‘నా డబ్బు నాకివ్వు లేదంటే నన్ను పెళ్లి చేసుకో’ అని ఆమె అన్నందుకు అతను తీసుకున్న నిర్ణయమేంటి...

సీమా కాంబ్లే
ఫొటో క్యాప్షన్, నిందితులు రాహుల్ బింగార్కర్, సీమా కాంబ్లే
    • రచయిత, ప్రియాంక జగ్తాప్
    • హోదా, బీబీసీ కోసం

ఓ మహిళను ఆమె బాయ్‌ఫ్రెండ్ పట్టపగలే చంపిన ఘటన మహారాష్ట్రలోని అంబర్‌నాథ్ రైల్వేస్టేషన్‌ సమీపంలోని ఓ బ్రిడ్జిపై జరిగింది.

ఆర్థిక కారణాలు, ప్రేమ వ్యవహారాలే ఈ హత్యకు కారణమని ప్రాథమిక విచారణలో తేలినట్టు పోలీసులు చెప్పారు.

సీమా కాంబ్లే తన బాయ్‌ఫ్రెండ్ రాహుల్ బింగార్కర్‌కు కొంత డబ్బు సాయం చేశారు.

ఈ డబ్బు వ్యవహారం చివరకు వారి మధ్య గొడవకు దారితీసింది. తన డబ్బు తిరిగివ్వాలని లేదంటే తనను పెళ్లి చేసుకోవాలని సీమా కాంబ్లే డిమాండ్ చేయడంతో ఆగ్రహించిన రాహుల్ ఆమెను హత్యచేశాడని పోలీసులు తెలిపారు.

ఈ హత్య అంబర్‌నాథ్ ప్రాతంలో తీవ్ర కలకలం సృష్టించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
సీమా కాంబ్లే హత్య

ఆ రోజు మధ్యాహ్నం ఏం జరిగింది?

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ఫిబ్రవరి 3న రాహుల్ సీమాకాంబ్లేకు ఫోన్ చేసి కలుద్దామని చెప్పాడు. ఆమె నుంచి తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చేస్తానని నమ్మించాడు.

వారిద్దరూ అంబర్‌నాథ్ రైల్వేస్టేషన్ సమీపంలోని బ్రిడ్జిపై కలుసుకున్నారు.

ఆ సమయంలో డబ్బుల గురించి గొడవ జరిగింది. దీంతో రాహుల్ ఆమెను కత్తితో పదేపదే పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు.

ఈ సమాచారం అందుకున్నశివాజీనగర్ పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. అక్కడికి కొన్ని గంటల్లోనే రాహుల్‌ను అరెస్ట్ చేశారు.

రక్తంతో తడిసి ముద్దయిన సీమాకాంబ్లేను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్టు డాక్టర్లు చెప్పారు.

సీమా కాంబ్లే

ప్రేమ,డబ్బు

పోలీసులు చెప్పిన వివరాల మేరకు రాహుల్ బింగార్కర్, సీమా ఒకరినొకరు ప్రేమించుకున్నారు.

కొన్నేళ్లుగా సీమా, రాహుల్ అంబర్‌నాథ్‌లోని బార్కుపాడ భోయిర్ చల్ ప్రాంతంలో నివసిస్తున్నారు.

ఒకే ప్రాంతంవారు కావడంతో వారి మధ్య పరిచయం ప్రేమగా మారింది. రాహుల్‌కు డబ్బు అవసరమవడంతో సీమా ఆ డబ్బు ఇచ్చింది.

రాహుల్‌కు సీమా మొత్తం 2 లక్షల 60 వేల రూపాయలు ఇచ్చినట్లు ఆమె కుటుంబసభ్యులు చెప్పారు. తిరిగి ఇవ్వాలనే షరతుపైనే ఆమె ఈ డబ్బు ఇచ్చిందని తెలిపారు.

రెండురోజులుగా సీమా తన డబ్బులు తనకు తిరిగి ఇవ్వమని రాహుల్‌ను అడగడం మొదలుపెట్టింది. కానీ రాహుల్ డబ్బులు ఇవ్వడానికి ఇష్టపడలేదు. దీంతో డబ్బులైనా తిరిగి ఇవ్వాలని, లేదంటే తనను పెళ్లయినా చేసుకోవాలని ఆమె డిమాండ్ చేసింది.

సీమా తన కుమార్తెతో ఒంటరిగా నివసిస్తోందని పోలీసులు చెప్పారు.

బ్రిడ్జి వద్ద పోలీసులు
ఫొటో క్యాప్షన్, అంబర్‌నాథ్ రైల్వేస్టేషన్ సమీపంలోని బ్రిడ్జి వద్ద హత్య జరిగింది.

కుటుంబ సభ్యులకూ తెలుసు

కొన్నిరోజులుగా సీమా, రాహుల్ డబ్బు విషయంపై గొడవపడుతున్నారనే సంగతి సీమా కుటుంబసభ్యులకు తెలుసు. సీమా హత్యకు గురవడంపై ఆమె సోదరి నంద మాట్లాడారు.

మీడియాతో ఆమె మాట్లాడుతూ ''రాహుల్ మా సోదరి నుంచి డబ్బు తీసుకున్నాడు. సీమా అతనికి 2 లక్షల 60వేల రూపాయలు ఇచ్చింది. అతను ఆమెను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. కానీ ఆమెను మోసం చేశాడు.'' అని తెలిపింది.

''డబ్బు తిరిగి ఇవ్వాల్సిందేనని మా సోదరి డిమాండ్ చేయడంతో ఇస్తానని మొదట చెప్పాడు. కానీ ఆ తరువాత మా ఇంటికి వచ్చినప్పుడు చంపేస్తానని బెదిరించాడు'' అని నందా తెలిపింది.

''నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే మరో ఐదు లక్షలు ఇవ్వాలి. అప్పుడే నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు. ఇదంతా నిన్న సాయంత్రం జరిగింది. కానీ ఈ రోజు మధ్యాహ్నం వచ్చి తనను కలవమని, డబ్బులు ఇచ్చేస్తానని రాహుల్ సీమాకు చెప్పాడు'' అని నందా చెప్పింది.

‘‘రాహుల్‌ గురించి సీమా చెప్పినప్పుడు, అతని నుంచి డబ్బులు తీసుకుని సమస్యను పరిష్కరించుకోమని చెప్పాను. కానీ తరువాత రాహుల్ మాత్రం సీమానే కాదు, ఆమె బిడ్డను కూడా వదలనని బెదిరించాడు'' అని తెలిపింది.

పోలీసులు ఏం చెప్పారు

''మా ప్రాథమిక విచారణలో ఆర్థిక వ్యవహారాలే ఈ హత్యకు కారణమని కనుగొన్నాం. డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో సీమా, రాహుల్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. రాహుల్ ఏ పనీచేయడం లేదు. అతనికి ఆ డబ్బు తిరిగి ఇచ్చే సామర్థ్యం లేదు. సీమా అదేపనిగా అతనిపై డబ్బు చెల్లించాలని ఒత్తిడి తెచ్చింది'' అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సచిన్ గోరే బీబీసీకి చెప్పారు.

''నిందితుడు సీమా గుండెలపైన, కడుపులోనా కొత్తితో పొడిచాడు. అంబర్‌నాథ్ రైల్వేస్టేషన్ సమీపంలోని బ్రిడ్జి వద్ద ఈ సంఘటన జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు 112 నెంబర్‌కు కాల్ చేసి ఈ విషయాన్ని తెలియజేశారని, నిందితుడిని కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించిందని ఆయన చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)