హీరో విజయ్: పార్టీ పెట్టిన ఏడాదిలో ఏం చేశారు? ఆ పార్టీ ప్రభావమెలా ఉంది?

విజయ్ పార్టీ

ఫొటో సోర్స్, @tvkvijayhq/x

    • రచయిత, నిత్య పాండియాన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తమిళనాడు తమిళగ వెట్రి కళగం ఫిబ్రవరి 2న పనయుర్‌లోని పార్టీ కార్యాలయంలో రెండో వార్షికోత్సవాన్ని జరుపుకుంది. పార్టీ పాలసీ నేతలుగా ప్రకటించిన ఐదుగురు నేతల విగ్రహాలను ఈ సందర్భంగా తమిళగ వెట్రి కళగం నేత విజయ్ ఆవిష్కరించారు.

చెన్నైలోని పనయుర్‌లో ఉన్న తమిళనాడు వెట్రి కళగం ప్రధాన కార్యాలయంలో పెరియార్, అంబేడ్కర్, కామరాజ్, వేలు నాచ్చియార్, అంజలై అమ్మాళ్ విగ్రహాలను ఆవిష్కరించి, నేతలకు నివాళి అర్పించారు.

రెండో ఏడాదిలోకి అడుగు పెట్టిన సందర్భంగా.. అధికారిక భాగస్వామ్యంతో తమిళనాడులో అతిపెద్ద ప్రజాస్వామ్య కార్యక్రమాన్ని చేపడతానని చెప్పారు.

''ప్రజా ఉద్యమంగా, ప్రజల కోసం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ.. రాజకీయాల్లో రెండో ఏడాదిలోకి అడుగుపెడుతున్నాం.'' అని అన్నారు.

''పార్టీ లాంచ్ నుంచి సభ్యత్వాల వరకు ఆశించిన రీతిలో మనం ముందుకు వెళ్తున్నాం.'' అని ఆయన చెప్పారు.

తమిళనాడు రాజకీయాల్లో పేరున్న పలువురు ప్రముఖులు తమిళగ వెట్రి కళగం పార్టీలో చేరారు. వారికి అత్యంత ముఖ్యమైన బాధ్యతలను కూడా అప్పజెప్పారు విజయ్. అయితే, గత ఏడాదిగా పార్టీ ఏం చేసింది? తమిళ రాజకీయాల్లో ఈ పార్టీ ఏ మేర ప్రభావం చూపింది?

''ప్రజల కోసం, ప్రజల తరఫున నిల్చేందుకు మేం రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించాం.. అది మా తొలి స్టేట్ కన్వెక్షన్ విక్టరీ పాలసీ ఫెస్టివల్. దీనిలో మేం పార్టీకి చెందిన ఐదుగురు అత్యున్నత పాలసీ నేతలను, లౌకిక సామాజిక న్యాయ విధానాలను, తీసుకోబోయే చర్యలను ప్రకటించాం. దీని ద్వారా, రాజకీయ రంగంలో అన్నివైపులా ఒక కదలికను తీసుకొచ్చాం.'' అని విజయ్ చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

'' ఈ ఏడాది కాలంగా ఎన్ని అడ్డంకులను ఎదుర్కొన్నామో మీరే చూశారు. ఎలాంటి భయం, ఎలాంటి ఒత్తిడి లేకుండా.. మన అభిప్రాయాలకు, సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నాం. శాంతియుతంగా, నిజాయితీగా ముందుకు వెళుతున్నాం.'' అని విజయ్ అన్నారు.

ఈ పార్టీని ఏర్పాటు చేసిన ఏడాదే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో విజయ్ పార్టీ పోటీ చేయలేదు. అదేవిధంగా, ఈరోడ్ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కూడా పార్టీ పోటీపడలేదు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఈవీకేఎస్ ఇలంగోవన్ మరణించడంతో, ఈ నియోజకవర్గం సీటు ఖాళీ అయింది.

2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఈ పార్టీ పనిచేస్తోంది.

ఆధావ్ అర్జున్

ఫొటో సోర్స్, @AadhavArjuna/x

పార్టీలో కొత్త ముఖాలు

పార్టీ ప్రారంభంలో విజయ్ నినాదం.. 'పాలనను పంచుకోవడం, అధికారాన్ని పంచుకోవడం'. విజయ్ పార్టీ‌లో విడుదలై చిరుతగల్ కట్చి (వీసీకే) విలీనమవుతుందన్న ఊహాగానాలు వినిపించాయి. అయితే, జనవరి 31న పనయుర్‌లోని థవేకా ప్రధాన కార్యాలయంలో విజయ్ సమక్షంలో అధావ్ అర్జున వీసీకే నుంచి విజయ్ పార్టీలో చేరారు.

ఏఐఏడీఎంకే ఐటీ వింగ్‌కు చెందిన జాయింట్ సెక్రటరీ నిర్మల్ కుమార్ కూడా విజయ్ పార్టీలో చేరారు. ఈ ఇద్దరికీ ప్రస్తుతం పార్టీలో సరికొత్త బాధ్యతలను అప్పజెప్పారు విజయ్.

ఎలక్షన్ క్యాంపెయిన్ మేనేజ్‌మెంట్ జనరల్ సెక్రటరీ పదవిని అధావ్ అర్జున్‌కు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సోషల్ మీడియా డిప్యూటీ జనరల్ సెక్రటరీ పదవిని నిర్మల్ కుమార్‌కు అప్పజెప్పారు. నాలుగు దశలలో జిల్లాల కార్యదర్శుల జాబితాను కూడా విజయ్ పార్టీ ప్రకటించింది. గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన ఒక పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో విజయ్, వీసీకే నేత తిరుమావలవన్ కలిసి పాల్గొంటున్నారనే వార్త కూడా పెద్ద వివాదానికి దారితీసింది. చివరికి వీసీకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఆధావ్ అర్జున్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో అధికార డీఎంకేను పరోక్షంగా విమర్శిస్తూ ఆధావ్ అర్జున్ పలు వ్యాఖ్యలు చేశారు.

''2026 ఎన్నికల్లో మేం రాచరికాన్ని రద్దు చేస్తాం.'' అని అన్నారు. ఆధావ్ అర్జున్ చేసిన ఈ వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయ రంగంలో పెద్ద చర్చకు దారితీశాయి. ఆ తర్వాత ఆధావ్ అర్జున్‌ను వీసీకే నుంచి సస్పెండ్ చేశారు.

విజయ్ పార్టీ

ఫొటో సోర్స్, TVK

పార్టీ ఏడాది ప్రయాణం ఎలా సాగింది?

విజయ్ అధికారికంగా తన పార్టీని 2024లో ప్రకటించారు. ప్రకటించిన తొమ్మిది నెలల తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ సమయంలో తన విధానాలను వివరించారు.

అప్పటి నుంచి ఆయన రాజకీయ పనుల్లో నిమగ్నమయ్యారు. తుపాను బాధితులకు సాయపడటం, పరందుర్ నిరసనకారులతో మాట్లాడటం, పార్టీ కార్యాలయంలో నేతల జయంతి ఉత్సవాలు, సంస్మరణ దినోత్సవాలు జరిపి వారి చిత్రపటాలకు నివాళులు అర్పించడం వంటివి చేస్తూ వస్తున్నారు. పుదుచ్చేరిలో బాలికను అత్యాచారం చేసి, హత్య చేయడాన్ని విజయ్ ఖండించారు. ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రకటించినప్పుడు.. తమిళనాడుకు ఎలాంటి సంక్షేమ పథకాలు లేవని ఆయన ఆరోపించారు.

అయితే, విజయ్ పార్టీ ఏడాది రాజకీయ ప్రయాణం రాజకీయ రంగంలో ప్రభావం చూపిందని కొందరు భావిస్తే.. మరికొందరు మాత్రం చేయాల్సింది చాలా ఉందని అంటున్నారు.

విజయ్ పార్టీ

ఫొటో సోర్స్, @tvkvijayhq/x

అధికార పార్టీతో అసంతృప్తి ప్రయోజనమా?

''ప్రజల సమయాన్ని వృథా చేయకుండా కేవలం 4 గంటల్లోనే కాన్ఫరెన్స్‌ను పూర్తి చేసిన ఏకైక పార్టీ ఇదే.'' అని చెన్నై యూనివర్సిటీలో డాక్టరల్ డిగ్రీ చేస్తోన్న తిరునావుక్కరసు చెప్పారు. రక్షణ, సైనిక విద్యను అభ్యసించిన ఈయన, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కీలక ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ఒక సంస్థలో వర్క్ చేశారు.

డీఎంకే పాలనపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. పరందుర్ విమానాశ్రయ ప్రాజెక్టు, వెంగై వాయల్‌లో మంచినీటి ట్యాంకులో మానవ మల మూత్రాలు కలిసిన ఇష్యూ, అన్నా యూనివర్సిటీ విద్యార్థుల సమస్యలు, తమిళనాడులో షెడ్యూల్డ్ కాస్ట్‌ ప్రజలపై దాడులు అన్ని ప్రజల్లో అధికార పార్టీపై తీవ్ర అసంతృప్తి తీసుకొచ్చాయి.

అధికార పార్టీతో అసంతృప్తితో ఉన్న వారికి విజయ్ పార్టీ ఆశావహంగా నిలుస్తుందని వివరించారు.

''ఇప్పటి వరకు నామ్ తమిళర్ కట్చి లాంటి పార్టీలకు యువత ఓటేసే వారు. కానీ, ఎలాంటి క్లిష్టమైన సిద్ధాంతాలు లేకుండా నిరాడంబరమైన, అందరికీ అందుబాటులో ఉండే పార్టీ కావడంతో, విజయ్ పార్టీకి వారి ఓట్లు వెళ్లే అవకాశం ఉంది.'' అని చెప్పారు.

విజయ్ పార్టీ

ఫొటో సోర్స్, @tvkvijayhq/x

అంత పెద్ద ప్రభావం చూపలేదు?

తమిళనాడులో విజయ్ పార్టీ ఎలాంటి ప్రభావం చూపలేదని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ''ఎన్నికల్లో పోటీ చేసి, ఫలితాలు వచ్చిన తర్వాతనే క్షేత్ర స్థాయిలో పార్టీ ఎలాంటి ప్రభావం చూపిందో తెలుస్తుంది.'' అని అజి సెంథిల్‌నాథన్ అన్నారు. అజి సెంథిల్‌నాథన్ రాజకీయ విశ్లేషకులు, రచయిత.

''పార్టీ ఏర్పాటైతే, అప్పటికే ఉన్న శూన్యతను పూరించాలి లేదంటే తనకంటూ ఒక ప్రత్యేకతను సృష్టించుకోవాలి. అయితే, ఈ రోజు అసలే ఉద్దేశ్యంతో విజయ్ రాజకీయాల్లోకి వచ్చారో స్పష్టత లేదు'' అని అన్నారు.

ఎలాంటి ప్రధాన రాజకీయ సిద్ధాంతం లేకుండా రాజకీయాల్లోకి వచ్చిన డీఎండీకే నేత విజయకాంత్‌ను ఉద్దేశించి అజి మాట్లాడారు. ఆ సమయంలో డీఎంకే, ఏఐఏడీఎంకేకు ప్రత్యామ్నాయం కావాల్సి ఉందని, దాన్ని విజయకాంత్ పార్టీ పూరించిందని చెప్పారు.

''ఒకవేళ ఆ సమయంలో రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చినా.. ఆయనకు కూడా అదే స్వాగతం ఉండేది. సింగిల్ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఉండేది కాదు.'' అని అన్నారు.

''పార్టీ సిద్ధాంతాన్ని బట్టి పనిచేయాలి. లేదంటే, అణచివేతకు గురైన ప్రజల స్వరంగానైనా ప్రజల్లో గుర్తింపు తెచ్చుకునేలా పనిచేయాలి. లేదంటే, ఆమ్ ఆద్మీ పార్టీ లాగా, ఒక ఉమ్మడి సమస్యపై పార్టీ పనిచేయాలి. ప్రజల సంక్షేమం కోసం కృషి చేయాలి. ఇక్కడ విజయ్ ఎవరి తరఫున నిల్చుంటున్నారు, ఎవరికోసం మాట్లాడుతున్నారన్న దానిపై ఎలాంటి స్పష్టత లేదు.'' అని సెంథిల్‌నాథన్ అన్నారు.

సినీ పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన నేతల పార్టీలలో బలహీనమైన పార్టీగా విజయ్ వెట్రి కళగం ఉందని అభిప్రాయపడ్డారు.

ఎలాంటి స్వరూపం లేకుండా విజయ్ పార్టీ లాంచ్ చేశారనీ, ఏడాదిగా ఈ పార్టీ ఏం చేయలేదని సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యాఖ్యాత ఆర్కే రాధాకృష్ణన్ చెప్పారు.

‘‘డీఎంకే పాలనపై నేడు ఉన్న అసంతృప్తి విజయ్ పార్టీకి అవకాశాన్ని అందిస్తుందా? ఓటు బలాన్ని పెంచుతుందా? అనే దానిపై అసలు ఆలోచించాల్సినవసరమే లేదు. ఎందుకంటే, ఎన్నికలకు కేవలం ఏడాది 2 నెలల సమయం మాత్రమే ఉంది’’ అని రాధాకృష్ణన్ అభిప్రాయపడ్డారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)