తెలంగాణ: ఎస్సీ వర్గీకరణ ఎలా చేశారు, క్రీమీలేయర్‌పై ప్రభుత్వ స్పందన ఏంటి?

సీఎంకు సత్కారం

ఫొటో సోర్స్, cmo/telangana

    • రచయిత, బళ్ళ సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తెలంగాణలో ఎస్సీ వర్గీకరణకు శాసనసభ ఆమోద ముద్రపడింది. మూడు దశాబ్దాల సమస్య ముగింపుకు తెలంగాణ శాసన సభ వేదికగా పెద్ద ముందడుగు పడింది.

వర్గీకరణపై డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం రెండు సభల ముందు ఉంచగా, రెండు సభలూ ఆ తీర్మానాన్ని ఆమోదించాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఎస్సీ కేటగిరీ

ఫొటో సోర్స్, cmo/telangana

ఫొటో క్యాప్షన్, తెలంగాణలో ఎస్సీలను మూడు గ్రూపులుగా విభజిస్తారు.

మూడు గ్రూపులుగా విభజన

తెలంగాణలో ఎస్సీలను మూడు గ్రూపులుగా విభజించారు.

1. మొదటి గ్రూపులో 15 కులాలు ఉంటాయి. ఇవి అత్యంత వెనుకబడిన కులాలు. వీరి జనాభా ఎస్సీల్లో 3.288 శాతం కాగా, వీరికి 1 శాతం రిజర్వేషన్ ఇస్తారు.

2. ఇక రెండవ గ్రూపులో మధ్యస్థంగా లబ్ధి పొందిన కులాలు ఉంటాయి. ఇందులో 18 కులాలను చేర్చారు. వీరి జనాభా 62.748 శాతం కాగా, వీరికి 9 శాతం రిజర్వేషన్ ఇస్తారు.

3. ఇక మూడవ గ్రూపులో కాస్త మెరుగైన ప్రయోజనం పొందిన కులాలు ఉంటాయి. వీటి సంఖ్య 26. వీరి జనాభా మొత్తం ఎస్సీల్లో 33.963. శాతం.వీరికి 5 శాతం రిజర్వేషన్ ఉంటుంది.

4. మొత్తంగా ఎస్సీల రిజర్వేషన్ 15 శాతం.

5. ఏదైన ఉద్యోగ నోటిఫికేషన్ లో ఒకటో గ్రూపులోని కులానికి చెందిన అభ్యర్థి లేకపోతే, రెండవ గ్రూపుకు, రెండవ గ్రూపులోనూ లేకపోతే మూడవ గ్రూపుకు బదలాయిస్తారు. మూడు గ్రూపుల్లో లేకపోతే అప్పుడు క్యారీ ఫార్వర్డ్ చేస్తారు.

6. ఉద్యోగుల ప్రమోషన్లలో రోస్టర్ పాయింట్లు అని ఉంటాయి. తాజా నివేదికలో గ్రూపు 1కి 7, గ్రూపు 2 కి 2,16,27,47,52,66,72,87,97, గ్రూపు 3కి 22,41,62,77,91 రోస్టర్ పాయింట్లు వస్తాయి.

ఏ గ్రూపులో ఏ కులం?

ఎస్సీ వర్గీకరణలోని కులాలు

ఫొటో సోర్స్, cmo/telangana

ఫొటో క్యాప్షన్, మొదటి గ్రూపులో 15 కులాలు ఉన్నాయి
ఎస్సీ వర్గీకరణలోని కులాలు

ఫొటో సోర్స్, cmo/telangana

ఫొటో క్యాప్షన్, రెండో గ్రూపులో 18 కులాలు ఉన్నాయి
ఎస్సీ వర్గీకరణలోని కులాలు

ఫొటో సోర్స్, cmo/telangana

ఫొటో క్యాప్షన్, మూడో గ్రూపులో 26 కులాలు ఉన్నాయి

క్రీమీలేయర్‌కు నో

జస్టిస్ షమీమ్ అక్తర్ సిఫార్సులన్నింటినీ దాదాపుగా ప్రభుత్వం అంగీకరించింది. అయితే ఓ కీలకమైన సలహాను తిరస్కరించింది.

ఎస్సీ రిజర్వేషన్లలోనూ క్రీమీలేయర్ అమలు చేయాలని, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జెడ్పీ చైర్‌పర్సన్లు, మేయర్లు, గ్రూప్ 1 సర్వీసుల్లో ఉన్న వారిని క్రీమీలేయర్ గా ప్రకటించి, వారి రెండో తరానికి రిజర్వేషన్ తొలగించాలన్న సూచనను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది.

ఎస్సీ రిజర్వేషన్

ఫొటో సోర్స్, Getty Images

అసలేంటీ వర్గీకరణ?

షెడ్యూల్డ్ కులాలు లేదా ఎస్సీ అనేది ఒక కులంగా చాలా మంది పొరబడతారు. కానీ అది ఒక కులం కాదు. అంటరానితనం వంటి భయంకరమైన వివక్షను అనుభవించిన కొన్ని కులాలను భారత రాజ్యాంగం ప్రత్యేకంగా గుర్తించి, వాటిని షెడ్యూల్డ్ కులాలు అనే జాబితాలో చేర్చింది.

మాల, మాదిగ, డక్కలి, ఆది ఆంధ్ర.. ఇలా అనేక కులాలు ఈ జాబితాలో ఉంటాయి.

తెలంగాణలో అలా 59 ఎస్సీ కులాలు ఉన్నాయి. ఆ జాబితాలోని కులాలకు ప్రభుత్వ విద్య, ఉద్యోగాల్లో కొంత శాతం రిజర్వేషన్ ఉంటుంది. తెలంగాణలో అది 15 శాతం. అంటే వందలో 15 ఉద్యోగాలు ఈ కులాల వారికే ఇస్తారు.

అయితే ఆ జాబితాలోని కులాల మధ్య కూడా అసమానతలు ఉన్నాయి. కొన్ని కులాలు ముందున్నాయి, కొన్ని కులాలు వెనుకబడి ఉన్నాయని ఆయా కులాల వారు చెబుతూ వచ్చారు. దీనివల్ల ఎస్సీలకు మొత్తంగా ఇచ్చిన రిజర్వేషన్లను కొన్ని కులాలే ఉపయోగించుకుని ముందుకు వెళ్తున్నాయనీ, మిగతా వారు వెనుకబడే ఉంటున్నారనీ ఇతర కులాలు ఆరోపిస్తూ వచ్చాయి.

అందుకే ఎస్సీలకు ఇచ్చిన 15 శాతం రిజర్వేషన్ ను తిరిగి, కులాల మధ్య విభజించి పంచాలనే డిమాండ్ వచ్చింది.

ప్రధానంగా రిజర్వేషన్ ఫలితాలు మాలలు ఎక్కువ అనుభవించారు కాబట్టి, ఎస్సీ కులాలను వర్గీకరణ జరపాలంటూ మాదిగలు పోరాడారు. మందకృష్ణ మాదిగ తెలుగునాట ఆ పోరాటంలో ముందు నడిచారు. అయితే మాలలు దీన్ని వ్యతిరేకించారు.

మంద కృష్ణ మాదిగ

ఫొటో సోర్స్, Manda Krishna Madiga/FB

ఫొటో క్యాప్షన్, మందకృష్ణ మాదిగ తెలుగునాట వర్గీకరణ కోసం పోరాటం చేశారు

ఉమ్మడి ఏపీలో వర్గీకరణ అమలు

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణను అమలు చేశారు. అంటే ఎస్సీ జాబితాలో ఉన్న కులాలను, వాటి వెనుకబాటుతనం, జనాభా ఆధారంగా ఎస్సీ ఏ, బీ, సీ, డీ అంటూ విభజించి వారికి విడివిడిగా రిజర్వేషన్ కల్పించారు. అలా విభజించడాన్నే రిజర్వేషన్ వర్గీకరణ అంటారు.

ఈ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల సంఘాలు కోర్టుకు వెళ్ళడంతో వాటి అమలు నిలిచిపోయింది.

షమీమ్ అక్తర్

ఫొటో సోర్స్, Telangana High Court

ఫొటో క్యాప్షన్, 2024 అక్టోబర్ 11వ తేదీన తెలంగాణ ప్రభుత్వం డాక్టర్ జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ అధ్వర్యంలో ఏక సభ్య న్యాయ కమిషన్‌ ఏర్పాటు చేసింది .

వర్గీకరణ రాజ్యాంగబద్ధమే అని సుప్రీం కోర్టు 2024 లో చెప్పడంతో మళ్లీ వర్గీకరణ అంశం ముందుకు కదిలింది. పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ దవీందర్ సింగ్ అండ్ అదర్స్ కేసులో సుప్రీం కోర్టు ఈ తీర్పు ఇచ్చింది.

ఆ తీర్పుకు అనుగుణంగా 2024 అక్టోబర్ 11వ తేదీన తెలంగాణ ప్రభుత్వం డాక్టర్ జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ అధ్వర్యంలో ఏక సభ్య న్యాయ కమిషన్‌ ఏర్పాటు చేసింది .

విచారణ కమిషన్ 2024 నవంబర్ 11వ తేదీన బాధ్యతలు స్వీకరించింది. అనేక మంది వాదనలను ఈ కమిషన్ విన్నది.

తెలంగాణలో ఉన్న మొత్తం 59 ఎస్సీ కులాలను అధ్యయనం చేసింది. చివరిగా ఫిబ్రవరి 3న కమిషన్ తన 199 పేజీల నివేదికను సమర్పించింది.

ఆ నివేదికనే తెలంగాణ ప్రభుత్వం ఆమోదించి రెండు సభల ముందు ఉంచగా, రెండు సభలూ ఆమోదించాయి. త్వరలో ఇది చట్ట రూపం దాల్చనుంది.

రేవంత్ రెడ్డి, ఎస్సీవర్గీకరణ

ఫొటో సోర్స్, Anumula Revanth Reddy/FB

ఫొటో క్యాప్షన్, ఫిబ్రవరి 4 ను తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవంగా గుర్తుంచుకుంటారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

త్వరలోనే చట్టంగా..

"ఫిబ్రవరి 4 కు తెలంగాణలో అత్యంత ప్రాధాన్యం ఉంది. ఫిబ్రవరి 4, 2024లో ఎస్సీ వర్గీకరణ చేయాలనే నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించింది. మళ్లీ ఇవాళ ఎస్సీ వర్గీకరణ నివేదికను కేబినెట్ ఆమోదించింది. దశాబ్దాల జఠిలమైన సమస్యకు పరిష్కారం లభించిన ఫిబ్రవరి 4 ను తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవంగా గుర్తుంచుకుందాం. త్వరలోనే వర్గీకరణను చట్టం రూపంలో తీసుకువచ్చి శాశ్వత పరిష్కారాన్ని చూపుతాం." అని శాసన సభలో ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం నాడు వ్యాఖ్యానించారు.

గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తాను ఇదే వర్గీకరణ కోసం వాయిదా తీర్మానం ఇస్తే సభ నుంచి బయటకు పంపారనీ, తాను సీఎం హోదాలో అదే తీర్మానం చేయబోతున్నట్టు గుర్తు చేసుకున్నారు రేవంత్ రెడ్డి.

అయితే తమకు 5 శాతం రిజర్వేషన్ ను కేటాయించడాన్ని మాల సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ''ఉమ్మడి ఏపీలో 2011లో జరిగిన జనాభా లెక్కల ప్రకారం ఈ రిజర్వేషన్లు ఇచ్చారు. అది సరికాదు. తాజాగా జనాభా లెక్కలు తీసి ఇవ్వాలి. గతంలో బాబు హయాంలో వర్గీకరణ సమయంలో మాలలకు 6 శాతం రిజర్వేషన్ వచ్చింది. ఇప్పుడు 5 శాతానికి మార్చడం తొందరపాటు. అలాగే కాంగ్రెస్ గతంలో హామీ ఇచ్చినట్టు మొత్తం ఎస్సీ రిజర్వేషన్ ను 18 శాతానికి పెంచాలి.'' అని మాల మహానాడు నాయకులు గోపోజు రమేశ్ బాబు డిమాండ్ చేశారు.

తమకు 9 శాతం కాదు, 11 శాతం రిజర్వేషన్ కావాలని మాదిగ దండోరా డిమాండ్ చేస్తోంది. ''30 ఏళ్ళుగా దీని కోసమే పోరాడాం. ఎన్నో కమీషన్లు వర్గీకరణకు అనుకూలంగా చెప్పాయి. ప్రభుత్వం ఇప్పుడు మాకు 9 శాతం ఇస్తామంటోంది. 15 లక్షల జనాభా ఉన్న మాలలకు 5 శాతం ఇస్తున్నారు. కానీ 32 లక్షల జనాభా ఉన్న మాదిగలకు ఏ రకంగా చూసినా 11 శాతం రిజర్వేషన్ కావాలి. మాకు తగ్గిన 2 శాతం కూడా కలపాలి’’ అని డిమాండ్ చేశారు మాదిగ దండోరా నాయకులు మంద కృష్ణ మాదిగ.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)