రాయలసీమలో అదానీ కంపెనీ పనులపై బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య వివాదమేంటి?

ఉద్యోగాలు అడిగేందుకే తన అనుచరులు వెళ్లారంటున్న ఆదినారాయణరెడ్డి

ఫొటో సోర్స్, facebook.com/AdiNROfficial/

ఫొటో క్యాప్షన్, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి
    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్‌
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో అదానీ ప్రాజెక్ట్ కేంద్రంగా వివాదం చోటు చేసుకుంది. బీజేపీ స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అనుచరులు, ప్రాజెక్ట్ కోసం పని చేస్తున్న వారి మధ్య ఘర్షణ జరిగింది.

కొండాపురం రాగికుంట దగ్గర అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌కు చెందిన రిత్విక్‌ ప్రాజెక్ట్స్‌ సంస్థ పనులను అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు అడ్డుకోవడం చర్చనీయమైంది.

తమ పార్టీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యేల వర్గీయుల మధ్య జరిగిన వివాదంపై బీజేపీ పెద్దలు కూడా దృష్టి సారించామని చెబుతున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అసలేం జరిగింది?

వైఎస్సార్‌ కడప జిల్లాలోని గండికోట ప్రాజెక్టు ఆధారంగా 1,000 మెగావాట్ల సామర్థ్యంతో అదానీ గ్రూప్ హైడ్రో పవర్‌ (పంప్డ్‌ స్టోరేజీ) ప్రాజెక్టు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు కొండాపురం మండలం దుబ్బుడుపల్లి రాగికుంట, తిరుమల గ్రామాలతో పాటు మైలవరం మండలం బొగ్గులుపల్లి పరిధిలోని 400 ఎకరాల భూమిలో ప్రాజెక్టు పనులు చేపట్టాలని నిర్ణయించింది.

తొలి విడతగా రూ.1,800 కోట్లతో నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టింది. ఇందుకు సంబంధించి సబ్‌ కాంట్రాక్టు టెండర్లను అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్‌కు చెందిన రిత్విక్‌ ప్రాజెక్ట్స్ సంస్థ దక్కించుకుంది. క్షేత్రస్థాయిలో పనులు మొదలుపెట్టింది.

ఈ నేపథ్యంలో మంగళవారం బీజేపీకే చెందిన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు వందల మంది వచ్చి ప్రాజెక్టు పనులను అడ్డుకున్నారు. రిత్విక్‌ సంస్థ ప్రతినిధులతో వాగ్వివాదానికి దిగారు. ఎమ్మెల్యేను సంప్రదించకుండా పనులు ఎలా చేస్తారని ప్రశ్నించారు.

ఎమ్మెల్యే వర్గీయులు రాళ్లు రువ్వడంతో కంటైనర్ అద్దాలు పగిలిపోయాయని తాళ్ల పొద్దుటూరు ఎస్‌ఐ రుషికేశ్వర్‌ రెడ్డి తెలిపారు. స్థానికులకు ఉద్యోగాలు కల్పించడంతో పాటు చిన్న చిన్న పనులను స్థానికులకు ఇవ్వాలని ఎమ్మెల్యే వర్గీయులు డిమాండ్‌ చేశారని బీబీసీతో ఎస్‌ఐ చెప్పారు.

హైడ్రో పవర్‌ (పంప్డ్‌ స్టోరేజీ) ప్రాజెక్టు సబ్ కాంట్రాక్ట్ పనులు దక్కించుకున్న రిత్విక్ సంస్థ

ఫొటో సోర్స్, x/CMRamesh_MP

ఫొటో క్యాప్షన్, ఎంపీ సీఎం రమేశ్ కుటుంబానికి చెందిన సంస్థ ఇక్కడ నిర్మాణ పనులు చేస్తోంది (ఫైల్ ఫొటో)

కేసులు

తమ నిర్మాణ పనులను అడ్డగించారంటూ రిత్విక్‌ సంస్థతో పాటు అదానీ సంస్థ ఇచ్చిన ఫిర్యాదుపై ఎమ్మెల్యే సోదరుడు శివనారాయణ రెడ్డి, బీజేపీ నేత డాక్టర్‌ రాజేశ్‌రెడ్డి, పబ్బులుతో పాటు మరో 300 మందిపై కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నట్టు డీఎస్పీ వెంకటేశ్వరరావు బీబీసీకి తెలిపారు.

మంగళవారం సాయంత్రమే వివాదం సద్దుమణిగిందని, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో పాటు స్థానికులతో చర్చించామని డీఎస్పీ చెప్పారు.

రిత్విక్ కాంట్రాక్ట్ సంస్థ పనులను అడ్డుకున్న ఎమ్మెల్యే వర్గీయులు
ఫొటో క్యాప్షన్, పనులను అడ్డుకున్న ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు

మా వాళ్లు ఉద్యోగాలు అడిగేందుకే వెళ్లారు: మీడియాతో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి

‘‘మా ప్రాంతంలో పరిశ్రమ పెడుతున్నారని తెలిసి, స్థానికులకు ఉద్యోగాలివ్వాలని, తమ వాహనాలను అద్దెకు పెట్టుకోవాలని అడగడానికి మాత్రమే మావాళ్లు అక్కడికి వెళ్లారు‘‘ అని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మీడియాతో చెప్పారు.

పనులు జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించామని.. అంతకుమించి అక్కడేమీ జరగలేదని ఎమ్మెల్యే స్థానిక మీడియాతో అన్నారు. ఈ విషయమై ఆయనతో మాట్లాడేందుకు బీబీసీ యత్నించగా అందుబాటులోకి రాలేదు.

అదేవిధంగా రిత్విక్‌ సంస్థకు సంబంధించి అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్‌‌తో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించగా, తాను విమానంలో ఉన్నానని, రేపు మాట్లాడతానని చెప్పారు.

‘ఇలాంటి వాటిని బీజేపీ ప్రోత్సహించదు’

‘‘జరిగిన ఘటన అవాంఛవీయం. భారతీయ జవతా పార్టీ ఇలాంటి వాటిని అస్సలు ప్రోత్సహించదు. అందులోనూ.. ఇది మా పార్టీకి చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులకు సంబంధించిన విషయం. కచ్చితంగా బీజేపీ పెద్దలు జోక్యం చేసుకుంటారు. అధిష్టానం జాతీయ స్థాయిలో వాస్తవాలను విచారిస్తుంది. ఇది పార్టీ అంతర్గత అంశం. దీని గురించి ఇంతకంటే మేం బహిరంగంగా మాట్లాడలేం’’ అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని రాయలసీమకు చెందిన బీజేపీ సీనియర్‌ నాయకుడు బీబీసీతో అన్నారు.

‘‘ఏదేమైనా ఇలాంటివి పార్టీకి మంచిది కాదు. పరిశ్రమలకు సంబంధించిన అంశంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై ప్రభావం చూపిస్తుంది. మామూలుగానే ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు పెట్టాలంటే గత పరిస్థితుల దృష్ట్యా కంపెనీలు భయపడుతున్నాయి. ఈ సమయంలో ఇలాంటివి చోటుచేసుకుంటే రాష్ట్రానికే నష్టం జరుగుతుంది..’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

ఇలాంటి పనుల వల్లనే రాయలసీమకు నష్టం

రాయలసీమలో ఇటువంటి ఘటనలు గతంలోనూ జరిగాయి. కమీషన్లు, సబ్ కాంట్రాక్టులు, స్థానికులకు ఉద్యోగాల పేరుతో ఫ్యాక్టరీల యజమానులను స్థానిక రాజకీయ నేతలు, వారి అనుచరులు బెదిరిస్తుంటారనే ఆరోపణలున్నాయి.

గతంలో పెనుగొండలో కియా కారు లాంచ్ కార్యక్రమంలో అప్పటి ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహరించిన తీరు మీద విమర్శలు వచ్చాయి. కియా ప్లాంట్ యాజమాన్యాన్ని ఇబ్బంది పెట్టే విధంగా మాధవ్ వ్యవహరించినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. కారు బానెట్ మీద నిరసన వ్యాఖ్యలు రాయడంతో పాటు మరొక సందర్భంలో ‘కియా మెడలు వంచేస్తా’ అని వ్యాఖ్యానించడంతో అప్పట్లో వివాదం రేగింది.

ఆ తర్వాత తాను స్థానికులకు ఉద్యోగాల కోసమే కియాపై ఒత్తిడి చేశానని గోరంట్ల మాధవ్ వివరణ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.

అనంతపురం జిల్లా రాప్తాడులో ఏర్పాటుచేయాలనుకున్న జాకీ పరిశ్రమ అప్పటి వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి డబ్బులు డిమాండ్ చేయడం వల్లే వెళ్లిపోయిందని రెండేళ్ల కిందట సీపీఐ నేతలు ఆరోపించారు. ఈ ఆరోపణలను అప్పట్లోనే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. అది సరైన కంపెనీ కాదని ట్రాక్ రికార్డు లేని ఆ కంపెనీకి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 2014- 19 మధ్య నామమాత్రపు ధరకు భూములు కట్టబెట్టిందని, అయినప్పటికీ ఆ కంపెనీ రావడం లేదని విమర్శించారు.

‘‘రాయలసీమ ప్రాంతంలో ఫ్యాక్టరీ పెడుతుంటే చాలు.. రాజకీయ నేతలు డబ్బుల కోసం ఇలా ఇబ్బంది పెట్టే దృష్టాంతాలు గతంలో ఎన్నో చోటు చేసుకున్నాయి. గత ముప్పై ఏళ్లుగా ఇలాంటి సంస్కృతి సీమ జిల్లాల్లో వేళ్లూనుకుపోయింది. కానీ ఒకే పార్టీ నేతల మధ్య, అది కూడా ఓ ఎంపీ, ఎమ్మెల్యే మధ్య ఇలాంటి వివాదం జరగడం ఇదే తొలిసారి. ఆది నారాయణరెడ్డిపై గతంలోనూ ఇలాంటి ఆరోపణలొచ్చాయి.. 2014కి ముందు నేషనల్‌ హైవే పనులు జరుగుతుంటే కమీషన్‌ ఇవ్వలేదని అడ్డుకున్నారనే విమర్శలున్నాయి. ఇక సీఎం రమేష్‌పై కూడా గతంలోఇదే మాదిరి ఆరోపణలున్నాయి.. ఆయన హంద్రీనావా పనులను అడ్డుకున్నారనే వాదనలున్నాయి.. ఇప్పటికైనా రాయలసీమ నేతలు మారాలి, పరిశ్రమలు వస్తుంటే ఆహ్వానించే వాతావరణం కల్పించాలి’’ అని కడప జిల్లాకు చెందిన సీనియర్‌ జర్నలిస్టు ఎస్‌.నగేష్‌ బీబీసీ వద్ద అన్నారు.

‘మా కంపెనీ ఆదేశాల మేరకు ఫిర్యాదు చేశాం’

ఒకేసారి పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు వచ్చారు. వాగ్వివాదానికి దిగారు. ఆవేశంలో కొన్ని వస్తువులను ధ్వంసం చేశారు. దాంతో తప్పని పరిస్థితుల్లో మా కంపెనీ ఆదేశాల మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాం.. అని ఆదాని కంపెనీ సైట్ మేనేజర్ సాయి పవన్ బీబీసీకి తెలిపారు. మరోవైపు రిత్విక్ కంపెనీకి చెందిన జయ ప్రకాష్ కూడా బీబీసీతో ఇవే మాటలు చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)