ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు అక్షరాలు తెలియవు, అంకెలూ రావు.. ‘అసర్‌’ సర్వే చెప్పిన అసలు నిజాలు

ప్రభుత్వ పాఠశాలలపై అసర్ సర్వే
ఫొటో క్యాప్షన్, ఎన్టీఆర్ జిల్లా నున్న గ్రామంలోని జెడ్పీ హైస్కూల్
    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్‌
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చదువు, అభ్యాస స్థితిపై విడుదలైన జాతీయ వార్షిక విద్యా స్థితి నివేదిక చర్చనీయాంశంగా మారింది.

2018–24 మధ్య దేశవ్యాప్తంగా ఉన్న 29 రాష్ట్రాల్లో 17,997 గ్రామాల్లోని ప్రభుత్వ స్కూళ్లలో విద్యా ప్రమాణాలపై యాన్యువల్‌ స్టేటస్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రిపోర్ట్‌(ఎఎస్‌ఈఆర్‌– అసర్‌) సర్వే చేపట్టింది. ఆరు లక్షల 49 వేల 491 మంది విద్యార్థులతో మాట్లాడి రూపొందించిన ఈ నివేదికను గత మంగళవారం దిల్లీలో విడుదల చేసింది.

దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతంలోని పిల్లలకు లెక్కల్లో కూడికలు, తీసివేతలు, భాగహారాలు సరిగ్గా రావడం లేదని నివేదికలో పొందుపరిచింది.

ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వస్తే గత పదేళ్లలో 2014– 24 మధ్య ఏపీలో విద్యా ప్రమాణాలు దిగజారాయని నివేదికలో పేర్కొంది. 5వ తరగతిలో రెండో తరగతి పాఠ్యాంశాన్ని చదవగల విద్యార్థుల శాతం 57 (2014)నుంచి 37.5 శాతానికి(2024) పడిపోయిందని వెల్లడించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

చదివేది 3వ తరగతి.. అక్షరాలు గుర్తించడమూ రాదు

ఏపీలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లోని 3వ తరగతి విద్యార్థుల్లో 5.9శాతం మంది అక్షరాలు కూడా సరిగ్గా గుర్తించలేని, చదవలేని స్థితిలో ఉన్నారని నివేదికలో పేర్కొన్నారు. 18.5 శాతం మంది అక్షరాలను గుర్తించగలరు గానీ పదాలను చదవలేరు. 36.5% మంది పదాలను చదవగలరు కానీ ఫస్ట్‌ క్లాస్‌ పాఠాన్ని కూడా చదవలేరు.

మూడో తరగతి విద్యార్థుల్లో 15.7% మంది మాత్రమే రెండో తరగతి పాఠాన్ని చదవగలరు. అంటే 84.3% మంది గ్రేడ్‌కు అంచనా వేసిన పఠనస్థాయి కంటే తక్కువగా ఉన్నారని నివేదిక పేర్కొంది. ఇక అక్షరాలు కూడా సరిగ్గా చదవలేని ఏడు, ఎనిమిది తరగతి విద్యార్థులు 2.2 శాతమని ఆ నివేదిక వెల్లడించింది.

2014-2024 మధ్య ఏం మారింది?

ప్రభుత్వ స్కూళ్లల్లో రెండో తరగతి పుస్తకం చదవలేని ఐదో తరగతి విద్యార్థులు 2014లో 43శాతం ఉండగా, 2024కి వచ్చేసరికి ఆ శాతం 62.5కి పెరిగింది.

అదేవిధంగా రెండోతరగతి పుస్తకం చదవలేని ఎనిమిదో తరగతి విద్యార్థులు 2014లో 20.5శాతం ఉండగా, 2024కి వచ్చేసరికి 47శాతం ఉందని స్పష్టం చేసింది.

తీసివేతలు, భాగహారాలు చేయలేని 8వ తరగతి విద్యార్థులు

ఇక గణితంలో కూడా విద్యార్థులు వెనుకబడి ఉన్నారని అసర్‌ నివేదికలో పేర్కొంది. 8వ తరగతి చదువుతున్న 2.3% మంది విద్యార్థులు ఒకటి నుంచి తొమ్మిది లోపు అంకెలను కూడా గుర్తించలేరు. 11 నుంచి 99 లోపు అంకెలను గుర్తించగలిగిన 8వ తరగతి విద్యార్థుల శాతం 14.2. తీసివేతలు చేయగలిగిన 8వ తరగతి విద్యార్థుల శాతం 30.9 ఉండగా భాగహారాలు వచ్చిన 8వ తరగతి విద్యార్థుల శాతం 48.4.

హాజరుశాతమూ తగ్గుతోంది..

విద్యార్థుల హాజరు శాతమూ తగ్గిపోతోందని అసర్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే 6–14 ఏళ్ల చిన్నారుల హాజరుశాతం 2018లో 63.2% ఉండగా 2024 నాటికి ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థులు 61.8 శాతానికి తగ్గారని పేర్కొంది.

2018లో 1–5 తరగతి బాలురు 55.4 శాతం, బాలికలు 63.4 శాతం ఎన్‌రోల్‌ అవ్వగా, 2024లో బాలురు 54.5 శాతానికి, బాలికలు 62.2 శాతానికి తగ్గిపోయారు. 6–8వ తరగతి విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌ కూడా 2018తో పోలిస్తే 2024 నాటికి తగ్గిపోయింది.

ఈ విభాగంలో 2018లో బాలురు 68.7 శాతం, బాలికలు 70.2 శాతం ఎన్‌రోల్‌ అయ్యారు. 2024 నాటికి బాలుర శాతం 64.1 శాతానికి, బాలికల శాతం 67.1 శాతానికి తగ్గిపోయింది.

సర్కారీ స్కూళ్ల విద్యాప్రమాణాలపై సర్వే
ఫొటో క్యాప్షన్, ఎన్టీఆర్ జిల్లా నున్న గ్రామంలోని జెడ్పీ హైస్కూల్

ఏటికేడు తగ్గిపోతున్న ప్రమాణాలు

ప్రభుత్వ స్కూళ్లలో మూడో తరగతిలో ఉండి రెండో తరగతి పుస్తకాలు చదవడం వచ్చిన విద్యార్థులు 2018లో 22.6 శాతం ఉండగా, 2022లో 10.5 శాతం, 2024లో 14.7 శాతానికి తగ్గారు.

మూడో తరగతి చదువుతూ కనీసం తీసివేతలు చేయడం వచ్చిన విద్యార్థులు 2018లో 34.1 శాతం ఉండగా, 2022లో 29.2 శాతానికి తగ్గారు.

ఐదో తరగతి చదువుతూ రెండో తరగతి పుస్తకాలు చదవడం వచ్చిన వాళ్లు 2018లో 57.1 శాతం ఉండగా, 2022లో 37.9 శాతం, 2024లో 37.5 శాతానికి తగ్గారు.

ప్రభుత్వ స్కూళ్లల్లో ఐదో తరగతి చదువుతూ భాగహారాలు చేయడం వచ్చిన విద్యార్థులు 2018లో 37.8 శాతం ఉండగా, 2022లో 27.3 శాతం, 2024లో 35.1 శాతానికి తగ్గారు.

సర్కారీ స్కూళ్ల విద్యాప్రమాణాలపై సర్వే
ఫొటో క్యాప్షన్, ఎన్టీఆర్‌ జిల్లా నున్న గ్రామంలోని జెడ్పీ హైస్కూలులో విద్యార్థులు

వసతి సౌకర్యాలూ కొరవడుతున్నాయి...

తాగునీటి సౌకర్యం ఉన్న ప్రభుత్వ స్కూళ్లు 2018లో 58.1 శాతం ఉండగా, 2024 నాటికి 55.9 శాతానికి తగ్గాయి. మరుగుదొడ్డి సౌకర్యం ఉన్న స్కూళ్లు 2018లో 86.4 శాతం ఉండగా, 2024లో 78.4 శాతానికి తగ్గాయి. బాలికల కోసం ప్రత్యేక మరుగుదొడ్లు ఉన్న స్కూళ్లు 2018లో 81.1 శాతం ఉండగా, 2024లో 77.2 శాతానికి తగ్గాయి.

పాఠశాలల్లో ఆఫీసులు, స్టోర్‌ రూం సౌకర్యాలు 2018లో 58.6 శాతం ఉండగా, 2024లో 51.4 శాతానికి తగ్గాయి. లైబ్రరీలో పుస్తకాలు అందుబాటులో ఉన్న స్కూళ్లు 2018లో 91 శాతం ఉండగా, 2024లో 83.8 శాతంగా ఉంది.

2018లో కంప్యూటర్లు అందుబాటులో ఉన్న స్కూళ్లు 22.6 శాతం ఉండగా, 2024 నాటికి 19.2 శాతానికి తగ్గాయి.

పిల్లలకు స్మార్ట్‌ ఫోన్లపై అవగాహన

14,15,16 ఏళ్ల వయసు గల పిల్లల్లో 71.6 శాతం డిజిటల్‌ టాస్కులు చేస్తుండగా, 93.8 శాతం మంది విద్యార్థులు ఇళ్లల్లో స్మార్ట్‌ఫోన్లు వినియోగిస్తున్నారని నివేదికలో పేర్కొన్నారు.

ఇందులో 46.9శాతం మందికి సొంతంగా స్మార్ట్‌ ఫోన్లు ఉన్నాయని ఆ నివేదికలో పేర్కొన్నారు.

సర్కారీ స్కూళ్ల ప్రమాణాలపై సర్వే
ఫొటో క్యాప్షన్, నున్న గ్రామంలోని జిల్లా పరిషత్‌ హైస్కూలు హెడ్ మాస్టర్ వజ్రాల భూపాల్‌ రెడ్డి

‘బ్రిడ్జి కోర్సులు పెడితే..’

''ఆ సర్వే మేమూ చూశాం.. ఆ సర్వే అంశాలన్నీ తప్పా ఒప్పా అని మేం మాట్లాడలేం..'' అని అసర్‌ గతేడాది చివరలో సర్వే చేసిన ఎన్‌టీఆర్‌ జిల్లా నున్న గ్రామంలోని జిల్లా పరిషత్‌ హైస్కూలు హెడ్‌మాస్టర్ వజ్రాల భూపాల్‌ రెడ్డి బీబీసీతో అన్నారు.

అయితే ఉపాధ్యాయవృత్తిలో మూడున్నర దశాబ్దాలుగా ఉన్న తాను వ్యక్తిగతంగా పరిశీలించినవి మాత్రం ఇవేనని చెప్పారు.

ఐదో తరగతి నుంచి ఆరో తరగతికి వచ్చే విద్యార్థుల ప్రమాణాలను ఒకసారి పరిశీలించాలి. ఇందుకోసం విద్యా సంవత్సరం ప్రారంభంలో జూన్‌ జూలై నెలలో బ్రిడ్జి కోర్స్‌ పెట్టాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. నిజంగా అది మంచిదే.'' అని భూపాల్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.

‘కామన్‌ పరీక్షల విధానం లేకపోవడమూ ఓ కారణమే’

''గతంలో 7వ తరగతిలో కామన్‌ పరీక్షలు ఉండేవి.. ఇప్పుడు కామన్‌ పరీక్షల విధానం లేకపోవడం వల్ల ఒకటవ తరగతిలో చేరిన విద్యార్థి సామర్థ్యం పూర్తిస్థాయిలో పరీక్షించేందుకు పదోతరగతి వరకు ఎటువంటి అవకాశం లేదు. దీనికి తోడు ఏకోపాధ్యాయ పాఠశాలలు కూడా విద్యాప్రమాణాలు తగ్గేందుకు కారణంగా భావించాలి.

ఒక ఉపాధ్యాయుడు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించాలి...అటువంటి పరిస్థితుల్లో విద్యాబోధన ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు...అలాగే సిలబస్‌ పూర్తి చేయాలనే హడావుడిలో మాస్టర్లు కూడా వెనుకబడిన విద్యార్థులను పట్టించుకోకుండా వదిలేయాల్సిన పరిస్థితి ఉందనేది వాస్తవం. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే'' అని భూపాల్‌రెడ్డి అన్నారు.

‘ప్రైవేటు స్కూళ్లను ప్రోత్సహించేలా సర్వే’

''ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు, విద్యా బోధన సరిగ్గా లేదని అసర్‌ సర్వేలో పేర్కొనడం దారుణం. కేవలం ప్రైవేటు రంగంలో స్కూళ్లను ప్రోత్సహించేలా ఈ సర్వే నివేదిక ఉందనిపిస్తోంది. వాస్తవానికి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధన మౌలిక సదుపాయాలు కల్పన ప్రతి ఏడాది మెరుగుపడుతూనే ఉన్నాయి. పదో తరగతిలో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మార్కులు సాధిస్తున్నారు'' అని పల్నాడు జిల్లాకు చెందిన ఓ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు మస్తాన్‌రావు బీబీసీతో అన్నారు.

‘టీవీలు, ఫోన్ల ప్రభావం’

''ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు ఎక్కువ శాతం ఆర్థికంగా వెనుకబడిన వారు. వారి తల్లిదండ్రులది రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి... అందువల్ల వారిలో ఎక్కువ శాతం మంది పిల్లల చదువు సంధ్యల గురించి పెద్దగా పట్టించుకోరు. అదే సమయంలో నట్టింట్లో తిష్ట వేసిన టీవీ భూతం, అరచేతిలో త్రిశంకు స్వర్గం చూపించే సెల్‌ఫోన్లు పిల్లలను చదువు నుంచి దూరం చేస్తున్నాయి'' అని మస్తాన్‌రావు వ్యాఖ్యానించారు.

‘ప్రభుత్వాలు మారినప్పుడల్లా విద్యావిధానంలో మార్పులా..’

ప్రభుత్వాలు మారినప్పుడల్లా విద్యా విధానంలో మార్పులు చేయడం వల్ల కూడా విద్యా బోధన కుంటుపడుతోందని మస్తాన్‌రావు అన్నారు.

‘‘బడి బయట పిల్లలు ఎవరూ ఉండకూడదనే నిబంధన కూడా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలు తగ్గేందుకు ఓ కారణంగా కనిపిస్తోంది. పలుచోట్ల ఉపాధ్యాయులు తల్లిదండ్రులను బతిమిలాడి వారి పిల్లలను బడిలో చేర్పిస్తున్నారు. విద్యాబోధన విషయంలో కాస్త గట్టిగా మాట్లాడితే ఎక్కడ మానేస్తారో అని ఏమీ అనలేని పరిస్థితి. ఇలా బడిలో హాజరుశాతం ఎక్కువ కనిపిస్తే పక్కాగా నేర్చుకునే విద్యార్థుల శాతం తగ్గుతోందనేది పచ్చి నిజం'' అని మస్తాన్‌ రావు అభిప్రాయపడ్డారు.

సర్కారీ స్కూళ్ల ప్రమాణాలపై సర్వే
ఫొటో క్యాప్షన్, ఎస్‌టీయూ స్టేట్‌ ప్రెసిడెంట్‌ సాయి శ్రీనివాస్‌

ఉపాధ్యాయులపై విపరీతమైన ఒత్తిడి

పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెరగాలంటే ముందుగా ప్రభుత్వాలు ఉపాధ్యాయులపై ఒత్తిడి తగ్గించాలని, వారిని కేవలం పాఠాలు చెప్పేందుకే పరిమితం చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం(ఎస్‌టీయూ) అధ్యక్షుడు ఎల్‌.సాయి శ్రీనివాస్‌ అన్నారు. ''పాలకులు అలా కాకుండా ఇతరత్రా విషయాలు అంటే నాన్‌ టీచింగ్‌లో కూడా ఉపాధ్యాయులను భాగం చేస్తున్నారు. ప్రభుత్వానికి కావలసిన డేటా తెప్పించుకునేందుకు ఉపాధ్యాయులపై ఒత్తిడి పెట్టకుండా ఔట్‌ సోర్సింగ్‌లో ఓ డిజిటల్‌ ఆపరేటర్‌ను నియమించి పని కల్పించాలి. టీచర్లను కేవలం క్లాస్‌ రూమ్‌ యాక్టివిటీకే పరిమితం చేయాలి. అప్పుడు విద్యాప్రమాణాలు కచ్చితంగా పెరుగుతాయి'' అని ఆయన బీబీసీతో అన్నారు.

మాతృభాషలో విద్యాబోధనతో సత్ఫలితాలు

''ఇప్పుడు హైస్కూళ్లల్లో తెలుగు మీడియం లేదు. గత ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకించిన ఈ ప్రభుత్వం ఇప్పటివరకు తెలుగు మీడియంను ఇంకా ప్రవేశ పెట్టలేదు. స్లో లెర్నర్‌ పిల్లలపై ఇంగ్లీష్‌ మీడియం బలవంతంగా రుద్దడం వల్ల ప్రమాణాలను అందుకోలేకపోతున్నారు. పోటీ పరీక్షలకు అనుగుణంగా విద్యావ్యవస్థను రూపొందిస్తున్నారు. అందరూ ఇంజనీర్లు, డాక్టర్లు అవ్వరు. ఎవరి అర్హతను బట్టి వారు చదువుకుంటారు. అది ప్రభుత్వం పరిగణనలో తీసుకోవాలి'' అని సాయిశ్రీనివాస్ అభిప్రాయపడ్డారు.

విజయరామరాజు
ఫొటో క్యాప్షన్, పాఠశాల విద్య కమిషనర్‌ విజయరామరాజు

మోడల్‌ ప్రైమరీ స్కూళ్లుగా రూపొందిస్తాం

‘‘అసర్‌ నివేదిక అధ్యయనం చేస్తున్నాం. దాంతో సంబంధం లేకుండానే ప్రాథమిక విద్యా పాఠశాలల బలోపేతం కోసం ప్రభుత్వం పూర్తిస్థాయి దృష్టి కేంద్రీకరించింది. ఇందుకోసం ప్రాథమిక స్కూళ్లను మోడల్‌ ప్రైమరీ స్కూళ్లుగా రూపొందించాలని భావిస్తున్నాం. ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులకు వసతులు, సౌకర్యాలతో పాటు నాణ్యమైన విద్యను అందించేందుకు అన్ని చర్యలూ తీసుకుంటాం’’ అని ఏపీ పాఠశాల విద్య కమిషనర్‌ వి.విజయరామరాజు బీబీసీతో అన్నారు.

టీచర్లపై ఒత్తిడి

‘‘మా పిల్లలను ప్రైవేటు స్కూళ్లలో చదివించేంత స్థోమత లేకున్నా..తప్పని పరిస్థితిలో చేర్పించాలని అనుకున్నాం.. కానీ గవర్నమెంటు స్కూళ్లను ప్రైవేటుకి దీటుగా చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో నమ్మకం వచ్చి చేర్పించాను, సౌకర్యాలు బాగానే ఉంటున్నాయి. చదువు కూడా గతం కంటే బాగానే చెబుతున్నారు. కానీ గత ప్రభుత్వం 3, 4,5 తరగతులను మా ఊరికి కాస్తదూరంలో ఉన్న హైస్కూల్‌లో కలిపేసింది. దాంతో 3,4 తరగతి చదువుతున్న మా పిల్లలు ఆ దూరం నడిచి వెళ్లాల్సి వస్తోంది. అంతదూరం వెళ్లలేని వాళ్లు ఊళ్లోని ప్రైవేటు స్కూలులో చేర్పించారు. ఈ ప్రభుత్వంలో కూడా అదే పరిస్థితి ఉంది’’ అని పల్నాడు జిల్లా బ్రాహ్మణపల్లికి చెందిన తల్లి రత్నకుమారి బీబీసీతో చెప్పారు.

‘‘మా అబ్బాయి నాలుగోతరగతి చదువుతున్నాడు.. సర్కారీ స్కూళ్లు గతం కంటే బాగానే ఉంటున్నాయి.. అందుకే నేను చేర్పించాను. రాజకీయాల గురించి మాకు తెలియదు.. అయితే టీచర్లు మాత్రం ఒత్తిడి ఫీలవుతున్నట్టు మాకు అర్ధమవుతోంది'' అని గుంటూరు జిల్లా యడ్లపాడుకి చెందిన రైతు కూలీ పి.కృష్ణంరాజు బీబీసీతో చెప్పారు.

సర్కారీ స్కూళ్ల ప్రమాణాలపై సర్వే

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, మాజీ మంత్రిబొత్స సత్యనారాయణ

ప్రాథమిక విద్యలో సంస్కరణలు తెచ్చింది మేమే- మాజీ మంత్రి బొత్స

రిపోర్టుపై మాజీ మంత్రి బొత్స స్పందించారు. ''ఆ రిపోర్ట్‌ ఏమిటో.. వాళ్లు ఏఏ స్కూళ్లల్లో చేశారో... నాకు తెలియదు కానీ గత వైసీపీ ప్రభుత్వంలో మాత్రం ప్రాథమిక విద్యలో మంచి మార్పులు తెచ్చానని నేను గట్టిగా చెప్పగలను. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న 2014 –19 మధ్య ప్రభుత్వ విద్యా వ్యవస్థ కుప్పకూలింది. ప్రభుత్వం కనీస సదుపాయాలు కల్పించలేక సరిపడినంత మంది విద్యార్థులు లేరన్న సాకుతో 1785 పాఠశాలలను మూసివేశారు. 2019లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు హయాంలో మూతబడిన స్కూళ్లు అన్నింటినీ తిరిగి తెరిచాం.'' అని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ బీబీసీతో అన్నారు.

సర్కారీ స్కూళ్ల ప్రమాణాలపై సర్వే

ఫొటో సోర్స్, https://www.facebook.com/

ఫొటో క్యాప్షన్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు

కొత్త రాష్ట్రంలో ప్రాథమిక విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టాం: మాజీ మంత్రి గంటా

‘‘ఉమ్మడి రాష్ట్రం నుంచి ఏపీ ప్రత్యేక రాష్ట్రమైన తర్వాత 2014–19 మధ్య ప్రాథమిక విద్యపై నాడు చంద్రబాబు సారధ్యంలోని టీడీపీ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. నూతన విధానాల్లో విద్యా బోధనకు శ్రీకారం చుట్టాం. డ్రాపవుట్స్‌ని తగ్గించి కొత్తగా స్కూళ్లల్లో చేర్పించే వారి సంఖ్యను పెంచాం. సోషల్‌ జస్టిస్, సమానత్వం అనేది కేవలం విద్యతోనే సాధ్యమన్న చంద్రబాబు ఆశయం మేరకు అప్పట్లో పని చేశాం. అందుకే 2014–19 మధ్య ఏపీలో ప్రభుత్వ పాఠశాలల పనితీరు ఇప్పటి కంటే బాగున్నట్టు అసర్‌ రిపోర్ట్‌ కూడా వెల్లడించింది. అయితే మా తర్వాత వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో విద్యావ్యవస్థ బాగా దెబ్బతింది.’’ అని 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు బీబీసీతో అన్నారు.

విద్యా ప్రమాణాలు తగ్గిపోయాయన్నది నిజం

‘‘విద్యాప్రమాణాలు తగ్గిపోయాయన్నది నిజం. ఎక్కువమంది టీచర్లలో క్వాలిటీ లేదు. ఇంగ్లీషు భాషపై పట్టులేదు. సబ్జెక్ట్‌పై దృష్టి పెట్టడం లేదు. చాలామంది ఉపాధ్యాయులకు వేరే వ్యాపకాలు ఉన్నాయి. ఇక ప్రభుత్వాలు మారినప్పుడల్లా విద్యావ్యవస్థలో మార్పులు తెచ్చేస్తున్నారు. ముందుగా ఆ మార్పులను టీచర్లే అవగతం చేసుకోలేకపోతున్నారు. ఇక విద్యార్థులకు వారేం బోధిస్తారు. సౌకర్యాలు, వసతుల పరంగా ప్రభుత్వాల కృషిని తప్పుపట్టలేం. కానీ బోధనపైనే పాలకులు దృష్టి పెట్టాలి.’’ అని ఏపీపీఎస్‌సీ మాజీ చైర్మన్, యూపీఎస్సీ పూర్వ సభ్యుడు, జెఎన్‌టీయూ మాజీ వీసీ వై వెంకటరామిరెడ్డి బీబీసీతో అన్నారు.

పిల్లలు భాగహారాలు, గణాంకాలు కూడా చేయలేని స్థితిలో ఉన్నారని అసర్‌ రిపోర్ట్‌ ప్రతి ఏటా చెబుతోందని, ఇది కొత్తేమీ కాదని ఎమ్మెల్సీ లక్ష్మణరావు అన్నారు.

‘‘అసర్‌ చూపిస్తున్న సమస్యలను పరిష్కరించాలంటే ముందు గ్రామీణ ప్రాంతాల్లోని స్కూళ్లలో ప్రతి క్లాస్‌కూ ఓ టీచర్‌ ఉండాలి. అప్పుడే విద్యార్థులు ఎంతవరకు చదువుతున్నారు అనే దానిపై దృష్టి పెట్టే వీలుంటుంది. కానీ మన రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు. 34వేల స్కూళ్లు ఉంటే సగానికి పైగా స్కూళ్లల్లో ఒకరిద్దరు టీచర్లు మాత్రమే ఉన్నారు. ముందు ఉపాధ్యాయుల కొరత సమస్యను అధిగమిస్తే కచ్చితంగా విద్యాప్రమాణాల్లో మార్పు వస్తుంది’’ అని ఎమ్మెల్సీ లక్ష్మణరావు బీబీసీతో అన్నారు.

రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శల సంగతెలా ఉన్నా, విద్యాప్రమాణాలు మెరుగవుతున్నాయని, అయితే ఇంకా మెరుగుపడాల్సిన అవసరం కూడా ఉందని విద్యారంగ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)