అమెరికా: త్వరలో పిల్లలను కననున్న భారతీయ జంటల పరిస్థితి ఎలా ఉంది?జన్మతఃపౌరసత్వంపై ట్రంప్ ఆదేశాలు వారిని అనిశ్చితిలోకి నెట్టాయా?

- రచయిత, సవితా పటేల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
నేహా సత్పుల్, అక్షయ్ దంపతులు త్వరలో ఈ భూమిమీదకు రానున్న తమ మొదటిబిడ్డ కోసం ఎదురు చూస్తున్నారు.
నైపుణ్యమున్న విదేశీ ఉద్యోగుల కోసం ఉద్దేశించిన హెచ్1బీ వీసాపై వారు దశాబ్దానికిపైగా అమెరికాలో పనిచేస్తున్నారు. ఫిబ్రవరి 26న తమకు పుట్టబోయే బిడ్డకు జన్మతఃలభించే అమెరికా పౌరసత్వం దక్కుతుందని బారు భావించారు.
తల్లిదండ్రులయ్యేవారికి సెలవులు ఇచ్చే సౌకర్యం ఉన్న పెద్ద టెక్నాలజీ సంస్థలో వారు ఉద్యోగం చేస్తున్నారు. కాలిఫోర్నియాలోని శాన్ జోస్‌లో ఆ జంట తమ జీవితాన్ని జాగ్రత్తగా నిర్మించుకున్నారు.
కానీ అమెరికాలో తాత్కాలిక విదేశీ ఉద్యోగులకు జన్మించే పిల్లలకు జన్మతఃలభించే అమెరికా పౌరసత్వ నిబంధనను తొలగిస్తున్నట్టు ప్రకటించడం ద్వారా అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ వారి కలలపై నీళ్లు చల్లారు.

‘మా బిడ్డ ఏ దేశానికి చెందుతుందో’
మేరీల్యాండ్ ఫెడరల్ జడ్జి ట్రంప్ ఆదేశాలకు అడ్డుకట్టవేశారు. సియాటెల్ కోర్టు తొలుత విధించిన రెండువారాల నిషేధిత గడువును మరింత పెంచింది. కోర్టులో ఈ సమస్య పరిష్కారమయ్యే వరకు ట్రంప్ ఆదేశాలు అమల్లోకి రావు. అయితే ఏ నిర్ణయాన్ని అయినా రద్దు చేసే అధికారం అత్యున్నత న్యాయస్థానానికి ఉంది.
దావాలు, న్యాయపరమైన సవాళ్లతో ఈ అంశం అక్షయ్, నేహాతోపాటు వేలాదిమందిని అనిశ్చితస్థితిలోకి నెట్టివేసింది. వారిని దిక్కుతోచని స్థితిలోకి పడేసింది.
''ఇది మాపై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతోంది''అని అక్షయ్ చెప్పారు. ''ఆ ఆదేశాలు అమల్లోకి వస్తే తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. ఇది ఏమీ తెలియని ప్రాంతం'' అని ఆయన అన్నారు. తమ బిడ్డ ఏ దేశానికి చెందినవారవుతారు అన్నదే వారి ముందున్న అతిపెద్ద ప్రశ్న.
వారి ఆందోళన సరైనదే అని న్యూయార్క్‌కు చెందిన ఇమ్మిగ్రేషన్ అటార్నీ సిరస్ మెహ్తా చెప్పారు. ''ఇక్కడ జన్మించిన వ్యక్తికి వలసవాది హోదా ఇచ్చే నిబంధన అమెరికా చట్టంలో లేదు'' అని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
ముందస్తు ప్రసవం.. నిబంధనలకు విరుద్ధం
అయితే నేహా దంపతులు ముందస్తు ప్రసవసం కోసం తమ డాక్టర్‌ను సంప్రదించారు. అంతా అనుకున్నట్టు జరిగితే 40వ వారంలో ప్రసవం చేయవచ్చని డాక్టర్ చెప్పారు. కానీ కొన్నిరోజులు ఆగాలని వారు నిర్ణయించుకున్నారు.
''అంతా సహజంగా జరగాలని నేననుకున్నా'' అని నేహ చెప్పారు. ''ప్రసవం సుఖంగా జరగడం, నా భార్య ఆరోగ్యంగా ఉండడం నాకు ముఖ్యం, పౌరసత్వం అనేది తర్వాతి సంగతి'' అని ఆకాశ్ చెప్పారు.
భారతీయ కుటుంబాలు త్వరగా సిజేరియన్లు చేయించుకోవాలని భావిస్తున్నాయని అమెరికా మీడియలో కథనాలు వచ్చిన తర్వాత అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్(ఏఏపీఐ) డాక్టర్ సతీశ్ కతుల ప్రసూతి వైద్యులతో దీని గురించి మాట్లాడారు. న్యూజెర్సీలో కొన్ని కేసులు తప్ప అలాంటి ఉద్దేశంతో తమ దగ్గరకు ఎవరూ రాలేదని చాలా మంది డాక్టర్లు చెప్పారని సతీశ్ తెలిపారు.
''అమెరికాలోకఠినమైన వైద్య చట్టాలున్నాయని, పౌరసత్వం కోసం ముందస్తుగా సిజేరియన్లు చేయించుకోవద్దని నేను సూచిస్తున్నా'' అని ఓహియోకు చెందిన ఆయన చెప్పారు.
''మా ఫిజీషియన్లు నైతికత పాటిస్తారు. వైద్యపరంగా అవసరమైతే తప్ప వారు ఇలాంటివి చేయరు''అని ఆయన తెలిపారు.

దక్షిణాసియా తల్లిదండ్రుల్లో ఆందోళన
అమెరికా పౌరసత్వానికి చాలా డిమాండ్ ఉంది. నైపుణ్యంగల హెచ్ -1బీ వీసా హోల్డర్లు ఎక్కువగా ఇది కోరుకుంటున్నారు. అమెరికా వలసదారుల్లో భారతీయులు రెండోస్థానంలో ఉన్నారు.
జన్మతః పౌరసత్వ ఆదేశం భారతీయులపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఇమ్మిగ్రేషన్ పాలసీ విశ్లేషకులు స్నేహపురి హెచ్చరించారు. అమెరికాలో 50లక్షలమందికి పైగా భారతీయులకు నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలున్నాయి.
''ఇది అమలయితే అమెరికాలో జన్మించిన వారి పిల్లలెవరికీ వీసా లభించదు'' అని ఆమె బీబీసీతో చెప్పారు. ట్రంప్ ఆదేశాల ప్రభావం, తదుపరి ఏం చేయాలనేదానిపై దక్షిణాసియాకు చెందిన కాబోయే తల్లిదండ్రులు ఆన్‌లైన్ గ్రూపుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తూ చర్చలు జరుపుతున్నారు.
అమెరికాలో స్థిరనివాసం ఏర్పరుచుకున్నవారికి పుట్టిన పిల్లలకు పౌరసత్వంలో ఎలాంటి సమస్యా ఉండబోదని ట్రంప్ ఆదేశాలు స్పష్టం చేస్తున్నాయి.
కానీ అమెరికాలో నివసిస్తున్న భారతీయులు గ్రీన్‌కార్డుతో శాశ్వత నివాస హోదా పొందడానికి ఇతర దేశాల వారితో పోలిస్తే ఎక్కువ కాలం ఎదురుచూడాల్సి వస్తోంది.
ప్రస్తుతమున్న అమెరికా నిబంధనల ప్రకారం ఒక దేశానికిచ్చే గ్రీన్‌కార్డులు మొత్తం గ్రీన్‌కార్డుల్లో ఏడుశాతానికి మించకూడదు.
గ్రీన్ కార్డుల కోసం జీవితాంతం ఎదురుచూపు?
భారతీయులు ఏటా 72శాతం హెచ్-1బీ వీసాలు పొందుతున్నారు. కాటో ఇన్‌స్టిట్యూట్ డేటా ప్రకారం భారతీయ ఉద్యోగుల్లో 62శాతం గ్రీన్ కార్డుల కోసం నిరీక్షిస్తున్నారు. 2023లో వారి సంఖ్య 11లక్షలుగా ఉంది. ఇప్పుడు గ్రీన్‌కార్డులు పొందుతున్న ఉద్యోగులు 2012లో దరఖాస్తు చేసుకున్నవారు.
''కొత్తగా గ్రీన్‌కార్డులకు దరఖాస్తు చేసుకున్నవారు జీవితకాలం ఎదురుచూడాలి. దాదాపు నాలుగు లక్షలమంది గ్రీన్ కార్డు పొందకుండానే చనిపోయే అవకాశం ఉంది'' అని కాటో ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ ఆఫ్ ఇమ్మిగ్రేషన్ స్టడీస్ డేవిడ్ బీర్ హెచ్చరించారు.
ఇతర వలసదారుల పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటుంది. వాళ్లు ఏడాదిలోపే శాశ్వత నివాసం పొందుతారు. వేగంగా పౌరసత్వం సంపాదించే అవకాశం ఉంటుంది.
ట్రంప్ ఉత్తర్వులు అమలయితే, అమెరికాలో అధికారికంగాలేని వలసదారులపైనా ప్రభావం ఉంటుంది. గతంలో వారి పిల్లలకు సహజంగా పౌరసత్వం వచ్చేది. వాళ్లకు 21 ఏళ్లు వచ్చినప్పుడు తల్లిదండ్రులు గ్రీన్ కార్డు కోసం స్పాన్సర్ చేయవచ్చు.
అమెరికాలో 2022 నాటికి 7,25,000 మంది భారతీయ వలసదారులు నివసిస్తున్నారని ప్యూ రీసెర్చ్ అంచనా వేసింది. ఇది మూడో అతిపెద్ద గ్రూప్. అదే సమయంలో మైగ్రేషన్ పాలసీ ఇన్‌స్టిట్యూట్ భారత్‌ను ఐదోస్థానంలో ఉంచింది.
భారత వలస జనాభా 3,75,000గా తేల్చింది. అనధికార వలసదారులు అమెరికా జనాభాలో 3శాతంకాగా, విదేశాల్లో జన్మించిన వారి శాతం 22.
అమెరికన్లలో అసంతృప్తి
H-1B లేదా O వీసాలపై ఉన్న భారతీయులకు ప్రధాన ఆందోళన వారి పిల్లల జీవన నాణ్యతే. వీరు అమెరికా రాయబార కార్యాలయంలో తమ వీసాలను రెన్యువల్ చేయించుకోవడానికి స్వదేశాలకు రావాల్సిఉంటుంది. తరచుగా దీనికోసం భారత్ వచ్చే వారు ఈ ప్రక్రియలో తీవ్ర జాప్యాన్ని ఎదుర్కోవాల్సివస్తోంది.
ఇలాంటి కష్టాలనే తమ పిల్లలు ఎదుర్కోకూడదని ఈ వలసదారులు కోరుకుంటున్నారు.
చాలా సంవత్సరాలుగా గ్రీన్ కార్డ్ కోసం ఎదురుచూస్తున్న అక్షయ్‌కు అమెరికా పౌరసత్వం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసు.
"10 సంవత్సరాల పైనుంచి మేమిక్కడ ఉంటున్నాం. నా తల్లిదండ్రులకు వయసు పెరుగుతున్న కొద్దీ నేను వారిదగ్గర ఉండాల్సిన అవసరం చాలా ఉంది. వీసా స్టాంపింగ్ విషయాలను సమన్వయం చేసుకోవడం కష్టంగా ఉంటుంది. ఇప్పుడు బిడ్డతో ఇది మరింత కష్టం కావచ్చు" అని అక్షయ్ తెలిపారు.
ట్రంప్ ఆదేశాలను అమెరికాలో చాలా మంది ఫిజీయన్లు వ్యతిరేకిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చే కార్మికులు కీలక సేవల్లో భాగంగా ఉన్నారని వారు అంటున్నారు.
''ఉత్తర, దక్షిణ డకోటాలోని గ్రామీణ ప్రాంతాల్లో భారతీయ వైద్యుల పాత్ర చాలా కీలకమని డాక్టర్ కతులా చెప్పారు. వారు లేకపోతే ఆరోగ్యరంగం కుప్పకూలుతుంది. ఇప్పుడు వారు, వారి కుటుంబాలు సందిగ్ధంలో ఉన్నాయి'' అని ఆయన చెప్పారు. గ్రీన్ కార్డులు అందించే ప్రక్రియను వేగవంతం చేయాలని, వారు అమెరికాకు చేసిన కృషికి కృతజ్ఞతగా వారి పిల్లలకు జన్మతఃపౌరసత్వం ఇవ్వాలని ఆయన కోరారు.
ట్రంప్ ఆదేశాలతో స్టూడెంట్, వర్క్ వీసాల పరిస్థితిపైనా భారతీయుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికాలో పుట్టిన వారి పిల్లలకు అమెరికా పౌరసత్వంపైనా ఇప్పుడు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
శాన్‌జోస్‌లో నివసిస్తున్న ప్రియాన్షి జాజూకి ఏప్రిల్‌లో బిడ్డ పుడుతుందని భావిస్తున్నారు. ట్రంప్ ఆదేశాలతో వచ్చే మార్పులపై స్పష్టత కోసం వారు ఎదురుచూస్తున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి).














