దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు: మహిళల ఓట్లు ఎవరికి?

ఫొటో సోర్స్, Getty Images
దేశమంతా ఆసక్తిగా చర్చించుకుంటున్న దిల్లీ ఎన్నికలు చివరి దశను చేరుకున్నాయి. ఈసారి కూడా అందరి దృష్టి మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ప్రధాని నరేంద్ర మోదీల మీద ఉంది.
దిల్లీలో కేజ్రీవాల్ వరుసగా మూడుసార్లు ఎన్నికలు గెలిచారు. దేశమంతటా రాజకీయ మద్దతును పెంచుకుంటున్న భారతీయ జనతా పార్టీ, దిల్లీలో మాత్రం వెనకబడి ఉంది.
అయితే 12 సంవత్సరాల పాలన తరువాత దిల్లీ ప్రజల నుంచి అనేక విషయాల్లో కేజ్రీవాల్ వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఇది ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపనుంది.
2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేశాయి. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు స్వతంత్రంగా పోటీ చేస్తున్నాయి. ఈ పరిణామం భాజపాకు అనుకూలం కానుందా? మహారాష్ట్ర ఎన్నికల్లో మాదిరిగా దిల్లీలో కూడా మహిళా ఓటర్లే ప్రభుత్వాన్ని నిర్ణయించనున్నారా?


ఫొటో సోర్స్, Getty Images
మహిళా ఓట్లపై పార్టీల దృష్టి
గతేడాది నవంబర్ లో జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ, శివసేన, ఎన్‌సీపీల 'మహాయుతి కూటమి’ ఘన విజయం సాధించింది. జూన్‌లో ప్రారంభమైన 'లడ్కీ బెహెన్ 'పథకం కూటమి విజయానికి ప్రధాన కారణం అయ్యుండచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
దీంతో దిల్లీ ఎన్నికల్లో కూడా పార్టీలన్నీ మహిళా ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే మహిళలు ఎవరి హామీలను నమ్ముతారో తేలాల్సి ఉంది.
ఈ విషయంపై మాట్లాడుతూ సీనియర్ జర్నలిస్ట్ రవీందర్ బవా ఇలా అన్నారు:
‘‘ఓటర్లలో దాదాపు 50% మహిళలే. ప్రస్తుతం రాజకీయ పార్టీలు మహిళలకి ఉచిత పథకాలు ప్రకటిస్తున్నాయి. కానీ వాళ్ళు అంతకు మించి ఇతర విషయాలను కూడా కోరుకుంటున్నారు. అందుకే కొందరు మహిళలు ఆమ్ ఆద్మీని కాదని బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ఎక్కువ శాతం మహిళల మద్దతు ఆమ్ ఆద్మీ పార్టీకే.'' అని బవా అన్నారు.

ఫొటో సోర్స్, ANI
బలహీన వర్గాలు ఎటువైపు?
‘‘అరవింద్ కేజ్రీవాల్, నరేంద్ర మోదీలను సగటు దిల్లీ ఓటర్ వేర్వేరు దృక్కోణాల నుంచి చూస్తారు. దిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌కు ఓటు వేయాలనుకునేవాళ్ళు, లోక్ సభ ఎన్నికల్లో మాత్రం నరేంద్ర మోదీని గెలిపించాలనుకుంటారు.
వాస్తవానికి ఇమేజ్ పరంగా కేజ్రీవాల్ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రత్యేకించి అద్దాల మేడ (శీష్ మహల్) వివాదం, లిక్కర్ స్కామ్ విషయాలలో ఆయనకి ఎదురుదెబ్బలు తగిలాయి. అయినప్పటికీ 3 వర్గాల ఓటర్లు కేజ్రీవాల్‌కు మద్దతిస్తూ వస్తున్నారు.
దిల్లీలో ముస్లిం ఓటర్లు 13శాతం మంది ఉన్నారు. వారికి ఆమ్ ఆద్మీ తప్ప ప్రత్యామ్నాయం లేదు. మరోవైపు సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్‌డీఎస్) సర్వే ప్రకారం దిల్లీలో ఉన్న 17 శాతం దళిత ఓటర్లులో 69 శాతం మంది 2020లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేశారు. దీంతోపాటు, ఆమ్ ఆద్మీకి మహిళా ఓటు బ్యాంకు బలంగా ఉంది.
2020 ఎన్నికల్లో 60 శాతం మంది మహిళా ఓటర్లు ఆమ్ ఆద్మీకి ఓటు వేస్తే, కేవలం 35 శాతం మహిళలు బీజేపీకి ఓటు వేశారని సీఎస్‌డీఎస్ సర్వే చెబుతోంది. ఇప్పుడు ఈ మూడు వర్గాలపై ఆమ్‌ఆద్మీ పార్టీ ఆశలు పెట్టుకుంది.’’ అని రాజకీయ విశ్లేషకులు అశుతోష్ అన్నారు.

పార్టీల వ్యూహాలు, విశ్లేషకుల అంచనాలు
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆరుసార్లు ఓడిపోయిన బీజేపీ ఏడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది.
మరి ఈసారి గెలుపు కోసం బీజేపీ ఏదైనా అద్భుతమైన ప్లాన్‌లు వేస్తుందా అనే ఆసక్తి నెలకొంది.
‘‘ నా అంచనా ప్రకారం, ఈ ఎన్నికల్లో బీజేపీ గెలవడానికి మంచి అవకాశం ఉంది. అరవింద్ కేజ్రీవాల్ జైలులో ఉన్నప్పుడు పార్టీ అస్తవ్యస్తం అయిపోయింది. విడుదల కాగానే తనపై ఉన్న వ్యతిరేకత గురించి కేజ్రీవాల్ తెలుసుకున్నారు. తరువాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, సీఎం బంగ్లాని విడిచిపెట్టి నైతికతను చాటుకునే ప్రయత్నం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కేజ్రీవాల్‌ను ఓడించడానికి బీజేపీ ఒక స్పష్టమైన వ్యూహాన్ని ఏర్పరుచుకోవాలి. తన అజెండాపై ఆమ్ ఆద్మీ పార్టీ స్పందించేలా చేయగలగాలి’’ అని అశుతోష్ అన్నారు.
దిల్లీ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ కంచుకోట. కానీ గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ అక్కడ ఖాతాను కూడా తెరవలేకపోయింది.
కాంగ్రెస్ పార్టీ గతంలో దిల్లీ ఎన్నికల్లో సాధించిన అత్యధిక ఓటు శాతం దాదాపు 40 శాతం. కానీ 2020 ఎన్నికల్లో 5 శాతం ఓట్లను కూడా ఆ పార్టీ సంపాదించుకోలేకపోయింది.
‘‘తమకు రావాల్సిన ఓట్లు స్థానిక పార్టీలకు వెళుతున్నాయని పంజాబ్, దిల్లీ, గుజరాత్‌కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీకి వివరించారు. ఈ మేరకు గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ స్థానిక పార్టీలతో పోటీపడాల్సి ఉంటుంది. పార్టీకి దిశానిర్దేశాన్ని అందించి సభ్యులందరిలో ఐక్యతను నెలకొల్పడంలో కాంగ్రెస్ ఇంకా కృషి చేయాలనేది స్పష్టం’’ అని లోక్‌మత్ పత్రికకు చెందిన జర్నలిస్ట్ ఆదేశ్ రావల్ అన్నారు.
‘‘కాంగ్రెస్ పార్టీ ఈసారి దిల్లీ ఎన్నికల్లో మంచి ప్రదర్శనను కనబరిస్తే 4.60 శాతం నుంచి 15 శాతం మధ్యలో ఓట్లను సంపాదించుకోగలదు. ఇదే గనక జరిగితే, ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయి, బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పరుస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీకి 15% ఓట్లు వస్తాయన్న నమ్మకం లేదు’’ అని ఆదేశ్ అభిప్రాయపడ్డారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














