్తుంటాయి. దానివల్ల యాత్రికులను రద్దీ తక్కువగా ఉన్న ప్రాంతాలవైపు మళ్లించే వీలు కలుగుతోంది. '' అని చెప్పారు.
అలాగే కుంభమేళా సమయంలో ఐదారు కిలోమీటర్ల దూరంలోనే వాహనాలు నిలిపివేస్తుండటంతో నడిచి వెళ్లేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు బిహార్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సర్వే చెబుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
2019లో ఏం చేశారంటే..
2019లో భారీ తొక్కిసలాట జరగకుండా రద్దీ నియంత్రించినట్టు పరిశోధనా పత్రంలో వెల్లడించారు అశోక్ కుమార్.
''సీసీ కెమెరా విజువల్స్ ఆధారంగా జనాన్ని ఆపడం, దారి మళ్లించడం వంటి వ్యూహాలు అనుసరించారు. త్రివేణి సంగమం వద్దకు వెళ్లడం, రావడం ఒకే దిశలో జరిగేలా పర్యవేక్షించారు.'' అని చెప్పారాయన.
అప్పట్లో తీసుకున్న మరికొన్ని చర్యలు గమనిస్తే..
- చివరి ప్రదేశం వరకు ప్రజా రవాణాలో చేరుకునేలా ఏర్పాట్లు చేశారు.
- మౌలిక వసతుల కల్పన, శాటిలైట్ పార్కింగ్ ఏర్పాటు
- ట్రాఫిక్‌ను త్రివేణి సంగమం వద్దకే కాకుండా అన్ని ప్రాంతాలకు సమానంగా వెళ్లేలా చేశారు.
- ముఖ్యమైన ఆరు రోజుల్లో 'నో వెహికల్ జోన్' వ్యూహం అమలు చేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








