అమెరికా సుంకాలు వాణిజ్య యుద్ధానికి దారితీస్తాయా, చైనా,కెనడా,మెక్సికో ఏం చెబుతున్నాయి?

ట్రంప్, జస్టిన్ ట్రూడో

ఫొటో సోర్స్, Getty Images

అమెరికా కొత్త అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ కెనడా, మెక్సికో, చైనాపై సుంకాలు విధించడంతో ఆయా దేశాలు దీటుగా స్పందిస్తున్నాయి.

కెనడా, మెక్సికో నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 25 శాతం, చైనాపై అదనంగా 10 శాతం సుంకం విధిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల నిర్ణయం తీసుకున్నారు.

దీంతో కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో అమెరికా వస్తువులపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. అమెరికా సుంకాలకు సిద్ధంగా ఉన్నామని ట్రూడో చెప్పారు.

మరోవైపు మెక్సికో, చైనా కూడా అమెరికా ప్రభుత్వ నిర్ణయానికి దీటుగా అవసరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో

ట్రూడో ఏమన్నారు?

కెనడా నిర్ణయం అమెరికా ఆర్థిక వ్యవస్థ, ధరలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని ట్రూడో అభిప్రాయపడ్డారు. ఇరుదేశాల మధ్య ఉన్న చరిత్రాత్మక సంబంధాన్ని చూసి ప్రపంచం ఈర్ష్యపడేదని అన్నారు.

''ఇది జరగాలని కోరుకోలేదు, కానీ కెనడా అన్నింటికీ సిద్ధంగా ఉంది. నేను సాయంత్రం కెనడా పౌరులను ఉద్దేశించి ప్రసంగిస్తాను" అని ట్రూడో విలేఖరుల సమావేశంలో చెప్పారు.

"ఈ రోజు మా కీలక మంత్రులు, క్యాబినెట్‌తో సమావేశమయ్యాను. మెక్సికో అధ్యక్షురాలు షీన్‌బామ్‌తో త్వరలో మాట్లాడతాను" అన్నారు.

'వెనక్కి తగ్గం'

కెనడాకు సంబంధించిన చాలా వస్తువులపై 25 శాతం సుంకం విధించనున్నట్లు అమెరికా ధృవీకరించింది. ఇంధనంపై 10 శాతం సుంకం కూడా విధిస్తున్నారు, ఫిబ్రవరి 4 నుంచి ఇవి అమలులోకి రానున్నాయి.

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించారా? అని ట్రూడోను విలేఖరులు ప్రశ్నించగా.. లేదని సమాధానమిచ్చారు.

అయితే అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు ట్రంప్‌ను ఫ్లోరిడాలో కలిశారు ట్రూడో.

ట్రంప్‌తో మాట్లాడేందుకు ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తానని కెనడా ప్రధాని చెప్పారు.

కెనడా, మెక్సికో సరిహద్దుల నుంచి అమెరికాకు ఫెంటానిల్ డ్రగ్ వస్తోందని ట్రంప్ పదే పదే ఆరోపిస్తున్నారు.

ఫెంటానిల్ కారణంగా అమెరికా ఈ నిర్ణయం తీసుకుందా? అని విలేఖరులు ప్రశ్నించగా ట్రూడో స్పందిస్తూ.. అమెరికా-కెనడా సరిహద్దు 'ప్రపంచంలోని అత్యంత సురక్షితమైన, బలమైన వాటిలో ఒకటి' అన్నారు.

రానున్న కొద్ది వారాలు కెనడా, అమెరికాలకు కష్టతరమని ట్రూడో అభిప్రాయపడ్డారు.

"ఇలా జరగాలని కోరుకోలేదు. కానీ, కెనడియన్ల కోసం మేం వెనక్కి తగ్గబోం" అని చెప్పారు.

 మెక్సికో ప్రెసిడెంట్ క్లాడియా షీన్‌బామ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మెక్సికో ప్రెసిడెంట్ క్లాడియా షీన్‌బామ్

మెక్సికో ఏమంటోంది?

మెక్సికోపై అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ విధించిన 25 శాతం టారిఫ్‌పై మెక్సికో ప్రెసిడెంట్ క్లాడియా షీన్‌బామ్ కూడా స్పందించారు.

అమెరికాపై కూడా సుంకాలు విధిస్తామని ఆమె హెచ్చరించారు.

"ప్లాన్ బీ ని అమలు చేయాలని మా ఆర్థిక మంత్రిని ఆదేశిస్తున్నా. ఇందులో మెక్సికో రక్షణకు సంబంధించిన టారిఫ్, నాన్-టారిఫ్ చర్యలు ఉన్నాయి" అని షీన్‌బామ్ ఒక ప్రకటనలో తెలిపారు. అయితే, ప్లాన్ బీ ఏమిటనే దానిపై ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్

ప్రపంచ వాణిజ్య సంస్థలో ఫిర్యాదు చేస్తాం: చైనా

చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ కూడా అమెరికా విధించిన సుంకాలపై స్పందించింది. అవసరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేసింది

"ఈ చర్యపై తీవ్ర అసంతృప్తితో ఉన్నాం. తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం " అని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.

అమెరికా నిర్ణయం ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలను ఉల్లంఘించేదిగా ఉందని ఆరోపించింది.

ఇలాంటి చర్యలు చైనా, అమెరికా మధ్య సాధారణ ఆర్థిక, వాణిజ్య సహకారానికి నష్టం కలిగిస్తాయని చైనా పేర్కొంది. అమెరికా 'తప్పుడు ప్రవర్తన'పై ప్రపంచ వాణిజ్య సంస్థలో ఫిర్యాదు చేస్తామని తెలిపింది.

తమ హక్కులు, ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని చైనా హెచ్చరించింది. అమెరికా తన తప్పుడు పద్ధతులను సరిదిద్దుకోవాలని, సమస్య పరిష్కారానికి కలిసి పని చేయాలని కోరుకుంటున్నట్లు చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

పరస్పర ప్రయోజనం, గౌరవం, సమానత్వం ఆధారంగా విభేదాలను పరిష్కరించు కోవడానికి, పరస్పర సహకారాన్ని బలోపేతం చేయడానికి కృషి చేయాలని అమెరికాను కోరింది.

అంతకుముందు, టారిఫ్ సమస్యపై చైనా అధికారిక వార్తాసంస్థ జిన్హువాలో చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి హే యాడోంగ్ ఒక ప్రకటన విడుదల చేశారు. సుంకాలతో చైనా, అమెరికా లేదా ప్రపంచంలోని ఏ ఇతర దేశాలకు ప్రయోజనం కలగదని చెప్పారు.

ఇంటర్‌నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ ద్వారా సుంకాలు విధించే నిర్ణయం తీసుకున్నామని డోనల్డ్ ట్రంప్ శనివారం ట్రూత్‌లో తెలిపారు.

వాణిజ్య యుద్ధం

ఫొటో సోర్స్, Getty Images

వాణిజ్య యుద్ధానికి దారి తీస్తుందా?

బీబీసీ బిజినెస్ కరస్పాండెంట్ జోనాథన్ జోసెఫ్ ఈ సమస్యపై క్యాపిటల్ ఎకనామిక్స్‌కు చెందిన పాల్ ఆష్‌వర్త్‌తో మాట్లాడారు.

ఇది "చాలా విధ్వంసక వాణిజ్య యుద్ధాన్ని" ప్రేరేపిస్తుందని పాల్ అభిప్రాయపడ్డారు. మెక్సికో, కెనడా రెండూ తమ ఆర్థిక వ్యవస్థల్లో 20 శాతం అమెరికాకు ఎగుమతి చేస్తున్నాయని, ఈ సుంకాలు వారి ఆర్థిక వ్యవస్థలను మాంద్యంలోకి నెట్టగలవన్నారు.

"ఈ సుంకాలు అమెరికన్లకు ఉత్పత్తులను మరింత ఖరీదైనవిగా చేస్తాయి. ప్రజలు వాటిని కొనుగోలు చేయడం మానేస్తారు. అంటే మెక్సికన్ కెనడియన్ కంపెనీలకు తక్కువ విక్రయాలు జరుగుతాయి, లాభాలూ తగ్గుతాయి" అని పాల్ అన్నారు.

రాబోయే నెలల్లో ఈయూ కూడా అమెరికా సుంకాలను ఎదుర్కొనే పరిస్థితి రావొచ్చని పాల్ హెచ్చరించారు.

అమెరికాలో అధిక ధరల పరిస్థితి ద్రవ్యోల్బణాన్ని పెంచుతుందని పాల్ చెప్పారు. వచ్చే ఏడాదిన్నర కాలంలో అమెరికా వడ్డీ రేటు తగ్గింపుకు తలుపులు మూతపడవచ్చని హెచ్చరించారు.

అధిక రుణ వ్యయాలను చెల్లించడం వల్ల అమెరికన్ వినియోగదారుల జీవన ప్రమాణాలు తగ్గుతాయి. భవిష్యత్తులో పెట్టుబడి పెట్టడానికి వ్యాపారులు సుముఖత చూపించరు. ఇది ప్రపంచవ్యాప్తంగా అమెరికా డాలర్లలో డబ్బు తీసుకునే ప్రభుత్వాలను, ఇతరులను కూడా దెబ్బతీస్తుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)