‘మమ్మల్ని చిత్రహింసలు పెట్టారు, విమానంలోకి ఎక్కగానే కాళ్లు, చేతులు కట్టేశారు’- అమెరికా వెనక్కి పంపిన పంజాబీలు ఇంకా ఏం చెప్పారు?

అమెరికా, పంజాబ్, అక్రమ వలసదారులు, Illegal immigrants, Donald Trump, USA, Amritsar.

ఫొటో సోర్స్, Kamal Saini/BBC

ఫొటో క్యాప్షన్, తన పాస్‌పోర్టు మీద వేసిన ముద్ర వల్ల తాను ఇక ఎన్నటికీ అమెరికా వెళ్లలేనని కుష్‌ప్రీత్‌ సింగ్ చెప్పారు.

సైనిక విమానంలో అమెరికా స్వదేశాలకు తిప్పి పంపిన భారతీయులలో పంజాబ్‌లోని ఫతేగఢ్ చురియాన్ ‌పట్టణానికి చెందిన జస్పాల్ సింగ్ ఒకరు.

ఆయన బీబీసీ ప్రతినిధి గురుప్రీత్ చావ్లాతో మాట్లాడారు. "అమెరికా అనే కల శాశ్వతంగా మూసుకుపోయింది" అని ఆయన బరువెక్కిన హృదయంతో చెప్పారు.

అమెరికా చేరుకునేందుకు ఆయన ప్రయాణం రెండున్నరేళ్ల కిందట ప్రారంభమైంది. ఆ కలను నిజం చేసుకునే ప్రయత్నంలో ఆయన రూ. 40 లక్షలు ఖర్చు చేశారు. ఇప్పుడవన్నీ నష్టపోయినట్లే.

జనవరి 29న అమెరికా 104 మంది భారతీయుల్ని సైనిక విమానంలో భారత దేశానికి పంపించింది. ఆ 104మందిలో జస్ప్రీత్ ఒకరు.

2022లో తాను విజిటర్ వీసా మీద ఇంగ్లండ్ వెళ్లానని అక్కడ స్పెయిన్ నుంచి వచ్చిన పంజాబీ ఏజంట్‌ను కలిశానని జస్పాల్ సింగ్ చెప్పారు. 2024 జులైలో ఆయన యూరప్ చేరుకున్నారు. అక్కడ వివిధ దేశాల్లో ఆరు నెలలు గడిపిన తర్వాత పనామా అడవుల గుండా అమెరికా వెళ్లే మార్గాన్ని కనుక్కున్నారు.

"అక్రమ మార్గంలో (డంకీరూట్) అమెరికా చేరుకునే ప్రయాణం చాలా ప్రమాదకరంగా ఉంది. ఆ మార్గంలో మగవాళ్లే కాకుండా ఆడవాళ్ల మృతదేహాలు కూడా చూశాను. కొన్ని అస్థిపంజరాలు కూడా కనిపించాయి" అని జస్పాల్ సింగ్ చెప్పారు.

"కొండల్ని ఎక్కే సమయంలో, తినేందుకు మాకు చిన్న రొట్టెముక్క, ఒకటి లేదా రెండు బిస్కేట్లు మాత్రమే ఇచ్చేవారు" అని ఆయన చెప్పారు.

అమెరికా సరిహద్దులు దాటి ఆ దేశంలో అడుగు పెట్టిన తర్వాత అమెరికా ఆర్మీ తమను అదుపులోకి తీసుకుందని జస్పాల్ సింగ్ అన్నారు.

"వాళ్లు మమ్మల్ని అనేక రకాలుగా చిత్రహింసలు పెట్టారు. విమానంలోకి ఎక్కించిన తర్వాత చేతులు, కాళ్లు కట్టేశారు. ఆ విమానం అనేక ప్రాంతాల్లో ఆగింది. మేము అమృత్‌సర్ చేరుకున్న తర్వాత చేతులు, కాళ్లకున్న కట్లు ఊడదీశారు" అని ఆయన చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
అమెరికా, పంజాబ్, అక్రమ వలసదారులు, Illegal immigrants, Donald Trump, USA, Amritsar.

ఫొటో సోర్స్, Kamal Saini/BBC

ఫొటో క్యాప్షన్, 2022 జనవరిలో రాబిన్ హండా అమెరికా చేరుకున్నారు.

‘భూమి అమ్మేశాను, ఇప్పుడు నా కొడుకు బతికేదెలా’

హరియాణాలోని కురుక్షేత్రకు సమీపంలో ఉన్న ఇస్మాయిలాబాద్‌లో ఉండే రాబిన్ హండా తన కలలను నిజం చేసుకునేందుకు ఏడు నెలల కిందట అమెరికా వెళ్లారు.

ఆయనను కూడా అమెరికా వెనక్కి పంపించింది. రాబిన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ చేశారు. మెరుగైన భవిష్యత్‌ను వెతుక్కుంటూ అమెరికా వెళ్లారు.

" నెలరోజుల ప్రయాణంలో వివిధ ప్రాంతాల్లో ఆగాను. మార్గంలో అనేక కష్టాలు ఎదురయ్యాయి. కొన్నిసార్లు తినడానికి ఏమీ ఉండేది కాదు. సముద్రాల్లో, పడవ ప్రయాణాల్లో అనేక కష్టాలు పడ్డాను. కొంతమంది నా దగ్గరున్న డబ్బులు తీసుకెళ్లారు. అనేక సమస్యలు ఎదుర్కొన్నాను" అని హరియాణా బీబీసీ ప్రతినిధి కమల్ సైనీతో చెప్పారు రాబిన్.

"జనవరి 22న నేను సరిహద్దుల్ని దాటి అమెరికాలో ప్రవేశించాను. ఆ తర్వాత న్యాయప్రక్రియ ద్వారా మమ్మల్ని సైన్యానికి అప్పగించారు. అక్కడ నుంచి వాళ్లు మమ్మల్ని ఒక క్యాంపుకు తీసుకెళ్లారు. క్యాంపులో వారు మమ్మల్ని నేరస్తుల్లా చూశారు" అని కన్నీటి పర్యంతం అయ్యారు.

"క్యాంప్ నుంచి మమ్మల్ని ఎక్కడకు తీసుకెళుతున్నారో కూడా చెప్పలేదు. మా కాళ్లు చేతులు చైన్లతో కట్టేశారు. మా ముందున్న సైనిక విమానాన్ని చూడగానే మేము షాక్ తిన్నాం" అని హొండా వివరించారు.

"అమెరికాకు ఇలా వెళ్లవద్దని చెబుతాను. ఎందుకంటే ఇది చాలా కష్టమైన మార్గం" అని రాబిన్ చెబుతున్నారు.

అమెరికా, పంజాబ్, అక్రమ వలసదారులు, Illegal immigrants, Donald Trump, USA, Amritsar.

ఫొటో సోర్స్, Kamal Saini/BBC

ఫొటో క్యాప్షన్, రాబిన్ నాయనమ్మ ప్యార్ కౌర్, తండ్రి మంజిత్ సింగ్

కుమారుడిని అమెరికా పంపించేందుకు 45 లక్షల రూపాయలు ఖర్చైందని రాబిన్ తండ్రి చెప్పారు.

"ఆ ఏజెన్సీ మమ్మల్ని మోసం చేసింది. మేమక్కడ నెల రోజులే ఉంటామని చెప్పారు. అయితే 6-7 నెలలు మేము వీధుల్లోనే గడపాల్సి వచ్చింది. వాళ్లు మమ్మల్ని చిత్రహింసలు పెట్టారు. మాకు కరెంట్ షాకులిచ్చారు" అని రాబిన్ చెప్పారు.

"వాళ్లు మా పిల్లల్ని కొడుతున్న వీడియోలు మా దగ్గర ఉన్నాయి. పిల్లల్ని పంపించేందుకు అనేకమంది తల్లితండ్రులు ఇక్కడ భూముల్ని అమ్మారు. పిల్లలకు మంచి ఉద్యోగం వస్తుందని అనుకున్నాం. కానీ అలా జరగలేదు" అని రాబిన్ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.

రాబిన్ నాయనమ్మ ప్యార్ కౌర్ ఆ సమయంలో ఉద్వేగ భరితంగా కనిపించారు. ‘భూమి అమ్మేసిన తర్వాత నా కొడుకుకు పని లేకుండా పోయింది. నా పిల్లలు ఆకలి, దాహంతో చనిపోతారు’ అంటూ ఆమె కన్నీరు పెట్టుకున్నారు.

అమెరికా, పంజాబ్, అక్రమ వలసదారులు, Illegal immigrants, Donald Trump, USA, Amritsar.
ఫొటో క్యాప్షన్, జస్వీందర్ సింగ్ అమెరికా చేరుకున్న 22 రోజుల తర్వాత ఆయనను అరెస్ట్ చేశారు.

రూ. 50 లక్షలు ఖర్చు చేసి..

ఫతేగఢ్ సాహిబ్ ‌జిల్లాలోని కహాన్‌పురా గ్రామంలో జస్విందర్ సింగ్ 2024 అక్టోబర్‌లో అమెరికా వెళ్లారు.

"రాత్రి పూట బాగా పొద్దు పోయిన తర్వాత జస్వీందర్ సింగ్‌ను పోలీసులు తీసుకొచ్చి ఇంట్లో వదిలి వెళ్లారు" అని ఆయన మామ కర్నైల్ సింగ్ చెప్పారు.

"మా చేతులకు బేడీలు వేసి మమ్మల్ని అమెరికా నుంచి ఇక్కడకు తీసుకువచ్చారు" అని తన కుటుంబ సభ్యులకు చెప్పారు జస్వీందర్.

జస్వీందర్ సింగ్‌ను అమెరికన్ అధికారులు అరెస్ట్ చెయ్యడానికి 22 రోజుల ముందు ఆయన అమెరికా చేరుకున్నారు.

"ఇంటికి వచ్చేటప్పటికి జస్వీందర్ ఆరోగ్యం బాగా దెబ్బ తింది. మానసికంగా తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు" అని కర్నైల్ సింగ్ చెప్పారు.

తర్వాతి రోజు ఉదయం జస్వీందర్ సింగ్ హటాత్తుగా అనారోగ్యం పాలవడంతో ఆయనను లుథియానా ఆసుపత్రిలో చేర్చారు.

"క్యాంపులో తినడానికి తనకేమీ ఇవ్వలేదు, అప్పుడప్పుడూ సగం యాపిల్ లేదా ఏదైనా జ్యూస్ ఇచ్చేవారు" అని జస్వీందర్ తన కుటుంబ సభ్యులకు చెప్పారు.

జస్వీందర్‌కు సోదరుడు ఉన్నారు. ఇద్దరూ గతంలో వ్యవసాయం చేసేవారు.

2024లో ఆయనకు ఓ ఏజంట్ పరిచయం కావడంతో అమెరికా వెళ్లాలని భావించారు.

జస్వీందర్ అమెరికా వెళ్లేందుకు తమ కుటుంబం రూ. 50 లక్షలు ఖర్చు చేసినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు.

"బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి, బంధువుల దగ్గర అప్పులు చేసి ఈ సొమ్ము సమకూర్చాం" అని వారు వెల్లడించారు.

భారతీయుల్ని తిప్పి పంపడంపై అమెరికా ఏమంటోంది?

"అక్రమ వలసదారుల విమానం గురించి మా దగ్గర ఎలాంటి సమాచారం లేదు" అని భారతదేశంలో అమెరికా రాయబార కార్యాలయ అధికార ప్రతినిధి బీబీసీతో చెప్పారు.

"అమెరికన్ల సంక్షేమం, జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని అమెరికన్ వలస చట్టాలను అమలు చెయ్యడం తప్పనిసరి. దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వారి విషయంలో అమెరికా చట్టాలకు లోబడి వ్యవహరిస్తున్నాం" అని ఆయన చెప్పారు.

అమెరికా, పంజాబ్, అక్రమ వలసదారులు, Illegal immigrants, Donald Trump, USA, Amritsar.

ఫొటో సోర్స్, SansadTV

ఫొటో క్యాప్షన్, భారత విదేశాంగమంత్రి జై శంకర్

విదేశాంగమంత్రి రాజ్యసభలో ఏం చెప్పారు?

"అక్రమ వలసల్ని ప్రోత్సహించడానికి మేము వ్యతిరేకం" అని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ రాజ్యసభలో చెప్పారు. "అక్రమ వలసల్లో అనేక ఇతర అక్రమ విధానాలు ముడిపడి ఉన్నాయి" అని ఆయన అన్నారు.

"అక్రమంగా అమెరికాకు వెళ్లి పట్టుబడిన భారతీయులు ఇతర నేరాలకు పాల్పడుతూ దొరికారు. వారు అమానవీయ పరిస్థితుల్లో ప్రయాణించాల్సి వచ్చింది" అని జై శంకర్ అన్నారు.

"అక్రమ వలసదారుల్ని తిప్పి పంపడం అంతర్జాతీయంగా ఆమోదం పొందిన విధానం కాదు. అసలు వెనక్కి పంపే ప్రక్రియ లేదు. ఇది అనేక ఏళ్లుగా జరుగుతోంది. 2009 నుంచి అమెరికా తిప్పి పంపిన భారతీయుల గురించి సమాచారం నేను అందించాను" అని విదేశాంగమంత్రి చెప్పారు.

"అక్రమ వలసదారుల్ని వెనక్కి పంపే ప్రక్రియలో వారి చేతులకు బేడీలు వేస్తారు. అయితే మహిళలు, పిల్లల విషయంలో అలా చెయ్యడం లేదని వారు మాకు చెప్పారు. మార్గంలో అవసరమైన వారందరికీ ఆహారం, వైద్య సాయం అందిస్తామని అమెరికా సమాచారమిచ్చింది" అని జై శంకర్ రాజ్యసభకు వివరించారు.

"పౌర విమానాలకు అమలు చేసే నియమావళి సైనిక విమానాలకు కూడా వర్తిస్తుంది. భారతీయుల్ని క్షేమంగా తీసుకువచ్చేందుకు మేము నిరంతరం అమెరికా ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాం. అక్రమ వలసల్ని అరికట్టేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న ఏజంట్లపై కఠినంగా వ్యవహరిస్తాం. అమెరికా నుంచి తిరిగి వచ్చిన భారతీయుల ద్వారా వారి సమాచారాన్ని సేకరిస్తున్నాం" అని జై శంకర్ చెప్పారు.

అమెరికా, పంజాబ్, అక్రమ వలసదారులు, Illegal immigrants, Donald Trump, USA, Amritsar.

ఫొటో సోర్స్, https://x.com/BhagwantMann

ఫొటో క్యాప్షన్, అమెరికా ప్రభుత్వ తీరు అమానవీయమన్న పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌సింగ్ మాన్ ఏమన్నారు?

అమెరికా తిప్పి పంపుతున్న భారతీయుల చేతులకు బేడీలు వెయ్యడాన్ని ఖండిస్తూ పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ "ఎక్స్"లో మెసేజ్ పోస్ట్ చేశారు.

"అమెరికా తీరు తీవ్రంగా అక్షేపించదగిన అంశం. మన దేశ పౌరుల చేతులకు బేడీలు, ఇనుప గొలుసులు వేసి పంపించడం మన దేశానికి అవమానకరం. మానసికంగా, ఆర్థికంగా నష్టపోయిన వారిని ఆదరించాల్సిన హరియాణా ప్రభుత్వం వారిని ఖైదీలను తీసుకెళ్లే వ్యాన్లలో ఇంటికి పంపించడం ద్వారా గాయాలపై కారం చల్లినట్లు వ్యవహరిస్తోంది" అని తన సందేశంలో రాశారు.

ఈ వ్యవహారాన్ని ప్రతిపక్ష సభ్యులు పార్లమెంట్‌లో ప్రస్తావించారు. దీనిపై చర్చను చేపట్టాలని కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాకూర్ నోటీస్ ఇచ్చారు. ఇది అమానవీయమని ఆయన వ్యాఖ్యానించినట్లు ది హిందూ పత్రిక పేర్కొంది.

లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ వాయిదా తీర్మానం ఇచ్చారు.

కాగా అమెరికా నుంచి భారతీయులను తిప్పి పంపడానికి సంబంధించిన సమాచారాన్ని పార్లమెంటుకు చెప్పాలని అమృత్‌సర్ ఎంపీ గుర్జీత్ సింగ్ ఓజ్లా అన్నారు.

అమెరికా నుంచి తిప్పిపంపిన భారతీయులను అమానవీయ రీతిలో తీసుకొచ్చారని గుర్జీత్ సింగ్ ఆరోపించారు.

వారి చేతులు, కాళ్లు కట్టేసి ఉన్నాయని ఆయన ఆరోపించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)