ట్రంప్ అంటే భయమా? సయోధ్య ప్రయత్నమా? హార్లీ డేవిడ్‌సన్‌పై ఇండియాలో సుంకాల తగ్గింపు ఏం చెప్తోంది

రంజీత్ రంజన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2016లో హార్లీ డేవిడ్‌సన్ బైక్‌పై ఎంపీ రంజీత్ రంజన్
    • రచయిత, సౌతిక్ బిశ్వాస్, నిఖిల్ ఇనమ్‌దార్
    • హోదా, బీబీసీ న్యూస్

ఇండియా గత వారం మోటార్ సైకిళ్లపై దిగుమతి సుంకాలు తగ్గించింది. 1600సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం గల ఇంజిన్లతో అధిక బరువు ఉండే బైక్‌లపై టారిఫ్‌ 50 నుంచి 30 శాతానికి.. చిన్న బైకులపై సుంకం 50 నుంచి 40 శాతానికి తగ్గించింది.

హార్లీ డేవిడ్‌సన్ బైక్స్ భారత్‌లోకి ప్రవేశించడాన్ని సులభతరం చేయడానికి ఈ చర్యలు ప్రోత్సాహాన్నిస్తాయి.

అమెరికా చేస్తున్న సుంకాల బెదిరింపులను తిప్పికొట్టాలని భారత్ భావిస్తోంది.

గత ఏడాది అమెరికా నుంచి భారత్‌కు రూ. 26 కోట్ల విలువైన మోటార్ సైకిళ్లు ఎగుమతి అయ్యాయి.

పొరుగు దేశాలు, మిత్ర దేశాలు, అలాగే అతిపెద్ద ప్రత్యర్థిగా భావించే చైనా వంటి దేశాలపైనా డోనల్డ్ ట్రంప్ వాణిజ్యపరమైన చర్యలు తీసుకుంటున్నారు.

అయితే ఈ ప్రభావం ఇంతవరకు భారత్‌పై లేదు.

భారత్ ఇప్పటికే సుంకాల తగ్గించడంతో ట్రంప్ సంతృప్తి చెందారా? లేదంటే భారత్‌పై పన్నుల భారం మోపేందుకు సిద్ధమవుతున్నారా అనేది తేలాల్సి ఉంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

గతంలో భారత్‌ సుంకాలపై ట్రంప్ తీవ్ర విమర్శలు

''కెనడా, మెక్సికో నిజానికి అమెరికాకు రెండు చేతుల్లాంటివి. ట్రంప్ ఆ రెండు దేశాలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటే...భారత్‌పై కూడా చాలా తేలిగ్గా అలాంటి చర్యలు తీసుకోగలరు'' అని దిల్లీకి చెందిన థింక్ ట్యాంక్ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(జీటీఆర్ఐ) ఫౌండర్ అజయ్ శ్రీవాస్తవ చెప్పారు.

గత నెల చివరి వారంలో ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణలో.. వాణిజ్య సమతుల్యత కోసం అమెరికా నుంచి భారత్ మరిన్ని ఆయుధాలు కొనుగోలు చేయాలని ఒత్తిడి చేశారు.

మొదటిసారి అధ్యక్షునిగా ఉన్న సమయంలో ట్రంప్ భారత్‌ సుంకాలపై విమర్శలు గుప్పించారు.

హార్లీ డేవిడ్‌సన్‌పై వందశాతం సుంకం విధించడంపై ట్రంప్ పదే పదే విమర్శలు చేశారు. అది ఆమోదయోగ్యం కాదన్నారు.

భారత్‌ను ''సుంకాల రాజు''గా ట్రంప్ గతంలో ఆరోపించారు.

వాణిజ్య సంబంధాల విషయంలో భారత్ భారీగా దుర్వినియోగానికి పాల్పడుతుందని విమర్శలు చేశారు.

అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా భారత్ వాణిజ్య మిగులు సాధిస్తోంది. 2023లో ద్వైపాక్షిక వాణిజ్యం 16 లక్షల కోట్ల రూపాయలు (190 బిలియన్ డాలర్లు) దాటింది.

2018 నుంచి అమెరికాకు వస్తువుల ఎగుమతులు 40శాతం పెరిగి రూ. 10 లక్షల కోట్లకు (123 బిలియన్ డాలర్లు) చేరుకున్నాయి.

సేవల వాణిజ్యం 22 శాతం పెరిగి రూ. 5.7 లక్షల కోట్లకు (66 బిలియన్ డాలర్లు) చేరుకున్నాయి.

అదేసమయంలో భారత్‌కు అమెరికా ఎగుమతులు రూ. 6.1 లక్షల కోట్లు (70 బిలియన్ డాలర్లు)గా ఉన్నాయి.

మరోవైపు భారత్ శాటిలైట్ గ్రౌండ్ ఇన్‌స్టలేషన్ల మీద దిగుమతి పన్నులు వసూలు చేయడం లేదు.

2023లో అమెరికా నుంచి భారత్‌కు ఈ ఎగుమతుల విలువ రూ. 800 కోట్లు (92మిలియన్ డాలర్లు).

ఔషధాల ఎగుమతులు

ఫొటో సోర్స్, Getty Images

భారత్ సులభతర వాణిజ్యం

2023లో భారతదేశానికి అమెరికా చేసిన ఎగుమతుల్లో ముడి చమురు, రూ. 12 లక్షల కోట్లు విలువైన పెట్రోలియం ఉత్పత్తులు సహా ఎల్ఎన్‌జీ, బొగ్గు, వైద్య పరికరాలు, శాస్త్రీయ పరికరాలు, స్క్రాప్ లోహాలు, టర్బోజెట్‌లు, కంప్యూటర్లు, బాదం పప్పులు ఉన్నాయి.

"భారత్ సుంకాల విధానాలను ట్రంప్ విమర్శించినప్పటికీ, తాజా తగ్గింపులు వివిధ రంగాలలో అమెరికా ఎగుమతులను పెంచేందుకు తోడ్పడతాయి" అని శ్రీవాస్తవ చెప్పారు.

" ప్రపంచ వాణిజ్య వాతావరణం ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ ...టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పారిశ్రామిక, వ్యర్థాల దిగుమతులపై కీలకమైన సుంకాల కోతలతో భారతదేశం వాణిజ్యాన్ని సులభతరం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది" అని ఆయనన్నారు.

వస్త్రాలు, ఔషధాలు, ఇంజనీరింగ్ వస్తువుల నుంచి పెట్రోలియం ఆయిల్స్, యంత్రాలు కట్ డైమండ్స్ వరకు విభిన్నమైన వస్తువులను భారత్ ఎగుమతి చేస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లు, ఆటోపార్ట్స్, రొయ్యలు, బంగారు ఆభరణాలు, పాదరక్షలు ఇనుము, ఉక్కును రవాణా చేస్తోంది. ప్రపంచ వాణిజ్యంలో భారత్ కీలక పాత్ర పోషిస్తుంది.

మేక్ ఇన్ ఇండియాతో మళ్లీ సుంకాలు పెరిగాయంటున్న నిపుణులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మేక్ ఇన్ ఇండియా(ఫైల్ ఫోటో)

‘మేక్ ఇన్ ఇండియా’తో పెరిగిన సుంకాలు

భారత్ ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత రక్షణాత్మక ఆర్థిక వ్యవస్థలలో ఒకటి. "విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను నియంత్రించే పాలనా వ్యవస్థల్లో భారత్ ఒకటి" అని 1970లలో, అమెరికన్ రాజకీయ శాస్త్రవేత్త జోసెఫ్ గ్రికో అభివర్ణించారు.

ఈ విధానం ప్రపంచ వాణిజ్యంలో భారతదేశ ఎగుమతి వాటాలో తగ్గుదలకు దారితీసింది.

1948లో 2.42%గా ఉన్న వాటా 1991 నాటికి 0.51%కి తగ్గిపోయింది.

అయితే, 1990 తరువాత భారత్ ఎట్టకేలకు సుంకాలను తగ్గించడం మొదలుపెట్టింది. 1990లో 80శాతం ఉన్న సగటు సుంకాలను 2008నాటికి 13శాతానికి తగ్గించింది.

అయితే భారతదేశంలో తయారీని పెంచడానికి మోదీ ప్రారంభించిన"మేక్ ఇన్ ఇండియా" విధానంతో సుంకాలు మళ్లీ 18 శాతానికి పెరిగాయి.

చైనా, దక్షిణ కొరియా, ఇండోనేషియా, థాయిలాండ్ వంటి ఇతర ఆసియా దేశాలు నిర్ణయించిన సుంకాల కంటే ఇది ఎక్కువ.

డోనల్డ్ ట్రంప్, మోదీ

ఫొటో సోర్స్, MANDEL NGAN/AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, ఈ నెలలో మోదీ అమెరికాలో పర్యటించే అవకాశముంది.

అమెరికా లక్ష్యం భారతేనా..?

ట్రంప్ 'అమెరికా ఫస్ట్' విధానంలో భారత్ మొదటి లక్ష్యమని వాణిజ్య నిపుణులు బిశ్వజిత్ ధర్ నమ్ముతున్నారు.

'అమెరికా ఫస్ట్' విధానంలో ఎక్కువ దిగుమతుల సుంకాలు విధించేవారిపై చర్యలు తీసకోవడం, వాణిజ్య విధానాలు మదింపు చేయడమనే అంశాలున్నాయని తెలిపారు.

వ్యవసాయ మార్కెట్ అమెరికాకు ఇప్పటికీ ఒక సమస్యగా ఉందని ఆయన అన్నారు.

అమెరికా నుంచి వచ్చే బాదం, ఆపిల్స్, శనగలు, పప్పుధాన్యాలు, వాల్‌నట్‌లపై సుంకాలను భారతదేశం తగ్గించింది. కానీ ట్రంప్ మరిన్ని వస్తువులపై సుంకాలు తగ్గించాలని డిమాండ్ చేసే అవకాశం ఉంది. అయితే, భారత్‌లో వ్యవసాయం చుట్టూ ఉన్న రాజకీయ సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుని మనం దృఢంగా ఉండవచ్చు.

"ఇక్కడే మనం గట్టిగా బేరమాడుతాం. అక్కడే సమస్యలు తలెత్తవచ్చు" అని ధార్ హెచ్చరిస్తున్నారు.

అయితే, చైనాను ఎదుర్కొనే క్వాడ్ సభ్యదేశంగా అమెరికాతో భారతదేశ వ్యూహాత్మక సంబంధాలు ఘర్షణను తగ్గించడంలో సహాయపడతాయి. అమెరికా వెనక్కి పంపిస్తున్న సరైన పత్రాలు లేని భారతీయ వలసదారులను తిరిగి పంపించాలని భారత్ అనుకోకపోవడం కూడా సానుకూల సంకేతాన్ని పంపిందని ధర్ విశ్లేషించారు.

ట్రంప్‌తో మోదీకి ఉన్న వ్యక్తిగత అనుబంధం కూడా ప్రయోజనం కలిగిస్తుందని నిపుణులు అంచనావేస్తున్నారు. ట్రంప్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఈ నెలలో అమెరికాలో పర్యటించనున్నట్టు తెలుస్తోంది. ఈ పర్యటనలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)