బంగారం ధరలు రికార్డు స్థాయిలో ఎందుకు పెరుగుతున్నాయి, ఇప్పుడు పెట్టుబడి పెట్టడం సరైనదేనా?

Woman wearing Gold

ఫొటో సోర్స్, Getty Images

బంగారం రేటెంత?

బంగారం ధర ఎందుకని పెరుగుతూ పోతోంది?

బంగారం రేటు ఇంకెంత వరకూ వెళ్లొచ్చు?

బంగారంపై పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయమేనా?

డోనల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడైనప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో గందరగోళం నెలకొంది. అలాగే, సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారానికి సంబంధించిన ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం ప్రజలు ఇంటర్నెట్‌లో ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
బంగారం, బిజినెస్, ఇన్వెస్ట్‌మెంట్, స్టాక్ మార్కెట్

ఫొటో సోర్స్, Getty Images

గురువారం బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. ఇండియన్ బులియన్ అండ్ జ్యువెల్లర్స్ అసోసియేషన్ ప్రకారం, 10 గ్రాముల బంగారం ధర రూ.84,000 దాటింది. గత కొద్దిరోజులుగా బంగారం ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి.

ఒకవైపు బంగారం ధర పెరగుతుంటే, మరోవైపు డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడుతోంది.

వారం ప్రారంభరోజు సోమవారం, రూపాయి రికార్డు కనిష్ఠ స్థాయికి చేరింది. డాలర్‌తో పోలిస్తే 55 పైసల భారీ పతనంతో 87.17 వద్ద ముగిసింది. అంటే ఒక డాలర్ విలువ 87 రూపాయల 17 పైసలకు చేరింది.

మెక్సికో, కెనడా, చైనాలపై అమెరికా అధ్యక్షుడు కొత్త సుంకాలు విధించడం, ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో బలహీన ధోరణి దీనికి కారణమని నిపుణులు భావిస్తున్నారు.

స్టాక్ మార్కెట్, డోనల్డ్ ట్రంప్, బంగారం, బిజినెస్

ఫొటో సోర్స్, Getty Images

ద్రవ్యోల్బణం భయం

ట్రంప్ తీసుకున్న కఠిన చర్యల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరుగొచ్చనే భయం ఏర్పడింది. దీంతో పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్లలో నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి బంగారంపై పెట్టుబడులు పెడుతున్నారు.

మార్కెట్ విశ్లేషకులు ఆసిఫ్ ఇక్బాల్ మాట్లాడుతూ, ''ప్రస్తుత పరిస్థితుల్లో, బంగారంపై పెట్టుబడులను చాలామంది హెడ్జింగ్ వ్యూహం(ఆశాజనకమైన రాబడి)గా భావిస్తున్నారు. స్టాక్‌ మార్కెట్లలో నష్టాలు వచ్చే అవకాశముందని భయపడుతున్నారు, అందుకే బంగారంపై పెట్టుబడులకు మొగ్గుచూపుతున్నారు'' అని అన్నారు.

''డోనల్డ్ ట్రంప్ విధించిన సుంకాలతో అనిశ్చితి ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొన్నప్పుడు, ప్రజలు తమ పెట్టుబడులకు భద్రత కోరుకుంటారు. అందువల్ల, బంగారం డిమాండ్ పెరుగుతుంది, దాని కారణంగా బంగారం ధరలు కూడా పెరుగుతాయి'' అని ఆర్థికవేత్త, ప్రొఫెసర్ అరుణ్‌కుమార్ బీబీసీతో చెప్పారు.

వాస్తవానికి, కెనడా, మెక్సికోల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 25 శాతం, చైనాపై 10 శాతం సుంకాలు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డోనల్ట్ ట్రంప్ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత.. మెక్సికో, కెనడాలపై సుంకాల అమలును 30 రోజులపాటు వాయిదా వేస్తున్నట్లు ట్రంప్ చెప్పారు.

కానీ, ట్రంప్ చైనాకు ఎలాంటి మినహాయింపూ ఇవ్వలేదు. యూరోపియన్ యూనియన్‌పై సుంకాల విధింపు గురించి కూడా ఆయన మాట్లాడారు. అమెరికా వస్తువులపై తాము కూడా సుంకాలు విధించబోతున్నట్లు ప్రకటించి చైనా కూడా ప్రతీకారం తీర్చుకుంది. అంటే, రానున్న రోజుల్లో సుంకాల యుద్ధం జరిగే అవకాశాలు పెరిగాయి.

బంగారం, స్టాక్ మార్కెట్, ట్రంప్, అమెరికా

ఫొటో సోర్స్, Getty Images

బంగారం ఒక సురక్షిత పెట్టుబడి

బంగారం ధరలు పెరగడానికి మరో కారణం కూడా ఉంది. అదేంటంటే, ప్రపంచవ్యాప్తంగా అనేక సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని కొనుగోలు చేయడం.

డాలర్ విలువతో రూపాయి మరింత బలహీనపడడం, మిడిల్ ఈస్ట్‌లో అనిశ్చితి, రష్యా-యుక్రెయిన్ యుద్ధాల కారణంగా కూడా బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తున్నారు.

''డాలర్ బలమైన కరెన్సీ. 2007 - 2009 మధ్య ఆర్థిక మాంద్యం సమయంలో డాలర్ బలపడింది. కానీ, ఇతర కరెన్సీలు కుదేలయ్యాయి. అందువల్ల, డాలర్, బంగారం తగ్గవని భావిస్తారు'' అని ప్రొఫెసర్ అరుణ్ కుమార్ అన్నారు.

''రూపాయి పడిపోతే, ప్రజలు డాలర్, ఇంకా బంగారం వైపు మొగ్గుచూపుతారు'' అని ఆయన అంటున్నారు.

డాలర్ సూచీ కూడా పెరుగుతోంది. ఇటీవల డాలర్ 109 మార్కును దాటింది. అంటే, డాలర్ ధర పెరగడం బంగారంతో సహా మొత్తం కమోడిటీ మార్కెట్‌ను ప్రభావితం చేస్తోందని అర్థం.

అరుణ్ కుమార్ మాట్లాడుతూ, ''డాలర్‌తో పోలిస్తే రూపాయి పడిపోయింది, కానీ ఇతర కరెన్సీలతో కాదు. పౌండ్, ఇతర కరెన్సీల విషయంలో రూపాయి తగ్గలేదు'' అన్నారు.

డాలర్‌తో పోలిస్తేనే రూపాయి బలహీనపడిందని ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా అంగీకరించారు, అయితే ''బలపడుతున్న డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడింది. కానీ, బలమైన ఆర్థిక విధానాల కారణంగా ఇతర కరెన్సీల విలువతో పోలిస్తే స్థిరంగానే ఉంది'' అని ఆమె చెప్పారు.

బంగారం, బిజినెస్, స్టాక్ మార్కెట్

ఫొటో సోర్స్, Getty Images

ఇప్పుడు బంగారంపై పెట్టుబడి పెట్టొచ్చా?

స్టాక్, కమోడిటీ మార్కెట్లలో అనిశ్చితి మాదిరిగానే, బంగారం భవిష్యత్తుపై కూడా చాలామంది నిపుణుల్లో కచ్చితమైన అభిప్రాయాలు ఉండవు. ఒకేసారి పెట్టుబడి పెట్టడానికి బదులు, రేటు పడిపోయిన ప్రతిసారీ కొద్దికొద్దిగా బంగారం కొనుగోలు చేసే వ్యూహాన్ని అనుసరిస్తే ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.

దీర్ఘకాలికంగా బంగారంలో పెట్టుబడులు పెట్టాలనుకునేవారు గోల్డ్ ఈటీఎఫ్, సావరిన్ గోల్డ్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టొచ్చని మార్కెట్ నిపుణులు ఆసిఫ్ ఇక్బాల్ చెబుతున్నారు.

''బంగారు ఆభరణాలు, బిస్కెట్లు లాంటివి కూడా కొనవచ్చు. కాకపోతే తయారీఛార్జీలు, వాటిని భద్రపరిచేందుకు అయ్యే ఖర్చుల వంటివాటిని కూడా గుర్తుంచుకోవాలి'' అని ఆయన అంటున్నారు.

చాలా దేశాల్లో పరిస్థితులు అంత బాలేవని, ద్రవ్యోల్బణం కూడా ప్రభావం చూపుతోందని ఆయన అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో, బంగారం ధర పెరుగుదల ట్రెండ్ కొనసాగవచ్చు, కాకపోతే ఆ ట్రెండ్ ఒకేలా ఉండకపోవచ్చు, పెట్టుబడిదారులు బంగారం కొనేందుకు మధ్యమధ్యలో అవకాశాలు వస్తూనే ఉండొచ్చని ఆయన అంటున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)