చంద్రబాబు: మంత్రులకు ర్యాంకుల్లో ప్రాతిపదిక ఏంటి?

చంద్రబాబు

ఫొటో సోర్స్, x.com/ncbn

ఫొటో క్యాప్షన్, చంద్రబాబు నాయుడు
    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్‌
    • హోదా, బీబీసీ కోసం

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 8 నెలల తర్వాత చంద్రబాబునాయుడు తనతో సహా మంత్రివర్గ సభ్యులకు ర్యాంకులు ఇచ్చారు.

అయితే ఈసారి పూర్తిస్థాయిలో మంత్రుల పనితీరుపై కాకుండా కేవలం ఫైళ్ల క్లియరెన్స్‌ ఆధారంగా ర్యాంకులు ప్రకటించారు.

కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి గతేడాది డిసెంబర్‌ చివరి వరకు ఫైళ్ల పరిష్కారం ఆయా మంత్రుల శాఖల్లో ఎంతవేగంగా జరుగుతోందో విశ్లేషించారు.

గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు ఈ వివరాలను వెల్లడించారు.

అటవీ, పంచాయతీరాజ్‌ శాఖలను పర్యవేక్షిస్తున్న ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌కు పదో ర్యాంక్‌ రాగా, విద్య, ఐటీ శాఖ చూస్తున్న నారా లోకేశ్‌కు ఎనిమిదో ర్యాంక్‌ వచ్చింది.

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి ఆరో ర్యాంక్‌ వస్తే , మొదటి ర్యాంక్‌ను ఎన్‌ఎండీ ఫరూక్‌ సాధించారు.

బీబీసీ న్యూస్ తెలుగు
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఏపీ ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు, మంత్రివర్గం, నారా లోకేశ్‌, పవన్ కల్యాణ్‌, మంత్రులకు ర్యాంకులు

ఫొటో సోర్స్, https://x.com/ncbn/status

ఫొటో క్యాప్షన్, ఫైళ్ల క్లియరెన్స్ ఆధారంగానే ర్యాంకులు కేటాయించినట్లు చంద్రబాబు తెలిపారు.

చంద్రబాబు ఏమన్నారు?

తమ ప్రభుత్వం "పీపుల్ ఫస్ట్" అనే విధానంతో పని చేస్తోందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఫైళ్ల క్లియరెన్స్‌లో మంత్రులకు ర్యాంకులు ఇచ్చామని, ఇందులో ఒకరిని ఎక్కువ చెయ్యడం, ఒకరిని తక్కువ చెయ్యడం ఏమీ లేదని "ఎక్స్"లో పోస్ట్ చేసిన సందేశంలో తెలిపారు.

ఇంకా అందులో "ప్రజలు అపారమైన నమ్మకంతో 2024 ఎన్నికల్లో 93 స్ట్రైక్ రేట్ తో చారిత్రాత్మక తీర్పు ఇచ్చి గెలిపించారు. వారి ఆశల్ని, ఆకాంక్షల్ని నెరవేర్చేందుకు తొలిరోజు, తొలిగంట నుంచి ప్రయత్నం చేస్తున్నాం. గత ప్రభుత్వ పాలనలో విధ్వంసమైన వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు శాయశక్తులా కష్టపడుతున్నాం." అని చంద్రబాబు పేర్కొన్నారు.

ఏపీ ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు, మంత్రివర్గం, నారా లోకేశ్‌, పవన్ కల్యాణ్‌, మంత్రులకు ర్యాంకులు

ఫొటో సోర్స్, Naga Babu/facebook

ఫొటో క్యాప్షన్, జనసేనకు చెందిన మంత్రులు ర్యాంకుల్లో పవన్ కల్యాణ్‌ కంటే ముందున్నారు.

పవన్‌ కంటే జనసేన మంత్రులే ముందు

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కంటే అదే పార్టీకి చెందిన ఇద్దరు మంత్రులు కందుల దుర్గేశ్ (2వ ర్యాంక్‌), నాదెండ్ల మనోహర్‌ (4వ ర్యాంక్‌) ముందున్నారు.

పాలనలో స్పీడ్‌ పెంచాలి: చంద్రబాబు

ఫైళ్ళ సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ పరిష్కరించడంలో మంత్రి పార్థసారథి, వాసంశెట్టి సుభాష్‌ వెనుకబడి ఉండడాన్ని చంద్రబాబు ఈ సందర్భంగా ప్రస్తావించారు.

మంత్రులంతా పనితీరులో వేగం పెంచాలని స్పష్టం చేశారు.

మంత్రులు ర్యాంకులు
ఫొటో క్యాప్షన్, మంత్రులు, ర్యాంకులు
మంత్రులు ర్యాంకులు

మొదటి ఆరు నెలలు తాను పెద్దగా ఎవరిపై ఒత్తిడి చేయలేదని, ఇకపై వేగం పెంచుకోకపోతే ఊరుకోనని, స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌‌ను ప్రతి శాఖకు వర్తింప చేస్తూ పనులు తొందరగా పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు.

ఈ మంత్రివర్గ సమావేశానికి పవన్‌ కల్యాణ్‌ హాజరు కాలేదు. ఆరోగ్యం బాగాలేనందువల్ల మంత్రివర్గ సమావేశానికి తాను హాజరుకాలేనని పవన్ కల్యాణ్ ముందుగానే సమాచారం అందించినట్లు వార్తలొచ్చాయి. అయితే ఈ అంశాన్ని బీబీసీ స్వయంగా ధ్రువీకరించుకోలేదు.

ఏపీ ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు, మంత్రివర్గం, నారా లోకేశ్‌, పవన్ కల్యాణ్‌, మంత్రులకు ర్యాంకులు

ఫొటో సోర్స్, x.com/ncbn/status

ఫొటో క్యాప్షన్, పరిపాలనలో వేగం పెంచాలని చంద్రబాబు మంత్రులను కోరారు.

‘ర్యాంకులు ఇవ్వడం మంత్రుల మనోభావాలను దెబ్బతీయడమే..’

శాఖల పనితీరుపై కావచ్చు లేదంటే ఫైళ్ల క్లియరెన్స్ పైనే కావచ్చు.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇలా తన మంత్రివర్గంలోని సభ్యులకు ర్యాంకులు ఇవ్వడం, దాన్ని బహిరంగంగా ప్రకటించడం అనేది సరికాదని సీనియర్ జర్నలిస్ట్ దారా గోపి అభిప్రాయపడ్డారు.

"మంత్రులు మోరల్ గా దెబ్బతింటారు. ఒకవేళ తాను సర్వే చేసినా అది ఇలా బయటపెట్టడం మంచి సంప్రదాయం కాదు. మంత్రులకు, ప్రజాప్రతినిధులకు విలువ గౌరవం ఉంటేనే రాజకీయంగా రాణించగలరు" అని ఆయన చెప్పారు.

"ఇక్కడ మరో విషయం ఏమిటంటే అసలు ఫైళ్ళ క్లియరెన్స్‌లో ర్యాంకులు అనేది సరికాదు. ఎందుకంటే అన్ని శాఖల ఫైల్స్‌ను ఒకే గాటన కట్టలేం. ప్రాధాన్యత ఒకింత తక్కువ ఉన్న శాఖల్లో ఫైళ్ల క్లియరెన్స్ సులువు గానే ఉంటుంది. కానీ రెవెన్యూ, మైన్స్ వంటి శాఖల్లో ఫైల్స్ ను క్లియర్ చేసేందుకు సమయం పడుతుంది. అందువల్ల ఇలా ర్యాంకులు ప్రకటించడం ఆయా మంత్రులకు ఇబ్బందికర అంశమే" అని దారా గోపి అభిప్రాయపడ్డారు.

మంత్రులు ర్యాంకులు
ఫొటో క్యాప్షన్, మంత్రులు ర్యాంకులు
మంత్రులు, ర్యాంకులు
ఫొటో క్యాప్షన్, మంత్రులు, ర్యాంకులు
మంత్రులు, ర్యాంకులు
ఫొటో క్యాప్షన్, మంత్రులు, ర్యాంకులు

ఈ వ్యవహారంపై ఎక్స్ వేదికగా టీడీపీ, వైసీపీ నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు.

మంత్రివర్గపు ర్యాంకులలో 8 ,9 స్థానాలను సాధించిన లోకేశ్‌, పవన్‌లకు అభినందనలు అని అంబటి రాంబాబు ఎక్స్‌లో మెసేజ్ పోస్ట్ చేశారు. దీనికి చంద్రబాబు, లోకేశ్‌, పవన్ కల్యాణ్‌లను ట్యాగ్ చేశారు.

అంబటి రాంబాబు మెసేజ్‌పై బుద్దా వెంకన్న స్పందించారు. "అయ్యా అంబటి 8,9 స్థానాల్లో వచ్చిన నారా లోకేశ్‌, పవన్ కల్యాణ్‌ గార్లు 1, 2 స్థానాల్లోకి రావడానికి కృషి చేస్తున్నారు. అలాగే 11 స్థానాల్లో ఉన్న మీ వై.ఎస్. జగన్ రెడ్డి కూడా వచ్చే ఎన్నికల్లో ఒక్క స్థానంలోకి రావడానికి మరింత కృషి చేస్తున్నాడు" అని అంబటి ట్వీట్‌కు బుద్దా వెంకన్న సమాధానం ఇచ్చారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)