కియా మోటార్స్: వందల కోట్ల పన్ను ఎగవేత ఆరోపణలతో ఈ కంపెనీకి చెన్నైకస్టమ్స్ టాక్స్ కమిషనర్ ఇచ్చిన నోటీసులో ఇంకా ఏముంది?

కియా కార్లు, ఆంధ్రప్రదేశ్, చెన్నై, కేంద్ర ఆర్థిక శాఖ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కియా 2019 నుంచి భారతదేశంలో పది లక్షలకు పైగా కార్లను విక్రయించింది.
    • రచయిత, నిఖిల్ ఇనాందార్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

దక్షిణ కొరియాకు చెందిన కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్ వందల కోట్ల రూపాయల పన్నులు ఎగవేసిందని ఆరోపిస్తూ భారత పన్నుల శాఖ అధికారులు రహస్యంగా నోటీస్ పంపించారు.

2024 ఏప్రిల్‌లో ఈ నోటీస్ పంపించినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది. ఎగవేసిన పన్నుల మొత్తం సుమారు రూ.1358 కోట్ల రూపాయలు ఉంటుందని రాయిటర్స్ తన కథనంలో పేర్కొంది.

అయితే దీనిపై "మేము పత్రాలతో సహా సమగ్ర ఆధారాలను సమర్పిస్తూ మా స్పందనను పంపించాం" అని కియా మోటార్స్ ఇండియా సంస్థ బీబీసీకి చెప్పింది. చెన్నైలోని కస్టమ్స్ విభాగం కమిషనర్ కియా మోటార్స్‌కు పన్నుల చెల్లింపులకు సంబంధించిన నోటీస్ పంపించారు.

అయితే కియా ఇతర వివరాలేవీ వెల్లడించలేదు. కియా సమాధానంపై స్పందన కోసం బీబీసీ కేంద్ర ఆర్థిక శాఖను సంప్రదించింది.

కియా మోటార్స్ ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో తన కార్లను ఉత్పత్తి చేస్తోంది. 2019 నుంచి ఈ సంస్థకు చెందిన పది లక్షలకు పైగా కార్లు అమ్ముడయ్యాయి.

కార్నివాల్ అనే మోడల్ కారు తయారీకి అవసరమైన విడి భాగాలను సింగిల్ షిప్‌మెంట్‌లో కాకుండా వేర్వేరు లాట్లలో కియా మోటార్స్ ఇండియా దిగుమతి చేసుకుందని, దీని వల్ల కస్టమ్స్ పన్నుల భారాన్ని తగ్గించుకుందని ప్రభుత్వం తన 432 పేజీల నోటీసులో ఆరోపించినట్లు రాయిటర్స్ కథనం తెలిపింది.

గతేడాది జర్మన్ ఆటో దిగ్గజం ఫోక్స్ వ్యాగన్ యూనిట్ స్కోడా ఆటో ఫోక్స్ వ్యాగన్ ఇండియాకు వాణిజ్య పన్నుల విభాగం అధికారులు 140 కోట్ల డాలర్లు ( నేటి విలువలో సుమారు రూ. 12 వేల కోట్లు )చెల్లించాలని కోరుతూ ఇలాంటి నోటీసే పంపించారు.

ఈ నోటీసును ఫోక్స్ వ్యాగన్ బాంబే హైకోర్టులో సవాలు చేసింది. " మేం అన్ని రకాల చట్టపరమైన వెసులుబాట్లను ఉపయోగించుకున్నాం" అని తెలిపింది.

పన్నులకు సంబంధించి ఇలా వివాదాలు పెరగడం, ఈ వివాదాల సత్వర పరిష్కారానికి అవసరమైన యంత్రాంగం లేకపోవడం, భారత్‌లో విదేశీ పెట్టుబడులపై ప్రభావం చూపుతోంది. ఇటీవలి కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ మందగించడానికి ఇదొక కారణంగా కనిపిస్తోంది.

2024లో భారత ఆర్థిక వ్యవస్థలోకి నికర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వివిధ కారణాల వల్ల సగానికి పడిపోయాయని హెచ్ఎస్‌బీసీ సెక్యూరిటీస్ అంచనా వేసింది.

బీబీసీ న్యూస్ తెలుగు
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
కియా కార్లు, ఆంధ్రప్రదేశ్, చెన్నై, కేంద్ర ఆర్థిక శాఖ, వాణిజ్య పన్నుల విభాగం

పన్నులకు సంబంధించిన అంశాలు, విధాన పరమైన అంశాల్లో అస్థిరత వంటివి విదేశీ పెట్టుబడుదారులను ఆలోచనలో పడేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

"ఈ వివాదం ప్రస్తుతం కోర్టులో ఉంది. కాబట్టి ఇందులో తప్పొప్పుల గురించి లాభ నష్టాలగురించి మాట్లాడటం సబబు కాదు" అని కేపీఎంజీ డిప్యూటీ సీఈఓ దినేష్ కనబర్ చెప్పారు.

"భారతదేశంలో పన్నులకు సంబంధించిన వివాదాల పరిష్కారం ఏళ్ల తరబడి కొనసాగుతుంది. ఈ మధ్యలోనే కొంత పన్ను చెల్లించాలనే డిమాండ్ చేసే ప్రమాదం కూడా ఉంది. భారతదేశం విదేశీ పెట్టబుడులను ఆకర్షించాలంటే సులభమైన వ్యాపార విధానాలు, పన్ను వివాదాల సత్వర పరిష్కార మార్గాలు చాలా కీలకం.’’ అని ఆయన చెప్పారు.

భారత ప్రభుత్వం, అంతర్జాతీయ సంస్థల మధ్య ఉన్నత స్థాయి పన్ను వివాదాలు ఏళ్ల తరబడి కొనసాగుతున్నాయి.

ఇందులో 2007లో భారత్‌కు చెందిన హచిసన్ సంస్థను వొడాఫోన్ కొనుగోలు చేసిన వ్యవహారంలో 200 కోట్ల డాలర్లు ( సుమారు రూ. 17 వేల కోట్లు ) చెల్లించాలనే వివాదం నడుస్తోంది. ఈ వ్యవహారంలో కోర్టు వొడాఫోన్‌కు అనుకూలంగా తీర్పు చెప్పింది.

ఇలాంటి కేసే ఒకటి ఎడిన్‌బరాకు చెందిన చమురు, సహజవాయువు ఉత్పత్తి చేసే కెయిరన్ ఎనర్జీ మీద కూడా నడుస్తోంది. ఈ సంస్థ 140 కోట్ల డాలర్లు( సుమారు రూ. 12 వేల కోట్లు ) చెల్లించాలని పన్నుల విభాగం ఇచ్చిన నోటీసుకు సంబంధించిన కేసు ప్రస్తుతం అంతర్జాతీయ ట్రైబ్యునల్‌కు చేరుకుంది. ఈ వివాదంలో కెయిర్న్ కేసు గెలవడంతో భారత ప్రభుత్వం రాజీ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

"పన్నులకు సంబంధించిన కేసుల్లో ప్రభుత్వ వాదన బలహీనంగా ఉంటోంది. ఈ కేసుల్ని గెలవాలంటే పన్నుల కార్యాలయంలో కొంత జవాబుదారీతనం అవసరం" అని పన్ను వ్యవహారాల నిపుణుడు కనబర్ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)