అమెరికాలో అక్రమ వలసదారులను ఎలా పట్టుకుంటారు, వారిలో ఎవరిని పంపిస్తారు, ఎవరిని వదిలేస్తారు?

ఫొటో సోర్స్, ANI
అమెరికాలో 'చట్టవిరుద్ధంగా' నివసిస్తున్న 104 మంది భారతీయులను ఆ దేశం ఇటీవలే వెనక్కు పంపించింది. ఇందులో గుజరాత్, హరియాణా, పంజాబ్‌లకు చెందిన వారు ఎక్కువగా ఉన్నారు.
డోనల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి 'అక్రమ వలసదారుల' ఏరివేతపై అమెరికావ్యాప్తంగా చర్యలు ప్రారంభించారు. గత శుక్రవారం అహ్మదాబాద్ విమానాశ్రయంలో కనిపించిన దృశ్యాలు కూడా దీని ఫలితమే.
ఇంతకీ అమెరికా నుంచి ఎవరెవరిని బహిష్కరిస్తున్నారు? వారు మళ్లీ అక్కడికి వెళ్లొచ్చా? ఏమైనా నిషేధం ఉంటుందా?


ఎవరిని బహిష్కరిస్తున్నారు?
అమెరికా నుంచి ఎవరిని బహిష్కరిస్తున్నారనే దానిపై మైగ్రేషన్ పాలసీ రిపోర్టు కొన్ని వివరాలు వెల్లడించింది.
అమెరికాలోని అనధికార వలసదారులను మాత్రమే బహిష్కరిస్తారని చాలామంది భావిస్తున్నారు.
అయితే, దేశంలో చట్టబద్ధంగా నివసిస్తూ సిటిజన్‌షిప్ పొందని వలసదారులు కూడా కొన్ని పరిస్థితులలో బహిష్కరణకు గురికావొచ్చు. అనధికారిక వలసదారులు, అక్రమంగా అమెరికా సరిహద్దులోకి ప్రవేశించినవారు, వీసాల గడువు దాటినా దేశంలోనే ఉంటున్న వ్యక్తులను కూడా వారివారి దేశాలకు తిప్పి పంపవచ్చు.
తాత్కాలిక వీసాలపై అమెరికాలోకి ప్రవేశించి నిబంధనలను ఉల్లంఘించిన వలసదారులను కూడా బహిష్కరించవచ్చు. ఉదాహరణకు ఉద్యోగం సంపాదించినా ఆ వీసాలో జాబ్ పర్మిట్ లేకపోవడం వల్ల కూడా బహిష్కరణ వేటు పడుతుంది.
వలసదారులే కాకుండా అమెరికాలోని గ్రీన్ కార్డ్ హోల్డర్లు, తాత్కాలిక వీసా హోల్డర్లు కూడా బహిష్కరణకు గురికావొచ్చు. అయితే, ఈ కోవలోకి వచ్చే వ్యక్తులు నేరాలకు పాల్పడినట్లు నిరూపణ కావాలి. ఈ నేరాలలో, తాగి వాహనం నడపడం, అనుమతి లేకుండా ఆయుధాలతో దొరికిపోవడం, డ్రగ్స్‌తో తిరగడం, దొంగతనం, హింసాత్మక నేరాలులాంటివి ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
Nolo.com కథనం ప్రకారం.. ‘అనైతిక చర్యలతో కూడిన నేరా’నికి పాల్పడిన వ్యక్తిని బహిష్కరించడానికి రెండు మార్గాలు ఉన్నాయి.
ఒకటి అమెరికాలో నివసించిన మొదటి ఐదు సంవత్సరాలలో అనైతికంగా భావించే నేరానికి పాల్పడటం. రెండోది, వేరు వేరు కేసుల్లో రెండు లేదా అంతకంటే ఎక్కువ అనైతిక నేరాలకు పాల్పడటం. రెండోదానికి కాలపరిమితి అంటూ ఏమీ లేదు.
అయితే, ‘అనైతిక చర్యలతో కూడిన నేరం’ అంటే ఏమిటో స్పష్టమైన నిర్వచనం లేదు. ఈ విషయంపై అమెరికా కోర్టులు ఎప్పటికప్పుడు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నాయి.
వీటిలో ‘మోసం, వ్యక్తులు లేదా ఆస్తికి హాని కలిగించే ఉద్దేశం, మరణం లేదా దోపిడీకి కారణమయ్యే ఉద్దేశంతో గాయపరచడం, భార్యాభర్తల మధ్య హింస’ మొదలైన నేరాలు ఉన్నాయి.

ఎవరిని అరెస్ట్ చేయాలనేది ఎలా నిర్ణయిస్తారు?
ICE.govలో అందించిన సమాచారం ప్రకారం.. అమెరికా ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ)కు చెందిన ఎన్‌ఫోర్స్‌మెంట్ అండ్ రిమూవల్ ఆపరేషన్స్ (ఈఆర్వో) అధికారులు ఆ దేశంలో వలస చట్టాలను అమలు చేసే పనిలో ఉంటారు.
ఈ అధికారులు నేషనల్ సెక్యూరిటీ వ్యవహారాలు చూస్తుంటారు. ఇమిగ్రేషన్ అమలు ప్రక్రియ అన్ని దశలను ఈఆర్వో నిర్వహిస్తుంది. బహిష్కరణకు అర్హత ఉన్న వ్యక్తుల గుర్తింపు, అరెస్టు, నిర్బంధం, వారిని వారి వారి దేశాలకు పంపించే ప్రక్రియ తదితరాలు ఇందులో ఉంటాయి.
బహిష్కరణకు అర్హులైన వ్యక్తులను గుర్తించడానికి లక్ష్య (టార్గెటెడ్), గూఢచార ఆధారిత కార్యకలాపాలను ఈఆర్వో నిర్వహిస్తుంది. క్రిమినల్ అరెస్ట్ వారెంట్‌లను అమలు చేయడం, బహిష్కరణకు అర్హత ఉన్న వ్యక్తుల అరెస్టులతో పాటు, ఇమిగ్రేషన్-సంబంధిత క్రిమినల్ చర్యల కోసం ప్రాసిక్యూషన్‌ను ప్రారంభించే అధికారం ఈఆర్వోకు ఉంది.
ఈఆర్వో విభాగం అదుపులోకి తీసుకున్న వ్యక్తులను ప్రధానంగా రెండు వర్గాలుగా విభజిస్తారు: ఒకటి అమెరికాలో పౌరసత్వం ఉన్నవారు, రెండోది అమెరికాలో వారి నేర చరిత్ర ఆధారంగా....
ఇక, నేర చరిత్ర ఉన్న వారిని మూడు ఉపవర్గాలుగా నమోదు చేస్తారు.
- ఒకటి అమెరికాలో నేరానికి పాల్పడిన వారు.
- రెండోది అమెరికాలో క్రిమినల్ కేసు పెండింగ్‌లో ఉన్న వ్యక్తులు.
- మూడోది అమెరికా చట్టాలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు లేకున్నా ఇమిగ్రేషన్ చట్టాలను ఉల్లంఘించిన వారు.
అధికారిక గణాంకాల ప్రకారం...అమెరికాలో ఈఆర్వో అధికారులు 2023లో దాదాపు 1.69 లక్షల మందిని అరెస్టు చేశారు.

ఫొటో సోర్స్, US Govt/Representative
బహిష్కరణకు గురైన వ్యక్తి పరిస్థితేంటి?
ఎవరైనా అమెరికా నుంచి బహిష్కరణకు గురైతే, వారిపై చాలా ఏళ్ల పాటు ఆ దేశానికి తిరిగి రాకుండా నిషేధం ఉంటుంది. అయితే, బహిష్కరణకు గల కారణం ఆధారంగా ఇందులో మార్పులుంటాయి.
'ఎక్స్‌పెడిటెడ్ డిపోర్టేషన్' ప్రక్రియ ద్వారా ఒక వ్యక్తిని బహిష్కరించినట్లయితే, తదుపరి ఐదేళ్లపాటు అమెరికాలోకి ప్రవేశించకుండా నిషేధం ఉంటుంది. 'ఎక్స్‌పెడిటెడ్ డిపోర్టేషన్' అనేది తక్కువ స్థాయి ఇమిగ్రేషన్ అధికారులు పౌరులు కాని వ్యక్తులను విచారణ లేకుండానే బహిష్కరించడం.
పౌరుడు కాని ఒక వ్యక్తిని బహిష్కరించాలని ఇమిగ్రేషన్ జడ్జి ఆదేశిస్తే, ఆ వ్యక్తి పదేళ్లపాటు అమెరికాలోకి రాకుండా నిషేధం ఉంటుంది.
ఏ వ్యక్తి మీదనైతే రెండుసార్లు బహిష్కరణ ఉత్తర్వు జారీ అవుతుందో వారు 20 సంవత్సరాల వరకు అమెరికాకు తిరిగి వెళ్లలేరు.
నిర్దిష్ట నేరాలకు పాల్పడిన వ్యక్తి, ఇమిగ్రేషన్ చట్టాలను పదేపదే ఉల్లంఘించే వ్యక్తిపై జీవితకాల నిషేధం ఉంటుంది.
అనేక సందర్భాల్లో 'బహిష్కరణ ఆర్డర్' నిజంగా బహిష్కరణ ప్రక్రియకు దారితీయదు. ఎందుకంటే సంబంధిత అథారిటీ బహిష్కరణ ఆర్డర్ జారీ చేసినా, చట్టపరంగా ప్రక్రియ పూర్తవ్వాలి.
బహిష్కరణ ఆర్డర్ ఉన్నా, సదరు వ్యక్తి జాడ లేకపోవచ్చు. జాబితాలో ఉండి, వారి సొంత దేశం తిరిగి వారిని తీసుకోవడానికి సిద్ధంగా లేకపోవచ్చు. ఇలాంటి కారణాలతో కూడా బహిష్కరణ ప్రక్రియ పూర్తి కాకపోవచ్చు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














