‘గాజా’ను స్వాధీనం చేసుకోవాలని ఉందన్న ట్రంప్.. సాధ్యమేనా?

ఫొటో సోర్స్, Getty Images
గాజాను స్వాధీనం చేసుకోవాలని కోరుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చెప్పారు.
వైట్‌హౌస్‌లో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో జరిగిన జాయింట్ న్యూస్ కాన్ఫరెన్స్‌లో చెప్పారు.
ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత వాషింగ్టన్‌లో పర్యటించిన తొలి విదేశీ నేత నెతన్యాహు.
నెతన్యాహుకు ధన్యవాదాలు తెలుపుతూ ట్రంప్ ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రారంభించారు.
ట్రంప్ తన ముందున్న నేతలను విమర్శిస్తూ.. జో బైడెన్ తన నాలుగేళ్ల పదవీ కాలంలో ఇజ్రాయెల్‌కు శత్రువులు పెరిగేలా చేశారని ఆరోపించారు.


ఫొటో సోర్స్, Getty Images
గాజాలో నివసిస్తున్న 18 లక్షల మంది ప్రజలు ఇతర అరబ్ దేశాలకు తరలి వెళ్లాలని, యుద్ధంలో ధ్వంసమైన పాలస్తీనియన్ భూభాగాన్ని స్వాధీనం చేసుకుని, పేలని బాంబులను తొలగించి, ఆర్థికంగా ఈ భూభాగాన్ని తిరిగి అభివృద్ధి చేసేందుకు అనుమతించాలని ట్రంప్ అన్నారు.
అక్కడ ఎవరు నివసిస్తారని మీడియా ప్రశ్నించగా.. ప్రపంచ ప్రజలకు ఇదొక గమ్యస్థానంగా మారుతుందని ట్రంప్ చెప్పారు.
వైట్‌హౌస్‌లో ఇజ్రాయెల్‌కు ఉన్న ఉన్నతమైన స్నేహితుడు అమెరికా అధ్యక్షుడు అని, ఒక విషయాన్ని భిన్నమైన కోణంలో ఆలోచించే సామర్థ్యం ట్రంప్‌కు ఉందని నెతన్యాహు కొనియాడారు.
ఈ ఆలోచన చరిత్రను మార్చగలిగే విషయమని తాను భావిస్తున్నట్లు చెప్పారు.
అయితే, గాజాను అమెరికా ఏ అధికారంతో స్వాధీనం చేసుకుంటుంది? ఎలా స్వాధీనం చేసుకుంటుందన్న ప్రశ్నకు ట్రంప్ నేరుగా సమాధానం చెప్పలేదు.

ఫొటో సోర్స్, Getty Images
తన తొలి పదవీ కాలంలో నెతన్యాహుతో కలిసి పనిచేయడం ఉన్నతమైన విజయాలను అందించిందని ట్రంప్ అన్నారు.
మిడిల్ ఈస్ట్‌లో శాంతిని, స్థిరత్వాన్ని తీసుకొచ్చిందని చెప్పారు.
జెరూసలేంలో అమెరికా ఎంబసీని తెరిచామని, అబ్రహం ఒప్పందాలపై సంతకాలు జరిగాయని అప్పుడే తొలిసారి ఇజ్రాయెల్‌ను కొన్ని అరబ్ దేశాలు గుర్తించాయని చెప్పుకొచ్చారు.
గాజా స్ట్రిప్ ఎన్నో దశాబ్దాలుగా మరణానికి, ధ్వంసానికి సంకేతంగా నిలుస్తుందని చెప్పారు.
పాలస్తీనా భూభాగాన్ని దురదృష్టమైనదిగా పేర్కొన్న ట్రంప్ ఇక్కడ నివసిస్తోన్న 18 లక్షల మంది ప్రజలు ఇతర దేశాలకు వెళ్లాలని అన్నారు.
సౌకర్యవంతంగా, ప్రశాంతంగా జీవించేలా గాజా ప్రజలకు అనుమతించేందుకు ధనిక దేశాలు వారికి పునరావాసం కల్పించాలని కోరారు.
ఇక్కడి నుంచి వెళ్తే వారిపై ఎవరూ కాల్పులు జరపరన్నారు. గాజాలో ప్రజలు ఇక్కడ నివసించేందుకు కారణం ఎలాంటి ప్రత్యామ్నాయం లేకపోవడమేనని ఆయన అన్నారు.
ఇజ్రాయెల్, హమాస్ మధ్యలో రెండో దశ కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలు ప్రారంభం కానున్నాయి.
తొలి దశ కాల్పుల విరమణ ఒప్పందం మార్చి 1 వరకు 42 రోజుల పాటు జరగనుంది. రెండో దశలో, శాశ్వత కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నారు. ఇజ్రాయెల్ బలగాలు గాజా నుంచి పూర్తిగా బయటికి రానున్నారు. గాజాలో ఉన్న మిగిలిన ఇజ్రాయెల్ బందీలను మరింత మంది పాలస్తీనా ఖైదీలను ఎక్స్చేంజ్ చేయడం ద్వారా విడుదల చేయనున్నారు.

15 నెలల ఘర్షణల్లో 46,700 మంది మృతి
ఇజ్రాయెల్ - పాలస్తీనాకు చెందిన సాయుధ, రాజకీయ గ్రూప్ అయిన హమాస్ మధ్య 15 నెలల పోరాటం తర్వాత ఈ కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది.
2023 అక్టోబర్ 7న, వందలాది మంది హమాస్ ఫైటర్లు సరిహద్దు వెంబడి ఉన్న, ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతాలపై దాడి చేసి, దాదాపు 1200 మందిని చంపేసి, 250 మందికి పైగా ప్రజలను బందీలుగా గాజాకు తీసుకెళ్లడంతో ఈ ఘర్షణ మొదలైంది.
దాడులకు తక్షణమే ప్రతిస్పందించిన ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఆ తర్వాత అక్టోబర్ 27న పూర్తి స్థాయి సైనిక చర్యకు దిగింది. అప్పటి నుంచి గాజాపై భూతల దాడులతో పాటు సముద్ర, వాయుమార్గాల్లోనూ దాడులు చేసింది. హమాస్ కూడా ఇజ్రాయెల్‌పై రాకెట్లతో దాడులు చేసింది.
ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో దాదాపు 46,700 మందికి పైగా చనిపోయినట్లు గాజాలో హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














