అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుపై ట్రంప్ ఆంక్షలు

Trump, అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ)

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, బెర్డ్న్ దెబుస్‌మన్ జూనియర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్‌పై అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఆంక్షలు విధించారు.

''అమెరికాను, మా సన్నిహిత మిత్రదేశం ఇజ్రాయెల్‌ను లక్ష్యంగా చేసుకుని చట్టవిరుద్ధమైన, నిరాధారమైన చర్యలు తీసుకుంటోంది'' అని ట్రంప్ ఆరోపించారు.

ట్రంప్ నిర్ణయంతో అమెరికా, దాని మిత్రదేశాలకు చెందిన పౌరులపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు దర్యాప్తులో సహకరించేవారికి, వారి కుటుంబాలకు ఆర్థిక, వీసా పరిమితులు ఏర్పడతాయి.

ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు వాషింగ్టన్ పర్యటన సందర్భంగా ట్రంప్ ఈ సంతకం చేశారు.

గాజాలో యుద్ధనేరాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ గత నవంబరులో అంతర్జాతీయ క్రిమినిల్ కోర్టు నెతన్యాహుపై అరెస్టు వారెంట్ జారీ చేసింది.

అయితే ఈ ఆరోపణలను ఇజ్రాయెల్ ఖండించింది. హమాస్ కమాండర్‌కు కూడా ఐసీసీ వారెంట్ జారీచేసింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఇజ్రాయెల్ విషయంలో ఐసీసీ వైఖరిని తప్పుబట్టిన అమెరికా

అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఉన్న నెదర్లాండ్స్ దీనిపై స్పందించింది. ట్రంప్ ఆదేశాలపై చింతిస్తున్నట్టు పేర్కొంది.

''శిక్ష మినహాయింపులకు వ్యతిరేకంగా పోరాడడం కోర్టుకు తప్పనిసరి'' అని డచ్ విదేశీ వ్యవహారాల మంత్రి కాస్పర్ వెల్డ్‌కాంప్ చెప్పారు.

హమాస్‌కు, ఇజ్రాయెల్‌కు ఒకేసారి వారెంట్లు జారీచేయడం ద్వారా హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం ''సిగ్గుమాలిన నైతిక సమానత్వం'' పాటించిందని వైట్ హౌస్ గురువారం ఆరోపించింది.

ఐసీసీ ఇటీవలి చర్యలు ప్రమాదకర ధోరణిలో ఉన్నాయని, హింస, ఆరోపణలు, అరెస్టుకు అవకాశం వంటివాటితో అమెరికన్లను ప్రమాదంలోకి నెట్టివేస్తున్నాయని తన ఉత్తర్వుల్లో ట్రంప్ ఆరోపించారు.

ఐసీసీలో అమెరికా సభ్య దేశం కాదు. అమెరికా అధికారులు, పౌరులపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అధికార పరిధిని ఆ దేశం పదేపదే తిరస్కరిస్తుంది.

ఇరాన్‌ను, ఇజ్రాయెల్ వ్యతిరేక గ్రూపులను పట్టించుకోకుండా ఐసీసీ తనను తాను రక్షించుకునే హక్కున్న ఇజ్రాయెల్‌పై ఆంక్షలు విధిస్తోందని వైట్ హౌస్ ఆరోపించింది.

అఫ్గానిస్తాన్‌లో అమెరికా బలగాల యుద్ధ నేరాలపై విచారణ జరుపుతున్న ఐసీసీ అధికారులపై మొదటిసారి అధ్యక్షునిగా ఉన్న సమయంలో ట్రంప్ ఆంక్షలు విధించారు. ఆ ఆంక్షలను జో బైడెన్ పాలనాయంత్రాగం ఎత్తివేసింది.

ఐసీసీపై ఆంక్షలు విధించాలని అమెరికా ప్రతినిధుల సభ గత నెలలో ఆమోదించింది. కానీ సెనెట్‌లో ఆ బిల్లు వీగిపోయింది.

చాలా యూరోపియన్ దేశాలు సహా అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో 120కి పైగా దేశాలకు సభ్యత్వం ఉంది. కానీ అమెరికా, ఇజ్రాయెల్ ఇందులో సభ్యదేశాలు కావు.

నెతన్యాహు, హమాస్‌కు అరెస్టు వారెంట్‌లు జారీ చేసిన ఐసీసీ

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఇజ్రాయెల్ విషయంలో ఐసీసీ వైఖరిని ట్రంప్ తప్పుపడుతున్నారు.

ఏదైనా కేసులో న్యాయపోరాటం కోసం ఐసీసీకి వెళ్లడం చివరి అవకాశం. అయితే ఆయా దేశాల అధికారులు విచారణ చేయకపోతేనే ఐసీసీ జోక్యం చేసుకుంటుంది.

రెండు దేశాలు(అమెరికా, ఇజ్రాయెల్) యుద్ధ చట్టాలు కచ్చితంగా పాటించే మిలటరీ ఉన్న దేశాలని ట్రంప్ తన ఉత్తర్వుల్లో తెలిపారు.

నెతన్యాహుకు ఐసీసీ వారెంట్ జారీ చేయడంపై తన పాలన చివరి రోజుల్లో బైడన్ కూడా విమర్శలు గుప్పించారు. ఇది ''దారుణమైనది'' అని ఆయనన్నారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఎలాంటి సమానత్వం లేదన్నారు.

గాజాను స్వాధీనం చేసుకోవడం గురించి, పాలస్తీనా ప్రజలను అక్కడినుంచి పంపించి పశ్చిమాసియా పర్యాటక ప్రాంతంలా గాజాను తీర్చిదిద్దడం గురించి నెతన్యాహుతో కలిసి ఉమ్మడి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన తర్వాత ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

అరబ్ నేతలతో పాటు ఐక్యరాజ్యసమితి ట్రంప్ ఆలోచనను వ్యతిరేకించింది. అయినప్పటికీ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్‌’లో ట్రంప్ మరోసారి ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.

''పోరాటం ముగిసిన తర్వాత గాజా స్ట్రిప్‌ను అమెరికా స్వాధీనం చేసుకుంటుంది'' అని ట్రంప్ పోస్టు చేశారు. ప్రస్తుతం హమాస్, ఇజ్రాయెల్ మధ్య శాంతిఒప్పందం కొనసాగుతోంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)