చాట్‌జీపీటీ భారత మీడియా సంస్థల కంటెంట్‌ను దోచుకుంటోందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఉమాంగ్ పొద్దర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఓపెన్ ఏఐ స్టార్టప్ చాట్‌జీపీటీ తమ కంటెంట్‌ను అనధికారికంగా ఉపయోగించుకుంటోందని భారత్‌కు చెందిన కొన్ని మీడియా సంస్థలు ఆరోపిస్తున్నాయి.
భారత్‌లోని ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ద హిందూ, ద ఇండియా టుడే గ్రూప్, బిలయనీర్ గౌతమ్ అదానీకి చెందిన ఎన్డీటీవీతో పాటు మరో 10కిపైగా సంస్థలు ఓపెన్ ఏఐపై కేసులకు సిద్ధమవుతున్నాయి.
కాగా ఈ వార్తా సంస్థల ఆరోపణలను ఓపెన్ ఏఐ ఖండిస్తోంది.
‘అందరికీ అందుబాటులో ఉన్న డేటా’నే తాము ఉపయోగిస్తున్నామని ఓపెనీ ఏఐ బీబీసీతో చెప్పింది.
చట్టబద్ధంగానే ఆ సమాచారం ఉపయోగించుకుంటున్నామని తెలిపింది.

చాట్‌జీపీటీ అతిపెద్ద యూజర్ బేస్ భారత్
తక్కువ ఖర్చుతో ఉండే ఏఐ ఎకోసిస్టమ్‌పై భారత్ ప్రణాళిక గురించి ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో చర్చించేందుకు ఓపెన్ ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మన్ దిల్లీ వచ్చారు.
ఏఐ విప్లవానికి నాయకత్వం వహించే దేశాల్లో భారత్ కచ్చితంగా ఉండాలని ఆయనన్నారు.
భారతీయ సంస్థలు పోటీ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటాయని 2023లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సందర్భోచితం కాదన్నారు.
''ఏఐకి..ప్రత్యేకించి ఓపెన్ ఏఐకి భారత్ కచ్చితంగా నమ్మదగ్గ, ముఖ్యమైన మార్కెట్'' అని ఒక ఈవెంట్‌లో ఆయన వ్యాఖ్యానించినట్టు స్థానిక మీడియా తెలిపింది.
భారత్‌లో అతిపెద్ద న్యూస్ ఏజెన్సీ అయిన ఏసియన్ న్యూస్ ఇంటర్నేషనల్(ఏఎన్ఐ) నవంబరులో ఓపెన్ ఏఐపై కేసు వేసింది. భారత్‌లో ఇలాంటి కేసు వేయడం ఇదే తొలిసారి.
తమ కాపీరైట్ మెటీరియల్‌ని చాట్ జీపీటీ అక్రమంగా ఉపయోగిస్తోందని ఏఎన్ఐ ఆరోపించింది. ఈ ఆరోపణలను ఓపెన్ ఏఐ ఖండించింది. దాదాపు రెండు కోట్ల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది.
భారత్‌లో విస్తరించాలన్న చాట్ జీపీటీ ప్రణాళికల నేపథ్యంలో ఈ కేసు ప్రాధాన్యం సంతరించుకుంది.
ఓ సర్వే ప్రకారం భారత్ ఇప్పటికే చాట్ జీపీటీ అతిపెద్ద యూజర్ బేస్‌గా ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచవ్యాప్తంగా ఓపెన్ ఏఐపై కేసులు
చాట్‌జీపీటీ వంటి చాట్‌బోట్‌లు ఇంటర్నెట్‌లో పెద్ద ఎత్తున సమాచారం సేకరించేలా శిక్షణ పొంది ఉంటాయి. భారత్‌లో దాదాపు 450 న్యూస్ చానళ్లు, 17వేల న్యూస్ పేపర్లు అందించే సమాచారం దీనికి చాలా ఉపయోగపడుతోంది.
అయితే చాట్ జీపీటీ ఇందులో సమాచారాన్ని న్యాయపరంగా సేకరిస్తుందా లేదా అనే విషయంలో స్పష్టత లేదు.
ప్రపంచవ్యాప్తంగా పబ్లిషర్లు, ఆర్టిస్టులు, వార్తాసంస్థలు వేసిన పదికిపైగా కేసులపై ఓపెన్‌ఏఐ పోరాడుతోంది.
ఈ ఆరోపణలన్నింటిలోకీ అత్యంత ముఖ్యమైనది 2023 డిసెంబరులో ద న్యూయార్క్ టైమ్స్ వేసిన కేసు. ఓపెన్ ఏఐ, దానికి మద్దతుగా ఉన్న మైక్రోసాఫ్ట్ బిలియన్ డాలర్లు చెల్లించాలని ఆ న్యూస్ పేపర్ డిమాండ్ చేసింది.
''ఏ కోర్టు తీసుకునే నిర్ణయమైనా ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి కేసులపై ప్రభావం చూపుతుంది'' అని భారతీయ న్యాయ సంస్థ ఆనంద్ అండ్ ఆనంద్‌లో ఏఐ నిపుణులైన లాయర్ వైభవ్ మిథల్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
లైసెన్స్ షేరింగ్ ఒప్పందాలు?
ఏఎన్ఐ వేసిన పిటిషన్‌పై వచ్చే తీర్పు ''ఏఐ మోడల్స్ భవిష్యత్తులో ఎలా నిర్వహిస్తారు, చాట్ జీపీటీ వంటి ఏఐ జనరేటివ్ మోడల్స్‌ను ఎలాంటి కాపీరైటెడ్ న్యూస్ కంటెంట్ ఉపయోగించుకునేలా శిక్షణ ఇస్తారు అనేవాటిని నిర్వచిస్తుంది'' అని మిథల్ చెప్పారు.
''ఏఎన్ఐకి అనుకూలంగా తీర్పు వస్తే మరిన్ని కేసులు దాఖలయ్యే అవకాశముంది. ఏఐ కంపెనీలు కంటెంట్ క్రియేటర్స్‌తో లైసెన్స్ షేరింగ్ ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం పెరుగుతుంది. కొన్ని కంపెనీలు ఇప్పటికే ఇది ప్రారంభించాయి.
ఒకవేళ కోర్టు తీర్పు ఓపెన్ ఏఐకి అనుకూలంగా వస్తే కాపీరైటెడ్ ప్రొటెక్టెడ్ డేటాను ఉపయోగించుకునేలా ఏఐకి శిక్షణ ఇవ్వడంలో మరింత స్వేచ్ఛ ఏర్పడుతుంది'' అని మిథల్ తెలిపారు.

ఫొటో సోర్స్, ANI
ఏఎన్ఐ కేసు ఏంటి?
తన సబ్‌స్క్రైబర్లకు ఏఎన్ఐ న్యూస్ అందిస్తుంది. ఏఎన్ఐకి టెక్స్ట్స్, ఫోటోలు, వీడియోలపై ప్రత్యేకమైన కాపీరైట్ ఉంది.
చాట్‌జీపీటీకి శిక్షణ ఇచ్చేందుకు తమ కంటెంట్‌ను అనుమతి లేకుండా ఓపెన్ ఏఐ ఉపయోగించుకుందని దిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్‌లో ఏఎన్ఐ ఆరోపించింది. చాట్‌బోట్‌ను సమర్థవంతంగా మార్చేందుకు ఇది ఉపయోగపడిందని, దీనివల్ల ఓపెన్ ఏఐ లాభపడిందని ఏఎన్ఐ ఆరోపించింది.
తమ కంటెంట్‌ను అక్రమంగా ఉపయోగిస్తున్నారని, సమాచారాన్ని ఉపయోగించుకునేందుకు లైసెన్స్ ఇస్తామని... పిటిషన్ దాఖలు చేసేముందు... ఓపెన్ ఏఐకి ప్రతిపాదించినట్టు ఏఎన్ఐ తెలిపింది.
ఓపెన్ ఏఐ ఆ ప్రతిపాదనను తిరస్కరించిందని, తమను ఇంటర్నల్‌గా బ్లాక్ లిస్ట్‌లో పెట్టిందని, ఇకపై తమ డేటా సేకరించబోదని ఏఎన్ఐ తెలింది. చాట్ జీపీటీ తమ సమాచారం తీసుకోలేదన్నవిషయాన్ని నిర్ధరించుకోడానికి వెబ్ క్రాలర్స్‌ను కూడా డిసేబుల్ చేయాలని ఆ సంస్థ ఏఎన్ఐని కోరింది.
ఇలాంటి చర్యలు తీసుకున్నప్పటికీ తమ సబ్‌స్క్రైబర్ల వెబ్‌సైట్ల నుంచి చాట్ జీపీటీ కంటెంట్‌ను తీసుకుంటోందని ఏఎన్ఐ తెలిపింది. దీని ద్వారా ఓపెన్ ఏఐ అన్యాయంగా లాభపడుతోందని ఆరోపించింది.
ఏఎన్ఐకి తప్పుడు ప్రకటనలను ఆపాదించి, దాని విశ్వసనీయతను దెబ్బతీసి, చాట్ జీపీటీ ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని ఆరోపించింది.
నష్టపరిహారం చెల్లించడంతో పాటు తమ కంటెంట్‌ను ఉపయోగించుకోవడం, అట్టిపెట్టకోవడం నిలిపివేసేలా ఓపెన్ఏఐని ఆదేశించాలని ఏఎన్ఐ కోరింది.
తమ కంపెనీ, సర్వర్లు భారత్‌లో లేవని, చాట్ బోట్ ఇక్కడ శిక్షణ పొందలేదని, ఇక్కడ కేసు వేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని ఓపెన్ ఏఐ తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
కేసులో భాగమయ్యేందుకు మీడియా సంస్థల ప్రయత్నం
ఈ కేసు తమపై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతుందని, తమ వాదనలు వినపించేందుకు అనుమతించాలని కోరుతూ డిసెంబరులో ‘ద ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పబ్లిషర్స్’ కోర్టులో పిటిషన్ వేసింది. ఈ ఫెడరేషన్ 80శాతం భాతీయ పబ్లిషర్లకు ప్రాతినిధ్యం వహిస్తుంది. పెంగ్విన్ రాండమ్ హౌస్, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ భారతీయ ఆఫీసులు కూడా ఇందులో భాగం.
ప్రముఖ భారతీయ న్యూస్ అవుట్‌లెట్‌లకు ప్రాతినిధ్యం వహించే డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్(డీఎన్‌పీఏ), మూడు ఇతర మీడియా అవుట్‌లెట్‌లు కూడా ఒక నెల తర్వాత ఇదే తరహా పిటిషన్ వేశాయి. అసోసియేటెడ్ ప్రెస్, ఫైనాన్షియల్ టైమ్స్ వంటి అంతర్జాతీయ న్యూస్ పబ్లిషర్లతో లైసెన్సింగ్ ఒప్పందాలు కుదుర్చుకున్న ఓపెన్ఏఐ భారత్‌లో మాత్రం అలాంటి పద్ధతి పాటించడం లేదని అవి వాదిస్తున్నాయి.
జర్నలిస్టుల జీవనోపాధిపై, మొత్తం భారత వార్తా పరిశ్రమపై ఇది ప్రభావం చూపిస్తుందని డీఎన్‌పీఏ కోర్టుకు తెలిపింది. చాట్‌బోట్‌లు న్యూస్ సబ్‌స్క్రిప్షన్లకు ప్రత్యామ్నాయం కాదని, ఆ ఉద్దేశంలో ఉపయోగించలేదని ఓపెన్ఏఐ వాదించింది.
పబ్లిషర్లు వేసిన అప్లికేషన్లను కోర్టు ఇంకా అంగీకరించలేదు. వాటిని విచారించకూడదని ఓపెన్ఏఐ అంటోంది.
ఈ అసోసియేషన్‌లను వాదకు అనుమతించినప్పటికీ, అవి సొంతంగా దావాలు వేయకపోవడంతో ఏఎన్ఐ ఆరోపణలపై మాత్రమే కోర్టు విచారణ జరుపుతుందని జడ్జి స్పష్టంచేశారు.
భారత్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా వార్తాసంస్థలతో నిర్మాణాత్మక భాగస్వామ్యాలు ఏర్పరుచుకుంటున్నామని ఓపెన్ ఏఐ బీబీసీతో చెప్పింది.
భారత్‌లో ఏఐ నియంత్రణ ఎలా ఉంది?
చాట్‌బోట్ అన్ని కోణాలపై అందరిదృష్టి పడేలా చాట్‌జీపీటీపై ప్రపంచవ్యాప్తంగా దాఖలైన దావాలు చేయగలవని విశ్లేషకులు అంటున్నారు.
చాట్‌బోట్‌లకు శిక్షణ ఇచ్చేందుకు ఉపయోగించిన డేటా అలాంటి ఓ కోణమని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ బాధ్యతాయుత ఉపయోగంపై పరిశోధన చేసిన డాక్టర్ శివరామకృష్ణన్ ఆర్ గురువాయుర్ చెప్పారు.
చాట్‌బోట్స్ డేటా సోర్సులను పరిశీలించడానికి ''ద ఏఎన్ఐ-ఓపెన్ ఏఐ'' కేసు ఉపయోగపడుతుందని తెలిపారు.
ఏఐని ఎలా నియంత్రించాలనేదానిపై ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాలు ఆలోచనలు చేస్తున్నాయి. వ్యక్తిగత సమాచారం పెద్ద ఎత్తున సేకరించడం, అట్టిపెట్టడం వ్యక్తిగతగోప్యతపై ఆందోళనలు కలిగిస్తోందని ఆరోపిస్తూ 2023లో ఇటలీ చాట్‌జీపీటిని బ్లాక్ చేసింది.
ఏఐని నియంత్రించే చట్టాన్ని యూరోపియన్ యూనియన్ గత ఏడాది ఆమోదించింది.
ఏఐని నియంత్రించే ప్రణాళికలు ఉన్నాయని భారత ప్రభుత్వం ఇప్పటికే సంకేతాలు పంపింది. టెస్టింగ్‌లో ఉన్న, నమ్మశక్యంగా లేని ఏఐ టూల్స్ ప్రారంభించేముందు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని తెలియచేస్తూ 2024 ఎన్నికలకు ముందు ఎడ్వైజరీ జారీచేసింది.
ఎన్నికల ప్రక్రియ సమగ్రతకు నష్టం కలిగించే ప్రతిస్పందనలు సృష్టించకూడదని, అది భారత్‌లో చట్టవిరుద్ధమని ఏఐని హెచ్చరించింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














