ఇజ్రాయెల్ బందీల విడుదలను నిలిపివేసిన హమాస్

ఇజ్రాయెల్ బందీల విడుదలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు హమాస్ సాయుధ విభాగం ప్రకటించింది.
శనివారం ముగ్గురు బందీలను విడుదల చేయాల్సి ఉండగా వారి విడుదల వాయిదా పడింది.
తదుపరి ప్రకటన వచ్చేవరకు బందీల విడుదల ఉండబోదని హమాస్ వెల్లడించింది.

హమాస్ తన ప్రకటనలో ఏం చెప్పిందంటే..
'గత మూడు వారాల్లో హమాస్ నాయకత్వం తమ శత్రువులు కాల్పుల విరమణ ఒప్పందంలోని అంశాలకు కట్టుబడడంలో విఫలం కావడాన్ని, ఉల్లంఘనలను గమనించింది.
నిరాశ్రయులు తిరిగి ఉత్తర గాజాకు వస్తుంటే వారిపై కాల్పులు జరపడం.. మానవతా సాయం రాకుండా అడ్డుకోవడం వంటి ఉల్లంఘనలు జరిగాయి.
ఈ కారణాల వల్ల శనివారం(ఫిబ్రవరి 15న) జియానిస్ట్ ఖైదీల విడుదలను వాయిదా వేస్తున్నాం'' అని హమాస్ తన ప్రకటనలో పేర్కొంది.
అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం: ఇజ్రాయెల్
హమాస్ నిర్ణయంపై ఇజ్రాయెల్ స్పందించింది. ఆ దేశ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ దీనిపై ఒక ప్రకటన విడుదల చేశారు.
'బందీల విడుదల, కాల్పుల విరమణ ఒప్పందాలను హమాస్ ఉల్లంఘించింది.గాజాలో ఎలాంటి పరిణామాలు జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఐడీఎఫ్‌ను అప్రమత్తం చేశాం. అక్టోబర్ 7 ఘటనలాంటిది మళ్లీ జరగనివ్వం' అన్నారు కట్జ్.

ఫొటో సోర్స్, Reuters
ఇప్పటివరకు 16 మంది విడుదల
కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం మొత్తంగా 33 మంది ఫస్ట్ ఫేజ్‌లో విడుదల చేయాలి.
అందులో 16 మందిని ఇప్పటికే విడుదల చేయగా మరో 17 మందిని విడుదల చేయాల్సి ఉంది.
అయితే, ఆ 17 మందిలో 8 మంది ఇప్పటికే మరణించారని ఇజ్రాయెల్ అంటోంది. అంటే 9 మందిని హమ స్ విడుదల చేయాల్సి ఉంది.
మరో ఒప్పందాన్ని అనుసరించి హమాస్ అయిదుగురు థాయిలాండ్ పౌరులను విడుదల చేసింది.
కాగా 1900 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేయడానికి కాల్పుల విరమణ ఒప్పందంలో ఇజ్రాయెల్ అంగీకరించింది.
దాని ప్రకారం ఇప్పటికే వందల మందిని విడిచిపెట్టింది.
మరోవైపు ఒప్పందంలో భాగంగా రెండో దశలో మరింత మంది బందీలను విడిపించేందుకు గాను ఇజ్రాయెల్ బృందం ఒకటి ఖతార్ వేదికగా హమాస్‌తో సంప్రదింపులు జరుపుతోంది.
హమాస్ తాజా ప్రకటన ఆ సంప్రదింపులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













