గాజాను స్వాధీనం చేసుకోవాలని ట్రంప్ ఎందుకు అనుకుంటున్నారు?

డోనల్డ్ ట్రంప్, నెతన్యాహు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గాజా స్వాధీనంపై ట్రంప్ వ్యాఖ్యలపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమయ్యాయి.
    • రచయిత, పాల్ ఆడమ్స్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

గాజాను అమెరికా స్వాధీనం చేసుకోవచ్చని, ఈ ప్రక్రియలో గాజా జనాభాకు పునరావాసం కల్పించవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఖండించారు.

హమాస్, ఇజ్రాయెల్ మధ్య శాంతిఒప్పందం, సంక్షోభం తర్వాత గాజా భవిష్యత్తుపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్న సమయంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

15 నెలల యుద్ధం తర్వాత గాజాలో మూడొంతుల భవనాలు ధ్వంసమయ్యాయని ఐక్యరాజ్య సమితి అంచనావేసింది.

ట్రంప్ అస్పష్టంగా చేసిన ఈ ప్రతిపాదన దశాబ్దాలుగా పశ్చిమాసియాపై అమెరికా అనుసరించిన విధానంలో అతిపెద్ద మార్పుకు సంకేతాలిస్తోంది.

గాజా, ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌‌లు భాగంగా ఉన్న పాలస్తీనా మనుగడలో ఉండాల్సిన అవసరంపై అంతర్జాతీయంగా ఏకాభిప్రాయాన్ని విస్తృతం చేస్తోంది.

ట్రంప్ ఆలోచన శ్రద్ధతో కూడుకున్నదని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు అన్నారు. అయితే అరబ్ దేశాలు, కొన్ని అమెరికా మిత్రదేశాలు ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
హమాస్, గాజా

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఇజ్రాయెల్, హమాస్ మధ్య శాంతి ఒప్పందం కుదిరినప్పటికీ ఇజ్రాయెల్ ఇంకా బలగాలను పూర్తిస్థాయిలో వెనక్కి తీసుకోలేదు.

డోనల్డ్ ట్రంప్ ఈ విషయాన్ని ఇప్పుడెందుకు చెప్పారు?

ఇజ్రాయెల్, పాలస్తీనీయుల విషయంలో దశాబ్దాలుగా అమెరికా చేస్తున్న దౌత్యం సంక్షోభాన్ని పరిష్కరించడంలో విఫలమైందని డోనల్డ్ ట్రంప్ భావిస్తుండొచ్చు.

శాంతి ప్రతిపాదనలు వస్తున్నాయి, అధ్యక్షులు వచ్చివెళ్తున్నారు కానీ సమస్యలు తీరడం లేదు.. మరింత ముదురుతున్నాయి. 2023అక్టోబరు 7న హమాస్ ఇజ్రాయెల్‌పై చేసిన దాడి, గాజా యుద్ధం దారుణ ఫలితాలను మిగిల్చాయి.

ప్రాపర్టీ డెవలపర్‌గా కోట్లు సంపాదించిన ట్రంప్, ఆ అనుభవంతో కచ్చితమైన పరిశీలన చేశారు. గాజాను పునర్నిర్మించేటప్పుడు లక్షల మంది పౌరులు అక్కడి శిథిలాలలోనే ఉండడమనేది ఏమాత్రం అర్థం లేని విషయమని ట్రంప్ భావిస్తున్నారు.

గాజాను పునర్నిర్మించడం సాధారణమైన విషయం కాదు. పేలుడు పదార్థాలను, పర్వతాలలా పోగుపడిన శిథిలాలని తొలగించాలి. నీళ్లు, విద్యుత్ లైన్లను మరమ్మత్తు చేయాలి. స్కూళ్లు, ఆస్పత్రులు, షాపులను తిరిగి నిర్మించాలి.

ఇవన్నీ జరగడానికి కొన్ని సంవత్సరాలు పడుతుందని, ఆ నిర్మాణాలు సాగే సమయంలో పాలస్తీనీయన్లు మరోచోటకు వెళ్లాల్సిఉంటుందని ట్రంప్ మధ్యఆసియా రాయబారి స్టీవ్ విట్కాఫ్ చెప్పారు.

గాజా స్ట్రిప్‌లోని దక్షిణ, మధ్య ప్రాంతాల్లోని శిబిరాల్లో.. వాళ్లను ఇళ్లకు దగ్గరగా ఉంచడానికి ఉన్న మార్గాలను వెతకడానికి బదులు, వాళ్లను శాశ్వతంగా అక్కడినుంచి వెళ్లిపోవాల్సిందిగా ట్రంప్ ప్రోత్సహిస్తున్నారు.

ప్రజలెవరూ లేకపోతే, గాజాను అమెరికా అనుకున్నట్లుగా నిర్మించవచ్చని, వేలమందికి ఉద్యోగాలు కల్పించవచ్చని, పెట్టుబడులకు అవకాశాలేర్పడుతాయని, అన్నింటికన్నా ముఖ్యంగా ప్రపంచ ప్రజలు నివసించడానికి ఓ ప్రాంతం ఏర్పాటుచేయవచ్చని ట్రంప్ నమ్ముతున్నారు.

ట్రంప్, నెతన్యాహు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ట్రంప్ వ్యాఖ్యలను నెతన్యాహు స్వాగతించారు.

ట్రంప్ వ్యాఖ్యలు ఎందుకు వివాదాస్పదమయ్యాయి?

అమెరికా రాయబార కార్యాలయాన్ని టెల్ అవీవ్ నుంచి జెరూసలేంకు మార్చడం సహా పశ్చిమాసియాపై అమెరికా విధానాన్ని మరింత సమర్థంగా మార్చడానికి మొదటిసారి అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఎక్కువ సమయం వెచ్చించారు ట్రంప్. ఆక్రమించిన ప్రాంతాలతో కలిపి ఇజ్రాయెల్ సార్వభౌమత్వాన్ని గుర్తించారు. అలాంటి అధ్యక్షుని నుంచి ఇలాంటి ప్రతిపాదన రావడం ఆశ్చర్యకరం.

పాలస్తీనా భూభాగంలో కొంత ప్రాంతాన్ని ఆక్రమించుకుని, అక్కడి ప్రజలను ఖాళీచేయించడం ఇజ్రాయెల్ పాలస్తీనా సంక్షోభానికి పరిష్కారమని అమెరికా అధ్యక్షులెవరూ ఇంతవరకు ఆలోచించలేదు.

స్పష్టంగా చెప్పాలంటే బలవంతంగా ఇలా చేయడమన్నది అంతర్జాతీయ చట్టాన్ని తీవ్రంగా ఉల్లఘించడం కిందకు వస్తుంది.

కొందరు పాలస్తీనియన్లు గాజాను విడిచిపెట్టి మరో చోట తమ జీవితాలను పునర్నిర్మించుకుంటున్నారు. 2023 అక్టోబరు నుంచి 1,50,000మంది వెళ్లిపోయారు.

కానీ మిగిలినవాళ్లు వెళ్లలేరు. వెళ్లాలి అనుకోవడం లేదు. వారికి ఆర్థిక స్తోమత సరిపోకపోవచ్చు. లేదా గాజాతో వారికి బలమైన అనుబంధం ఉండడం కావొచ్చు.

గాజా నివాసితుల్లో చాలామంది..1948లో ఇజ్రాయెల్ ఏర్పడినప్పుడు వాళ్ల ఇళ్ల నుంచి పారిపోయిన లేదా బలవంతంగా పంపించివేసిన ప్రజల సంతతివారు. ఈ కాలాన్ని పాలస్తీనియన్లు నక్బా అని పిలుస్తారు. విపత్తును అరబిక్‌లో నక్బా అంటారు.

ఇజ్రాయెల్‌లో పాటు తమకు సొంత దేశం కావాలని భావించే పాలస్తీనియన్లకు అందులో కొంత భాగం కోల్పోవడాన్ని తమ శరీరభాగాన్ని కోల్పోవడంగా భావిస్తారు.

గాజా భౌగోళికంగా 1948 నుంచి వెస్ట్‌బ్యాంకు నుంచి వేరుగా ఉంది. టన్నెల్స్, రైల్వేలు వంటివి రెండు ప్రాంతాలను కలుపుతున్నాయి. దీనిపై ట్రంప్ 2020లో చేపట్టిన విజన్ ఫర్ పీస్ సహా గతంలో చర్చలు, సంప్రదింపులు జరిగాయి.

ఇప్పుడు ట్రంప్ పాలస్తీనియన్లు గాజాను పూర్తిగా వదులుకోవాలని చెప్తున్నారు.

పౌరులను బలవంతంగా పంపించివేయడం గురించి ఆయన సూచన చేయనప్పటికీ, అది అంతర్జాతీయ చట్టానికి వ్యతిరేకం- ట్రంప్ పాలస్తీనియన్లను వెళ్లిపోవాల్సిందిగా ప్రోత్సహిస్తున్నారన్నది స్పష్టమవుతోంది.

ఇతర ప్రాంతాల్లో నిర్మాణాలు జరిగేటప్పుడు తక్కువగా దెబ్బతిన్న చోట్ల గాజా ప్రజలు నివసించేందుకు వీలు కల్పించే వేల కార్వాన్ల సరఫరాను ఇజ్రాయిల్ అడ్డుకుంటోందని పాలస్తీనా అధికారులు ఇప్పటికే ఆరోపించారు.

18లక్షలమంది గాజా శరణార్థులకు అరబ్ దేశాలు ముఖ్యంగా ఈజిప్టు, జోర్డాన్ వంటివి ఆశ్రయం ఇవ్వాలన్న ట్రంప్ ప్రతిపాదనను ఆ దేశాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.

ఈ సమస్య కాకుండానే ఆ రెండు దేశాలకు అనేక సమస్యలున్నాయి.

ఐక్యరాజ్యసమితి

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, గాజాలో మూడింట రెండు వంతుల భవనాలు ధ్వంసమయ్యాయని ఐక్యరాజ్యసమితి అంచనావేసింది.

గాజా ప్రస్తుత పరిస్థితి ఏంటి?

1967లో ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకోవడానికి ముందు 19 ఏళ్లపాటు ఈజిప్ట్ గాజాను ఆక్రమించుకుంది.

ఇప్పటికీ అంతర్జాతీయ చట్టం ప్రకారం ఇజ్రాయెల్ ఆక్రమించుకున్నప్రాంతంగానే భావిస్తున్నారు. అయితే దీనిపై ఇజ్రాయెల్ వివాదం లేవనెత్తుతోంది. 2005లో యూదు సెటిల్‌మెంట్లను ఏకపక్షంగా కూల్చివేసి, మిలటరీని వెనక్కి పిలిచిన తర్వాత ఆక్రమణ పూర్తయిందని ఇజ్రాయెల్ చెబుతోంది.

ఐక్యరాజ్యసమితి సభ్యత్వ దేశాల్లో మూడోవంతు గాజాను స్వతంత్ర పాలస్తీనాలో భాగంగా గుర్తించినప్పటికీ అమెరికా మాత్రం అంగీకరించలేదు.

కంచెలు, ఇజ్రాయెలీ సముద్ర దిగ్బంధనంతో బయటి ప్రపంచానికి దూరంగా ఉండే ఆ ప్రాంతం ఎప్పుడూ స్వతంత్రంగా ఉన్నట్టు కనిపించదు.

ఇజ్రాయెల్ అనుమతి లేకుండా ఏమీ జరగదు. ఎవరూ లోపలకు రాలేరు. బయటకు వెళ్లలేరు. 1998లో ఆర్భాటంగా ప్రారంభించిన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పాలస్తీనా రెండో తిరుగుబాటు సమయంలో 2001లో ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది.

2006 పాలస్తీనా ఎన్నికల్లో హమాస్ విజయం సాధించిన తర్వాత, జరిగిన పోరాటంలో ప్రత్యర్థులను ఆ ప్రాంతం నుంచి పంపించివేసింది. ఆ తర్వాత భద్రతా కారణాలంటూ ఇజ్రాయెల్, ఈజిప్టు గాజాను దిగ్బంధించాయి.

తాజా యుద్ధానికి చాలా కాలం ముంద నుంచే పాలస్తీనియన్లు గాజాను బహిరంగజైలుగా భావించడం ప్రారంభించారు.

గాజా, ఇజ్రాయెల్, హమాస్
ఫొటో క్యాప్షన్, గాజాను ఈజిప్టు, ఇజ్రాయెల్ దిగ్బంధించాయి.

ట్రంప్ గాజాను స్వాధీనం చేసుకోగలరా?

ఆ భూభాగం మీద అమెరికాకు ఎలాంటి న్యాయపరమైన హక్కులేదు. అమెరికా పరిపాలన ఎలా సాగించాలనుకుంటున్నారో ట్రంప్ స్పష్టంగా చెప్పలేదు.

అమెరికా గ్రీన్‌ల్యాండ్ లేదా పనామా కాలువను స్వాధీనం చేసుకుంటుందని చెప్పినట్టుగానే....ట్రంప్ నిజంగానే గాజా స్వాధీనం గురించి మాట్లాడారా లేక..గాజా భవిష్యత్తుపై చర్చలు ప్రారంభం కావడానికి ముందు తమ బేరసారాల సామర్థ్యాన్ని పెంచుకోవడానికి అలాంటి వ్యాఖ్యలు చేశారా అన్నదానిపై స్పష్టత లేదు.

యుద్ధం తర్వాత గాజా పాలనపై అనేక ప్రణాళికలు చర్చకు వచ్చాయి.

గాజా పరిపాలనను పర్యవేక్షించడానికి వీలుగా రెండు ప్రధాన పాలస్తీనా వర్గాలయిన హమాస్, ఫతా ఉమ్మడి కమిటీ ఏర్పాటుచేయడానికి డిసెంబరులో అంగీకరించాయి. అయితే ఇంతవరకూ ఆ దిశగా ప్రయత్నాలు సాగలేదు.

అరబ్ దేశాలకు చెందిన బలగాలతో అంతర్జాతీయ శాంతి పరిరక్షక దళం ఏర్పాటుపై చర్చలు సాగాయి

వెస్ట్ బ్యాంక్‌లోని కొన్ని ప్రాంతాలపై నియంత్రణ ఉన్న పాలస్తీనా అధారిటీ పూర్తి బాధ్యతలు స్వీకరించేదాకా తాత్కాలిక పరిపానయంత్రాంగం ఏర్పాటుచేయడంపై యూఏఈ, అమెరికా, ఇజ్రాయెల్ చర్చలు జరిపినట్టు గత నెలలో రాయిటర్స్ తెలిపింది.

అయితే యుద్ధానంతరం గాజా నిర్వహణలో పాలస్తీనా అధారిటీ పాత్ర ఉండబోదని గతంలో బహిరంగంగానే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు చెప్పారు.

పరిమిత సంఖ్యలోనే అయినప్పటికీ అమెరికా బలగాలు ఇప్పటికే రంగంలోకి దిగాయి. దక్షిణ గాజా దగ్గర కీలక చెక్‌పాయింట్ ఏర్పాటుచేశారు. ఆయుధాల కోసం ఉత్తరం ప్రాంతానికి తిరిగి వచ్చే పాలస్తీనియన్ల వాహనాలను తనిఖీ చేయడానికి అమెరికా సెక్యూరిటీ సంస్థ వందమంది మాజీ భద్రతాసిబ్బందిని అక్కడ నియమించింది.

అదే చెక్ పాయింట్ దగ్గర ఈజిప్టు భద్రతాసిబ్బంది కూడా కనిపిస్తున్నారు.

గాజాలో అమెరికా నేతృత్వంలో అంతర్జాతీయ సమాజం ఉనికి విస్తరిస్తోందనడానికి వీటిని తొలి సంకేతాలుగా భావించాలి.

అయితే గాజాను అమెరికా స్వాధీనం చేసుకోవాలంటే పశ్చిమాసియాలో పెద్ద ఎత్తున సైన్యాన్ని దించాల్సి ఉంటుంది. కానీ ఇలాంటివాటినే తాను వ్యతిరేకిస్తున్నట్టు చాలా కాలంగా ట్రంప్ చెబుతున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)