అమెరికా: అక్రమ వలసదారులంటూ సైనిక విమానాల్లోనే ఎందుకు వెనక్కి పంపుతోంది?

ఫొటో సోర్స్, US Government/Representative
అమెరికాలో అక్రమంగా ఉంటున్నారని చెబుతున్న వలసదారులతో బయలుదేరిన అమెరికన్ సైనిక విమానం భారత్‌కు చేరుకుంది.
అయితే, ఈ విమానంలో ఎంతమంది ఉన్నారనే అధికారిక లెక్కలు ఇంకా విడుదల కాలేదు. వారి సంఖ్య 100కి పైనే ఉందని మీడియా కథనాలు చెబుతున్నాయి.
డోనల్డ్ ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత అమెరికాలో ఉంటున్న భారతీయులను వెనక్కి పంపడం ఇదే తొలిసారి.
భారత్‌తో పాటు బ్రెజిల్, గ్వాటెమలా, పెరూ, హోండురాస్ పౌరులను కూడా సైనిక విమానాల్లో అమెరికా నుంచి వెనక్కి పంపించారు.
అక్రమ వలసదారులను సైనిక విమానాల్లో వారి దేశాలకు పంపించేయాలన్న డోనల్డ్ ట్రంప్ ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర విమర్శలొచ్చాయి.

అక్రమ వలసదారులైన కొలంబియా పౌరులను అమెరికా సైనిక విమానాల్లో వారి దేశానికి పంపించేస్తామని డోనల్డ్ ట్రంప్ ప్రకటించడాన్ని ఆ దేశ అధ్యక్షుడు గుస్తావో పెడ్రో వ్యతిరేకించారు.
తమ పౌరుల గౌరవాన్ని తాము కాపాడాలనుకుంటున్నామని ఆయన అన్నారు. ఆ తర్వాత, కొలంబియా వైమానిక దళానికి చెందిన రెండు విమానాలు అమెరికా వెళ్లి తమ పౌరులతో కొలంబియా రాజధాని బొగోటాకు చేరుకున్నాయి.
అంతకుముందు, బ్రెజిల్ పౌరులను వెనక్కి తీసుకెళ్తున్న సైనిక విమానానికి సంబంధించిన కొన్ని ఫోటోలు బయటికొచ్చాయి. వాటిలో వారి చేతులకు సంకెళ్లు వేసి ఉన్నాయి.
ఆ ఫోటోలు బయటికొచ్చిన తర్వాత డోనల్డ్ ట్రంప్ ప్రభుత్వ వైఖరిపై విమర్శలొచ్చాయి. ఆ తర్వాత కూడా డోనల్డ్ ట్రంప్ కనికరం చూపలేదు, అక్రమ వలసదారులంటూ వారివారి దేశాలకు పంపించేయడానికి అమెరికా సైన్యాన్ని ఉపయోగిస్తున్నారు.
ఇప్పుడు, అక్రమ వలసదారులంటూ భారత పౌరులను అమెరికా సైనిక విమానంలో భారత్‌కు తిప్పి పంపించారు.

ఫొటో సోర్స్, Reuters
సైన్యాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నారు?
జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం, డోనల్డ్ ట్రంప్ ఎన్నో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్‌పై సంతకాలు చేశారు.
దేశ సరిహద్దులను పటిష్టం చేసేందుకు అమెరికా సైన్యానికి అధికారాలు ఇచ్చారు.
దీంతో పాటు, దేశ అంతర్గత భద్రత శాఖకు రక్షణ శాఖ సైనిక విమానాలను సమకూరుస్తుందని, వాటి ద్వారా ఐదు వేల మందికిపైగా 'అక్రమ ఏలియెన్స్'ను వెనక్కి పంపించవచ్చని అప్పటి అమెరికా తాత్కాలిక రక్షణ మంత్రి రాబర్ట్ సెలెసెస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
అలాగే, అధ్యక్షుడు ట్రంప్ కూడా అక్రమ వలసదారులను ఏలియెన్స్, క్రిమినల్స్ అని సంబోధించారు.
ఇటీవల ట్రంప్ రిపబ్లికన్ పార్టీ ఎంపీలతో మాట్లాడుతూ, ''చరిత్రలో మొదటిసారి, అక్రమ వలసదారులను వాళ్లెక్కడి నుంచి వచ్చారో అక్కడికే సైనిక విమానాల్లో తిప్పి పంపించేస్తాం. ఇన్నాళ్లూ వాళ్లు మనల్ని తెలివితక్కువవాళ్లలా చూస్తూ నవ్వుకున్నారు, ఇప్పుడు మా గౌరవం మాకు కావాలి'' అన్నారు.
క్రిస్మస్ రోజున చేతికి సంకెళ్లతో మిలటరీ విమానం ఎక్కుతున్న వారి ఫోటోలను జనవరి 24న, వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ షేర్ చేశారు.
''అక్రమ వలసదారులను వెనక్కి తిప్పి పంపే విమానాలు బయలుదేరాయి. ఒకవేళ మీరు చట్టవిరుద్ధంగా అమెరికా వస్తే, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచం మొత్తానికి బలమైన, స్పష్టమైన సందేశం పంపుతున్నారు'' అని ఆమె రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
సైనిక విమానాలను ఉపయోగించడం ద్వారా ట్రంప్ గట్టి సంకేతాలు పంపాలనుకుంటున్నారని భావిస్తున్నారు.
అక్రమ వలసదారులను కస్టడీలో ఉంచడం, చట్టపరంగా అప్పీల్ చేసుకునేందుకు సమయం ఇచ్చే కంటే, వారిని వెంటనే వెనక్కి పంపించేయడానికే మొగ్గు చూపుతానని గత డిసెంబర్‌లో ట్రంప్ అన్నారు.
''మరో 20 ఏళ్లు వాళ్లు శిబిరాల్లో కూర్చోవడం నాకు ఇష్టం లేదు. నేను వాళ్లని దేశం నుంచి బయటికి పంపించేయాలనుకుంటున్నా. వారు వెనక్కి రావడాన్ని ఆయా దేశాలు అంగీకరించాల్సి ఉంటుంది'' అని ఆయన అన్నారు.
సైనిక విమానాలను ఆధిపత్యానికి చిహ్నంగా కూడా భావిస్తారు, అందుకే తమ దేశంలో అమెరికా సైనిక విమానాలు దిగడానికి కొలంబియా అధ్యక్షుడు అంగీకరించలేదు. ఆ తర్వాత కొలంబియా విమానాలు అమెరికా వెళ్లి తమ పౌరులను వెనక్కి తీసుకొచ్చాయి.
సైనిక విమానాల్లో బలవంతంగా ఎక్కించడం, మరో దేశ భూభాగంపై దిగడాన్ని సార్వభౌమాధికారానికి సంబంధించిన విషయంగా భావిస్తారు. అందుకే మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ ఈ విషయంలో కీలక ప్రకటన చేశారు.
''వాళ్లు ఆ పని వారి దేశం లోపల మాత్రమే చేయగలరు. మెక్సికో విషయానికి వస్తే, మేం మా సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటాం. సమన్వయం చేసుకునేందుకు చర్చల అంశాన్ని పరిశీలిస్తాం'' అని ఆమె అన్నారు.
సైనిక విమానాలు వాడడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కూడా. అందువల్ల, దీనిని ట్రంప్ బల ప్రదర్శనగా కూడా భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, Reuters
సైనిక, మామూలు విమానాల ఖర్చులో తేడా
ఇప్పటి వరకూ, తమ దేశంలో అక్రమంగా నివసిస్తున్న వారిని వెనక్కి పంపేందుకు అమెరికా సాధారణ విమానాలను ఏర్పాటు చేసేది. అలాగే, ఈ బాధ్యత గతంలో యూఎస్ కస్టమ్స్ అండ్ ఇమిగ్రేషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్(ICE)పై ఉండేది.
ఇవి చిన్న విమానాలు కావడంతో వీటి గురించి పెద్దగా చర్చ జరిగింది లేదు. కానీ, ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం అక్రమ వలసదారులంటూ వెనక్కి పంపేందుకు సైన్యానికి చెందిన C-17 గ్లోబ్‌మాస్టర్ వంటి భారీ విమానాలను ఉపయోగిస్తోంది.
రాయిటర్స్ వార్తా సంస్థ, ఈ రెండు రకాల విమానాలకు అయ్యే ఖర్చులను లెక్కగట్టింది.
రాయిటర్స్ కథనం ప్రకారం.. గత వారం అక్రమ వలసదారులంటూ గ్వాటెమాలా పౌరులను అమెరికా వెనక్కి పంపింది. అందుకోసం ఒక్కొక్కరికి అయిన ఖర్చు 4,675 డాలర్లు, అంటే దాదాపు 4 లక్షల రూపాయలు.
అమెరికన్ ఎయిర్‌లైన్స్‌లో గ్వాటెమాలాకు వన్‌వే ఫస్ట్ క్లాస్ టికెట్ ధర 853 డాలర్లు (సుమారు 74 వేల రూపాయలు). అంటే, దాదాపు ఐదు రెట్లు ఎక్కువ ఖర్చు చేశారు.
రాయిటర్స్ పేర్కొన్న వివరాల ప్రకారం, 2023 ఏప్రిల్‌లో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా 135 మంది అక్రమ వలసదారులను వెనక్కి తిప్పి పంపే విమానానికి, ఐదు గంటల ప్రయాణానికి అయ్యే ఖర్చు 17 వేల డాలర్లు (సుమారు 15 లక్షల రూపాయలు) అని అప్పటి ICE యాక్టింగ్ డైరెక్టర్ చెప్పారు.
దానితో పోల్చిచూస్తే, అమెరికా సైనిక విమానం C-17 ఖర్చు చాలా రెట్లు ఎక్కువ. రాయిటర్స్ నివేదిక ప్రకారం, ఈ విమానానికి గంటకు అయ్యే ఖర్చు 28 వేల డాలర్లు, అంటే సుమారు 24 లక్షల రూపాయలు.

ఫొటో సోర్స్, Reuters
ఇప్పటి వరకూ ఎన్ని విమానాలు వెళ్లాయి?
ఇటీవల ప్రారంభమైన ఈ వెనక్కి పంపే ప్రక్రియలో, భారత్ మాత్రమే అత్యంత దూరంలో ఉన్న దేశం. అమెరికా సైనిక విమానాలు గ్వాటెమలా, పెరూ, హోండురాస్, ఈక్వెడార్‌లకు కూడా వెళ్లాయి.
ది న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం, అమెరికా నుంచి ఇప్పటి వరకూ 6 సైనిక విమానాలు మాత్రమే బయలుదేరాయి.
అక్రమ వలసదారులను వెనక్కి పంపేందుకు ట్రంప్ ప్రభుత్వం సైనికేతర విమానాలను వినియోగిస్తున్నట్లు కూడా రిపోర్టులు ఉన్నాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














