ప్రేమలు ఏమవుతున్నాయి, అయిన వారినే అంతం చేసే ఆలోచనలు ఎందుకు పెరుగుతున్నాయి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, గరికిపాటి ఉమాకాంత్
- హోదా, బీబీసీ కోసం
హైదరాబాద్‌లో భార్యను అమానవీయరీతిలో హత్య చేసినట్లు ఓ భర్తపై ఆరోపణలు..
సూర్యాపేటలో కులాంతర వివాహం చేసుకుందని మనమరాలి భర్తను చంపించిందంటూ నానమ్మపై కేసు
పల్నాడు జిల్లాలో కన్నతండ్రిని కొడుకు కాలువలో పడేసి మృతికి కారణమయ్యాడనే ఆరోపణలు..
ఏలూరు జిల్లాలో పసికందును బతికుండగానే స్మశానంలో పూడ్చి పెట్టేందుకు ఇచ్చిన తల్లిదండ్రుల కాఠిన్యం..
వైజాగ్‌లో ఆన్‌లైన్ గేమ్స్ వద్దని వారించినందుకు తల్లినే చంపాడని కొడుకుపై పోలీసు కేసు ఘటనలు...'కన్న' ప్రేమలు కడకు ఏమవుతున్నాయన్న చర్చకు తెరలేపాయి.
ఈ ఘటనలకు సంబంధించి ఆయా కేసులు దర్యాప్తు చేస్తున్న పోలీసులు బీబీసీకి తెలిపిన వివరాల ప్రకారం..
(హెచ్చరిక: ఈ కథనంలో మిమ్మల్ని కలిచివేసే అంశాలుంటాయి)


ఫొటో సోర్స్, Getty Images
నీళ్లలో తోసేసిన కొడుకు
తల్లి ఈ మధ్యనే చనిపోయింది. 85 ఏళ్ల తండ్రి నుంచి ఆస్తి రాయించేసుకున్నారు. వయసుడిగిన నాన్నను సాకడం ఆ పెద్ద కొడుకు భారంగా భావించాడు.
అంతే.. తీసుకెళ్లి కాలువలో పడేశాడు. నీళ్లల్లో కొట్టుకుంటూ, నన్ను బతికించమని తండ్రి అర్ధించినా ఆ కొడుకు మనసు కరగలేదు.
అలా నీళ్లల్లో కొద్దిసేపు కొట్టుకుని మునిగి తండ్రి చనిపోయిన తర్వాతే అక్కడి నుంచి కొడుకు బయలుదేరాడు.
ఈ దారుణ ఘటన పల్నాడు జిల్లా ఈపూరు మండలం భద్రపాలెంలో జరిగింది.
నమ్మించి.. కారులో తెచ్చి
''నూజెండ్లకు చెందిన గంగినేని కొండయ్య, శిరోమణి వృద్ధ దంపతులు తమకున్న పొలం మూడేళ్ల కిందట అమ్మేశారు. ఆ డబ్బును పెద్ద కుమారుడు వెంకటేశ్వరరావుకి ఇచ్చి ఆయన దగ్గరే ఉంటున్నారు. ఇటీవల కొండయ్య భార్య శిరోమణి కన్నుమూశారు. 85 ఏళ్లు పైబడినా కొండయ్య తన పనులు తానే చేసుకునే వాడు. అయినా సరే.. ఆయన్ను చూసుకోవడం వెంకటేశ్వరరావు దంపతులు భారంగా భావించారు. ఆయన ఏం మాట్లాడినా ముసలోడు విసిగిస్తున్నాడంటూ కోపగించుకునే వారు.
ఈ క్రమంలోనే తండ్రి కొండయ్యను బయటకు వెళదాం రమ్మంటూ కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు వెంకటేశ్వరరావు. భద్రపాలెంలో సాగర్ కాల్వ వంతెన వద్దకు తీసుకెళ్లి కిందకి దిగమన్నారు. కొండయ్య దిగగానే ఒక్కసారిగా పైకెత్తి కాల్వలోకి విసిరేశాడు.
కాలువలో కొట్టుకుపోతూ కాపాడాలంటూ కొండయ్య కేకలు వేశారు. అయినా సరే కొడుకు వెంకటేశ్వరరావు మనసు కరగలేదు. ఇది చూసి చుట్టుపక్కల వాళ్లు వచ్చే లోగానే.. కొండయ్య చనిపోయారు. కారు ఎక్కి వెళ్లబోతున్న వెంకటేశ్వరరావును భద్రపురం గ్రామస్థులు పట్టుకుని కొట్టారు'' అని కేసు దర్యాప్తు చేస్తున్న వినుకొండ రూరల్ సీఐ ప్రభాకర్, ఈపూరు ఎస్‌ఐ ఉమామహేశ్వరరావు బీబీసీకి తెలిపారు.
లోపంతో బిడ్డ పుట్టాడని..
ఆరోగ్య సమస్యతో పుట్టిన బిడ్డను భరించలేమని, పోషించే శక్తి లేదని భావించి తల్లిదండ్రులు రెండురోజుల పసికందును బతికుండగానే పాతిపెట్టేందుకు ఇచ్చేసిన పాశవిక ఘటన ఇది.
ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం చింతాయగూడెంకి చెందిన కోమటి దుర్గా శ్రీనివాస్, సంధ్య కుమారి దంపతులకు గత నెల 28న తణుకులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మగ బిడ్డ జన్మించాడు. అయితే శిశువుకి పరీక్షలు చేసిన డాక్టర్లు మెదడులో సమస్య ఉందని చెప్పారు.
అనారోగ్యంతో ఉన్న బిడ్డను పెంచడం భారమని భావించి స్మశానంలో ఖననం చేసేందుకు తాడేపల్లిగూడెంకి చెందిన ఓ ఇద్దరు వ్యక్తులకు ఇచ్చేశారు తల్లిదండ్రులు.
వారు ఆ బిడ్డను తీసుకుని 29వ తేదీ రాత్రి సమయంలో తాడేపల్లిగూడెం ఆరో వార్డులో గల స్మశాన వాటికకు చేరుకుని ఖననం చేసేందుకు యత్నిస్తుండగా, బిడ్డ ఒక్కసారిగా బిగ్గరగా ఏడ్చాడు.
అది విన్న కాటికాపరితో పాటు రోడ్డుపై వెళ్తున్న స్థానికులు గట్టిగా నిలదీయడంతో అసలు విషయం చెప్పారు.
విషయం సచివాలయ సిబ్బందికి తెలియడం, వారు ఇచ్చిన సమాచారంతో ఐసీడీఎస్ సూపర్ వైజర్ దుర్గాభవాని ఘటనా స్థలానికి చేరుకొని పసికందును వెంటనే స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని పశ్చిమగోదావరి జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ రాజేశ్ తెలిపారు.
ఈ ఘటనపై విచారణ జరపుతున్న తాడేపల్లి గూడెం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సుబ్రమణ్యం బీబీసీతో మాట్లాడారు.
బిడ్డ చనిపోయాడని భావించే పూడ్చి పెట్టమని ఇచ్చామే తప్ప బతికి ఉన్నట్టు నిజంగా తమకు తెలియదని ఆ తల్లిదండ్రులు చెప్పినట్లు సీఐ వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆన్‌లైన్ గేమ్స్ వద్దన్నందుకు..
ఆన్‌లైన్ గేమ్స్‌కి బానిసగా మారిన కుమారుడిని, వాటి జోలికి వెళ్లవద్దన్నందుకు ఓ తల్లి ప్రాణం పోగొట్టుకున్నారు. ఈ ఘటన విశాఖలోని తీర ప్రాంత రక్షక దళం (కోస్ట్ గార్డ్) క్వార్టర్స్‌లో చోటుచేసుకుంది.
విశాఖపట్నంలోని మల్కాపురం పోలీసుల కథనం ప్రకారం..
‘‘కోస్ట్ గార్డ్ కమాండర్ బల్బీర్ సింగ్, భార్య ఆల్కా సింగ్(47)..తమ ఇద్దరు పిల్లలు అనుమోల్ సింగ్, ఆయుష్మాన్ సింగ్‌తో కలిసి కోస్ట్ గార్డ్ క్వార్టర్స్‌లో ఉంటున్నారు.
జనవరి 30 న బల్బీర్ సింగ్ విధుల నిమిత్తం ఒడిశా వెళ్లగా, ఇంట్లో తల్లి ఆల్కా సింగ్, పెద్ద కుమారుడు అనుమోల్ సింగ్ (20) ఉన్నారు.
ఆన్‌లైన్ గేమ్స్‌కి అలవాటుపడిన అనుమోల్ సింగ్ ల్యాప్ టాప్, సెల్‌ఫోన్ ఇవ్వాలని తల్లిని అడగ్గా అందుకు ఆమె నిరాకరించారు.
దీంతో కోపోద్రిక్తుడైన అనుమోల్ తల్లి అల్కా సింగ్‌ను కత్తితో పొడిచి గోడకి కొట్టి చంపినట్టు మల్కాపురం పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ విద్యాసాగర్ బీబీసీకి తెలిపారు.
నైతిక విలువలు కొరవడంతోనే..
సమాజంలో మానవ సంబంధాలు, నైతిక విలువలు కొరవడటంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని సైకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ స్వాతి పైడిపాటి అన్నారు.
రక్త సంబంధీకుల మధ్య హత్యలు, చివరికి బిడ్డల చేతిలో హత్యకు గురికావడం, లేదా కనిపెంచాల్సిన పిల్లలనే చంపేయడం వంటి దారుణాలు నేటి సమాజ స్థితిని తెలియజేస్తున్నాయని ఆమె అన్నారు.
''చిన్నప్పటి నుంచి పెరిగిన నేపథ్యం, చుట్టుపక్కల వాతావరణం, క్షణికావేశంతో పాటు ఆర్ధిక అవసరాలు ఇలాంటి విపరిణామాలను పెంచుతున్నాయి. వీటికి అడ్డుకట్ట పడాలంటే సమాజంలో మనుషుల మధ్య ప్రేమాభిమానాలు, నైతిక విలువలు పెరగాలి'' అని డాక్టర్ స్వాతి అన్నారు.
చిన్నప్పటి నుంచే పిల్లల్లో మానవతావిలువలను పెంపొందింపజేయాలని డాక్టర్ సూచించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














